ఒక్క సిరీస్‌ ఓడితే ఏంటి? మా లక్ష్యం వరల్డ్‌కప్‌ మాత్రమే: పాక్‌ కెప్టెన్‌ | Doesnt Matter When You Lose Series Focus Is On WC: Salman Agha | Sakshi
Sakshi News home page

ఒక్క సిరీస్‌ ఓడితే ఏంటి? మా లక్ష్యం వరల్డ్‌కప్‌ మాత్రమే: పాక్‌ కెప్టెన్‌

Published Thu, Mar 27 2025 1:30 PM | Last Updated on Thu, Mar 27 2025 3:15 PM

Doesnt Matter When You Lose Series Focus Is On WC: Salman Agha

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు గత కొంతకాలంగా ఇంటా.. బయటా పరాభవాలే ఎదురవుతున్నాయి. తొలుత న్యూజిలాండ్‌- సౌతాఫ్రికాతో సొంతగడ్డపై త్రైపాక్షిక సిరీస్‌లో ఓటమిపాలైన పాక్‌.. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ చేదు అనుభవాలు ఎదుర్కొంది.

ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్తాన్‌.. కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది. అనంతరం న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌ (NZ vs PAK T20 Series)లో చిత్తుగా ఓడిపోయింది. కివీస్‌తో బుధవారం నాటి ఐదో టీ20లో ఓడి.. 4-1తో సిరీస్‌లో పరాజయం పాలైంది.

ఒక్క సిరీస్‌ ఓడితే ఏంటి? మా లక్ష్యం వరల్డ్‌కప్‌ మాత్రమే
అయితే, ఓటమి అనంతరం పాకిస్తాన్‌ టీ20 జట్టు కొత్త కెప్టెన్‌ సల్మాన్‌ అలీ ఆఘా (Salman Ali Agha) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇలాంటి సిరీస్‌లలో ఓడిపోయినా ఫర్వాలేదని.. తమ దృష్టి మొత్తం ఆసియా కప్‌, వరల్డ్‌కప్‌ టోర్నీల మీదనే ఉందని అతడు వ్యాఖ్యానించాడు. ‘‘న్యూజిలాండ్‌ జట్టు అద్భుతంగా ఆడింది.

సిరీస్‌ ఆసాంతం వాళ్లు అదరగొట్టారు. అయినా మాకూ కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. మూడో టీ20లో హసన్‌ నవాజ్‌ అద్భుత శతకం సాధించాడు. ఐదో టీ20లో సూఫియాన్‌ సూపర్‌గా బౌలింగ్‌ చేశాడు.

వన్డే సిరీస్‌లో మేము రాణిస్తాం
మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా దృష్టి మొత్తం ఆసియా కప్‌, ప్రపంచకప్‌లపైనే కేంద్రీకృతమై ఉంది. ఈ సిరీస్‌లో ఓడినంత మాత్రాన పెద్దగా నిరాశపడాల్సిందేమీ లేదు. ఇక పొట్టి ఫార్మాట్‌కు, వన్డే ఫార్మాట్‌కు ఏమాత్రం పొంతన ఉండదని తెలిసిందే. వన్డే సిరీస్‌లో మేము రాణిస్తాం’’ అని సల్మాన్‌ ఆఘా పేర్కొన్నాడు.

అపుడు డకెట్‌ కూడా ఇలాగే
ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఆఘా కామెంట్లపై సోషల్‌ మీడియాలో సైటైర్లు పేలుతున్నాయి. ఇంగ్లండ్‌ క్రికెటర్‌ బెన్‌ డకెట్‌తో పోలుస్తూ నెటిజన్లు సల్మాన్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 టోర్నీకి ముందు ఇంగ్లండ్‌ భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌ అయింది. అయితే.. ఈ ఘోర ఓటమి తర్వాత బెన్‌ డకెట్‌ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సిరీస్‌లలో పరాజయాలు పెద్దగా లెక్కలోకి రావు. మేమే చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత దీనిని అందరూ మర్చిపోతారు’’ అని పేర్కొన్నాడు.

రెండు జట్లదీ ఒకే పరిస్థితి
అయితే, చాంపియన్స్‌ ట్రోఫీలో ఇంగ్లండ్‌ కనీసం ఒక్క విజయం కూడా సాధించలేదు. అఫ్గనిస్తాన్‌ చేతిలోనూ చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు సల్మాన్‌ ఆఘా తమ ఫోకస్‌ ఆసియా కప్‌, వరల్డ్‌కప్‌ మాత్రమే అని చెప్పడం గమనార్హం. 

అన్నట్లు చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌ తొలుత న్యూజిలాండ్‌.. తర్వాత టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలుద్దామనుకుంటే వర్షం వల్ల.. ఆ మ్యాచ్‌ రద్దైంది. దీంతో ఇంగ్లండ్‌ మాదిరే ఒక్క గెలుపు లేకుండానే పాకిస్తాన్‌ ఈ వన్డే టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది.

చదవండి: NZ vs Pak: టిమ్‌ సీఫర్ట్‌ విధ్వంసం.. పాకిస్తాన్‌కు అవమానకర ఓటమి
పాక్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement