మహ్మద్ రిజ్వాన్ (PC: PCB X)
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ కావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని మహ్మద్ రిజ్వాన్ హర్షం వ్యక్తం చేశాడు. దేశం తరఫున ఆడాలన్న కోరికతో పాటు సారథిగా ఎదగాలన్న కల నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.
తొలి సిరీస్‌లోనే పాక్‌ను విజేతగా నిలుపుతా
మాజీ కెప్టెన్ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్... తనదైన శైలిలో జట్టుకు ముందుకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఇక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సిరీస్‌లోనే పాక్‌ను విజేతగా నిలుపుతానంటూ రిజ్వాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడమే తమ తక్షణ కర్తవ్యమని పేర్కొన్నాడు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ దారుణ వైఫల్యం తర్వాత బాబర్ ఆజం వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. షాన్ మసూద్ టెస్టులు, షాహిన్ ఆఫ్రిది టీ20 జట్టు కెప్టెన్లుగా నియమితులయ్యారు.
అయితే, వరుస వైఫల్యాల నేపథ్యంలోనూ షాన్ మసూద్‌ను కొనసాగించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. ఆఫ్రిదిపై మాత్రం వేటువేసింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024కు ముందు బాబర్ ఆజం తిరిగి వన్డే, టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే, ఈసారి కూడా పాక్ మెగా టోర్నీలో విఫలం కావడంతో బాబర్ కెప్టెన్సీపై విమర్శలు రాగా.. ఇటీవలే సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు.
ఈ క్రమంలో బాబర్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్‌ను వన్డే, టీ20 కెప్టెన్‌గా నియమించినట్లు పీసీబీ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఇక ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా రిజ్వాన్ కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.
ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడిస్తాం
ఈ నేపథ్యంలో రిజ్వాన్ తాజాగా మాట్లాడుతూ.. ‘‘గతంలో ఆస్ట్రేలియా గడ్డపై మేము ఇబ్బంది పడ్డామన్న మాట వాస్తవం. అయితే, ఈసారి మాత్రం అభిమానుల కలను నెరవేరుస్తాం. గత సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లో చివరి వరకు విజయం మాదే అన్నట్లుగా పోరాటం సాగించాం.
కానీ దురదృష్టవశాత్తూ ఆఖరి నిమిషంలో ప్రతికూల ఫలితం వచ్చేది. నాడు చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. ఈసారి ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడిస్తాం’’ అని విశ్వాసం వ్యక్తం చేశాడు.
కాగా పాకిస్తాన్ చివరగా 2002లో ఆసీస్‌లో ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలిచింది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య నవంబరు 4- 18 వరకు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ఇక వరుస వైఫల్యాల అనంతరం ఇటీవలే పాకిస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది. సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి 2-1తో గెలిచింది.
చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్
Comments
Please login to add a commentAdd a comment