
ఐర్లాండ్‌పై వెస్టిండీస్ విజయం
మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ
లాహోర్: హేలీ మాథ్యూస్ మరోసారి ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టడంతో... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో వెస్టిండీస్ తొలి విజయం నమోదు చేసుకుంది. మొదటి మ్యాచ్‌లో స్కాట్లాండ్ చేతిలో ఓడిన వెస్టిండీస్ జట్టు... రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో విండీస్ 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించగా... మొదట బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హేలీ మాథ్యూస్ (18 బంతుల్లో 23; 5 ఫోర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా... చినెల్లి హెన్రీ (36 బంతుల్లో 46; 2 ఫోర్లు, 1 సిక్స్), స్టెఫానీ టేలర్ (56 బంతుల్లో 46; 5 ఫోర్లు), జైదా జేమ్స్ (36) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో జేన్ మాగుర్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ మహిళల జట్టు 32.2 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అమీ హంటర్ (46 బంతుల్లో 48; 8 ఫోర్లు) ధాటిగా ఆడగా... మిగిలిన వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో వీరోచిత శతకంతో పాటు... బౌలింగ్‌లో 4 వికెట్లతో విజృంభించినా... జట్టును గెలిపించుకోలేకపోయిన హేలీ మాథ్యూస్... తాజా పోరులోనూ 4 వికెట్లతో సత్తా చాటింది. మైదానంలో పాదరసంలా కదులుతూ మూడు క్యాచ్‌లు సైతం అందుకుంది. ఇతర విండీస్ బౌలర్లలో ఆలియా, కరిష్మా చెరో 2 వికెట్లు తీశారు. తదుపరి మ్యాచ్‌లో సోమవారం ఆతిథ్య పాకిస్తాన్‌తో వెస్టిండీస్ తలపడుతుంది.