పారిస్: ఒకే ఒక్కసారి సెలెక్షన్ ట్రయల్స్‌లో తడబడినందుకు తొలి రెండు ప్రపంచకప్ టోర్నీలలో భారత జట్టులో చోటు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మూడో ప్రపంచకప్ టోర్నీలో ఘనంగా పునరాగమనం చేసింది. ఏడు నెలల విరామం తర్వాత మళ్లీ బరిలోకి దిగిన విజయవాడకు చెందిన సురేఖ పారిస్ వేదికగా జరుగుతోన్న ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో తన ప్రతాపం చూపించింది. కాంపౌండ్ కేటగిరీ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత అగ్రశ్రేణి ఆర్చర్ అభిషేక్ వర్మతో కలిసి సురేఖ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) ద్వయం 156–151తో రాబిన్–లిసెల్ జాట్మా (ఎస్తోనియా) జోడీని ఓడించి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించింది.
150కి 150 పాయింట్లు...
కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలోనూ సురేఖ అద్భుత ప్రదర్శన చేసి సెమీస్ చేరింది. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సురేఖ తొలి రౌండ్‌లో 147–133తో యోహానా హోర్టా ఒలివియెరా (పోర్చుగల్)పై, రెండో రౌండ్‌లో 150–141తో ఎలీసా బజిచెటో (ఇటలీ)పై గెలుపొందింది. ఎలీసాతో జరిగిన మ్యాచ్‌లో సురేఖ అందుబాటులో ఉన్న 150 పాయింట్లకుగాను 150 పాయింట్లు సాధించడం విశేషం. మ్యాచ్‌లో ఇద్దరు ఆర్చర్లు మూడు బాణాల చొప్పున ఐదుసార్లు లక్ష్యంపై సంధించాల్సి ఉంటుంది. సురేఖ సంధించిన 15 బాణాలూ 10 పాయింట్ల వృత్తంలోనే పడటం విశేషం. మూడో రౌండ్‌లో సురేఖ 146–144తో మార్సెలా (ఇటలీ)పై, క్వార్టర్ ఫైనల్లో 149–148తో లిసెల్ జాట్మా (ఎస్తోనియా)పై విజయం సాధించింది.
‘కాంపౌండ్’నూ ఒలింపిక్స్‌లో చేర్చండి...
2028 లాస్‌ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో కాంపౌండ్ కేటగిరీని కూడా చేర్చాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ప్రపంచ ఆర్చరీ సమాఖ్య ప్రతిపాదన పంపించింది. మైదానంలో కాకుండా ఇండోర్ గ్రౌండ్‌లో కాంపౌండ్ పోటీలను నిర్వహించాలని కోరింది. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో రికర్వ్ కేటగిరీలో మాత్రమే పోటీలు నిర్వహిస్తున్నారు. రికర్వ్ కేటగిరీతో పోలిస్తే కాంపౌండ్ కేటగిరీకి చెందిన విల్లు ఆకారం, బాణాన్ని విడుదల చేసే విధానం తేడా ఉంటుంది. రికర్వ్ విల్లులో బాణాన్ని వేళ్ల ద్వారా... కాంపౌండ్‌లో బొటనవేలితో ట్రిగ్గర్‌ను నొక్కి బాణాన్ని విడుదల చేస్తారు.
చదవండి: Vennam Jyothi Surekha: జ్యోతి సురేఖకు గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం: ఏపీ కేబినెట్ ఆమోదం
Archery World Cup: సూపర్ సురేఖ.. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ఫైనల్లోకి
Published Sat, Jun 25 2022 7:22 AM | Last Updated on Sat, Jun 25 2022 7:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment