![Blasting Centuries: Abhishek Sharma In IPL, Mohammad Rizwan And James Vince In PSL]](/styles/webp/s3/article_images/2025/04/13/ashnalhc.jpg.webp?itok=NC2sGego)
క్రికెట్ అభిమానులు శనివారం (ఏప్రిల్ 12) సాయంత్రాన్ని తనివి తీరా ఎంజాయ్ చేశారు. నిన్న ఒకే సమయంలో రెండు వేర్వేరు లీగ్‌ల్లో మూడు విధ్వంసకర శతకాలు, రెండు అతి భారీ ఛేజింగ్‌లు నమోదయ్యాయి. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని (246) ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో (55 బంతుల్లో 141; 14 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. అభిషేక్ రఫ్ఫాడించడంతో సన్‌రైజర్స్ మరో 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో అత్యత్తుమ ఛేజింగ్.
నిన్న సాయంత్రం సన్‌రైజర్స్, పంజాబ్ మ్యాచ్ జరుగుతుండగానే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో మరో సూపర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒకరు, ఛేజింగ్‌లో మరొకరు విధ్వంకర శతకాలతో విరుచుకుపడ్డారు. పంజాబ్‌పై సన్‌రైజర్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించిన తరహానే పీఎస్‌ఎల్‌లో ముల్తాన్ సుల్తాన్స్ నిర్దేశించిన 235 పరుగుల భారీ లక్ష్యాన్ని కరాచీ కింగ్స్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్.. మొహమ్మద్ రిజ్వాన్ (63 బంతుల్లో 105 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో షాయ్ హెప్ 8, ఉస్మాన్ ఖాన్ 19, కమ్రాన్ ఘులామ్ 36, మైఖేల్ బ్రేస్‌వెల్ 44 పరుగులు (నాటౌట్) చేశారు. కరాచీ బౌలర్లలో హసన్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఖుష్దిల్ షా తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. జేమ్స్ విన్స్ (43 బంతుల్లో 101; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. ఖుష్దిల్ షా (37 బంతుల్లో 60; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి కరాచీ గెలుపు ఖరారు చేశాడు. కరాచీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (12) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. టిమ్ సీఫర్ట్ (32) పర్వాలేదనిపించాడు. సుల్తాన్స్ బౌలర్లలో అకీఫ్ జావిద్ 3 వికెట్లు పడగొట్టగా.. బ్రేస్‌వెల్, ఉసామా మిర్ తలో వికెట్ దక్కించుకున్నారు.