
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ (Ahmed Shehzad) మండిపడ్డాడు. స్వప్రయోజనాల కోసం జట్టును భ్రష్టుపట్టిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దాల్సిన జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) ఎప్పుడో చేతులెత్తేసిందని.. కేవలం సొంతవాళ్లకు జీతాలు ఇచ్చుకునేందుకు ఇదొక మాధ్యమంగా ఉపయోగపడుతుందని ఆరోపించాడు.
గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్- సౌతాఫ్రికా జట్లతో త్రైపాక్షిక వన్డే సిరీస్‌లో ఓటమిపాలైన రిజ్వాన్ బృందం.. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ వైఫల్యం చెందింది.
ఈ మెగా వన్డే టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి.. కనీసం ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది. గ్రూప్ దశలో న్యూజిలాండ్, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన రిజ్వాన్ బృందం.. ఆఖరిదైన బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో నిరాశగా వెనుదిరిగింది.
ఈ క్రమంలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజంలపై వేటు వేసిన పీసీబీ.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నుంచి వారిని పక్కనపెట్టింది. టీ20 కొత్త కెప్టెన్‌గా సల్మాన్ ఆఘాకు బాధ్యతలు అప్పగించింది.
91 పరుగులకే ఆలౌట్ .. ఘోర ఓటమి
అయితే, కివీస్ దేశ పర్యటనలో భాగంగా తొలి టీ20లో పాకిస్తాన్ అత్యంత ఘోర ఓటమిని మూటగట్టుకుంది. తొలుత 91 పరుగులకే ఆలౌట్ అయిన పాకిస్తాన్.. లక్ష్య ఛేదనలో కివీస్‌ను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయింది.
పాక్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ 10.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టపోయి ఛేదించింది. ఫలితంగా పాక్ టీ20 చరిత్రలో ఇదో ఘోర ఓటమి(59 బంతులు మిగిలి ఉండగానే ప్రత్యర్థి టార్గెట్ ఛేదించడం)గా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ పీసీబీ సెలక్షన్ కమిటీ తీరును తూర్పారబట్టాడు.
అతడిని జట్టులోకి తీసుకుంది ఎవరు?
‘‘అసలు షాదాబ్‌ను ఏ ప్రాతిపదికన జట్టులోకి తీసుకున్నారు. అతడి ప్రదర్శన గత కొంతకాలంగా ఎలా ఉందో మీకు తెలియదా? అతడిని జట్టులోకి తీసుకువచ్చింది ఎవరు?
ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఏమవుతుందో చూడండి. షాదాబ్ విషయంలో పీసీబీ ప్రణాళికలే వేరు. అతడిని ఎందుకు ఎంపిక చేశారన్నది కొద్దిరోజుల్లోనే బయటపడుతుంది.
అయినా.. కివీస్‌తో తొలి టీ20లో మా బౌలర్లు అసలు ఏం చేశారు? మాట్లాడితే సీనియర్లు, అనుభవజ్ఞులు ఉన్నారు అంటారు. కానీ వాళ్లలో ఒక్కరైనా బాధ్యతగా ఆడారా? అసలు ప్రత్యర్థిని కాస్తైనా భయపెట్టగలిగారా? ఇంతకంటే చెత్త ఓటమి మరొకటి ఉంటుందా?’’ అని షెహజాద్ ఘాటు విమర్శలు చేశాడు.
కాగా కివీస్‌తో తొలి టీ20లో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ కేవలం 3 పరుగులే చేశాడు. అదే విధంగా.. రెండు ఓవర్ల బౌలింగ్‌లో పద్దెమినిది పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.
ఎన్సీఏను ఎవరు నడిపిస్తున్నారు?
ఇక NCA గురించి ప్రస్తావిస్తూ.. ‘‘జాతీయ క్రికెట్ అకాడమీ ఆటగాళ్ల నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దాలి. ఇక్కడి నుంచే మెరికల్లాంటి ఆటగాళ్లు వచ్చేవారు. నేను.. మహ్మద్ ఆమిర్, ఇమాద్ వసీం, ఉమర్ అమీన్, షాన్ మసూద్ వచ్చాం. మేము ఎన్సీఏలో ఉన్నప్పుడు వివిధ రకాల శిక్షణా శిబిరాలు నిర్వహించేవారు. ముదాస్సర్ నజర్ వంటి కోచ్‌లు ఉండేవారు.
కానీ గత నాలుగేళ్లుగా ఎన్సీఏ ఏం చేస్తోంది? ఎన్సీఏను ఎవరు నడిపిస్తున్నారు? ఆటగాళ్ల అభివృద్ధికి దోహదం చేయాల్సింది పోయి.. సొంతవాళ్లకు జీతాలు ఇచ్చేందుకు మాత్రమే దీనిని ఉపయోగించుకుంటున్నారు. ఎన్సీఏ చీఫ్ నదీమ్ ఖాన్ ఏం చేస్తున్నారు.
ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారా? జవాబుదారీతనం ఉందా? ప్రతిసారీ ఆటగాళ్లను ఓటములకు బాధ్యులను చేయడం సరికాదు. నదీమ్ ఖాన్‌ను ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదు?
ఎన్సీఏ లాంటి కీలకమైన వ్యవస్థను నీరుగారుస్తుంటే ఎవరూ మాట్లాడరే? అసలు ఆయనను ఏ ప్రాతిపదికన అక్కడ నియమించారు? ఇందుకు అతడికి ఉన్న అర్హతలు, నైపుణ్యాలు ఏమిటి? అసలు పీసీబీ ఏం చేస్తోంది?’’ అని అహ్మద్ షెహజాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment