ఇలాంటి వికెట్‌ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్‌ | It Wasnt Easiest Wicket There Wasnt Reckless Hitting But: Cummins on SRH Loss To MI | Sakshi
Sakshi News home page

ఇలాంటి వికెట్‌ మీద కష్టమే.. మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ: కమిన్స్‌

Published Fri, Apr 18 2025 9:11 AM | Last Updated on Fri, Apr 18 2025 1:07 PM

It Wasnt Easiest Wicket There Wasnt Reckless Hitting But: Cummins on SRH Loss To MI

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH)కు మరోసారి చేదు అనుభవమే మిగిలింది. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కమిన్స్‌ బృందం నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమిష్టి వైఫల్యం కారణంగా ఈ సీజన్‌లో ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది.

అంతేకాదు.. ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు సొంత మైదానం వెలుపల ఒక్క మ్యాచ్‌ కూడా గెలవని ఏకైక జట్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ముంబై చేతిలో ఓటమి అనంతరం సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins)తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.

ఇలాంటి వికెట్‌ మీద కష్టమే..
‘‘వాంఖడే వికెట్‌పై పరుగులు రాబట్టడానికి కష్టపడాల్సి వచ్చింది. బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు సులువుగానే రన్స్‌ చేయొచ్చనే అనిపించింది. కానీ అనూహ్యంగా పిచ్‌ పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. ఏదేమైనా వాళ్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

ఎక్కడిక్కడ మమ్మల్ని కట్టడి చేశారు. మేము కూడా బాగానే బ్యాటింగ్‌ చేశాం. ఇలాంటి వికెట్‌ మీద 160 అనేది మెరుగైన స్కోరే. కానీ మేము ఇంకాస్త బెటర్‌గా బ్యాటింగ్‌ చేయాల్సింది. ఈరోజు మా వాళ్లు పవర్‌ప్లేలో ఎలాంటి తొందరపాటు చర్యలకు పోలేదు.

మా వాళ్లు నిర్లక్ష్యంగా ఆడలేదు.. కానీ
నిర్లక్ష్య రీతిలో హిట్టింగ్‌ కూడా ఆడలేదు. కానీ ఇలా జరిగిపోయింది. మేము ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమో!.. ఇక మా బౌలింగ్‌ విషయానికొస్తే డెత్‌ ఓవర్లలో మా ప్రదర్శన పర్వాలేదనిపించింది.

ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన బౌలర్‌తో 1-2 ఓవర్లు మాత్రమే వేయించగలము అనిపించింది. అందుకే రాహుల్‌ చహర్‌ను తీసుకువచ్చాం. ఫైనల్‌కు చేరుకోవాలంటే హోం గ్రౌండ్‌ వెలుపల ఎక్కువగా మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.

కానీ దురదృష్టవశాత్తూ ఈ సీజన్‌లో మేము ఇంత వరకు ఇతర వేదికలపై ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయాం. పొరపాట్లను సమీక్షించుకుని సానుకూలంగా ముందుకు వెళ్తాం. తదుపరి మా సొంత మైదానంలో మ్యాచ్‌ ఆడబోతున్నాం. మాకు అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది కాబట్టి.. అనుకున్న ఫలితం రాబట్టగలమని నమ్ముతున్నాం’’ అని ప్యాట్‌ కమిన్స్‌ పేర్కొన్నాడు.

శైలికి భిన్నంగా
కాగా వాంఖడే వేదికగా టాస్‌ ఓడిన సన్‌రైజర్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. దూకుడైన తమ శైలికి భిన్నంగా రైజర్స్‌ ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 40), ట్రవిస్‌ హెడ్‌ (29 బంతుల్లో 28) నెమ్మదిగా ఆడారు. ఇషాన్‌ కిషన్‌ (2), నితీశ్‌ రెడ్డి (21 బంతుల్లో 19) పూర్తిగా విఫలం కాగా.. క్లాసెన్‌ (28 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించాడు.

ఆఖర్లో అనికేత్‌ వర్మ (8 బంతుల్లో 18 నాటౌట్‌), కమిన్స్‌ (4 బంతుల్లో 8 నాటౌట్‌) కాస్త వేగంగా ఆడగా.. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి రైజర్స్‌ ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా చెరో వికెట్‌ తీయగా.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ విల్‌ జాక్స్‌ రెండు వికెట్లు కూల్చాడు.

పాండ్యా మెరుపులు
ఇక లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆరు వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు రియాన్‌ రికెల్టన్‌ (31), రోహిత్‌ శర్మ (26) ఫర్వాలేదనిపించగా.. విల్‌ జాక్స్‌ (36), సూర్యకుమార్‌ యాదవ్‌ (26), తిలక్‌ వర్మ (17 బంతుల్లో 21 నాటౌట్‌) రాణించారు. 

హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (9 బంతుల్లో  21)తొ మెరిసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. రైజర్స్‌ కెప్టెన్‌ కమిన్స్‌కు మూడు, ఇషాన్‌ మలింగకు రెండు, హర్షల్‌ పటేల్‌కు ఒక వికెట్‌ దక్కాయి.  

చదవండి: అభిషేక్‌ శర్మ, నితీశ్‌ కుమార్‌కు జాక్‌ పాట్‌..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement