
అహ్మదాబాద్ వన్డే సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో కోహ్లి ఆరో స్థానంలో ఉన్నాడు.
కాగా గత కొంతకాలంగా కోహ్లి వరుస వైఫల్యాలతో సతమవుతున్న విషయం తెలిసిందే. గత పన్నెండు ఇన్నింగ్స్‌లో అతడు చేసిన పరుగులు వరుసగా 4, 1, 5, 100*, 7, 11, 3, 36, 5, 17, 6, 6. ఈ క్రమంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్(India vs England)లోనైనా కోహ్లి ఫామ్‌లోకి వస్తాడని భావిస్తే.. మోకాలి గాయం కారణంగా నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు.
కేవలం ఐదు పరుగులు
అనంతరం కటక్‌లో జరిగిన రెండో వన్డేతో పునరాగమనం చేసిన కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ సాయంతో కేవలం ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.
ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డేలోనైనా బ్యాట్ ఝులిపిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో కోహ్లి ఓ అరుదైన ఘనత సాధించడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. కాగా కోహ్లి ఇంగ్లండ్‌పై ఇప్పటి వరకు ఎనిమిది శతకాలు బాదడంతో పాటు 23 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. సగటు 41.23.
హాఫ్ సెంచరీతో మెరిసిన కోహ్లి
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం నాటి నామమాత్రపు మూడో వన్డేకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
అయితే, ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ కోహ్లి(52), ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చిన కోహ్లి అవుటయ్యాడు.
ఇక ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ శతకం(112) బాదగా..శ్రేయస్ అయ్యర్(78), కేఎల్ రాహుల్(40) రాణించారు. ఫలితంగా నిర్ణీత యాభై ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు
1. డాన్ బ్రాడ్‌మన్(ఆస్ట్రేలియా)- 63 ఇన్నింగ్స్‌లో 5028 పరుగులు
2. అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా)- 124 ఇన్నింగ్స్‌లో 4850 పరుగులు
3. స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా)- 114 ఇన్నింగ్స్‌లో 4815 పరుగులు
4. వివియన్ రిచర్డ్స్(వెస్టిండీస్)- 84 ఇన్నింగ్స్‌లో 4488 పరుగులు
5. రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 99 ఇన్నింగ్స్‌లో 4141 పరుగులు
6. విరాట్ కోహ్లి(ఇండియా)-109 ఇన్నింగ్స్‌లో 4001కి పైగా పరుగులు.
చదవండి: ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు: భారత మాజీ క్రికెటర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment