ముంబై బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన యూపీ | WPL 2025: Mumbai Indians Restricted UP Warriorz To 142 Runs | Sakshi
Sakshi News home page

ముంబై బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన యూపీ

Published Wed, Feb 26 2025 9:39 PM | Last Updated on Wed, Feb 26 2025 9:39 PM

WPL 2025: Mumbai Indians Restricted UP Warriorz To 142 Runs

డబ్ల్యూపీఎల్‌-2025లో ఇవాళ (ఫిబ్రవరి 26) ముంబై ఇండియన్స్‌, యూపీ వారియర్జ్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన యూపీ.. ముంబై బౌలర్లు విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

ముంబై బౌలర్లలో నాట్‌ సీవర్‌ ‍బ్రంట్‌ 3 వికెట్లు పడగొట్టగా.. షబ్నిమ్‌ ఇస్మాయిల్‌, సంస్కృతి గుప్తా తలో 2, హేలీ మాథ్యూస్‌, అమెలియా కెర్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. 

యూపీ ఇన్నింగ్స్‌లో గ్రేస్‌ హ్యారిస్‌  (45) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. వృంద దినేశ్‌ (33) ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. శ్వేతా సెహ్రావత్‌ (19), ఉమా ఛెత్రీ (13 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. కిరణ్‌ నవ్‌గిరే (1), కెప్టెన్‌ దీప్తి శర్మ (4), తహ్లియా మెక్‌గ్రాత్‌ (1), చిన్నెల్‌ హెన్రీ (7), సోఫీ ఎక్లెస్టోన్‌ (6) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. సైమా ఠాకోర్‌ డకౌట్‌ కాగా.. క్రాంతి గౌడ్‌ (5) అజేయంగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో యూపీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే గ్రేస్‌ హ్యారిస్‌, వృంద దినేశ్‌ చలువే. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. వీరిద్దరు క్రీజ్‌లో ఉండగా.. యూపీ భారీ స్కోర్‌ చేసేలా కనిపించింది. అయితే స్పల్ప వ్యవధిలో వీరు ఔట్‌ కావడంతో యూపీ ఇన్నింగ్స్‌ పతనం మొదలైంది. మధ్యలో శ్వేతా సెహ్రావత్‌, ఉమా ఛెత్రీ కొద్ది సేపు నిలకడగా బ్యాటింగ్‌ చేయడంతో యూపీ 100 పరుగుల మార్కును దాటగలిగింది.

అనంతరం ముంబై ఛేదనను నిదానంగా ప్రారంభించింది. తొలి 2 ఓవర్లలో ఆ జట్టు వికెట్లేమీ నష్టపోనప్పటికీ 2 పరుగులు మాత్రమే చేయగలిగింది. చిన్నెల్‌ హెన్రీ, సోఫీ ఎక్లెస్టోన్‌ తొలి రెండు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఈ సీజన్‌లో యూపీ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో విజయం సాధించింది. 

ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించిన ముంబై మూడో ప్లేస్‌లో ఉంది. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన ఢిల్లీ టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. ఆర్సీబీ రెండో స్థానంలో ఉంది. 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయం​ సాధించిన గుజరాత్‌ చివరి స్థానంలో కొనసాగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement