రిజ్వాన్‌తో బాబర్ ఆజం (PC: PCB)
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. కివీస్ గడ్డపై జనవరి 12 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
ఇక ఈ సిరీస్ ద్వారానే పాక్ టీ20 జట్టు కొత్త కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది సారథిగా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి సీనియర్లు అతడి నాయకత్వంలో తొలిసారి మైదానంలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో పీసీబీ సెలక్షన్ కమిటీ కన్సల్టెంట్, మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్‌కు వింత ప్రశ్న ఎదురైంది.
స్థానిక టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో యాంకర్.. ‘‘సీనియర్లు బాబర్ ఆజం, రిజ్వాన్‌లకు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా విశ్రాంతినివ్వవచ్చు కదా?’’ అని అక్మల్‌ను అడిగారు. ఇందుకు అతడు బదులిస్తూ..
‘‘సెలక్షన్ కమిటీలోని సభ్యులు కానీ.. మేనేజ్‌మెంట్‌గానీ న్యూజిలాండ్ సిరీస్‌లో బాబర్, రిజ్వాన్‌లకు రెస్ట్ ఇవ్వాలని అనుకోలేదు. ఎందుకంటే పాక్ జట్టు వెళ్తోంది న్యూజిలాండ్‌కు.. నేపాల్‌కు కాదు.
అలాంటి పటిష్ట జట్టుతో పోటీపడేటప్పుడు సీనియర్లకు విశ్రాంతినివ్వడం ఏమిటి? అసలు ఎవరైనా అలాంటి ఆలోచన చేస్తారా?’’ అంటూ కమ్రాన్ అక్మల్ కౌంటర్ వేశాడు.
ఇక షాన్ మసూద్ కెప్టెన్సీ గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘కెప్టెన్‌గా లేదంటే కోచింగ్ సిబ్బందిగా కొత్తగా నియమితులైన వాళ్లకు.. తమను తాము నిరూపించుకునేందుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం ఇవ్వాలి.
ఆ తర్వాతే వారి పనితీరును అంచనా వేసే అవకాశం ఉంటుంది’’ అని అక్మల్ పేర్కొన్నాడు. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో ఘోర వైఫల్యం అనంతరం పాక్ కెప్టెన్‌గా బాబర్ ఆజం వైదొలిగాడు. అతడి స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్లు అయ్యారు.
ఈ క్రమంలో మసూద్ సారథ్యంలో తొలిసారి ఆసీస్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ తొలి టెస్టుల్లో చిత్తుచిత్తుగా ఓడి విమర్శలు మూటగట్టుకుంది. ఇక డిసెంబరు 26 నుంచి రెండో టెస్టు ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ముగించుకుని తదుపరి న్యూజిలాండ్‌కు పయనం కానుంది.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు
షాహిన్ ఆఫ్రిది (కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, హసీబుల్లా ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఆజం ఖాన్, అమీర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, ఉసామా మీర్, హారిస్ రవూఫ్, జమాన్ ఖాన్.
Comments
Please login to add a commentAdd a comment