కౌలాలంపూర్: క్యూ స్పోర్ట్స్ (బిలియర్స్, స్నూకర్)లో భారత దిగ్గజ ప్లేయర్ పంకజ్ అద్వానీ విశ్వ వేదికపై మరోసారి మెరిశాడు. మలేసియాలో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ 150 పాయింట్ల ఫార్మాట్‌లో ఈ బెంగళూరు ఆటగాడు చాంపియన్‌గా నిలిచాడు. బిలియర్స్, స్నూకర్‌లలో వివిధ ఫార్మాట్‌లలో కలిపి పంకజ్‌కిది 25వ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారితో శనివారం జరిగిన ఫైనల్లో 37 ఏళ్ల పంకజ్ అద్వానీ 4–0 (151–0, 150–31, 153–12, 150–29) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు.
ఆద్యంతం పూర్తి ఏకాగ్రతతో ఆడిన పంకజ్ ఏదశలోనూ తన ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి ఫ్రేమ్‌లో బ్రేక్ లేకుండా 149 పాయింట్లు స్కోరు చేసిన పంకజ్ ఆ తర్వాతి ఫ్రేమ్‌లలోనూ అదే జోరు కొనసాగించాడు. మ్యాచ్ మొత్తంలో కొఠారి కేవలం 72 పాయింట్లు స్కోరు చేయగా... పంకజ్ 604 పాయింట్లు సాధించడం అతని ఆధిపత్యాన్ని సూచిస్తోంది. ఈ గెలుపుతో పంకజ్ ఒకే ఏడాది జాతీయ, ఆసియా, ప్రపంచ బిలియర్స్ టైటిల్స్‌ను ఐదోసారి సాధించడం విశేషం.
ఓవరాల్‌గా 150 పాయింట్ల ఫార్మాట్‌లో పంకజ్‌దికి ఐదో ప్రపంచ టైటిల్. చివరిసారి ఈ టోర్నీ 2019లో జరిగింది. ఆ ఏడాది కూడా పంకజ్‌కే టైటిల్ దక్కింది. కరోనా కారణంగా గత రెండేళ్లు ఈ టోర్నీని నిర్వహించలేదు. ‘వరుసగా ఐదేళ్లు ప్రపంచ టైటిల్‌ను నిలబెట్టుకోవడం కలలాంటిదే. ఈ ఏడాది ప్రతి టోర్నీలో నా ఆటతీరుపట్ల సంతృప్తి చెందాను. ప్రపంచస్థాయిలో భారత్‌కు మరో టైటిల్ అందించినందుకు ఆనందంగా ఉంది’ అని పంకజ్ వ్యాఖ్యానించాడు.
8: పాయింట్ల ఫార్మాట్‌లో పంకజ్ సాధించిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ (2005, 2008, 2014, 2016, 2017, 2018, 2019, 2022).
8: లాంగ్ ఫార్మాట్‌లో పంకజ్ గెలిచిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ (2005, 2007, 2008, 2009, 2012, 2014, 2015, 2018).
8: స్నూకర్‌లో పంకజ్ సొంతం చేసుకున్న ప్రపంచ టైటిల్స్ (15 రెడ్స్: 2003, 2015, 2107; 6 రెడ్స్: 2014, 2015, 2021), వరల్డ్ టీమ్ కప్ (2018), వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్ (2019).
1: పంకజ్ నెగ్గిన ప్రపంచ బిలియర్డ్స్ టీమ్ టైటిల్స్ సంఖ్య (2014).
Comments
Please login to add a commentAdd a comment