సౌతాఫ్రికా గడ్డపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. వన్డే సిరీస్‌లో ఆతిథ్య ప్రొటిస్ జట్టును 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా.. సౌతాఫ్రికా 2-0తో నెగ్గింది. అనంతరం జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో జయభేరి మోగించిన పాకిస్తాన్.. తాజాగా మూడో వన్డేలోనూ విజయం సాధించింది. జొహన్నస్‌బర్గ్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది.
సయీమ్ అయూబ్ శతకం
ఇక వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ బృందం తొమ్మిది వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఓపెనర్ సయీమ్ అయూబ్(94 బంతుల్లో 101) శతకంతో చెలరేగగా.. బాబర్ ఆజం(52), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(53) హాఫ్ సెంచరీలు సాధించారు.
మిగతా వాళ్లలో సల్మాన్ ఆఘా(48), తయ్యబ్ తాహిర్(28) రాణించారు. టాపార్డర్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్(0)తో పాటు లోయర్ ఆర్డర్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైంది. ప్రొటిస్ బౌలర్లలో కగిసో రబడ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్ రెండు, క్వెనా మఫాకా, కార్బిన్ బాష్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
క్లాసెన్ ఒక్కడే
అయితే, లక్ష్య ఛేదనలో మాత్రం సౌతాఫ్రికా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. ఓపెనర్లలో టోనీ డి జోర్జి(26) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ తెంబా బవుమా 8 పరుగులకే నిష్క్రమించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాసీ వాన్ డెర్ డసెన్ 35 రన్స్‌తో రాణించగా.. మిడిలార్డర్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్(19) నిరాశపరిచాడు.
ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ధనాధన్ బ్యాటింగ్‌తో ప్రొటిస్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కేవలం 43 బంతుల్లోనే 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 81 పరుగులు సాధించాడు. అయితే, షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో తయ్యబ్ తాహిర్‌కు క్యాచ్ ఇచ్చి క్లాసెన్ పెవిలియన్ చేరడంతో ప్రొటిస్ జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.
36 పరుగుల తేడాతో పాక్ గెలుపు
మార్కో జాన్సెన్(26), కార్బిన్ బాష్(40 నాటౌట్) కాసేపు పోరాడగా.. జార్న్ ఫార్చూన్(8), కగిసో రబడ(14), మఫాకా(0) విఫలమయ్యారు. ఫలితంగా 42 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌట్ అయిన సౌతాఫ్రికాపై.. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది.
తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది. పాక్ బౌలర్లలో సూఫియాన్ ముకీం నాలుగు వికెట్లు కూల్చగా.. షాహిన్ ఆఫ్రిది, నసీం షా చెరో రెండు.. మహ్మద్ హొస్నేన్, సయీమ్ ఆయుబ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
సౌతాఫ్రికాలో సౌతాఫ్రికాను వన్డేల్లో వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా
కాగా 1991లో అధికారికంగా తొలిసారి వన్డే సిరీస్ ఆడిన సౌతాఫ్రికా.. స్వదేశంలో క్లీన్‌స్వీప్ కావడం ఇదే మొదటిసారి. తద్వారా ప్రొటిస్ గడ్డపై సౌతాఫ్రికాను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా పాకిస్తాన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇంతవరకు ఏ జట్టుకూ సాధ్యం కాని అరుదైన ఫీట్ నమోదు చేసింది.
అంతేకాదు.. సౌతాఫ్రికాపై పాకిస్తాన్‌కు ఇది మూడో ద్వైపాక్షిక సిరీస్ విజయం. ఈ ఘనత సాధించిన తొలి జట్టు కూడా పాకిస్తాన్ కావడం విశేషం. ఇక మూడో వన్డేలో సెంచరీ చేసిన సయీమ్ ఆయుబ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా అందుకున్నాడు.
చదవండి: VHT 2024: అయ్యర్ సెంచరీ వృథా.. 383 పరుగుల టార్గెట్‌ను ఊదిపడేసిన కర్ణాటక
Comments
Please login to add a commentAdd a comment