
పాకిస్తాన్ క్రికెట్ జట్టు రాత మారటం లేదు. వరుస ఓటములతో చతికిల పడ్డ పాక్.. తాజాగా న్యూజిలాండ్‌తో రెండో వన్డేలోనూ పరాజయం పాలైంది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆతిథ్య జట్టుకు సిరీస్ సమర్పించుకుంది.
కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ (Pakistan Tour Of New Zealand)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) సారథ్యంలో టీ20 సిరీస్‌లో 4-1తో ఘోర పరాభవం చవిచూసింది. అనంతరం.. రిజ్వాన్ కెప్టెన్సీలో శనివారం తొలి వన్డే ఆడిన పాక్.. 73 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ క్రమంలో బుధవారం ఇరుజట్ల మధ్య రెండో వన్డే జరిగింది. హామిల్టన్ వేదికగా టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో రైస్ మరియూ 18 పరుగులకు పరిమితం కాగా.. నిక్ కెల్లీ 31 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో హెన్రీ నికోల్స్(22), ముహమ్మద్ అబ్బాస్ (41) ఫర్వాలేదనిపించగా.. మిచెల్ హే దంచికొట్టాడు.
సెంచరీకి ఒక్క పరుగు దూరంలో
ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 78 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయినప్పటికీ.. కివీస్ మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మిచెల్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది.
పాక్ బౌలర్లలో మొహమ్మద్ వసీం జూనియర్, సూఫియాన్ ముకీమ్ రెండేసి వికెట్లు తీయగా.. ఫాహిమ్ అష్రఫ్, అకిఫ్ జావేద్, హ్యారిస్ రవూఫ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
పేకమేడలా కుప్పకూలిన టాపార్డర్
ఇక లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఆరంభం నుంచే తడబడింది. కివీస్ పేసర్ల ధాటికి పాక్ టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (1), ఇమామ్ ఉల్ హక్(1)తో పాటు బాబర్ ఆజం(Babar Azam- 1), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (5) సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు.
సల్మాన్ ఆఘా 9 పరుగులకే నిష్క్రమించగా.. తయ్యబ్ తాహిర్ 13 పరుగులు చేశాడు. ఇలా బ్యాటర్లంతా విఫలమైన వేళ..బౌలింగ్ ఆల్‌రౌండర్ ఫాహిమ్ అష్రఫ్ బ్యాట్‌తో చెలరేగాడు. 80 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 73 పరుగులు సాధించాడు.
అతడికి తోడుగా పేసర్ నసీం షా రాణించాడు. కేవలం 44 బంతుల్లోనే 51 పరుగులతో అలరించాడు. వీరిద్దరి అర్ధ శతకాల కారణంగా పాక్ అవమానకర నుంచి తప్పించుకుంది. 41.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయి.. 84 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఐదేసిన బెన్ సీర్స్
కివీస్ బౌలర్లలో రైటార్మ్ పేసర్ బెన్ సీర్స్ ఐదు వికెట్లతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. జేకబ్ డఫీ మూడు, నాథన్ స్మిత్, విలియం ఓరూర్కీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కివీస్ బ్యాటర్ మిచెల్ హేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇక ఈ విజయంతో మరో వన్డే మిగిలి ఉండగానే బ్రేస్‌వెల్ బృందం పాక్‌పై వన్డే సిరీస్ గెలుపు నమోదు చేసింది. ఇరుజట్ల మధ్య ఏప్రిల్ 5 నాటి నామమాత్రపు వన్డేతో పాక్ కివీస్ టూర్ ముగుస్తుంది.
కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రిజ్వాన్ బృందం న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గెలుపు అన్నదే లేకుండా ఈ వన్డే టోర్నీని ముగించింది. తాజాగా న్యూజిలాండ్ పర్యటనలోనూ మరోసారి చెత్త ప్రదర్శనతో వన్డే సిరీస్ చేజార్చుకుంది.
చదవండి: రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!