నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌.. అతడి బ్యాటింగ్‌ అద్భుతం: కివీస్‌ కెప్టెన్‌ | "He Was Unbelievable..": Michael Bracewell Hails Hasan Nawaz Stellar Match Winning Century Vs NZ, Check Match Highlights Inside | Sakshi
Sakshi News home page

నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌.. అతడి బ్యాటింగ్‌ అద్భుతం: కివీస్‌ కెప్టెన్‌

Published Sat, Mar 22 2025 10:11 AM | Last Updated on Sat, Mar 22 2025 11:55 AM

He Was Unbelievable: Bracewell Hails Hasan Nawaz Stellar Century Vs NZ

పాకిస్తాన్‌ యువ బ్యాటర్‌ హసన్‌ నవాజ్‌పై న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మైకేల్‌ బ్రేస్‌వెల్‌ ప్రశంసలు కురిపించాడు. మూడో టీ20లో నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌ ఆడి.. మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నాడని అన్నాడు. పాక్‌ గెలుపులో క్రెడిట్‌ మొత్తం అతడికే ఇవ్వాలని పేర్కొన్నాడు. 

కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలుత టీ20 సిరీస్‌ ఆరంభం కాగా.. మొదటి రెండు మ్యాచ్‌లలో ఆతిథ్య కివీస్‌ విజయం సాధించింది. 

అయితే, శుక్రవారం జరిగిన మూడో టీ20లో పాకిస్తాన్‌ సంచలన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అక్లాండ్‌ వేదికగా టాస్‌ గెలిచిన పాక్‌.. తొలుత బౌలింగ్‌ చేసింది.

 204 పరుగులకు ఆలౌట్‌
ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 19.5 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మార్క్‌ చాప్‌మన్‌ (44 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) భారీ అర్ధశతకంతో ఆకట్టుకోగా... కెప్టెన్‌ బ్రేస్‌వెల్‌ (18 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. పాకిస్తాన్‌ బౌలర్లలో హరీస్‌ రవూఫ్‌ 3 వికెట్లు పడగొట్టగా... షాహీన్‌ షా అఫ్రిది, అబ్రార్‌ అహ్మద్, అబ్బాస్‌ అఫ్రిది తలా 2 వికెట్లు తీశారు.

ఇక 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 16 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 207 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హసన్‌ నవాజ్‌  (45 బంతుల్లో 105 నాటౌట్‌; 10 ఫోర్లు, 7 సిక్స్‌లు నాటౌట్‌) కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసుకోగా... కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (31 బంతుల్లో 51 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), మొహమ్మద్‌ హరీస్‌ (20 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో డఫీ ఒక వికెట్‌ పడగొట్టాడు.

రెండు డకౌట్‌ల తర్వాత... నవాజ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌
ఈ సిరీస్‌ ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నవాజ్‌... తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయినా మేనేజ్‌మెంట్‌ అతడిపై నమ్మకం ఉంచి మూడో మ్యాచ్‌లో అవకాశం ఇవ్వగా... తన విధ్వంసకర బ్యాటింగ్‌తో రికార్డులు తిరగరాశాడు. అతడి దూకుడుతో భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. 

తొలి ఓవర్‌లో రెండు సిక్సర్లతో హెచ్చరికలు జారీచేసిన హరీస్‌... రెండో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు. మొదట హరీస్‌కు అండగా నిలిచిన నవాజ్‌... ఆ తర్వాత బ్యాట్‌కు పనిచెప్పడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.

తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించిన అనంతరం హరీస్‌ అవుట్‌ కాగా... పవర్‌ ప్లే (6 ఓవర్లలో) ముగిసేసరికి పాకిస్తాన్‌ 75/1తో నిలిచింది. అంతర్జాతీయ టీ20ల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక పవర్‌ ప్లే స్కోరు. 2016లో ఇంగ్లండ్‌పై చేసిన 73 పరుగులు రెండో స్థానానికి చేరింది. 

కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా రాకతో పాక్‌ దూకుడు మరింత పెరిగింది. వీలు చిక్కినప్పుడల్లా నవాజ్‌ సిక్సర్లతో చెలరేగగా... అతడికి సల్మాన్‌ అండగా నిలిచాడు. ఈ క్రమంలో నవాజ్‌ 44 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

పాకిస్తాన్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో ఇదే వేగవంతమైన శతకం. 2021లో దక్షిణాఫ్రికాపై బాబర్‌ ఆజమ్‌ (49 బంతుల్లో) చేసిన సెంచరీ రెండో స్థానంలో ఉంది. ‘గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యా. ఒక్క పరుగు కూడా చేయకుండానే అవుటయ్యా. దీంతో బాగా ఒత్తిడికి గురయ్యా. అయినా మేనేజ్‌మెంట్‌ నాకు మరో అవకాశం ఇచ్చింది.

తొలి పరుగు చేసినప్పుడు భారం తీరినట్లు అనిపించింది. దీంతో స్వేచ్ఛగా ఆడి జట్టును గెలిపించాలనుకున్నా’ అని నవాజ్‌ అన్నాడు. 

ఇక నవాజ్, సల్మాన్‌ అబేధ్యమైన రెండో వికెట్‌కు 133 పరుగులు జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చారు. 200 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోపు పూర్తి చేసిన తొలి జట్టుగా పాకిస్తాన్‌ నిలిచింది. ఓవరాల్‌గా పాకిస్తాన్‌కు ఇది రెండో పెద్ద ఛేదన. కెప్టెన్‌ సల్మాన్‌ కూడా ఈ మ్యాచ్‌లోనే తొలి అంతర్జాతీయ అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు.

అతడు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం కివీస్‌ కెప్టెన్‌ మైకేల్‌ బ్రేస్‌వెల్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ ఫలితం మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. నవాజ్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. అతడు నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ విషయంలో అతడికి తప్పకుండా క్రెడిట్‌ ఇవ్వాలి.

మేము 20 ఓవర్ల పాటు ఆడలేకపోయాం. పొట్టి క్రికెట్‌లో ఇదొక నేరం లాంటిదే. చాప్‌మన్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. కానీ అతడు అవుటైన తర్వాత మేము మరో రెండు ఓవర్లు మెరుగ్గా బ్యాటింగ్‌ చేసి ఉంటే.. 230 పరుగుల మేర సాధించేవాళ్లం. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో కనీసం మరో పదిహేను పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది’’ అని పేర్కొన్నాడు.

చదవండి: భారత జట్టు కెప్టెన్‌గా యువరాజ్‌ సింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement