
నేడు ఇండియన్ సూపర్ లీగ్ 11వ సీజన్ ఫైనల్
రెండో టైటిల్ కోసం మోహన్ బగాన్ సూపర్ జెయింట్‌తో బెంగళూరు ఎఫ్‌సీ ఢీ
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
కోల్‌కతా: 13 జట్లు... 162 మ్యాచ్‌లు... 210 రోజులు... 465 గోల్స్‌తో సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) 11వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. గత సీజన్ రన్నరప్ మోహన్ బగాన్ సూపర్ జెయింట్, బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) మధ్య నేడు ఫైనల్ జరగనుంది. వరుసగా మూడోసారి ఫైనల్ చేరుకున్న మోహన్ బగాన్ జట్టు... సొంతగడ్డపై జరగనున్న తుదిపోరులో గెలిచి రెండోసారి చాంపియన్‌గా నిలవాలని భావిస్తుంటే... ఇప్పటి వరకు నాలుగుసార్లు ఫైనల్‌కు చేరిన బెంగళూరు ఎఫ్‌సీ కూడా రెండోసారి టైటిల్ చేజిక్కించుకోవాలని చూస్తోంది.
2022–23 సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన మోహన్ బగాన్ జట్టు... 2023–24 సీజన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తాజా సీజన్ లీగ్ దశలో అదిరిపోయే ఆటతీరు కనబర్చిన మోహన్ బగాన్... ఇప్పటికే లీగ్ షీల్డ్ విన్నర్‌గా నిలిచింది. 2024–25 లీగ్ దశలో 24 మ్యాచ్‌లాడిన మోహన్ బగాన్ జట్టు 17 విజయాలు, 2 పరాజయాలు, 5 ‘డ్రా’లతో 56 పాయింట్లు ఖాతాలో వేసుకొని ‘టేబుల్ టాపర్’గా నిలిచింది.
నాకౌట్ మ్యాచ్‌లతో కలుపుకొని 26 మ్యాచ్‌ల్లో మోహన్ బగాన్ 50 గోల్స్ చేసింది. అంటే సరాసరిగా ఈ సీజన్‌లో మ్యాచ్‌కు రెండు గోల్స్ చొప్పున కొట్టింది. ఇక బెంగళూరు జట్టు గ్రూప్ దశలో 24 మ్యాచ్‌ల్లో 11 విజయాలు, 8 పరాజయాలు, 5 ‘డ్రా’లతో 38 పాయింట్లు సాధించి ముందంజ వేసింది. నాకౌట్ మ్యాచ్‌లతో కలుపుకొని బెంగళూరు 27 మ్యాచ్‌ల్లో 48 గోల్స్ చేసింది.
సమఉజ్జీల సమరం...
దూకుడుకు మారుపేరైన ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు ఖాయమే కాగా... ఈ సీజన్‌లో మోహన్ బగాన్ ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. బగాన్ జట్టు ప్రత్యర్థులకు 18 గోల్స్ మాత్రమే ఇచ్చుకోగా... బెంగళూరు జట్టు 33 గోల్స్ సమరి్పంచుకుంది. ఈ గణాంకాలు చాలు మోహన్ బగాన్ జట్టుపై గోల్ కొట్టడం ఎంత కష్టమో చెప్పేందుకు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఐఎస్‌ఎల్ ఫైనల్‌కు చేరిన బెంగళూరు జట్టు... 2018–19 సీజన్‌లో చాంపియన్‌గా అవతరించింది. 2017–18, 2022–23 సీజన్‌లలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
2022–23 సీజన్‌లో మోహన్ బగాన్, బెంగళూరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్ నిర్ణీత సమయంలో 2–2 గోల్స్‌తో ‘డ్రా’ కాగా... షూటౌట్‌లో మోహన్ బగాన్ జట్టు 4–3 గోల్స్ తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. ఇప్పుడా పరాజయానికి బదులు తీర్చుకునేందుకు బెంగళూరుకు చక్కటి అవకాశం ఉంది. భారత స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రీ బెంగళూరు జట్టుకు సారథ్యం వహిస్తుండగా... సుభాశీష్ బోస్ కెప్టెన్సీలో మోహన్ బగాన్ బరిలోకి దిగుతోంది.
‘ఫైనల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. సీజన్ చాలా బాగా సాగింది. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగిస్తూ రెండోసారి ట్రోఫీ గెలుచుకోవాలని భావిస్తున్నాం. కోల్‌కతా నగరం మాకు రెండో ఇల్లు లాంటింది. జట్టు ప్రదర్శన బాగుంది. సొంత అభిమానుల సమక్షంలో మ్యాచ్ ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. వారి అంచనాలను అందుకునేందుకు ప్రయత్నిస్తాం’ అని మోహన్ బగాన్ సారథి సుభాశీష్ బోస్ అన్నాడు.
ఆడిన ఎనిమిది సీజన్‌లలో బెంగళూరు జట్టు నాలుగోసారి ఫైనల్‌కు చేరగా... ఐఎస్‌ఎల్ చరిత్రలో వరుసగా మూడోసారి ఫైనల్ చేరిన తొలి జట్టుగా మోహన్ బగాన్ నిలిచింది. మోహన్ బగాన్ తరఫున అల్బెర్టో రోడ్రిగ్స్, లిస్టన్ కొలాకో, అనిరుధ్ థాపా, సుభాశీష్ కీలకం కానుండగా... బెంగళూరు జట్టు గోల్‌కీపర్ గుర్‌ప్రీత్‌సింగ్ సంధు, చింగ్‌లెన్‌సనా సింగ్, అల్బెర్టో నొగురె, ఎడ్గర్ మెండెజ్‌పై భారీ ఆశలు పెట్టుకుంది.