![Dheeraj team wins against Olympic champion South Korea](/styles/webp/s3/filefield_paths/medals_0.jpg.webp?itok=h8Pa9uxD)
ఒలింపిక్ చాంపియన్ దక్షిణ కొరియాపై విజయం
14 ఏళ్ల తర్వాత ఆర్చరీ
ప్రపంచకప్ టోర్నీలో స్వర్ణం
షాంఘై (చైనా): సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు స్వర్ణ పతకంతో మెరిసింది. టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ దక్షిణ కొరియాతో ఆదివారం జరిగిన రికర్వ్ టీమ్ విభాగం ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాధవ్‌లతో కూడిన భారత జట్టు 5–1 (57–57, 57–55, 55–53)తో సంచలన విజయం సాధించింది.
తద్వారా 14 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ టోర్నీలో టీమ్ విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకుంది. చివరిసారి భారత్ 2010 ఆగస్టులో షాంఘైలోనే జరిగిన ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నీలో స్వర్ణం సాధించింది. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ధీరజ్ –అంకిత ద్వయం కాంస్య పతకం గెలిచింది.
కాంస్య పతక మ్యాచ్‌లో ధీరజ్–అంకిత జోడీ 6–0 (35–31, 38–35, 39–37)తో వలెన్సియా–మతియాస్ (మెక్సికో) జంటపై నెగ్గింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో భారత స్టార్ దీపిక కుమారి 0–6 (26–27, 27–29, 27–28)తో ఆసియా క్రీడల చాంపియన్ లిమ్ సిహైన్ (కొరియా) చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment