qualifying tournament
-
ఒకే ఓవర్లో 39 పరుగులు
అపియా (సమోవా): అంతర్జాతీయ టి20 క్రికెట్లో మంగళవారం అద్భుతం చోటు చేసుకుంది. టి20 ప్రపంచకప్ ఈస్ట్ ఆసియా–పసిఫిక్ రీజియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా వనువాటు, సమోవా మధ్య జరిగిన పోరులో ఒకే ఓవర్లో 39 పరుగులు నమోదయ్యాయి. ఈ ఫార్మాట్లో గతంలో ఐదుసార్లు ఒకే ఓవర్లో 36 పరుగులు నమోదు కాగా... సమోవా దాన్ని అధిగమిస్తూ మొత్తం 39 పరుగులు రాబట్టింది. మిడిలార్డర్ బ్యాటర్ డారియస్ విసెర్ ఆరు సిక్సర్లతో అదరగొట్టాడు. క్వాలిఫయర్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో వనువాటుపై సమోవా 10 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సమోవా నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. విసెర్ (62 బంతుల్లో 132; 5 ఫోర్లు, 14 సిక్సర్లు) శతక్కొట్టగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. అనంతరం లక్ష్యఛేదనలో వనువాటు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. నళిన్ నిపికో (52 బంతుల్లో 73; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆ ఓవర్ సాగిందిలా.. వనువాటు బౌలర్ నళిన్ నిపికో వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో డారియస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వరుసగా 6, 6, 6, 1నోబాల్, 6, 0, 1 నోబాల్, 6+1నోబాల్, 6 పరుగులు సాధించి ఒకే ఓవర్లో 39 పరుగులు పిండుకున్నాడు. గతంలో యువరాజ్ సింగ్ (భారత్; 2007లో ఇంగ్లండ్‌పై; స్టువర్ట్ బ్రాడ్), కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్; 2021లో శ్రీలంకపై; అఖిల ధనంజయ), నికోలస్ పూరన్ (వెస్టిండీస్; 2024లో అఫ్గానిస్తాన్‌పై; అజ్మతుల్లా ఓమర్జాయ్), దీపేంద్ర సింగ్ (నేపాల్;2024లో ఖతర్‌పై; కమ్రాన్ ఖాన్), రోహిత్ శర్మ–రింకూ సింగ్ (భారత్; 2024లో అఫ్గానిస్తాన్‌పై; కరీమ్ జన్నత్) కూడా ఒకే ఓవర్లో 36 పరుగులు సాధించారు. అయితే తాజా మ్యాచ్‌లో వనువాటు బౌలర్ అదనంగా మూడు నోబాల్స్ వేయడంతో... మొత్తం 39 పరుగులు వచ్చాయి. ఒక టి20 ఇన్నింగ్స్ జట్టు స్కోరులో అత్యధిక శాతం పరుగులు చేసిన ప్లేయర్‌గా విసెర్ రికార్డుల్లోకెక్కాడు. సమోవా జట్టు 20 ఓవర్లలో 174 పరుగులు చేయగా.. అందులో విసెర్ ఒక్కడే 132 పరుగులు సాధించాడు. అంటే జట్టు మొత్తం స్కోరులో 75.86 శాతం విసెర్ బ్యాట్ నుంచే వచ్చాయి. గతంలో ఆ్రస్టేలియా ప్లేయర్ ఆరోన్ ఫించ్ జట్టు స్కోరులో 75.01 శాతం పరుగులు సాధించాడు. -
Paris Olympics 2024: నీరజ్ వస్తున్నాడు
పారిస్: భారీ అంచనాలతో పారిస్ ఒలింపిక్స్‌లో అడుగు పెట్టిన ఒలింపిక్ డిఫెండింగ్ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మంగళవారం క్వాలిఫయింగ్ బరిలోకి దిగనున్నాడు. 2020 టోక్యో ఓలింపిక్స్లో నీరజ్ పసిడి పతకం సాధించి దేశ అథ్లెటిక్స్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. ‘పారిస్’లోనూ టోక్యో ప్రదర్శనను పునరావృతం చేయాలని పట్టుదలతో ఉన్నాడు. టోక్యో విశ్వ క్రీడల తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కొనసాగించిన 26 ఏళ్ల నీరజ్ గత ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి విశ్వవిజేతగా నిలిచాడు. ‘పారిస్’ నుంచి కూడా పతకంతో తిరిగి వస్తాడని యావత్ భారతావని ఆశలు పెట్టుకోగా... వాటిని అందుకోవడమే లక్ష్యంగా నేడు నీరజ్ మైదానంలో అడుగు పెట్టనున్నాడు. గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఆచితూచి టోరీ్నల్లో పాల్గొన్న 26 ఏళ్ల నీరజ్.. ఈ ఏడాది బరిలోకి దిగిన మూడు టోరీ్నల్లోనూ ఆకట్టుకున్నాడు. ఈ విభాగంలో భారత్ నుంచి నీరజ్ చోప్రాతోపాటు.. కిశోర్ కుమార్ జేనా కూడా పోటీ పడుతున్నాడు. రెండు గ్రూప్‌ల్లో కలిపి మొత్తం 32 మంది త్రోయర్లు బరిలోకి దిగుతున్నారు. గ్రూప్ ‘బి’లో నీరజ్... కిశోర్ గ్రూప్ ‘ఎ’లో ఉన్నారు. ఫైనల్ చేరడానికి అర్హత ప్రమాణంగా 84 మీటర్లు నిర్ణయించారు. క్వాలిఫయింగ్ రౌండ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 12 మంది ఫైనల్‌కు అర్హత సాధించనున్నారు. ఒకవేళ 12 మంది కంటే ఎక్కువ మంది 84 మీటర్లను దాటి జావెలిన్‌ను విసిరితే ఇందులో నుంచి టాప్–12 మందికి ఫైనల్ బెర్త్‌లు లభిస్తాయి. ఫైనల్ గురువారం జరుగుతుంది. పాకిస్తాన్ త్రోయర్ నదీమ్ అర్షద్, జాకబ్ వాద్లెచ్ (చెక్ రిపబ్లిక్), వెబర్ (జర్మనీ), ఒలీవర్ (ఫిన్లాండ్) నుంచి నీరజ్‌కు ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. నీరజ్ టైటిల్ నిలబెట్టుకుంటే.. ఒలింపిక్స్‌లో ఆ ఘనత సాధించిన ఐదో జావెలిన్ త్రోయర్ కానున్నాడు. విశ్వక్రీడల చరిత్రలో ఎరిక్ లామింగ్ (స్వీడన్; 1908, 1912), జానీ మైరా (ఫిన్లాండ్; 1920, 1924), జాన్ జెలెన్జీ (చెక్ రిపబ్లిక్; 1992, 1996, 2000), ఆండ్రీస్ థోర్కిల్డ్సెన్ (నార్వే; 2004, 2008) స్వర్ణాన్ని నిలబెట్టుకున్నారు. -
‘పారిస్’కు చేరువగా సచిన్
బ్యాంకాక్: పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఆఖరి క్వాలిఫయింగ్ టోర్నీలో భారత బాక్సర్లు సచిన్ సివాచ్ (57 కేజీలు) క్వార్టర్ ఫైనల్ చేరగా... అమిత్ పంఘాల్ (51 కేజీలు), సంజీత్ కుమార్ (92 కేజీలు), జైస్మిన్ (57 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లో సచిన్ 5–0తో బతుహన్ సిఫ్టిసీ (టర్కీ)పై ఏకపక్ష విజయం సాధించాడు. రెండో రౌండ్ బౌట్లలో సంజీత్ 5–0తో లూయిస్ సాంచెజ్ (వెనిజులా)పై, అమిత్ 4–1తో మౌరిసియో రూయిజ్ (మెక్సికో)పై గెలిచారు. మహిళల 57 కేజీల రెండో రౌండ్లో జైస్మిన్ 5–0తో మహసతి హమ్జయేవా (అజర్బైజాన్)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన బాక్సర్లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారవుతాయి. -
పురుషుల రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి బెర్త్
ఇస్తాన్‌బుల్: పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో పురుషుల విభాగంలో భారత్‌కు తొలి బెర్త్ లభించింది. క్వాలిఫయింగ్ టోర్నీలో అమన్ సెహ్రావత్ ఫైనల్‌కు చేరడంతో భారత్‌నుంచి ఒక రెజ్లర్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఖాయమైంది. 57 కేజీల విభాగంలో అమన్ 12–2 స్కోరుతో హాన్ చాంగ్‌సాంగ్ (కొరియా)ను చిత్తు చేశాడు. మరో సెమీఫైనల్లో భారత రెజ్లర్ సుజీత్ (65 కేజీలు) 1–6 తేడాతో తుల్గా తుమూర్ (మంగోలియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే అతని అవకాశాలు పూర్తిగా పోలేదు. నేడు మూడో స్థానంలో కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో గెలిచినా సుమీత్ భారత్‌కు రెండో బెర్త్ అందిస్తాడు. మరో వైపు బరిలోకి దిగిన మిగిలిన నలుగురు భారత రెజ్లర్లకు మాత్రం చుక్కెదురైంది. వీరందరిలోకి అత్యంత అనుభవజు్ఞడైన దీపక్ పూనియా తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. 86 కేజీల విభాగంలో 4–6 తేడాతో చైనాకు చెందిన జూషెన్ లిన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. జూషెన్ ఆ తర్వాత క్వార్టర్స్‌లో పరాజయంపాలవడంతో పూనియా ‘రెపిచెజ్’ ఆశలు కూడా గల్లంతయ్యాయి. 74 కేజీల విభాగంలో జైదీప్ 0–3తో తైమురాజ్ సల్కజనోవ్ (స్లొవేకియా) చేతిలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోగా...దీపక్ (97 కేజీలు) 1–5తో ఒమర్‌బిబిరోవిచ్ (మాసిడోనియా) చేతిలో, ఆంథోనీ జాన్సన్ (జమైకా) చేతిలో సుమీత్ మాలిక్ (125 కేజీలు) పరాజయంపాలయ్యారు. -
మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి శ్రీలంక, స్కాట్లాండ్ అర్హత
బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు అర్హత సాధించాయి. అబుదాబిలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్లోకి ప్రవేశించి మిగిలిన రెండు బెర్త్‌లను సొంతం చేసుకున్నాయి. సెమీఫైనల్స్‌లో చమరి అటపట్టు నాయకత్వంలోని శ్రీలంక జట్టు 15 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టును ఓడించగా... కేథరీన్ బ్రైస్ సారథ్యంలోని స్కాట్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది. తొలిసారి టి20 ప్రపంచకప్ టోటోర్నీకి అర్హత పొందిన స్కాట్లాండ్ ఈరోజు జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్లో శ్రీలంకతో ఆడుతుంది. టి20 ప్రపంచకప్ అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఢాకా, సిల్హెట్లో జరుగుతుంది. గత టి20 ప్రపంచకప్‌లో టాప్–6లో నిలిచిన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ నేరుగా ఈ టోటోర్నీకి అర్హత పొందాయి. ఆతిథ్య దేశం హోదాలో బంగ్లాదేశ్, ఐసీసీ ర్యాంక్ ప్రకారం పాకిస్తాన్ ఈ టోటోర్నీలో ఆడనున్నాయి. -
షూటింగ్లో భారత్‌కు 20వ ఒలింపిక్ బెర్త్
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లో భారత్‌కు 20 బెర్త్ ఖరారైంది. రియో డి జనీరోలో జరుగుతున్న చివరి ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ పలక్ గులియా కాంస్య పతకం సాధించింది. తద్వారా భారత్‌కు ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, 18 ఏళ్ల హరియాణా అమ్మాయి పలక్ 217.6 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. భారత్‌కే చెందిన మరో షూటర్ సంయమ్ 176.7 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. -
ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నికి వినేశ్
పాటియాలా: వచ్చే నెలలో కిర్గిస్తాన్‌లో జరిగే పారిస్ ఒలింపిక్స్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నిలో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ బరిలోకి దిగనుంది. ఈ టోర్నిలో పాల్గొనే భారత మహిళల జట్టును ఎంపిక చేసేందుకు సోమవారం నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ 50 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. వినేశ్ రెగ్యులర్ వెయిట్ కేటగిరీ 53 కేజీలు కాగా... ఇప్పటికే ఈ కేటగిరీలో అంతిమ్ పంఘాల్ ఒలింపిక్ బెర్త్ దక్కించుకుంది. దాంతో వినేశ్ సెలెక్షన్ ట్రయల్స్ టోర్నిలో 50 కేజీలతోపాటు 53 కేజీల విభాగంలోనూ పోటీపడింది. ఒక రెజ్లర్ ఒకే రోజు ఒకే వెయిట్ కేటగిరీలో పోటీపడాలన్న నిబంధన ఉన్నా అడ్‌హక్ కమిటీ వినేశ్‌ను రెండు కేటగిరీల్లో పోటీ పడేందుకు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమైంది. అయితే వినేశ్ 53 కేజీల విభాగం సెమీఫైనల్లో ఓడిపోయింది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నిలో పాల్గొనే భారత జట్టులో అన్షు మలిక్ (57 కేజీలు), మాన్సి అహ్లావత్ (62 కేజీలు), నిషా దహియా (68 కేజీలు), రితిక (76 కేజీలు) కూడా ఎంపికయ్యారు. -
Paris Olympics: బజరంగ్, రవి దహియాలకు షాక్
సోనెపట్ (హరియాణా): టోక్యో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన రవి దహియా... కాంస్య పతకం నెగ్గిన బజరంగ్ పూనియాలకు షాక్! పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోరీ్నల్లో బరిలోకి దిగే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో బజరంగ్ (65 కేజీలు), రవి (57 కేజీలు) అనూహ్యంగా ఓడిపోయారు. ఆదివారం నిర్వహించిన ట్రయల్స్‌లో సెమీఫైనల్లో బజరంగ్ 1–9తో రోహిత్ చేతిలో ఓడాడు. ఫైనల్లో రోహిత్‌పై సుజీత్ కల్కాల్ గెలుపొంది ఆసియా, వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన 57 కేజీల విభాగంలో తొలి బౌట్లో రవి దహియా 13–14తో అమన్ సెహ్రావత్ చేతిలో... రెండో బౌట్లో 8–10తో ఉదిత్ చేతిలో ఓడిపోయాడు. ఇతర ఒలింపిక్ వెయిట్ కేటగిరీల్లో జైదీప్ (74 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు), దీపక్ నెహ్రా (97 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు) విజేతలుగా నిలిచి భారత జట్టుకు ఎంపికయ్యారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ఏప్రిల్ 19 నుంచి 21 వరకు కిర్గిస్తాన్‌లో... వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీ మే 9 నుంచి 12 వరకు ఇస్తాంబుల్‌లో జరుగుతాయి. -
భారత్ సత్తాకు సవాల్
భువనేశ్వర్: సొంతగడ్డపై సమష్టి ఆటతీరుతో రాణించి ఆసియా చాంపియన్ ఖతర్ జట్టును నిలువరించాలని భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు పట్టుదలతో ఉంది. ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ రెండో రౌండ్లో భాగంగా నేడు కళింగ స్టేడియంలో ఖతర్ జట్టుతో భారత్ తలపడనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఖతర్ 61వ స్థానంలో, భారత్ 102వ స్థానంలో ఉన్నాయి. ర్యాంక్ పరంగానూ, ప్రావీణ్యం పరంగానూ తమకంటే మెరుగ్గా ఉన్న ఖతర్ జట్టును నిలువరించాలంటే భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలి. సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీని విజయంతో ప్రారంభించింది. కువైట్‌తో ఈనెల 16న జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–0తో గెలిచింది. మరోవైపు ఖతర్ జట్టు తొలి లీగ్ మ్యాచ్‌లో 8–1తో అఫ్గానిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మ్యాచ్ భారతజట్టు సత్తాకు సవాల్‌గా నిలువనుంది. ఇప్పటి వరకు భారత్, ఖతర్ జట్లు ముఖాముఖిగా మూడుసార్లు తలపడ్డాయి. 1996లో ఖతర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 0–6తో ఓడిన టీమిండియా, 2019లో రెండో మ్యాచ్‌ను 0–0తో ‘డ్రా’ చేసుకుంది. 2021లో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 0–1తో ఓటమి చవిచూసింది. ప్రపంచకప్ ఆసియా జోన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఎ’లో భారత్, ఖతర్, కువైట్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి. ఇంటా బయటా పద్ధతిలో ఒక్కో జట్టు మిగతా మూడు జట్లతో మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం టాప్–2లో నిలిచిన రెండు జట్లు ప్రపంచకప్ మూడో రౌండ్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. -
Paris 2024 Olympics: పారిస్ ఒలింపిక్స్ హాకీ క్వాలిఫయింగ్ టోర్నీ: భారత్‌కు కఠిన సవాలు
వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించేందుకు భారత మహిళల హాకీ జట్టు శ్రమించాల్సి ఉంటుంది. జనవరి 13 నుంచి 19 వరకు రాంచీలో జరిగే ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోరీ్న–1కు సంబంధించిన వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సోమవారం విడుదల చేసింది. ప్రపంచ ఆరో ర్యాంకర్ భారత్‌తోపాటు ఈ టోరీ్నలో ప్రపంచ ఐదో ర్యాంకర్ జర్మనీ, న్యూజిలాండ్ (9), జపాన్ (11), చిలీ (14), అమెరికా (15), ఇటలీ (19), చెక్ రిపబ్లిక్ (25) జట్లు బరిలో ఉన్నాయి. ఈ టోర్నీలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గిన మూడు జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. జనవరి 13 నుంచి 20 వరకు స్పెయిన్‌లోని వాలెన్సియాలో ఎనిమిది జట్ల (బెల్జియం, కెనడా, బ్రిటన్, ఐర్లాండ్, మలేసియా, దక్షిణ కొరియా, స్పెయిన్, ఉక్రెయిన్) మధ్య క్వాలిఫయింగ్–2 టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీ ద్వారా మరో మూడు జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత పొందుతాయి. -
నెదర్లాండ్స్ ఆశలు సజీవం
హరారే: వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో నెదర్లాండ్స్ నిలిచింది. సోమవారం జరిగిన ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 74 పరుగుల తేడాతో ఒమన్‌పై గెలిచింది. వర్షంవల్ల 48 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముందుగా నెదర్లాండ్స్ 48 ఓవర్లలో 7 వికెట్లకు 362 పరుగుల భారీస్కోరు చేసింది. ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్ (109 బంతుల్లో 110; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కాడు. వెస్లీ బరెసి (65 బంతుల్లో 97; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు సెంచరీ భాగ్యాన్ని త్రుటిలో కోల్పోయాడు. తర్వాత మళ్లీ వానతో ఒమన్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 321 పరుగులుగా నిర్దేశించారు. అయితే ఒమన్ 44 ఓవర్లలో 6 వికెట్లకు 246 పరుగులే చేసింది. అయాన్ ఖాన్ (92 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 2) ఒంటరి పోరాటం చేశాడు. నేడు జింబాబ్వే గెలిస్తే... ఇప్పటికే శ్రీలంక జట్టుకు ప్రపంచకప్ బెర్త్ ఖరారుకాగా... రెండో బెర్త్ కోసం జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ రేసులో ఉన్నాయి. ఈరోజు స్కాట్లాండ్తో తమ చివరి ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో జింబాబ్వే గెలిస్తే మిగతా మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ స్కాట్లాండ్ విజయం సాధిస్తే మాత్రం జింబాబ్వే జట్టుకు అర్హత అవకాశాలు క్లిష్టమవుతాయి. నెదర్లాండ్స్, స్కాట్లాండ్ల మధ్య ఈనెల 6న జరిగే మ్యాచ్ ఫలితం తర్వాతే రెండో బెర్త్ ఎవరికి దక్కుతుందో ఖరారవుతుంది. -
జింబాబ్వే తరపున ఫాస్టెస్ట్ సెంచరీ.. రెండు రోజుల్లోనే చెరిపేసి
జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో జింబాబ్వే తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సికందర్ రజా 54 బంతుల్లో ఆరు ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు నాటౌట్ సుడిగాలి శతకంతో మెరిశాడు. కేవలం 54 బంతుల్లోనే భారీ శతకం బాదిన సికందర్ రాజా జింబాబ్వే తరపున వన్డే క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డు సీన్ విలియమ్స్ పేరిట ఉండేది. జూన్ 18న నేపాల్‌పై విలియమ్స్ కేవలం 70 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఈ రికార్డును సికందర్ రాజా కేవలం రెండు రోజుల్లోనే చెరిపేసి కొత్త చరిత్ర సృష్టించాడు. కాగా 37 ఏళ్ల వయసులో శతకం బాదిన సికందర్ రజా.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన పెద్ద వయస్కుడిగా క్రెయిగ్ ఎర్విన్‌తో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ఇక వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. డివిలియర్స్ కేవలం 31 బంతుల్లోనే శతకం మార్క్ అందుకోగా.. ఆ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ బ్యాటర్ కోరె అండర్సన్ (36 బంతుల్లోనే శతకం), షాహిద్ అఫ్రిది 37 బంతుల్లో, జాస్ బట్లర్ 46 బంతుల్లో, సనత్ జయసూర్య 48 బంతుల్లో అందుకున్నారు. ఇక టీమిండియా తరపున విరాట్ కోహ్లి 52 బంతుల్లో సెంచరీ సాధించాడు. చదవండి: చావుదెబ్బ కొట్టిన ఆసీస్.. రికార్డులు బద్దలైన వేళ సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఎదురులేని జింబాబ్వే -
Antalya: జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు
అంటాల్యా (తుర్కియే): భారత అగ్రశ్రేణి ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కొత్త సీజన్లో శుభారంభం చేసింది. ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో ఆమె క్వాలిఫయింగ్‌లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు మరో ప్రపంచ రికార్డును సమం చేసింది. మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ మొత్తం 713 పాయింట్లు స్కోరు చేసింది. 2015లో సారా లోపెజ్ (కొలంబియా) 713 పాయింట్లతో నమోదు చేసిన ప్రపంచ రికార్డును సురేఖ సమం చేసింది. అంతేకాకుండా కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. 2017లో కొరియా ఆర్చర్ 709 పాయింట్లతో నమోదు చేసిన రికార్డును సురేఖ సవరించింది. క్వాలిఫయింగ్‌లో ఒక్కో ఆర్చర్ 72 బాణాలు సంధించాలి. తొలి రౌండ్లో 36, రెండో రౌండ్లో మరో 36 బాణాలు సంధిస్తారు. తొలి రౌండ్లో జ్యోతి సురేఖ 353 పాయింట్లు... రెండో రౌండ్లో 360 పాయింట్లు సాధించింది. రెండో రౌండ్లో జ్యోతి సురేఖ కొట్టిన 36 బాణాలు 10 పాయింట్ల సర్కిల్‌లోకి వెళ్లడం విశేషం. దాంతో ఆమె అందుబాటులో ఉన్న మొత్తం 360 పాయింట్లను తన ఖాతాలోకి వేసుకుంది. ఈ క్రమంలో జ్యోతి సురేఖ 360కి 360 పాయింట్లు స్కోరు చేసిన తొలి మహిళా ఆర్చర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ప్రదర్శనతో 2015 నుంచి సారా లోపెజ్ (356 పాయింట్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జ్యోతి సురేఖ బద్దలు కొట్టింది. ‘ప్రపంచ రికార్డు సాధిస్తానని ఊహించలేదు. ఇదే నా అత్యుత్తమ ప్రదర్శన. టాప్ సీడ్‌తో మెయిన్ రౌండ్లో బరిలోకి దిగనుండటం సంతోషంగా ఉంది. ఎలిమినేషన్ రౌండ్లలోనూ పూర్తి ఏకాగ్రతతో పోటీపడతాను’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి సురేఖ వ్యాఖ్యానించింది. క్వాలిఫయింగ్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచిన సురేఖకు ఎలిమినేషన్ రౌండ్లలో టాప్ సీడ్ దక్కింది. భారత్‌కే చెందిన అదితి, అవ్నీత్ కౌర్ స్కోర్ల ఆధారంగా క్వాలిఫయింగ్ టీమ్ విభాగంలో భారత్ 2,112 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొని నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. 2011 నుంచి భారత జట్టుకు ఆడుతున్న సురేఖ అంతర్జాతీయ టోర్నీలలో 30 కంటే ఎక్కువ పతకాలు సాధించింది. -
తడబడితే తారుమారు
విశ్వవ్యాప్తంగా ఆదరణ ఉన్న ఆట ఫుట్‌బాల్. ఇతర టీమ్ క్రీడల్లో మాదిరిగా ఈ ఆటలో రెండు దేశాల మధ్య ఏడాదికో రెండేళ్లకో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు. ఏడాదిలో ఎక్కువ భాగం స్టార్ ఆటగాళ్లందరూ ఆయా దేశాల్లో ప్రొఫెషనల్ లీగ్‌లలో క్లబ్ జట్లకు ఆడుతుంటారు. దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ లేదా యూరో టోర్నీ లేదా కోపా అమెరికా కప్ లేదా కాన్ఫడరేషన్స్ కప్‌లాంటి టోర్నీల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ఆధ్వర్యంలో అప్పుడప్పుడు ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగుతారు. దాదాపు మూడేళ్లపాటు కొనసాగే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలలో ఎంతటి గొప్ప జట్టయినా ఆద్యంతం నిలకడగా రాణిస్తేనే ముందంజ వేస్తాం. కేవలం ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తే భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ లభిస్తుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని చిన్న చిన్న జట్లు కూడా వదులుకోవు. అందుకే ప్రత్యర్థి జట్టుకి ఎంత గొప్ప రికార్డు ఉన్నా ఈ చిన్న జట్లు కడదాకా సంచలనం కోసం పోరాడతాయి. ఈ క్రమంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా పెద్ద జట్లకు చుక్కెదురు తప్పదు. మరో పది రోజుల్లో ఖతర్ వేదికగా జరగనున్న 22వ ప్రపంచకప్‌లో కచ్చితంగా అర్హత సాధిస్తాయనుకున్న ఎనిమిది జట్లు (ఇటలీ, స్వీడన్, రష్యా, చిలీ, ఈజిప్ట్, నైజీరియా, కొలంబియా, అల్జీరియా) క్వాలిఫయింగ్‌లోనే నిష్క్రమించి ఆశ్చర్యపరిచాయి. ఈ జాబితాలో అతి ముఖ్యమైన జట్టు ఇటలీ. ప్రపంచకప్‌లో ఇటలీ జట్టుకు గొప్ప చరిత్రనే ఉంది. నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఇటలీ వరుసగా రెండోసారి ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందలేకపోయింది. 2018 రష్యాలో జరిగిన ప్రపంచకప్‌కు బెర్త్ దక్కించుకోలేకపోయిన ఇటలీ జట్టు ఈసారి ఖతర్ విమానం కూడా ఎక్కడంలేదు. యూరోప్ దేశాలకు మొత్తం 13 బెర్త్‌లు ఉండగా... గ్రూప్ దశలో పది గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన 10 జట్లు ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. గ్రూప్ ‘సి’లో ఇటలీ జట్టు రెండో స్థానంలో నిలిచి నేరుగా కాకుండా రెండో రౌండ్ ద్వారా అర్హత పొందేందుకు రేసులో నిలిచింది. అయితే రెండో రౌండ్లో ఇటలీ 0–1తో నార్త్ మెసడోనియా చేతిలో ఓడిపోయి ప్రపంచకప్‌నకు అర్హత పొందే అవకాశాన్ని చేజార్చుకుంది. 2018 ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన స్వీడన్ ఈసారి క్వాలిఫయింగ్‌ను దాటి ముందుకెళ్లలేకపోయింది. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా జట్టుపై వేటు వేశారు. దక్షిణ అమెరికా జోన్లో ఆరో స్థానంలో నిలిచి కొలంబియా ఈ మెగా టోర్నీకి దూరమైంది. 1962లో ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వడంతోపాటు మూడో స్థానంలో నిలిచిన చిలీ వరుసగా రెండోసారి ప్రపంచకప్ బెర్త్ సాధించలేకపోయింది. ఆఫ్రికా జోన్ నుంచి చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో ఓడి ఈజిప్ట్, నైజీరియా, అల్జీరియా మెగా టోర్నీకి అర్హత పొందలేకపోయాయి. 1938 నుంచి 2002 ప్రపంచకప్ వరకు ఆతిథ్య దేశంతోపాటు డిఫెండింగ్ చాంపియన్‌కు నేరుగా ఎంట్రీ లభించేది. కానీ 2006 ప్రపంచకప్ నుంచి కేవలం ఆతిథ్య జట్టుకే నేరుగా ఎంట్రీ ఇచ్చి డిఫెండింగ్ చాంపియన్ కూడా క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా బెర్త్ సాధించాలని ‘ఫిఫా’ నిర్ణయించింది. –సాక్షి క్రీడావిభాగం -
యూకీ బాంబ్రీ నిష్క్రమణ
న్యూయార్క్: ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ సింగిల్స్ విభాగంలో క్వాలిఫయింగ్ దశలోనే భారత్ పోరాటం ముగిసింది. రెండో క్వాలిఫయిగ్ రౌండ్ మ్యాచ్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ 3–6, 2–6 స్కోరుతో జిజో బెరŠగ్స్ (బెల్జియం) చేతిలో ఓటమిపాలయ్యాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 552వ స్థానంలో ఉన్న యూకీ 155వ ర్యాంక్‌లో ఉన్న ప్రత్యర్థి ముందు నిలవలేకపోయాడు. ఈ టోర్నీలో ఇంతకు ముందే క్వాలిఫయింగ్ దశలో భారత ఆటగాళ్లు రామ్‌కుమార్ రామనాథన్, సుమీత్ నగాల్ ఓడిపోయారు. -
పోరాడి ఓడిన సుమిత్ నగాల్
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. న్యూయార్క్‌లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 464వ ర్యాంకర్ సుమిత్ 6–7 (2/7), 4–6తో ప్రపంచ 132వ ర్యాంకర్ వాసెక్ పోస్పిసిల్ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. గంటా 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ ఒక ఏస్ సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 26 అనవసర తప్పిదాలు చేశాడు. తొలి రౌండ్లో ఓడిన సుమిత్‌కు 21,100 డాలర్ల (రూ. 16 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్ కూడా తొలి రౌండ్లో ఓడిపోగా, యూకీ బాంబ్రీ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. -
టి20 ప్రపంచకప్‌కు జింబాబ్వే, నెదర్లాండ్స్
దుబాయ్: ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే చివరి రెండు జట్లుగా జింబాబ్వే, నెదర్లాండ్స్ ఖరారయ్యాయి. క్వాలిఫయింగ్ టోర్నీ (బి)లో ఈ రెండు జట్లు ఫైనల్ చేరాయి. బులవాయోలో జరిగిన తొలి సెమీ ఫైనల్లో జింబాబ్వే 27 పరుగుల తేడాతో పపువా న్యూ గినియాపై విజయం సాధించింది. జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేయగా, న్యూ గినియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులే చేయగలిగింది. మరో సెమీ ఫైనల్లో నెదర్లాండ్స్ 7 వికెట్ల తేడాతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్)ను ఓడించింది. అమెరికా 19.4 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్ కాగా, నెదర్లాండ్స్ 19 ఓవర్లలో 3 వికెట్లకు 139 పరుగులు చేసింది. బాస్ డి లీడ్ (67 బంతుల్లో 91 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. టి20 ప్రపంచకప్‌లో ఆడబోవడం జింబాబ్వేకు ఇది ఆరో సారి కాగా, నెదర్లాండ్స్ ఐదో సారి బరిలోకి దిగనుంది. మొత్తం 16 జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. -
World Cup 2022: 64 ఏళ్ల తర్వాత... ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు వేల్స్ జట్టు అర్హత
కార్డిఫ్: ఎప్పుడో 1958లో... వేల్స్ ఫుట్‌బాల్ జట్టు ప్రపంచకప్‌లో చక్కటి ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్ వరకు చేరింది. అయితే ఆ మ్యాచ్‌లో అప్పుడు 17 ఏళ్ల వయసు ఉన్న ఆల్‌టైమ్ గ్రేట్ పీలే (బ్రెజిల్) చేసిన ఏకైక గోల్‌తో వేల్స్ పరాజయం పాలైంది. ఆ తర్వాత మరో 15 ప్రపంచకప్‌లు జరిగినా... ఒక్కసారి కూడా వేల్స్ అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడు మరోసారి ఆ టీమ్‌కు విశ్వవేదికపై తలపడే అవకాశం వచ్చింది. ఈ ఏడాది ఖతర్‌లో జరిగే ‘ఫిఫా’ వరల్డ్ కప్‌కు వేల్స్ అర్హత పొందింది. క్వాలిఫయర్స్ పోరులో వేల్స్ 1–0 తేడాతో ఉక్రెయిన్‌పై విజయం సాధించింది. ఉక్రెయిన్ ఆటగాడు ఆండ్రీ యర్మొలెంకో 34వ నిమిషంలో చేసిన ‘సెల్ఫ్ గోల్’తో వేల్స్‌కు అదృష్టం కలిసొచ్చింది. వేల్స్ స్టార్ ఆటగాడు, ఐదుసార్లు చాంపియన్స్ లీగ్ టైటిల్ విజయాల్లో భాగమైన గారెత్ బేల్ ఈ విజయాన్ని ‘తమ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఫలితం’గా అభివర్ణించాడు. బేల్ కొట్టిన ఫ్రీకిక్‌ను హెడర్‌తో దిశ మళ్లించే ప్రయత్నంలోనే విఫలమై యర్మొలెంకో బంతిని తమ గోల్‌పోస్ట్‌లోకే పంపించాడు. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, అమెరికా, ఇరాన్ ఉన్న గ్రూప్ ‘బి’లో వేల్స్ పోటీ పడనుంది. -
సుమిత్ నగాల్ పరాజయం
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత ప్లేయర్ సుమిత్ నగాల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. పారిస్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సుమిత్ 2–6, 2–6తో పెడ్రో కాచిన్ (అర్జెంటీనా) చేతిలో పరాజయం పాలయ్యాడు. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయాడు. -
ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు నిరాశ
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ క్వాలిఫయింగ్ బరిలో మిగిలిన చివరి భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. ప్రజ్నేశ్ 3–6, 4–6తో క్రిస్టోఫర్ యుబ్యాంక్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. క్రిస్టోఫర్ 14 ఏస్‌లు సంధించగా... ప్రజ్నేశ్ 5 ఏస్‌లను మాత్రమే కొట్టాడు. ఇతర భారత ప్లేయర్లు సుమిత్ నగాల్, రామ్‌కుమార్... మహిళల విభాగంలో అంకిత రైనా తొలి రౌండ్లోనే ఓడారు. -
ప్రపంచ క్యాండిడేట్స్ మహిళల చెస్ టోర్నీకి కోనేరు హంపి అర్హత
సాక్షి, హైదరాబాద్: మహిళల ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్–2022 మ్యాచ్‌కు అర్హత టోర్నీ అయిన ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు భారత స్టార్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి అర్హత సాధించింది. 2019–2021 మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ హంపి 293 పాయింట్లతో ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలువడంతో ఆమెకు క్యాండిడేట్స్ టోర్నీ బెర్త్ ఖరారైంది. హంపితోపాటు కాటరీనా లాగ్నో (రష్యా–280 పాయింట్లు), గత ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో రన్నరప్‌గా నిలిచిన అలెక్సాండ్రా గోర్యాచ్కినా (రష్యా) కూడా క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత పొందారు. ∙గ్రాండ్‌ప్రి సిరీస్‌లోని నాలుగు టోర్నీలలో చివరిదైన జిబ్రాల్టర్ టోర్నీ బుధవారం ముగిసింది. ఈ టోర్నీలో హంపి ఆడకపోయినా గతంలో ఆమె ఆడిన రెండు గ్రాండ్‌ప్రి టోర్నీలలో అద్భుత ప్రదర్శన చేసింది. రష్యాలోని స్కొల్కోవాలో జరిగిన టోర్నీలో హంపి విజేతగా (160 పాయింట్లు), మొనాకో టోర్నీలో సంయుక్త విజేతగా (133 పాయింట్లు) నిలిచింది. కరోనా నేపథ్యంలో హంపి జిబ్రాల్టర్ టోర్నీకి దూరంగా ఉంది. ఈ టోర్నీలో బరిలోకి దిగిన నానా జాగ్‌నిద్జె (జార్జియా), అనా ముజిచుక్ (ఉక్రెయిన్), కాటరీనా లాగ్నో (రష్యా)లలో ఇద్దరు టాప్–3లో నిలిచి ఉంటే హంపికి క్యాండిడేట్స్ టోర్నీ బెర్త్ కోసం కొంతకాలం వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఈ ముగ్గురిలో కాటరీనా మాత్రమే టాప్–3లో నిలువడంతో హంపికి బెర్త్ ఖరారైంది. ∙వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో జరిగే క్యాండిడేట్స్ టోర్నీలో మొత్తం ఎనిమిది మంది పాల్గొంటారు. ఈ టోర్నీ విజేత 2022 ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జూ వెన్జున్ (చైనా)తో తలపడుతుంది. -
టోక్యో ఒలింపిక్స్‌కు సుమిత్ అర్హత
సోఫియా (బల్గేరియా): భారత రెజ్లర్ సుమిత్ మలిక్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నీలో సుమిత్ 125 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకొని ‘టోక్యో’ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో సుమిత్ 5–0తో జోస్ డానియల్ డియాజ్ రొబెర్టి (వెనిజులా)పై విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో సుమిత్ 10–5తో రుస్తుమ్ ఇస్కందర్ (తజికిస్తాన్)ను ఓడించాడు. మరోవైపు అమిత్ ధన్కర్ (74 కేజీలు), సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయారు. అమిత్ తొలి రౌండ్లో 6–9తో మిహైల్ సావా (మాల్డోవా) చేతిలో ఓడిపోగా... సత్యవర్త్ క్వార్టర్ ఫైనల్లో బల్గేరియా రెజ్లర్ బతయెవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఫైనల్ చేరిన వారికి మాత్రమే టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారవుతాయి. -
భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
సోఫియా (బల్గేరియా): టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు భారత రెజ్లర్లు చివరి ప్రయత్నం చేయనున్నారు. నేటి నుంచి బల్గేరియా రాజధాని సోఫియాలో జరగనున్న వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో మొత్తం 12 బెర్త్‌ల కోసం భారత రెజ్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో పురుషుల ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్... మహిళల ఫ్రీస్టయిల్ విభాగాలలో 84 దేశాల నుంచి 400 మందికిపైగా రెజ్లర్లు 18 వెయిట్ కేటగిరీలలో బరిలోకి దిగనున్నారు. ప్రతి వెయిట్ కేటగిరీలో ఫైనల్‌కు చేరిన ఇద్దరు రెజ్లర్లకు టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారవుతాయి. ► తొలి రోజు పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో 57, 65, 74, 86, 97, 125 కేజీల విభాగాల్లో పోటీలుంటాయి. ఇప్పటికే భారత్ నుంచి ఫ్రీస్టయిల్ విభాగంలో రవి (57 కేజీలు), బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. ► చివరి క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ నుంచి ఫ్రీస్టయిల్లో మిగిలిన మూడు బెర్త్‌ల కోసం అమిత్ ధన్కర్ (74 కేజీలు), సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు) పోటీపడనున్నారు. ► పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో ఆరు వెయిట్ కేటగిరీలలో ఇప్పటి వరకు భారత్ నుంచి ఒక్కరు కూడా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయారు. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సచిన్ రాణా (60 కేజీలు), ఆశు (67 కేజీలు), గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), సునీల్ (87 కేజీలు), దీపాంశు (97 కేజీలు), నవీన్ (130 కేజీలు) బరిలో ఉన్నారు. ► మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్ నుంచి వినేశ్ ఫొగాట్ (53 కేజీలు), అన్షు మలిక్ (57 కేజీలు), సోనమ్ మలిక్ (62 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. మిగిలిన మూడు బెర్త్‌ల కోసం ఆఖరి క్వాలిఫయింగ్ టోర్నీలో సీమా బిస్లా (50 కేజీలు), నిషా (68 కేజీలు), పూజా (76 కేజీలు) రేసులో ఉన్నారు. -
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీకి భారత్ దూరం
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్ అయిన ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నమెంట్ నుంచి భారత అథ్లెటిక్స్ జట్టు వైదొలిగింది. పోలాండ్లోని సిలెసియా నగరంలో మే 1, 2 తేదీల్లో ఈ టోర్నీ జరుగుతుంది. భారత మహిళల 4గీ100 మీటర్ల రిలే, పురుషుల 4గీ400 మీటర్ల రిలే జట్టు సభ్యుల కోసం భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నెదర్లాండ్స్‌కు చెందిన కేఎల్ఎమ్ రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ ద్వారా గురువారం ఉదయం న్యూఢిల్లీ నుంచి అమ్‌స్టర్‌డామ్ వరకు విమానం టికెట్లను బుక్ చేసింది. అమ్‌స్టర్‌డామ్ నుంచి కనెక్టింగ్ ఫ్లయిట్లో భారత జట్లు పోలాండ్‌కు వెళ్లాల్సింది. అయితే కరోనా కల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి తమ దేశానికి వచ్చే విమానాలను నెదర్లాండ్స్ ప్రభుత్వం సోమవారం రాత్రి నుంచి రద్దు చేసింది. భారత్ నుంచి నేరుగా పోలాండ్‌కు విమానాలు లేకపోవడంతో ఏఎఫ్ఐ ముందుగా అమ్స్టర్డామ్కు టికెట్లు బుక్ చేసి అక్కడి నుంచి పోలాండ్‌కు పంపించే ఏర్పాట్లు చేసింది. ‘యూరప్‌లోని ఇతర నగరాల నుంచి పోలాండ్‌కు వెళ్లేందుకు ఏమైనా ఫ్లయిట్స్ ఉన్నాయా అని తీవ్రంగా ప్రయత్నించాం. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. దాంతో ఈ టోర్నీ నుంచి భారత జట్లు వైదొలగక తప్పలేదు’ అని ఏఎఫ్ఐ అధ్యక్షుడు అదిలె సుమరివల్లా తెలిపారు. భారత మహిళల 4గీ100 రిలే జట్టులో హిమ దాస్, ద్యుతీ చంద్, ధనలక్ష్మీ, అర్చన, ధనేశ్వరి, హిమశ్రీ రాయ్ సభ్యులుగా ఉన్నారు. వరల్డ్ రిలే టోర్నీలో టాప్–8 లో నిలిచిన జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. -
‘టోక్యో’కు అన్షు, సోనమ్
అల్మాటీ (కజకిస్తాన్): ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్లో రెండో రోజు భారత్‌కు రెండు బెర్త్‌లు ఖరారయ్యాయి. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత యువ రెజ్లర్లు అన్షు మలిక్ (57 కేజీలు), సోనమ్ మలిక్ (62 కేజీలు) అద్భుతం చేశారు. హరియాణా రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల అన్షు, 18 ఏళ్ల సోనమ్ తమ విభాగాల్లో ఫైనల్‌కు చేరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. 57 కేజీల ఫైనల్లో అన్షు 4–7తో ఖాన్‌గోరుజుల్ బోల్డ్‌సైఖాన్ (మంగోలియా) చేతిలో ఓటమి చవిచూసి రజతం సాధించగా... 62 కేజీల ఫైనల్లో జియా లాంగ్ (చైనా)తో తలపడాల్సిన సోనమ్ గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో జియా లాంగ్‌కు స్వర్ణం, సోనమ్‌కు రజతం లభించాయి. అయితే మిగతా మూడు విభాగాల్లో భారత రెజ్లర్లకు నిరాశ ఎదురైంది. సీమా బిస్లా (50 కేజీలు) నాలుగో స్థానంలో నిలువగా... నిషా (68 కేజీలు), పూజా (76 కేజీలు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించారు. ఫైనల్‌కు చేరిన వారికి మాత్రమే టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌లు లభిస్తాయి.