
న్యూఢిల్లీ: వరల్డ్ మ్యాచ్‌ప్లే బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత దిగ్గజం పంకజ్ అద్వానీ రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఐర్లాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో పంకజ్ హోరాహోరీగా పోరాడి ఓడాడు. శనివారం జరిగిన తుదిపోరులో పంకజ్ 7–8 (100–19, 100–0, 47–100, 52–100, 100–19, 0–100, 100–49, 3–100, 100–34, 100–4, 85–100, 100–31, 53–100, 43–100, 28–100) ఫ్రేమ్‌ల తేడాతో ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ కాసియర్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
బిలియర్డ్స్, స్నూకర్ క్రీడాంశాల్లో వివిధ విభాగాల్లో కలిపి 28 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పంకజ్... ‘బెస్ట్ ఆఫ్ 15’ పోరులో ఆరంభంలో చక్కటి ఆధిపత్యం కనబర్చినా... ఆఖర్లో పుంజుకున్న ఇంగ్లండ్ క్యూయిస్ట్ విజయం సాధించాడు. ఇక ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఐబీఎస్‌ఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో పంకజ్ పోటీ పడనున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న అద్వానీ... 2016 నుంచి ఈ టోర్నీలో వరుసగా టైటిల్స్ సాధిస్తూ వస్తున్నాడు.