అంటాల్యా (తుర్కియే): భారత అగ్రశ్రేణి ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కొత్త సీజన్‌లో శుభారంభం చేసింది. ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో ఆమె క్వాలిఫయింగ్‌లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు మరో ప్రపంచ రికార్డును సమం చేసింది. మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ మొత్తం 713 పాయింట్లు స్కోరు చేసింది. 2015లో సారా లోపెజ్ (కొలంబియా) 713 పాయింట్లతో నమోదు చేసిన ప్రపంచ రికార్డును సురేఖ సమం చేసింది.
అంతేకాకుండా కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. 2017లో కొరియా ఆర్చర్ 709 పాయింట్లతో నమోదు చేసిన రికార్డును సురేఖ సవరించింది. క్వాలిఫయింగ్‌లో ఒక్కో ఆర్చర్ 72 బాణాలు సంధించాలి. తొలి రౌండ్‌లో 36, రెండో రౌండ్‌లో మరో 36 బాణాలు సంధిస్తారు. తొలి రౌండ్‌లో జ్యోతి సురేఖ 353 పాయింట్లు... రెండో రౌండ్‌లో 360 పాయింట్లు సాధించింది. రెండో రౌండ్‌లో జ్యోతి సురేఖ కొట్టిన 36 బాణాలు 10 పాయింట్ల సర్కిల్‌లోకి వెళ్లడం విశేషం.
దాంతో ఆమె అందుబాటులో ఉన్న మొత్తం 360 పాయింట్లను తన ఖాతాలోకి వేసుకుంది. ఈ క్రమంలో జ్యోతి సురేఖ 360కి 360 పాయింట్లు స్కోరు చేసిన తొలి మహిళా ఆర్చర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ప్రదర్శనతో 2015 నుంచి సారా లోపెజ్ (356 పాయింట్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జ్యోతి సురేఖ బద్దలు కొట్టింది. ‘ప్రపంచ రికార్డు సాధిస్తానని ఊహించలేదు. ఇదే నా అత్యుత్తమ ప్రదర్శన. టాప్ సీడ్‌తో మెయిన్ రౌండ్‌లో బరిలోకి దిగనుండటం సంతోషంగా ఉంది.
ఎలిమినేషన్ రౌండ్లలోనూ పూర్తి ఏకాగ్రతతో పోటీపడతాను’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి సురేఖ వ్యాఖ్యానించింది. క్వాలిఫయింగ్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచిన సురేఖకు ఎలిమినేషన్ రౌండ్‌లలో టాప్ సీడ్ దక్కింది. భారత్‌కే చెందిన అదితి, అవ్‌నీత్ కౌర్ స్కోర్ల ఆధారంగా క్వాలిఫయింగ్ టీమ్ విభాగంలో భారత్ 2,112 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొని నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. 2011 నుంచి భారత జట్టుకు ఆడుతున్న సురేఖ అంతర్జాతీయ టోర్నీలలో 30 కంటే ఎక్కువ పతకాలు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment