
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025 (IPL 2025)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి ఎనిమిది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న కమిన్స్ బృందం కేవలం రెండు మాత్రమే గెలిచింది. ముంబై ఇండియన్స్ (SRH vs MI)తో బుధవారం నాటి పోరులో ఓటమిపాలై ఈ సీజన్‌లో ఆరో ఓటమిని నమోదు చేసింది.
కుప్పకూలిన టాపార్డర్
సొంత మైదానం ఉప్పల్ వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. పేలవ ప్రదర్శన కనబరిచింది. ముంబై పేసర్ల ధాటికి రైజర్స్ టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (0), అభిషేక్ శర్మ (8) దారుణంగా విఫలం కాగా.. ఇషాన్ కిషన్ (1) మరోసారి చేతులెత్తేశాడు.
నితీశ్ రెడ్డి (2) సైతం నిరాశపరిచాడు. ఇలాంటి దశలో వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (44 బంతుల్లో 71) అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 43)తో కలిసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.
ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ ఏకంగా నాలుగు వికెట్లు కూల్చగా.. దీపక్ చహర్ రెండు, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక సన్‌రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ముంబై 15.4 ఓవర్లలో ఛేదించింది. రోహిత్ శర్మ (46 బంతుల్లో 70), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్) రాణించారు.
వాళ్లిద్దరి వల్లే ఈ మాత్రం..
ఈ నేపథ్యంలో ముంబై చేతిలో ఓటమి అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) స్పందించాడు. బ్యాటర్ల వైఫల్యమే తమ ఓటమికి కారణమని పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో తమకు ఇంకా కొన్ని మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయని.. వికెట్‌ను సరిగ్గా అంచనా వేయగలిగితేనే ఇకపై ముందుకు సాగే అవకాశం ఉందని కమిన్స్ వ్యాఖ్యానించాడు.
‘‘అభినవ్, క్లాసీ వల్ల మేము చెప్పుకోగదగ్గ స్కోరు చేయగలిగాం. కానీ ఈ ఇన్నింగ్స్‌లో మా జట్టు ప్రదర్శన అస్సలు బాలేదు. కనీసం ఇంకొక్కరైనా పట్టుదలగా నిలబడి ఉంటే బాగుండేది.
ఇంకా కొన్ని మ్యాచ్‌లే ఉన్నాయి
ఇదే పిచ్‌పై మా తొలి మ్యాచ్‌లో 280 పరుగులు స్కోరు చేశాం. కానీ ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీ20 మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సమయానుగుణంగా ఇన్నింగ్స్ ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటే మంచిది.
లేదంటే పరిస్థితి చేజారుతుంది. మాకింకా కొన్ని మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వికెట్‌ను కచ్చితంగా అంచనా వేసి.. అందుకు అనుగుణంగా ఆడితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలము. అయితే, కొన్నిసార్లు మనం సఫలమైతే.. మరికొన్ని సార్లు ప్రత్యర్థి జట్టు పైచేయి సాధిస్తుంది’’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
కాగా గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌కు ఈ సీజన్‌లో ఇంకా ఆరు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఆరింటిలోనూ గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు సన్‌రైజర్స్‌పై గెలిచిన ముంబై.. తొమ్మిదింట ఐదో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో ఏకంగా మూడో స్థానానికి దూసుకువచ్చింది.
చదవండి: IND Vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
4️⃣th consecutive win for the @mipaltan 👌
They make it 2️⃣ in 2️⃣ against #SRH this season 👏
Scorecard ▶ https://t.co/nZaVdtwDtv #TATAIPL | #SRHvMI pic.twitter.com/wZMMQnOEi0— IndianPremierLeague (@IPL) April 23, 2025