
Photo Courtesy: BCCI/SRH
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klassen) ఓ పొరపాటు చేశాడు. అతడి తప్పిదం కారణంగా ముంబై ఓపెనర్ రియాన్ రికెల్టన్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. క్లాసెన్ తప్పు వల్ల లైఫ్ పొందిన అతడు తన స్కోరుకు మరో పది పరుగులు జతచేసి.. ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
162 పరుగులు
అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గురువారం ముంబై- హైదరాబాద్ (MI vs SRH) జట్లు తలపడ్డాయి. వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ముంబై ఇండియన్స్.. రైజర్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో కమిన్స్ బృందం 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది.
సన్‌రైజర్స్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40) టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్ (28 బంతుల్లో 37) కూడా రాణించాడు. ఇక రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఓపెనర్ రోహిత్ శర్మ(16 బంతుల్లో 26) కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి
ఇక మరో ఓపెనర్ రియాన్ రికెల్టన్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో అతడు అవుటయ్యాడని భావించి మైదానం వీడే సమయానికి.. హై డ్రామా చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన ఫోర్త్ అంపైర్.. రికెల్టన్ పెవిలియన్‌కు వెళ్లకుండా ఆపేశాడు. జీషన్ వేసిన బంతిని నో బాల్‌గా ప్రకటించాడు.
క్లాసెన్ చేసిన తప్పు వల్ల
నిజానికి రికెల్టన్‌ను అవుట్ చేసే విషయంలో బౌలర్‌గా జీషన్ అన్సారీ.. ఫీల్డర్‌గా క్యాచ్ అందుకోవడంలో కమిన్స్ ఎలాంటి పొరపాటు చేయలేదు. కానీ వికెట్ కీపర్ క్లాసెన్ చేసిన తప్పు వల్ల రికెల్టన్‌కు లైఫ్ వచ్చింది.
కారణం ఇదే
విషయం ఏమిటంటే.. క్యాచ్‌ను అందుకునే లేదా స్టంపింగ్ ప్రయత్నంలో వికెట్ కీపర్ గ్లవ్స్ స్టంప్స్ ముందుకు రాకూడదు. ఇది అందరికీ తెలిసిన, చాలా కాలంగా అమల్లో ఉన్న నిబంధనే. కానీ గురువారం ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అన్సారీ వేసిన బంతిని రికెల్టన్ ఆడి కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు.
అయితే దీనిని ‘నోబాల్’గా ప్రకటిస్తూ అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు. రికెల్టన్ షాట్ ఆడక ముందే క్లాసెన్ గ్లవ్స్ ముందుకు రావడం ఇందుకు కారణం. ఇది ఐసీసీ నిబంధన 27.3.1కు విరుద్ధం. అందుకే అంపైర్లు నోబాల్ ఇచ్చారు. క్లాసెన్ కూడా తాను చేసిన తప్పును వెంటనే అంగీకరిస్తూ సైగ చేయడం గమనార్హం.
వాంఖడేలో జయభేరి
ఇక ముంబై బ్యాటర్లలో రికెల్టన్ 31 పరుగులు చేయగా.. విల్ జాక్స్ (36), సూర్యకుమార్ యాదవ్ (26), తిలక్ వర్మ (21 నాటౌట్) రాణించారు. ఆఖర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ముంబై మరో పదకొండు బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. 18.1 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసి.. నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
Applying the finishing touches 🤌
🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)
Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025
ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ హైదరాబాద్ స్కోర్లు
హైదరాబాద్: 162/5 (20)
ముంబై: 166/6 (18.1)
ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ముంబై విజయం.
చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్!