![Pak vs SA ODI: Heinrich Klaasen 56 Ball 87 South Africa Set 353 Run Target](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Heinrich-Klaasen.jpg.webp?itok=tsc9jTle)
పాకిస్తాన్‌తో వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు దంచికొట్టారు. త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా కరాచీ వేదికగా ప్రొటిస్ జట్టు 352 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. నేషనల్ స్టేడియంలో నాలుగో నాలుగో అత్యధిక స్కోరును నమోదు చేసింది.
కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) సన్నాహకాల్లో భాగంగా పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్, సౌతాఫ్రికా అక్కడకు వెళ్లాయి. ఈ క్రమంలో ట్రై సిరీస్‌లో భాగంగా తొలుత పాక్- న్యూజిలాండ్ మధ్య లాహోర్‌లో శనివారం మ్యాచ్ జరిగింది. ఇందులో కివీస్ జట్టు పాక్‌ను 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
ఫైనల్‌లో న్యూజిలాండ్
అనంతరం సౌతాఫ్రికాతో సోమవారం తలపడ్డ న్యూజిలాండ్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో మరో ఫైనల్ బెర్తు కోసం సౌతాఫ్రికా- పాకిస్తాన్ కరాచీలో మంగళవారం మ్యాచ్ ఆడుతున్నాయి. ఇందులో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ తెంబా బవుమా(Temba Bavuma) అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. 96 బంతుల్లో పదమూడు ఫోర్ల సాయంతో 82 రన్స్ సాధించాడు.
మరో ఓపెనర్ టోనీ డి జోర్జి(22) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన మాథ్యూ బ్రీట్జ్కే( Matthew Breetzke) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 84 బంతుల్లో 83 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసర ఇన్నింగ్స్
కేవలం 38 బంతుల్లోనే యాభై పరుగులు అందుకున్న ఈ విధ్వంసకర వీరుడు.. మొత్తంగా 56 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. క్లాసెన్ ఇన్నింగ్స్‌లో పదకొండు ఫోర్లతో పాటు మూడు సిక్సర్లు ఉండటం విశేషం. ఇక మిగతా వాళ్లలో వియాన్ ముల్దర్(2) విఫలం కాగా.. కైలే వెరెన్నె(32 బంతుల్లో 44 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కార్బిన్ బోష్(9 బంతుల్లో 15 నాటౌట్) అతడికి సహకరించాడు.
ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో సౌతాఫ్రికా కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 352 పరుగులు సాధించింది. ఇక సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఆఖరి పది ఓవర్లలో పాకిస్తాన్ ఏకంగా 110 పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టు బౌలర్ల చెత్త ప్రదర్శనకు నిదర్శనం. ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డేలోనూ చివరి పది ఓవర్లలో పాక్ బౌలర్లు 123 పరుగులు ఇచ్చుకున్నారు.
శుక్రవారం ఫైనల్ మ్యాచ్
కాగా.. పాకిస్తాన్- సౌతాఫ్రికా మధ్య కరాచీ మ్యాచ్‌లో గెలిచిన జట్టు న్యూజిలాండ్‌తో శుక్రవారం ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది.
ఈ మెగా టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ నేరుగా అర్హత సాధించగా.. ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఈ ఈవెంట్లో అడుగుపెట్టాయి. ఈ క్రమంలో ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించగా.. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్-‘ఎ’ నుంచి.. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ గ్రూప్-‘బి’ నుంచి పోటీపడనున్నాయి.
కాగా ఇటీవల సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా పాకిస్తాన్ ఆతిథ్య జట్టును 3-0తో వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ను వారి సొంతగడ్డపై ఓడించాలనే పట్టుదలతో కరాచీలో చితక్కొట్టిన సౌతాఫ్రికా.. బౌలింగ్‌లోనూ రాణించి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు
Comments
Please login to add a commentAdd a comment