
ఫార్ములావన్ సీజన్‌లో రెండో విజయం
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెక్‌లారెన్ డ్రైవర్
సాఖిర్ (బహ్రెయిన్): క్వాలిఫయింగ్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెక్‌లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందుకున్నాడు. ఫార్ములావన్ 2025 సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన సీజన్ నాలుగో రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో పియాస్ట్రి విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఆ్రస్టేలియాకు చెందిన పియా్రస్టి... నిర్ణీత 57 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 35 నిమిషాల 39.435 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
ఈ సీజన్‌లో చైనా గ్రాండ్‌ప్రిలోనూ పియాస్ట్రి టైటిల్ సాధించాడు. మెర్సిడెస్ జట్టుకు చెందిన జార్జి రసెల్ రెండో స్థానాన్ని పొందగా... మెక్‌లారెన్‌కే చెందిన లాండో నోరిస్ మూడో స్థానంలో నిలిచాడు. గత నాలుగేళ్లుగా ప్రపంచ చాంపియన్‌గా నిలుస్తున్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ ఆరో స్థానంతో సరిపెట్టుకోగా... ఫెరారీ తరఫున తొలిసారి బరిలోకి దిగిన లూయిస్ హామిల్టన్ ఐదో స్థానాన్ని సాధించాడు.
24 రేసుల ఈ సీజన్‌లో నాలుగు రేసులు పూర్తయ్యాయి. 77 పాయింట్లతో లాండో నోరిస్ అగ్ర స్థానంలో... 74 పాయింట్లతో ఆస్కార్ పియాస్ట్రి రెండో స్థానంలో... వెర్‌స్టాపెన్ 69 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని ఐదో రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి ఈనెల 20న జిద్దా నగరంలో జరుగుతుంది.