Archery World Cup
-
భారత ఆర్చరీ జట్లకు టాప్ సీడింగ్
అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీ కాంపౌండ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లకు టాప్ సీడింగ్ లభించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో ఆసియా క్రీడల చాంపియన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ చాంపియన్ అదితి, పర్ణిత్ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు 2100 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఫలితంగా టీమ్ విభాగంలో భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. జ్యోతి సురేఖ 705 పాయింట్లతో రెండో స్థానంలో, అదితి 699 పాయింట్లతో 10వ స్థానంలో, పరీ్ణత్ 696 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచారు. ప్రియాంశ్ (710 పాయింట్లు), అభిషేక్ వర్మ (710 పాయింట్లు), ప్రథమేశ్ (705 పాయింట్లు) లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు క్వాలిఫయింగ్ రౌండ్లో 2125 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
ధీరజ్ బృందం సంచలనం
షాంఘై (చైనా): సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు స్వర్ణ పతకంతో మెరిసింది. టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ దక్షిణ కొరియాతో ఆదివారం జరిగిన రికర్వ్ టీమ్ విభాగం ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాధవ్‌లతో కూడిన భారత జట్టు 5–1 (57–57, 57–55, 55–53)తో సంచలన విజయం సాధించింది. తద్వారా 14 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ టోర్నీలో టీమ్ విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకుంది. చివరిసారి భారత్ 2010 ఆగస్టులో షాంఘైలోనే జరిగిన ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నీలో స్వర్ణం సాధించింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ధీరజ్ –అంకిత ద్వయం కాంస్య పతకం గెలిచింది. కాంస్య పతక మ్యాచ్‌లో ధీరజ్–అంకిత జోడీ 6–0 (35–31, 38–35, 39–37)తో వలెన్సియా–మతియాస్ (మెక్సికో) జంటపై నెగ్గింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో భారత స్టార్ దీపిక కుమారి 0–6 (26–27, 27–29, 27–28)తో ఆసియా క్రీడల చాంపియన్ లిమ్ సిహైన్ (కొరియా) చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకుంది. -
ప్రథమేశ్ ‘రజత’ గురి
హెర్మెసిలో (మెక్సికో): ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్స్ టోర్నీలో భారత ప్లేయర్ ప్రథమేశ్ జాకర్ రజత పతకంతో మెరిశాడు. ఆదివారం జరిగిన కాంపౌండ్ ఈవెంట్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో ప్రథమేశ్, మథియాస్ ఫులెర్టన్ (డెన్మార్క్) నిర్ణీత 15 బాణాల తర్వాత 148–148 పాయింట్లతో సమంగా నిలిచారు. ‘షూట్ ఆఫ్’లో ఇద్దరు 10 పాయింట్ల షాట్ కొట్టారు. అయితే మథియాస్ కొట్టిన బాణం కేంద్ర బిందువుకు అతి సమీపంలో ఉండటంతో అతనికి స్వర్ణ పతకం దక్కింది. ప్రథమేశ్‌కు 15 వేల స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 13 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. భారత్‌కే చెందిన అభిషేక్ వర్మ ఒక పాయింట్ తేడాతో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. మహిళల వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ, అదితి క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగారు. -
ధీరజ్ 'గురి' అదిరె.. ఆర్చరీ వరల్డ్‌కప్‌లో ఇరగదీసిన ఆంధ్ర కుర్రాడు
అంటాల్యా (తుర్కియే): అంచనాలకు మించి రాణించిన ఆంధ్రప్రదేశ్ యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర (విజయవాడ) ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో రెండు పతకాలతో మెరిశాడు. తొలిసారి ప్రపంచకప్ టోర్నీలో ఆడుతున్న 21 ఏళ్ల ధీరజ్ పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కలిసి రజత పతకం ... వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. పురుషుల టీమ్ ఫైనల్లో ధీరజ్, అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్ బృందం 4–5తో లీ జాంగ్యువాన్, కి జింగ్షువో, వె షావోజువాన్లతో కూడిన చైనా జట్టు చేతిలో ఓడింది. వ్యక్తిగత విభాగం కాంస్య పతక మ్యాచ్‌లో ధీరజ్ 7–3తో ఇల్ఫాత్ అబ్దులిన్ (కజకిస్తాన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో ధీరజ్ 4–6తో డాన్ ఒలారు (మాల్డోవా) చేతిలో ఓడిపోయాడు. -
Antalya: జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు
అంటాల్యా (తుర్కియే): భారత అగ్రశ్రేణి ఆర్చర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కొత్త సీజన్లో శుభారంభం చేసింది. ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో ఆమె క్వాలిఫయింగ్‌లో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు మరో ప్రపంచ రికార్డును సమం చేసింది. మంగళవారం జరిగిన మహిళల కాంపౌండ్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ మొత్తం 713 పాయింట్లు స్కోరు చేసింది. 2015లో సారా లోపెజ్ (కొలంబియా) 713 పాయింట్లతో నమోదు చేసిన ప్రపంచ రికార్డును సురేఖ సమం చేసింది. అంతేకాకుండా కొత్త ఆసియా రికార్డును సృష్టించింది. 2017లో కొరియా ఆర్చర్ 709 పాయింట్లతో నమోదు చేసిన రికార్డును సురేఖ సవరించింది. క్వాలిఫయింగ్‌లో ఒక్కో ఆర్చర్ 72 బాణాలు సంధించాలి. తొలి రౌండ్లో 36, రెండో రౌండ్లో మరో 36 బాణాలు సంధిస్తారు. తొలి రౌండ్లో జ్యోతి సురేఖ 353 పాయింట్లు... రెండో రౌండ్లో 360 పాయింట్లు సాధించింది. రెండో రౌండ్లో జ్యోతి సురేఖ కొట్టిన 36 బాణాలు 10 పాయింట్ల సర్కిల్‌లోకి వెళ్లడం విశేషం. దాంతో ఆమె అందుబాటులో ఉన్న మొత్తం 360 పాయింట్లను తన ఖాతాలోకి వేసుకుంది. ఈ క్రమంలో జ్యోతి సురేఖ 360కి 360 పాయింట్లు స్కోరు చేసిన తొలి మహిళా ఆర్చర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ప్రదర్శనతో 2015 నుంచి సారా లోపెజ్ (356 పాయింట్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జ్యోతి సురేఖ బద్దలు కొట్టింది. ‘ప్రపంచ రికార్డు సాధిస్తానని ఊహించలేదు. ఇదే నా అత్యుత్తమ ప్రదర్శన. టాప్ సీడ్‌తో మెయిన్ రౌండ్లో బరిలోకి దిగనుండటం సంతోషంగా ఉంది. ఎలిమినేషన్ రౌండ్లలోనూ పూర్తి ఏకాగ్రతతో పోటీపడతాను’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి సురేఖ వ్యాఖ్యానించింది. క్వాలిఫయింగ్‌లో టాప్ ర్యాంక్‌లో నిలిచిన సురేఖకు ఎలిమినేషన్ రౌండ్లలో టాప్ సీడ్ దక్కింది. భారత్‌కే చెందిన అదితి, అవ్నీత్ కౌర్ స్కోర్ల ఆధారంగా క్వాలిఫయింగ్ టీమ్ విభాగంలో భారత్ 2,112 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొని నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. 2011 నుంచి భారత జట్టుకు ఆడుతున్న సురేఖ అంతర్జాతీయ టోర్నీలలో 30 కంటే ఎక్కువ పతకాలు సాధించింది. -
Antalya:ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్–1 టోర్నీ బరిలో సురేఖ
కొన్నేళ్లుగా ఆర్చరీ ప్రపంచకప్ టోర్నీలలో నిలకడగా పతకాలు సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ మరో కొత్త సీజన్‌కు సిద్ధమైంది. అంటాల్యాలో నేటి నుంచి వరల్డ్‌కప్ స్టేజ్–1 టోర్నీ జరగనుంది. జ్యోతి సురేఖతోపాటు అవ్నీత్ కౌర్, అదితి స్వామి, సాక్షి చౌదరీ మహిళల కాంపౌండ్ టీమ్, వ్యక్తిగత విభాగాల్లో బరిలోకి దిగుతారు. 52 దేశాల నుంచి 394 మంది ఆర్చర్లు రికర్వ్, కాంపౌండ్ ఈవెంట్స్‌లో ఈ టోర్నీలో ఆడనున్నారు. -
ప్రపంచకప్ ఆర్చరీ టోర్నీలకు సురేఖ, ధీరజ్
సోనీపత్ (హరియాణా): ఈ ఏడాది జరిగే మూడు ప్రపంచకప్ టోర్నీలు... ప్రపంచ చాంపియన్‌షిప్... అనంతరం ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల, మహిళల రికర్వ్, కాంపౌండ్ జట్లను భారత ఆర్చరీ సంఘం సోమవారం ప్రకటించింది. పురుషుల రికర్వ్ జట్టులో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు తరఫున పోటీపడ్డ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్... మహిళల కాంపౌండ్ జట్టులో ఆంధ్రప్రదేశ్ మేటి క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ, తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత చోటు సంపాదించారు. సోనీపత్‌లోని భారత స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో నిర్వహించిన ట్రయల్స్ ఆధారంగా జట్లను ఎంపిక చేశారు. పురుషుల, మహిళల రికర్వ్ విభాగాల్లో ఎనిమిది మంది చొప్పున... పురుషుల, మహిళల కాంపౌండ్ విభాగాల్లో ఎనిమిది మంది చొప్పున ఎంపిక చేశారు. ఇందులో టాప్–4లో నిలిచిన వారికి తొలి ప్రాధాన్యత లభిస్తుంది. రెండు ప్రపంచకప్ టోర్నీలు ముగిశాక టాప్–4లో నిలిచిన వారు విఫలమైతే తదుపరి టోర్నీకి 5 నుంచి 8 స్థానాల్లో నిలిచిన వారికి చాన్స్ ఇస్తారు. మూడు ప్రపంచకప్ టోర్నీలు అంటాల్యాలో (ఏప్రిల్ 18–23)... షాంఘైలో (మే 16–21)... కొలంబియాలో (జూన్ 13–18) జరుగుతాయి. ప్రపంచ చాంపియన్‌షిప్ జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు జర్మనీలో... ఆసియా క్రీడలు సెప్టెంబర్‌లో చైనాలో జరుగుతాయి. ట్రయల్స్‌లో విఫలమైన ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి మహిళల రికర్వ్ జట్టులో చోటు సంపాదించలేకపోయింది. మార్చి 18న ఐఎస్ఎల్ ఫైనల్ ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్ మార్చి 18న గోవాలోని ఫటోర్డా పట్టణంలో జరుగుతుంది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లు మార్చి 3న మొదలవుతాయి. ఇప్పటికే టాప్–2లో నిలిచిన ముంబై సిటీ, డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఎఫ్‌సీ నేరుగా సెమీఫైనల్ చేరాయి. -
దీపిక బృందానికి రజతం
పారిస్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీని భారత్ రజత పతకంతో ముగించింది. ఆదివారం జరిగిన మహిళల టీమ్ రికర్వ్ ఫైనల్లో దీపిక కుమారి, అంకిత, సిమ్రన్‌జిత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. చైనీస్ తైపీ జట్టుతో జరిగిన ఫైనల్లో దీపిక బృందం 1–5తో ఓడిపోయింది. ఈ టోర్నీలో భారత్‌కు మొత్తం మూడు పతకాలు లభించాయి. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట స్వర్ణం నెగ్గగా... కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ రజతం సాధించింది. చదవండి: Ranji Trophy 2022: 'కెప్టెన్ పెళ్లికి రెండు రోజుల సెలవు మాత్రమే ఇచ్చాను' -
Archery World Cup: సూపర్ సురేఖ.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఫైనల్లోకి
పారిస్: ఒకే ఒక్కసారి సెలెక్షన్ ట్రయల్స్‌లో తడబడినందుకు తొలి రెండు ప్రపంచకప్ టోర్నీలలో భారత జట్టులో చోటు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మూడో ప్రపంచకప్ టోర్నీలో ఘనంగా పునరాగమనం చేసింది. ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ బరిలోకి దిగిన విజయవాడకు చెందిన సురేఖ పారిస్ వేదికగా జరుగుతోన్న ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో తన ప్రతాపం చూపించింది. కాంపౌండ్ కేటగిరీ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత అగ్రశ్రేణి ఆర్చర్ అభిషేక్ వర్మతో కలిసి సురేఖ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) ద్వయం 156–151తో రాబిన్–లిసెల్ జాట్మా (ఎస్తోనియా) జోడీని ఓడించి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించింది. 150కి 150 పాయింట్లు... కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలోనూ సురేఖ అద్భుత ప్రదర్శన చేసి సెమీస్ చేరింది. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సురేఖ తొలి రౌండ్లో 147–133తో యోహానా హోర్టా ఒలివియెరా (పోర్చుగల్)పై, రెండో రౌండ్లో 150–141తో ఎలీసా బజిచెటో (ఇటలీ)పై గెలుపొందింది. ఎలీసాతో జరిగిన మ్యాచ్‌లో సురేఖ అందుబాటులో ఉన్న 150 పాయింట్లకుగాను 150 పాయింట్లు సాధించడం విశేషం. మ్యాచ్‌లో ఇద్దరు ఆర్చర్లు మూడు బాణాల చొప్పున ఐదుసార్లు లక్ష్యంపై సంధించాల్సి ఉంటుంది. సురేఖ సంధించిన 15 బాణాలూ 10 పాయింట్ల వృత్తంలోనే పడటం విశేషం. మూడో రౌండ్లో సురేఖ 146–144తో మార్సెలా (ఇటలీ)పై, క్వార్టర్ ఫైనల్లో 149–148తో లిసెల్ జాట్మా (ఎస్తోనియా)పై విజయం సాధించింది. ‘కాంపౌండ్’నూ ఒలింపిక్స్‌లో చేర్చండి... 2028 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో కాంపౌండ్ కేటగిరీని కూడా చేర్చాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ప్రపంచ ఆర్చరీ సమాఖ్య ప్రతిపాదన పంపించింది. మైదానంలో కాకుండా ఇండోర్ గ్రౌండ్లో కాంపౌండ్ పోటీలను నిర్వహించాలని కోరింది. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో రికర్వ్ కేటగిరీలో మాత్రమే పోటీలు నిర్వహిస్తున్నారు. రికర్వ్ కేటగిరీతో పోలిస్తే కాంపౌండ్ కేటగిరీకి చెందిన విల్లు ఆకారం, బాణాన్ని విడుదల చేసే విధానం తేడా ఉంటుంది. రికర్వ్ విల్లులో బాణాన్ని వేళ్ల ద్వారా... కాంపౌండ్‌లో బొటనవేలితో ట్రిగ్గర్ను నొక్కి బాణాన్ని విడుదల చేస్తారు. చదవండి: Vennam Jyothi Surekha: జ్యోతి సురేఖకు గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం: ఏపీ కేబినెట్ ఆమోదం -
కాంస్య పతక పోరులో ఓటమి
పారిస్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీలో భారత మహిళల కాంపౌండ్ జట్టు కాంస్య పతక పోరులో ఓడిపోయింది. వెన్నం జ్యోతి సురేఖ, ప్రియా గుర్జర్, ముస్కాన్ కిరార్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతక మ్యాచ్‌లో 228–231తో సోఫీ డోడిమోంట్, లోలా గ్రాండ్‌జీన్, సాండ్రా హెర్వీలతో కూడిన ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ పొందిన భారత్ 230–227తో బ్రెజిల్ జట్టును ఓడించి సెమీఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత్ 228–231తో బ్రిటన్ జట్టు చేతిలో పరాజయంపాలై కాంస్య పతకం బరిలో నిలిచింది. అభిషేక్ వర్మ, మోహన్ రామ్‌స్వరూప్ భరద్వాజ్, అమన్ సైనీలతో కూడిన భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో 234–235తో టర్కీ చేతిలో ఓడింది. -
Archery World Cup 2022:భారత్ పసిడి గురి
అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. శనివారం జరిగిన పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో రజత్ చౌహాన్, అమన్ సైనీ, అభిషేక్ వర్మలతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. జీన్ ఫిలిప్, బేరర్, అడ్రియన్‌లతో కూడిన ఫ్రాన్స్ జట్టుతో జరిగిన ఫైనల్లో భారత్ 232–231తో విజయం సాధించింది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్‌లో అభిషేక్–ముస్కాన్ ద్వయం 156–157తో అమందా–బుడెన్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడిపోయింది. -
Archery World Cup: దీపికకు త్రుటిలో చేజారిన కాంస్యం
యాంక్టన్ (యూఎస్ఏ): ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్ టోర్నీలో భారత ఆర్చర్ దీపికా కుమారి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. మహిళల రికర్వ్ విభాగంలో గురువారం జరిగిన కాంస్య పతకం పోరులో ఆమె 5–6తో మిచెల్లే క్రొప్పెన్ (జర్మనీ) చేతిలో ఓడింది. ఐదు సెట్లు ముగిసిన తర్వాత ఇద్దరు ఆర్చర్లు 5–5తో సమంగా నిలవడంతో విజేతను నిర్ణయించేందుకు షూటాఫ్ అనివార్యమైంది. ఇక్కడ ఇరు ఆర్చర్లకు చెరో బాణం సంధించాల్సి ఉంటుంది. మిచెల్లే తొమ్మిది పాయింట్లను స్కోరు చేయగా... దీపిక ఆరు పాయింట్లను మాత్రమే సాధించింది. దాంతో దీపిక కాంస్యాన్ని చేజార్చుకుంది. అంతకు ముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపిక 6–4తో స్వెత్లానా గొంబోవా (రష్యా)పై నెగ్గి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే అక్కడ దీపిక 2–6తో ఎలెనా ఒసిపోవా (రష్యా) చేతిలో ఓడి కాంస్యం కోసం పోటీలో నిలిచింది. మరోవైపు పురుషుల కాంపౌండ్ విభాగంలో జరిగిన క్వార్టర్స్‌లో అభిõÙక్ వర్మ 142–146 స్కోర్ తేడాతో బ్రాడెన్ గెలెన్‌తీన్ (అమెరికా) చేతిలో ఓడాడు. చదవండి: Chris Gayle: అందుకే నేను తప్పుకొంటున్నా... -
ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం
పారిస్: ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత మహిళల ఆర్చరీ బృందం ఆదివారం సత్తా చాటింది. ఆర్చరీ ప్రపంచకప్‌లో రికర్వ్ టీమ్ భారత్‌కు రెండో స్వర్ణం అందించింది. రికర్వ్ టీమ్‌లో దీపికా కుమారి, కోమలిక బరి, అంకిత భాకట్‌లతో కూడిన భారత ఆర్చరీ బృందం మెక్సికోపై 5-1 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం గెలిచింది. కాగా ఆరేళ్ల విరామం తర్వాత ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ వ్యక్తిగత విభాగంలో శనివారం పసిడి పతకం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ వరల్డ్‌కప్ స్టేజ్–3 టోర్నీలో 32 ఏళ్ల అభిషేక్ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. క్రిస్ షాఫ్ (అమెరికా)తో శనివారం జరిగిన ఫైనల్లో అభిషేక్ వర్మ ‘షూట్ ఆఫ్’లో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన భారత్ బాక్సర్.. ప్రపంచ నంబర్ వన్ స్థానం కైవసం -
ప్రపంచకప్ ఫైనల్లో జ్యోతి సురేఖ బృందం
బెర్లిన్‌లో జరుగుతోన్న ప్రపంచకప్ ఆర్చరీ పోటీల్లో తెలుగుతేజం వెన్నం జ్యోతిసురేఖ సభ్యురాలిగా ఉన్న భారత మహిళల బృందం ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో సురేఖ, త్రిషాదేబ్, ముస్కాన్ కిరార్‌లతో కూడిన భారత కాంపౌండ్ జట్టు 231–228 స్కోరుతో టాప్ సీడ్ టర్కీ జట్టుపై విజయం సాధించింది. శనివారం జరిగే ‘పసిడి’ పోరులో ఫ్రాన్స్ జట్టుతో భారత్ తలపడనుంది. -
దీపిక ‘పసిడి’ గురి
సాల్ట్ లేక్ సిటీ (అమెరికా): ఆరేళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళా స్టార్ ఆర్చర్ దీపిక కుమారి మరోసారి ప్రపంచకప్ ఆర్చరీ టోర్నీలో వ్యక్తిగత స్వర్ణం సాధించింది. సోమవారం ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్ లో ఈ జార్ఖండ్ అమ్మాయి విజేతగా నిలిచింది. ఫైనల్లో దీపిక 7–4తో మిచెల్లి క్రాపెన్ (జర్మనీ)పై గెలిచి 2012 తర్వాత ఈ టోర్నీలో పసిడి పతకం గెల్చుకుంది. దీంతో టర్కీలో ఈ ఏడాది చివర్లో జరిగే సీజన్ ముగింపు టోర్నీకి ఆమె అర్హత సాధించింది. మరోవైపు రికర్వ్ మిక్స్డ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో దీపిక–అతాను దాస్ (భారత్) ద్వయం 4–5తో తాంగ్ చి చున్–తాన్ యా టింగ్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడింది. సురేఖ ర్యాంక్ 10: మరోవైపు మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కెరీర్ బెస్ట్ పదో ర్యాంక్‌ను సాధించింది. ఈ ఏడాది జరిగిన మూడు ప్రపంచకప్ టోర్నీలలోనూ సురేఖ మిక్స్డ్ విభాగంలో కాంస్య పతకాలు గెలిచింది. -
జ్యోతి సురేఖ–అభిషేక్ జంటకు కాంస్యం
సాల్ట్ లేక్ సిటీ (అమెరికా): ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తన ఖాతాలో నాలుగో పతకాన్ని జమ చేసుకుంది. ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీలో జ్యోతి సురేఖ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్‌కే చెందిన అభిషేక్ వర్మతో కలిసి కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ ద్వయం 147–140తో జేమీ వ్యాన్ నట్టా–క్రిస్ స్కాఫ్ (అమెరికా) జోడీపై గెలుపొందింది. మరోవైపు పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ రజతం సంపాదించాడు. ఫైనల్లో అభిషేక్ 123–140తో స్టీఫెన్ హాన్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ ఏడాది సురేఖ షాంఘై, అంటాల్యా ప్రపంచకప్‌లలో రెండు కాంస్యాలు, ఒక రజతం సాధించింది. -
ఆర్చరీ ప్రపంచకప్‌కు జ్యోతి సురేఖ
హైదరాబాద్: విజయవాడకు చెందిన అంతర్జాతీయ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మేలో జరగనున్న ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైంది. ఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన కాంపౌండ్ విభాగం సెలెక్షన్స్‌లో జ్యోతి 21 పాయింట్లకుగాను 16.5 పాయింట్లు స్కోర్ చేసి భారత జట్టులో చోటు దక్కించుకుంది. చైనాలో మే 16 నుంచి 21 వరకు జరిగే ప్రపంచకప్ స్టేజ్–1 పోటీలతో పాటు, జూన్ 6 నుంచి 11వరకు టర్కీలో జరిగే ప్రపంచకప్ స్టేజ్–2 పోటీల్లో జ్యోతి సురేఖ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. -
ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌కు దీపిక, అభిషేక్
కోల్‌కతా : వచ్చే నెలలో జరిగే ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌కు స్టార్ ఆర్చర్ దీపికా కుమారి, అభిషేక్ వర్మ అర్హత సాధించారు. అంటాల్యాలో జరిగిన స్టేజి-2 ప్రపంచకప్‌లో కాంస్యం సాధించిన దీపికా... ఈ ఈవెంట్లో రెం డేళ్ల అనంతరం పాల్గొననుంది. 24 ప్రపంచ ర్యాంకింగ్ పాయింట్లతో తను మహిళల రికర్వ్ ఈవెంట్‌కు అర్హత సాధించింది. మరోవైపు గతనెలలో వార్సాలో జరిగిన ప్రపంచకప్ స్టేజి 3లో విజేతగా నిలిచిన వర్మ 39 రేటింగ్ పాయింట్లతో కాంపౌండ్ విభాగంలో పోటీపడనున్నాడు. అక్టోబర్ 24, 25న మెక్సికోలో పోటీలు జరుగుతాయి. -
చౌహాన్ కొత్త చరిత్ర
కోపెన్హగెన్: వరల్డ్‌కప్ ఆర్చరీలో భారత విలుకాడు రజత్ చౌహాన్ కొత్త చరిత్ర సృష్టించాడు. శనివారం జరిగిన కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రజత్ 143 పాయింట్లు నెగ్గి రజతంతో మెరిశాడు. మూడో సెట్లో 8, 9 పాయింట్లకే పరిమితం కావడంతో కాస్త వెనుకబడ్డాడు. స్థానిక ఆటగాడు స్టీఫెన్ హన్సెన్ 147 పాయింట్లతో స్వర్ణం సాధిం చాడు. ప్రపంచకప్ ఆర్చరీలో భారత మహిళల రికర్వ్ టీమ్ (2011) పతకం నెగ్గినా... వ్యక్తిగత విభాగంలో దేశానికి మెడల్ రావడం ఇదే మొదటిసారి. తొలి రెండు సెట్లలో ఇద్దరు క్రీడాకారులు సమంగా పాయింట్లు సాధించడంతో స్కోరు 58-58తో సమమైంది. అయితే మూడోసెట్లో భారత కుర్రాడు మూడు పాయింట్లు వెనుకబడటంతో స్కోరు 85-88గా మారింది. నాలుగో సెట్లో చౌహన్ 30 పాయింట్లు నెగ్గినా... హన్సెన్ చివరి వరకు ఆధిక్యాన్ని కొనసాగించాడు. -
‘పసిడి’ కాంతలు
- ప్రపంచకప్ ఆర్చరీలో దీపిక బృందానికి స్వర్ణ పతకం - పురుషుల జట్టుకు రజతం వ్రోక్లా (పోలండ్): సీజన్లో చివరి ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత ఆర్చరీ జట్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. దీపిక కుమారి నేతృత్వంలోని మహిళల రికర్వ్ జట్టు స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... జయంత తాలుక్దార్ సారథ్యంలోని పురుషుల రికర్వ్ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల జట్టు 6-0 (52-50; 54-51; 56-54) స్కోరుతో మెక్సికో జట్టును ఓడించింది. టీమిండియా వరుసగా మూడు సెట్లను గెల్చుకొని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు జయంత తాలుక్దార్, తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్లతో కూడిన భారత పురుషుల బృందం 3-5 (54-56; 52-53; 55-53; 52-52) స్కోరుతో మెక్సికో చేతిలో ఓటమి పాలైంది. ఫైనల్లో రెండు జట్లలోని ముగ్గురు సభ్యులకు ఒక్కో రౌండ్లో (గరిష్టంగా నాలుగు రౌండ్లు) రెండేసి బాణాలు సంధించే అవకాశం ఇస్తారు. ఆరు బాణాల తర్వాత ఎక్కువ పాయింట్లు నెగ్గిన వారికి సెట్ వశమవుతుంది. సెట్ నెగ్గితే రెండు పాయింట్లు ఇస్తారు. స్కోరు సమమైతే మాత్రం ఒక్కో పాయింట్ కేటాయిస్తారు. ఎక్కువ సెట్ పాయింట్లు నెగ్గిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపిక కుమారి ఈసారి భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. భారత్ సంధించిన ఐదు 10 పాయింట్ల స్కోరులో దీపికవే మూడు ఉండటం విశేషం. మరోవైపు మెక్సికో జట్టులో కేవలం రెండు 10 పాయింట్ల స్కోరు ఉండటం గమనార్హం. ‘ఫైనల్ మ్యాచ్ కష్టంగా అనిపించలేదు. ఇదే జోరును ఆసియా క్రీడల్లో కొనసాగిస్తామనే నమ్మకం ఉంది. ఈ స్వర్ణ పతకంతో మా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఈ సీజన్ మాకు కలిసిరాలేదు. అయితే ఆసియా క్రీడలకు ముందు మా శ్రమకు ఫలితం లభించింది’ అని దీపిక కుమారి వ్యాఖ్యానించింది. -
భారత్‌కు కాంస్యం
అంటాల్యా (టర్కీ): ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పూర్వాషా షిండే, త్రిషా దేబ్, లిల్లీ చానులతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు టీమ్ విభాగంలో కాంస్యం నెగ్గింది. మూడో స్థానం పోరులో భారత్ 226-224 పాయింట్లతో బ్రెండా మెరినో, లిండా ఒచావో, కాట్యా సోఫియాలతో కూడిన మెక్సికో జట్టును ఓడించింది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో రజత్ చౌహాన్ 141-145 పాయింట్లతో యోంగ్ చోయ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయి రజత పతకం సొంతం చేసుకున్నాడు.