
డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా లక్నో వేదికగా ఇవాళ (మార్చి 6) యూపీ వారియర్జ్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై ఇండియన్స్ యూపీ వారియర్జ్‌ను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేసింది. అమేలియా కెర్ ఐదు వికెట్లతో విజృంభించడంతో వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే చేయగలిగింది.
వారియర్జ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జార్జియా వాల్ (55) అర్ద సెంచరీతో రాణించగా.. గ్రేస్ హ్యారిస్ (28), కెప్టెన్ దీప్తి శర్మ (27), వృందా దినేశ్ (10), ఆఖర్లో సోఫీ ఎక్లెస్టోన్ (16) రెండంకెల స్కోర్లు చేశారు. కిరణ్ నవ్‌గిరే, శ్వేతా సెహ్రావత్ డకౌట్లు కాగా.. చిన్నెల్ హెన్రీ 6, ఉమ్రా ఛెత్రీ ఒక పరుగు చేశారు.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో అమేలియా కెర్‌తో పాటు హేలీ మాథ్యూస్ (2), నాట్ సీవర్ బ్రంట్ (1), పరుణిక సిసోడియా (1) వికెట్లు తీశారు.
వారియర్జ్ ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు గ్రేస్ హ్యారిస్, జార్జియా వాల్ గట్టి పునాది వేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 74 పరుగులు (8 ఓవర్లలో) జోడించారు. హ్యారిస్, వాల్ క్రీజ్‌లో ఉండగా.. వారియర్జ్ భారీ స్కోర్ సాధిస్తుందని అంతా భావించారు. అయితే 16 పరుగుల వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడంతో వారియర్జ్ కష్టాల్లో పడింది.
హ్యారిస్, వాల్ ఔటయ్యాక వారియర్జ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ చేయలేకపోయింది. సెకండ్ డౌన్‌లో వచ్చిన దీప్తి శర్మ చివరి ఓవర్ వరకు క్రీజ్‌లో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆఖర్లో ఎక్లెస్టోన్ ఓ మోస్తరుగా బ్యాట్‌ను ఝులిపించడంతో వారియర్జ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
ఈ సీజన్‌లో వారియర్జ్ ఆశించిన స్థాయిలో రాణించలేక పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించింది.
గత రెండు సీజన్లలో చివరి స్థానంలో నిలిచిన గుజరాత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. గతేడాది రన్నరప్ ముంబై ఇండియన్స్ మూడులో, ఢిపెండింగ్ చాంపియన్ ఆర్సీబీ నాలుగో స్థానంలో ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment