
హరియాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకారం
చండీగఢ్: పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు హరియాణా రాష్ట్ర ప్రభుత్వం భారీ నగదు బహుమతి అందించనుంది. 2024 విశ్వక్రీడల మహిళల 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్‌కు చేరగా... తుదిపోరుకు ముందు నిబంధనల విరుద్ధంగా నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉందనే కారణంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో వినేశ్ పారిస్ ఒలింపిక్స్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగింది.
తదనంతర పరిణామాల మధ్య రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లో చేరిన వినేశ్... హరియాణాలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. కాగా... ఒలింపిక్స్ ఫైనల్ చేరిన వినేశ్‌ను రజత పతకం గెలిచిన ప్లేయర్‌గానే భావిస్తామని గతంలోనే హరియాణా ప్రభుత్వం ప్రకటించింది. అందుకు తగ్గట్లే ఆమెకు పురస్కారం అందిస్తామని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాలసీ ప్రకారం వినేశ్‌కు 3 ఆఫర్లు కేటాయించగా... అందులో వినేశ్ రూ. 4 కోట్ల నగదు బహుమతిని ఎంచుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు క్రీడా మంత్రిత్వ శాఖకు ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన అథ్లెట్లకు హరియాణా ప్రభుత్వం... రూ. 4 కోట్ల ప్రైజ్‌మనీ, గ్రూప్–1 ఉద్యోగం, షెహ్రీ వికాస్ ప్రాధికారణ్ ఇంటి స్థలం రూపంలో మూడు ఆఫర్లను ప్రకటించడం ఆనవాయితీ. అందులో అథ్లెట్లు ఎంపిక చేసుకున్న దాన్ని వారికి కేటాయిస్తారు. మార్చి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో వినేశ్ ఈ అంశాన్ని గుర్తుచేసింది.
‘వినేశ్ దేశానికి గర్వకారణం అని ముఖ్యమంత్రి గతంలో అన్నారు. రజత పతక విజేతతో సమానంగా సత్కరిస్తామని మాటిచ్చారు. డబ్బు ముఖ్యం కాదు... కానీ ఇది గౌరవానికి సంబంధించిన విషయం. ఇప్పటి వరకు సీఎం హామీ నెరవేరలేదు’ అని వినేశ్ పేర్కొంది. దీంతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు నగదు పురస్కారం ఇవ్వాలని నిర్ణయించింది.