
సెంట్రల్ ఫ్లోరిడా: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ పసిడి వెలుగులు విరజిమ్మింది. శనివారం కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ–రిషభ్ యాదవ్ (భారత్) జోడీ 153–151 పాయింట్ల తేడాతో హువాంగ్ ఐజు–చెన్ చియె లున్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. తుదిపోరులో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన భారత జోడీ... రెండో సీడ్ చైనీస్ తైపీని వెనక్కినెడుతూ స్వర్ణం కైవసం చేసుకుంది.
తొలి రెండు సిరీస్‌లను 37–38, 38–39తో కోల్పోయిన భారత ఆర్చర్లు... మూడో సెట్‌లో 39–38తో తిరిగి పోటీలోకి వచ్చారు. నాలుగో సిరీస్‌లో 39–36తో సునాయాసంగా నెగ్గి పసిడి పతకం చేజిక్కించుకున్నారు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ కాంపౌండ్ విభాగాన్ని చేర్చిన అనంతరం ఈ విజయం విశ్వక్రీడల్లో భారత పతక ఆశలను మరింత పెంచింది.
ఈ టోర్నీలో భారత్‌కు ఇది మూడో పతకం కావడం విశేషం. అంతకుముందు కాంపౌండ్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు కాంస్య పతకం నెగ్గగా... రికర్వ్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరి కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది.