
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో పోలుస్తూ పాక్ రిపోర్టర్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ రెండింటిలో గొప్ప లీగ్ ఏదో చెప్పాలంటూ అతడు అడిగిన ప్రశ్నకు లాహోర్ ఖలందర్స్ స్టార్, ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్ దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ సత్తా
కాగా ప్రపంచంలోని అత్యంత ఆదరణ పొందిన, ఖరీదైన టీ20 లీగ్‌గా ఐపీఎల్ వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో భాగమైన ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ జట్లను కొనుగోలు చేసి.. అక్కడా సత్తా చాటుతున్నాయి. ఇక ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఐపీఎల్‌తో పోటీకి దిగి
పదిహేడేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న ఐపీఎల్‌కు ఇంత వరకు ప్రపంచంలోని ఏ టీ20 లీగ్ కూడా పోటీ ఇవ్వలేకపోతోంది. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మాత్రం ఈసారి ఐపీఎల్‌తో ఢీకొట్టింది. మార్చి 22న మొదలైన ఐపీఎల్-2025 మే 25న ముగియనుండగా.. పీఎస్‌ఎల్‌ను ఏప్రిల్ 11- మే 18 వరకు నిర్వహించేందుకు పీసీబీ షెడ్యూల్ ఖరారు చేసింది.
ఫలితంగా.. ఐపీఎల్‌తో పోటీ కారణంగా ప్రేక్షక ఆదరణ లేక పీఎస్‌ఎల్ వెలవెలబోతోంది. అయితే, కొంత మంది పాక్ జర్నలిస్టులు మాత్రం ఐపీఎల్‌తో పీఎస్‌ఎల్‌ను పోలుస్తూ విదేశీ ఆటగాళ్లను తికమకపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా లాహోర్ ఖలందర్ స్టార్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్‌ను ఓ రిపోర్టర్.. ప్రపంచంలోని ఇతర లీగ్‌లతో పోలిస్తే పీఎస్‌ఎల్ స్థానమేమిటి? అంటూ ప్రశ్నించారు.
PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు
ఈ ప్రశ్నను అర్థం చేసుకున్న సామ్ బిల్లింగ్స్.. ‘‘నా నుంచి మీరేదో చిలిపి సమాధానం ఆశిస్తున్నారు.. అంతే కదా!.. ప్రపంచంలో ఎక్కడైనా ప్రేక్షకులను కలిగి ఉండటం క్రికెట్‌కు ఉన్న ప్రత్యేకత. ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.. ఇలా ఎక్కడ క్రికెట్ ఆడినా అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా మారిపోవడం క్రికెటర్లుగా మా బాధ్యత.
కాబట్టి వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న లీగ్‌లను పోల్చి చూస్తూ.. ర్యాంకులు ఇవ్వడం కాస్త కష్టంతో కూడుకున్న పని. అయితే, ఇతర లీగ్‌లతో పోలిస్తే.. ఐపీఎల్ ప్రీమియర్ కాంపిటిషన్ అన్న మాట వాస్తవం. ఐపీఎల్‌తో పోలిస్తే ప్రతి లీగ్.. దానికంటే వెనుబడి ఉన్నట్లే.
ఇంగ్లండ్‌లో మేము.. ఇక్కడ పీఎస్‌ఎల్ మాదిరే ప్రపంచంలోని రెండో అత్యుత్తమ టీ20 లీగ్‌గా పేరొందాలనే ప్రయత్నాలు చేస్తున్నాము. ఆస్ట్రేలియాకు చెందిన బిగ్‌బాష్ లీగ్ పరిస్థితి కూడా ఇంతే.
ఏదేమైనా ప్రతీ లీగ్ దానికదే ప్రత్యేకం. నేనైతే ప్రపంచంలోని అత్యుత్తమ లీగ్‌లలో భాగమైనందుకు సంతోషంగా ఉన్నా’’ అని సామ్ బిల్లింగ్ పేర్కొన్నాడు. పీఎస్‌ఎల్ కంటే ఐపీఎల్ కచ్చితంగా బెటర్ అంటూ పరోక్షంగా తన మనసులో మాటను వెల్లడించాడు.
గతంలో ఐపీఎల్‌లో ఆడిన బిల్లింగ్స్
కాగా 33 ఏళ్ల సామ్ బిల్లింగ్స్ 2015-16లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున పీఎస్‌ఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అంటే.. 2023 నుంచి లాహోర్ ఖలందర్స్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ ఆడిన బిల్లింగ్స్.. 2018, 2019లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. చివరగా 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
చదవండి: Rohit Sharma: కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం