PSL 2025: చప్పగా సాగిన తొలి మ్యాచ్‌.. ఇలా అయితే కష్టమే! | PSL 2025: Munro Hits Fifty Islamabad United Beat Lahore Qalandars | Sakshi
Sakshi News home page

PSL 2025: చప్పగా సాగిన తొలి మ్యాచ్‌.. ఇస్లామాబాద్‌ను గెలిపించిన మున్రో

Published Sat, Apr 12 2025 11:21 AM | Last Updated on Sat, Apr 12 2025 11:52 AM

PSL 2025: Munro Hits Fifty Islamabad United Beat Lahore Qalandars

PC: PSL X

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)-2025 సీజన్‌ శుక్రవారం (ఏప్రిల్‌ 11) మొదలైంది. తొలి మ్యాచ్‌లో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ (ISU)- లాహోర్‌ ఖలందర్స్‌ (LHQ) తలపడ్డాయి. రావల్పిండి వేదికగా జరిగిన ఈ పోరులో టాస్‌ గెలిచిన ఇస్లామాబాద్‌ జట్టు.. లాహోర్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

అయితే, ఓపెనర్లు ఫఖర్‌ జమాన్‌ (1), మహ్మద్‌ నయీమ్‌ (8) త్వరత్వరగా పెవిలియన్‌కు చేరడంతో లాహోర్‌కు ఆరంభంలోనే వరుస  షాకులు తగిలాయి. ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ అబ్దుల్లా షఫీక్‌ (38 బంతుల్లో 66) ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. అతడికి తోడుగా సికందర్‌ రజా (23) రాణించాడు.

చెలరేగిన జేసన్‌ హోల్డర్‌
అయితే, డారిల్‌ మిచెల్‌ (13) సహా మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో 19.2 ఓవర్లలో కేవలం 139 పరుగులు మాత్రమే చేసి లాహోర్‌ జట్టు ఆలౌట్‌ అయింది. ఇస్లామాబాద్‌ బౌలర్లలో పేసర్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జేసన్‌ హోల్డర్‌ నాలుగు వికెట్ల (4/26)తో చెలరేగగా.. కెప్టెన్‌, స్పిన్నర్‌ షాదాబ్‌ ఖాన్‌ (3/25) మూడు వికెట్లతో రాణించాడు.

మిగిలిన వారిలో నసీం షా, రిలే మెరిడిత్‌, ఇమాద్‌ వసీం ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దిగిన ఇస్లామాబాద్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్‌ ఆండ్రీ గౌస్‌ (4) సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే వెనుదిరగగా.. మరో ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (24 బంతుల్లో 25) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపు
ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ కొలిన్‌ మున్రో, సల్మాన్‌ ఆఘా కాస్త వేగంగా ఆడి.. జట్టును విజయతీరాలకు చేర్చారు. మున్రో 42 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 59 పరుగులతో అజేయంగా నిలవగా.. సల్మాన్‌ 34 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

వీరిద్దరి ఇన్నింగ్స్‌ కారణంగా 17.4 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఇస్లామాబాద్‌ టార్గెట్‌ పూర్తి చేసింది. లాహోర్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి సీజన్‌ను ఘనంగా ఆరంభించింది.

ఐపీఎల్‌తో ఢీ!
కాగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) సాధారణంగా ఐపీఎల్‌తో పోటీ లేకుండా పీఎస్‌ఎల్‌ నిర్వహించేది. కానీ ఈసారి మాత్రం క్యాష్‌ రిచ్‌ లీగ్‌ను ఢీకొడుతూ ఏప్రిల్‌ 11- మే 18 వరకు షెడ్యూల్‌ ఖరారు చేసింది. 

మరోవైపు మార్చి 22న మొదలైన ఐపీఎల్‌-2025.. మే 25న ఫైనల్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది విదేశీ క్రికెటర్లు కూడా ఐపీఎల్‌ ఆడే నిమిత్తం పీఎస్‌ఎల్‌ నుంచి తప్పుకొన్నారు.

చప్పగా సాగిన తొలి మ్యాచ్‌.. ఇలా అయితే కష్టమే!
ఇక పరుగుల వరద పారే ఐపీఎల్‌తో పోటీకి వచ్చిన పీఎస్‌ఎల్‌ తొలి మ్యాచే చప్పగా సాగింది. కనీసం ఇరు జట్లు కలిసీ కనీసం మూడు వందల పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయాయి. దీంతో అభిమానులు ఉసూరుమంటున్నారు. 

పీఎస్‌ఎల్‌ ఇలాగే కొనసాగితే ఎవరూ చూడరని.. సొంత అభిమానులే పీసీబీని విమర్శిస్తున్నారు.  టీ20 క్రికెట్‌ అంటేనే బౌండరీలు, సిక్సర్ల వర్షం ఉండాలని.. కాస్త బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు తయారు చేయాలని సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.

పీఎస్‌ఎల్‌-2025: ఇస్లామాబాద్‌ వర్సెస్‌ లాహోర్‌ స్కోర్లు
లాహోర్‌: 139 (19.2)
ఇస్లామాబాద్‌: 143/2 (17.4)
ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లాహోర్‌ను ఓడించి ఇస్లామాబాద్‌.

చదవండి: KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? ఇంతకీ మెదడు పనిచేస్తోందా?!
ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూప‌ర్ లీగ్.. విదేశీ క్రికెట‌ర్లు వీరే
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement