‘పసిడి’ కాంతలు
- ప్రపంచకప్ ఆర్చరీలో దీపిక బృందానికి స్వర్ణ పతకం
- పురుషుల జట్టుకు రజతం
వ్రోక్లా (పోలండ్): సీజన్‌లో చివరి ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత ఆర్చరీ జట్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. దీపిక కుమారి నేతృత్వంలోని మహిళల రికర్వ్ జట్టు స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... జయంత తాలుక్‌దార్ సారథ్యంలోని పురుషుల రికర్వ్ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల జట్టు 6-0 (52-50; 54-51; 56-54) స్కోరుతో మెక్సికో జట్టును ఓడించింది. టీమిండియా వరుసగా మూడు సెట్‌లను గెల్చుకొని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు జయంత తాలుక్‌దార్, తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్‌లతో కూడిన భారత పురుషుల బృందం 3-5 (54-56; 52-53; 55-53; 52-52) స్కోరుతో మెక్సికో చేతిలో ఓటమి పాలైంది.
ఫైనల్లో రెండు జట్లలోని ముగ్గురు సభ్యులకు ఒక్కో రౌండ్‌లో (గరిష్టంగా నాలుగు రౌండ్‌లు) రెండేసి బాణాలు సంధించే అవకాశం ఇస్తారు. ఆరు బాణాల తర్వాత ఎక్కువ పాయింట్లు నెగ్గిన వారికి సెట్ వశమవుతుంది. సెట్ నెగ్గితే రెండు పాయింట్లు ఇస్తారు. స్కోరు సమమైతే మాత్రం ఒక్కో పాయింట్ కేటాయిస్తారు. ఎక్కువ సెట్ పాయింట్లు నెగ్గిన వారిని విజేతగా ప్రకటిస్తారు.
ప్రపంచ మాజీ నంబర్‌వన్ దీపిక కుమారి ఈసారి భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. భారత్ సంధించిన ఐదు 10 పాయింట్ల స్కోరులో దీపికవే మూడు ఉండటం విశేషం. మరోవైపు మెక్సికో జట్టులో కేవలం రెండు 10 పాయింట్ల స్కోరు ఉండటం గమనార్హం.
‘ఫైనల్ మ్యాచ్ కష్టంగా అనిపించలేదు. ఇదే జోరును ఆసియా క్రీడల్లో కొనసాగిస్తామనే నమ్మకం ఉంది. ఈ స్వర్ణ పతకంతో మా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఈ సీజన్ మాకు కలిసిరాలేదు. అయితే ఆసియా క్రీడలకు ముందు మా శ్రమకు ఫలితం లభించింది’ అని దీపిక కుమారి వ్యాఖ్యానించింది.