సౌతాఫ్రికాతో రెండో వన్డేలో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. సమిష్టిగా రాణించి 81 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా టీ20, వన్డే, టెస్టులు ఆడేందుకు పాక్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.
ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. ఆతిథ్య సౌతాఫ్రికా 2-0తో సిరీస్ గెలుచుకుంది. అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం పాకిస్తాన్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. పర్ల్ వేదికగా మంగళవారం నాటి తొలి వన్డేలో మూడు వికెట్ల తేడాతో గెలిచిన రిజ్వాన్ బృందం.. కేప్‌టౌన్ మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంది.
ఓపెనర్లు విఫలం
న్యూలాండ్స్ మైదానంలో గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షఫీక్ అబ్దుల్లా డకౌట్ కాగా.. మరో ఓపెనర్ సయీమ్ అయూబ్ 25 పరుగులకే వెనుదిరిగాడు.
కమ్రాన్ గులామ్ మెరుపు అర్ధ శతకం
అయితే, వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(95 బంతుల్లో 73) మెరుగ్గా రాణించగా.. రిజ్వాన్ కెప్టెన్ ఇన్నింగ్స్(82 బంతుల్లో 80)తో మెరిశాడు. మిగతా వాళ్లలో సల్మాన్ ఆఘా(33) ఫర్వాలేదనిపించగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కమ్రాన్ గులామ్(32 బంతుల్లో 63) మెరుపు అర్ధ శతకం సాధించాడు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 329 పరుగులు చేసి పాకిస్తాన్ ఆలౌట్ అయింది.
ప్రొటిస్ జట్టు బౌలర్లలో యువ పేసర్ క్వెనా మఫాకా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్కో జాన్సెన్ మూడు, బిజోర్న్ ఫార్చూన్, పెహ్లూక్వాయో తలా ఒక వికెట్ తీశారు. అయితే, లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్‌లో ఓపెనర్లు కెప్టెన్ తెంబా బవుమా(12), టోనీ డి జోర్జీ(34), వన్‌డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్(23) విఫలమయ్యారు.
హెన్రిచ్ క్లాసెన్ ధనాధన్ ఇన్నింగ్స్
ఇక మిడిలార్డర్‌లో ఐడెన్ మార్క్రమ్(21) నిరాశపరచగా.. హెన్రిచ్ క్లాసెన్ మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. 74 బంతుల్లో అతడు 8 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 97 పరుగులు సాధించి.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక డేవిడ్ మిల్లర్(29) కాసేపు పోరాడే ప్రయత్నం చేయగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం లభించలేదు.
సిరీస్ పాక్ కైవసం
ఈ క్రమంలో 43.1 ఓవర్లకే సౌతాఫ్రికా కథ ముగిసిపోయింది. ఆతిథ్య ప్రొటిస్‌ను 248 పరుగులకే పరిమితం చేసిన పాకిస్తాన్.. 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది నాలుగు, నసీం షా మూడు, అబ్రార్ అహ్మద్ రెండు, సల్మాన్ ఆఘా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు మూడో వన్డే ఆదివారం జొహన్నస్‌బర్గ్‌లో జరుగుతుంది.
చదవండి: IND W Vs WI W: విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం
Comments
Please login to add a commentAdd a comment