NZ vs PAK: రిజ్వాన్‌, బాబర్‌లపై వేటు.. పాక్‌ కొత్త కెప్టెన్‌గా స్టార్‌ ఆల్‌రౌండర్‌ | NZ Vs PAK 2025 PCB: Babar Azam Rizwan Dropped New Pakistan T20I Skipper Is | Sakshi
Sakshi News home page

NZ vs PAK: రిజ్వాన్‌, బాబర్‌లపై వేటు.. పాక్‌ కొత్త కెప్టెన్‌గా స్టార్‌ ఆల్‌రౌండర్‌

Published Tue, Mar 4 2025 5:12 PM | Last Updated on Tue, Mar 4 2025 5:34 PM

NZ Vs PAK 2025 PCB: Babar Azam Rizwan Dropped New Pakistan T20I Skipper Is

న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(PCB) తమ జట్లను ప్రకటించింది. కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(Mohammad Rizwan), మాజీ సారథి బాబర్‌ ఆజం(Babar Azam)లకు ఈ సందర్భంగా షాకిచ్చింది. టీ20 జట్టు నుంచి వీరిద్దరిని తప్పించిన యాజమాన్యం వన్డేల్లో మాత్రం చోటిచ్చింది.

పాయింట్ల పట్టికలో అట్టడుగున
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్‌ ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుగా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన రిజ్వాన్‌ బృందం.. గ్రూప్‌ దశలోనే ఈ వన్డే టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది. 

గ్రూప్‌-‘ఎ’లో భాగంగా తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్‌ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌.. అనంతరం దుబాయ్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో మరోసారి పరాజయాన్ని చవిచూసింది.

అనంతరం ఆఖరిగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రయత్నించగా.. వర్షం అడ్డుపడింది. రావల్పిండిలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ వరణుడి కారణంగా టాస్‌ పడకుండానే రద్దైపోయింది. దీంతో చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో ఒక్క విజయం కూడా లేకుండానే పాకిస్తాన్‌ టోర్నీని ముగించింది. పాయింట్ల పట్టికలోనూ అట్టడుగున నిలిచి అభిమానుల ఆగ్రహానికి గురైంది.

ఈ టోర్నీలో కెప్టెన్‌ రిజ్వాన్‌తో పాటు స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజం విఫలం కావడం తీవ్ర ‍ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై మాజీ క్రికెటర్లు వసీం అక్రం, షోయబ్‌ అక్తర్‌ తదితరులు విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో పీసీబీ ప్రక్షాళన చర్యలు చేపట్టినట్లు కనిపిస్తోంద.

న్యూజిలాండ్‌ పర్యటనకు
కాగా చాంపియన్స్‌ ట్రోఫీలో చేదు అనుభవం తర్వాత పాకిస్తాన్‌ పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడేందుకు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. మార్చి 16- ఏప్రిల్‌ 5 వరకు కొనసాగనున్న పర్యటనలో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించి రెండు వేర్వేరు జట్లను పీసీబీ మంగళవారం ప్రకటించింది. వన్డే సారథిగా రిజ్వాన్‌ను కొనసాగించడంతో పాటు ఆ జట్టులో బాబర్‌కు కూడా సెలక్టర్లు చోటిచ్చారు.

అయితే, టీ20లకు మాత్రం పీసీబీ కొత్త కెప్టెన్‌ను తీసుకువచ్చింది. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ సల్మాన్‌ ఆఘాను పాక్‌ టీ20 జట్టు సారథిగా నియమించింది. ఈ క్రమంలో రిజ్వాన్‌, బాబర్‌లపై వేటు వేసింది. 

ఆకిబ్‌ కొనసాగింపు
ఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్‌ ఆకిబ్‌ జావెద్‌పై కూడా వేటు పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా కివీస్‌ టూర్‌కు మాత్రం పాకిస్తాన్‌ అతడినే కొనసాగించింది.

కొత్తగా మహ్మద్‌ యూసఫ్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించిన పీసీబీ.. నవీద్‌ అక్రం చీమాను టీమ్‌ మేనేజర్‌గా.. అజర్‌ మహమూద్‌ను అసిస్టెంట్‌ కోచ్‌గా సహాయక సిబ్బందిలో చేర్చుకుంది. 

ఇదిలా ఉంటే.. ఈ టూర్‌కు గాయాల వల్ల ఓపెనర్లు ఫఖర్‌ జమాన్‌, సయీమ్‌ ఆయుబ్‌ దూరం కాగా ఆకిఫ్‌ జావేద్‌, మహ్మద్‌ అలీలకు వన్డే జట్టులో స్థానం దక్కింది.

కాగా న్యూజిలాండ్‌- పాకిస్తాన్‌ మధ్య మార్చి 16, 18, 21, 23, 26 తేదీల్లో ఐదు టీ20లు.. మార్చి 29, ఏప్రిల్‌ 2, 5 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.

న్యూజిలాండ్‌తో వన్డేలకు పాకిస్తాన్‌ జట్టు
మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ ఆఘా (వైస్‌ కెప్టెన్‌), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, ఆకిఫ్‌ జావేద్, బాబర్ ఆజం,  ఫహీమ్ అష్రఫ్, ఇమామ్ ఉల్ హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ అలీ, ముహమ్మద్ వాసిం జూనియర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా,  సూఫియాన్‌ ముఖీమ్, తయ్యాబ్ తాహిర్.

న్యూజిలాండ్‌తో టీ20లకు పాకిస్తాన్‌ జట్టు
సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్‌ కెప్టెన్‌), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, హసన్ నవాజ్, జహందాద్ ఖాన్, ఖుష్దిల్ షా, ముహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, ముహమ్మద్ అలీ, ముహమ్మద్ హారీస్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, షాహీన్ షా అఫ్రిది, సూఫియాన్‌ ముఖీమ్‌, ఉస్మాన్‌ ఖాన్‌.

చదవండి: రోహిత్‌ శర్మ ‘చెత్త’ రికార్డు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement