World title
-
IBSF World Billiards Championship: పంకజ్ ఖాతాలో 25వ ప్రపంచ టైటిల్
కౌలాలంపూర్: క్యూ స్పోర్ట్స్ (బిలియర్స్, స్నూకర్)లో భారత దిగ్గజ ప్లేయర్ పంకజ్ అద్వానీ విశ్వ వేదికపై మరోసారి మెరిశాడు. మలేసియాలో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ 150 పాయింట్ల ఫార్మాట్లో ఈ బెంగళూరు ఆటగాడు చాంపియన్‌గా నిలిచాడు. బిలియర్స్, స్నూకర్లలో వివిధ ఫార్మాట్లలో కలిపి పంకజ్‌కిది 25వ ప్రపంచ టైటిల్ కావడం విశేషం. భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారితో శనివారం జరిగిన ఫైనల్లో 37 ఏళ్ల పంకజ్ అద్వానీ 4–0 (151–0, 150–31, 153–12, 150–29) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. ఆద్యంతం పూర్తి ఏకాగ్రతతో ఆడిన పంకజ్ ఏదశలోనూ తన ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి ఫ్రేమ్‌లో బ్రేక్ లేకుండా 149 పాయింట్లు స్కోరు చేసిన పంకజ్ ఆ తర్వాతి ఫ్రేమ్‌లలోనూ అదే జోరు కొనసాగించాడు. మ్యాచ్ మొత్తంలో కొఠారి కేవలం 72 పాయింట్లు స్కోరు చేయగా... పంకజ్ 604 పాయింట్లు సాధించడం అతని ఆధిపత్యాన్ని సూచిస్తోంది. ఈ గెలుపుతో పంకజ్ ఒకే ఏడాది జాతీయ, ఆసియా, ప్రపంచ బిలియర్స్ టైటిల్స్‌ను ఐదోసారి సాధించడం విశేషం. ఓవరాల్‌గా 150 పాయింట్ల ఫార్మాట్లో పంకజ్‌దికి ఐదో ప్రపంచ టైటిల్. చివరిసారి ఈ టోర్నీ 2019లో జరిగింది. ఆ ఏడాది కూడా పంకజ్‌కే టైటిల్ దక్కింది. కరోనా కారణంగా గత రెండేళ్లు ఈ టోర్నీని నిర్వహించలేదు. ‘వరుసగా ఐదేళ్లు ప్రపంచ టైటిల్‌ను నిలబెట్టుకోవడం కలలాంటిదే. ఈ ఏడాది ప్రతి టోర్నీలో నా ఆటతీరుపట్ల సంతృప్తి చెందాను. ప్రపంచస్థాయిలో భారత్‌కు మరో టైటిల్ అందించినందుకు ఆనందంగా ఉంది’ అని పంకజ్ వ్యాఖ్యానించాడు. 8: పాయింట్ల ఫార్మాట్లో పంకజ్ సాధించిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ (2005, 2008, 2014, 2016, 2017, 2018, 2019, 2022). 8: లాంగ్ ఫార్మాట్లో పంకజ్ గెలిచిన ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్స్ (2005, 2007, 2008, 2009, 2012, 2014, 2015, 2018). 8: స్నూకర్‌లో పంకజ్ సొంతం చేసుకున్న ప్రపంచ టైటిల్స్ (15 రెడ్స్: 2003, 2015, 2107; 6 రెడ్స్: 2014, 2015, 2021), వరల్డ్ టీమ్ కప్ (2018), వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్ (2019). 1: పంకజ్ నెగ్గిన ప్రపంచ బిలియర్డ్స్ టీమ్ టైటిల్స్ సంఖ్య (2014). -
స్త్రీ శక్తి: బ్యాక్ ఆన్ ది బైక్ పడి లేచిన కెరటం
ఫిమేల్ మోటర్ స్పోర్ట్స్ అథ్లెట్‌గా ప్రయాణం సులువేమీ కాదు. మద్దతు ఇచ్చే వాళ్ల కంటే వద్దనే వాళ్లే ఎక్కువ... దీనికి ఐశ్వర్య మినహాయింపు కాదు. మొన్న...‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’ అని ఆశ్చర్యంగా అడిగారు. నిన్న... ‘స్లోయెస్ట్ బైకర్’ అని ముఖం మీదే అన్నారు. ఇప్పుడు మాత్రం... ఐశ్వర్య గురించి ‘ఆశాకిరణం లాంటి ప్రొఫెషనల్ బైకర్’ అంటున్నారు... బెంగళూరుకు చెందిన ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచి బైక్‌లు అంటే చాలా ఇష్టం. ఇంట్లో నాన్న బైక్ ఉండేది. ప్రతి ఆదివారం ఆ బైక్‌పై తనను ఏదో ఒక కొత్త ప్రదేశానికి తీసుకెళుతుండేవాడు. ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన తరువాత ఐశ్వర్యకు బైకే లోకం అయింది. ఫ్రెండ్స్‌ను తీసుకొని రోజూ బైక్‌పై చక్కర్లు కొట్టేది. ఇలా తిరుగుతున్న రోజుల్లో ఒకసారి టీవిలో మోటోజీపి రేస్ చూసి ‘వావ్’ అనుకుంది. అలాంటి రేస్‌లో ఒకరోజు తాను భాగం అవుతానని అనుకోలేదు ఐశ్వర్య. ఇక అది మొదలు... మోటర్‌స్పోర్ట్స్, మోటర్‌స్పోర్ట్స్ అథ్లెట్ల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. నిజంగా చెప్పాలంటే అదొక ప్రపంచం! నిన్నటివరకు బైకింగ్ అనేది తనకు సరదా మాత్రమే. క్రికెట్, ఫుట్‌బాల్‌లాగే అది కూడా ఒక ఆట అని, దానిలో నిరూపించుకుంటే అంతర్జాతీయస్థాయికి వెళ్లవచ్చు అని తెలిశాక ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ట్రైనింగ్, రేసింగ్తోనే రోజులు గడిచేవి. అయితే ఐశ్వర్య అమ్మానాన్నలకు, వారి అమ్మా, నాన్నలకు ఆమెను పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్‌గా చూడాలనేది కల. అయితే వారొకటి తలిస్తే ఐశ్వర్య కల ఒకటి తలిచింది. తండ్రి ససేమిరా అన్నాడు. తల్లి మాత్రం పట్టువిడుపు ధోరణి ప్రదర్శిస్తూ మద్దతు ఇచ్చేది. 2018లో కొద్దిమందితో కలిసి జోర్డీ అనే కోచ్ దగ్గర శిక్షణ తీసుకుంది. జోర్డీ సలహా మేరకు బజా అరగాన్, స్పెయిన్‌లో పాల్గొని ఫస్ట్ ఫిమేల్ ఇండియన్‌గా చరిత్ర సృష్టించింది ఐశ్వర్య. (స్పానిష్ బజా...స్పెయిన్‌లోని అరగన్ ప్రాంతంలో జరిగే ర్యాలీ రైడ్ లేదా క్రాస్–కంట్రీ ర్యాలీ. ఆఫ్రికన్ ఎడ్వెంచరస్ ర్యాలీలను స్ఫూర్తిగా తీసుకొని 1983లో దీనిని దేశంలో మొదలుపెట్టారు) ఆరుసార్లు నేషనల్ రోడ్రేసింగ్ ర్యాలీ ఛాంపియన్‌గా నిలిచింది. 2019లో మోటర్ స్పోర్ట్స్‌లో వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. తన సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. మోటర్‌స్పోర్ట్స్ లో మన దేశానికి సంబంధించి గట్టిగా వినిపిస్తున్న పేర్లలో ఐశ్వర్య పేరు ఒకటి. ‘నిజానికి మా కుటుంబంలో మోటర్‌స్పోర్ట్స్ గురించి తెలిసిన వారు లేరు. వరల్డ్ ఛాంపియన్షిప్ గురించి గైడ్ చేసేవారు కూడా లేరు. నాకు నేనే తెలుసుకుంటూ వెళ్లాను. రేస్‌లలో పాల్గొనడం ద్వారా ఎంతోమందితో మాట్లాడి, వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది’ అంటుంది ఐశ్వర్య. ‘ప్లాన్ బీ’ లేదా సెకండ్ కెరీర్ అనేవి ఉండాలి అంటారు. అయితే ఒక రంగంలోకి, ఒక లక్ష్యం కోసం దిగిన వారు ‘ప్లాన్ బీ’ గురించి ఆలోచించవద్దు అంటుంది ఐశ్వర్య. ‘ఈ రంగంలో రాణించకపోతే నెక్స్›్టఏమిటి? అని ఎప్పుడూ ఆనుకోలేదు. కచ్చితంగా సాధించాల్సిందే అనుకున్నాను’ అంటుంది ఐశ్వర్య. స్పెయిన్‌లో మహిళలు మోటర్‌స్పోర్ట్స్‌లో రాణించడానికి అనువైన వాతావరణం, మౌలిక వసతులు ఉన్నాయి. కుటుంబ మద్దతు కూడా బలంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి మన దేశంలో కూడా రావాలని కోరుకుంటుంది ఐశ్వర్య. మోటర్ స్పోర్ట్స్ అంటే పరాజయాలు, విజయాలు మాత్రమే కాదు... గట్టి గాయాలు కూడా. ఒక ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది ఐశ్వర్య. ఇక ఆమె నడవడం కూడా కష్టమే అనుకున్నారంతా. అయితే ‘బ్యాక్ ఆన్ ది బైక్’ అంటూ మళ్లీ విజయపథంలో దూసుకుపోవడానికి ఎంతోకాలం పట్టలేదు! -
జపాన్ గ్రాండ్‌ప్రి విజేత లూయిస్ హామిల్టన్
వేదిక మారిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ జోరు తగ్గలేదు. క్వాలిఫయింగ్‌లో కనబరిచిన దూకుడును ప్రధాన రేసులోనూ కొనసాగించాడు. ఫలితంగా ఈ సీజన్ ఫార్ములావన్‌లో తొమ్మిదో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. నిర్ణీత 53 ల్యాప్‌లను అందరికంటే ముందుగా అతను గంటా 27 నిమిషాల 17.062 సెకన్లలో పూర్తి చేశాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడు, ఒకాన్ తొమ్మిది స్థానాల్లో నిలిచారు. -
‘ప్రపంచకప్ సాధించడమే మా అంతిమ లక్ష్యం’
సాక్షి, స్పోర్ట్స్ : ప్రపంచకప్ సాధించడమే అంతిమ లక్ష్యమని భారత మహిళా పేసర్ జులన్ గోస్వామి అభిప్రాయపడ్డారు. కాలి మడమ గాయంతో ఆమె దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా తిరుగొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మహిళల జట్టు ప్రపంచకప్ గెలువలేదు. గతేడాది అడుగుదూరంలో కప్‌ను చేజార్చుకున్న భారత అమ్మాయిలకు ఈ ఏడాది నవంబర్‌లో టీ20 ప్రపంచకప్ రూపంలో మరో అవకాశం రానుంది. ఈ నేపథ్యంలో గోస్వామి మాట్లాడుతూ.. ‘ టీ20 ప్రపంచకప్ కసరత్తు దక్షిణాఫ్రికా పర్యటనతోనే మొదలైంది. ఇంకా సుమారు ఏడాది సమయం ఉండగా కసరత్తు మొదలు పెట్టడం మంచి పరిణామం. ఈ వ్యవధిలో భారత మహిళలు బీజీ షెడ్యూలతో రాటు దేలుతారు. భారత్‌లో ఆస్ట్రేలియాతో, ఇంగ్లండ్‌లో ట్రై టీ20 సిరీస్ ప్రపంచకప్ సన్నహాకానికి ఉపయోగపడుతాయి. ఒక వేళ ప్రపంచకప్ గెలిస్తే మా కల నెరవేరినట్లే. నా కెరీర్ ప్రారంభించినప్పుడే ప్రపంచకప్ గెలవాలనే కోరిక నా మెదడులో నాటుకుపోయింది. నాలుగేళ్ల కోసారి వచ్చే ఈ టోర్నీ గెలుపు ఒలింపిక్ బంగారు పతకంతో సమానం. టీ20 ప్రపంచకప్ టోర్నీ సెమీస్‌కు వెళ్లడమే మా లక్ష్యమైనప్పటికీ, అంతిమ లక్ష్యం మాత్రం ప్రపంచకప్ సాధించడమే.’ అని 16 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న గోస్వామి తెలిపారు. దక్షిణాఫ్రికా పర్యటనపై స్పందిస్తూ.. దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ గెలవడంపై స్పందిస్తూ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కలిగించిన స్పూర్తే విజయానికి కారణమని గోస్వామి అభిప్రాయపడ్డారు. అక్కడికి వెళ్లే ముందు సచిన్ మహిళా క్రికెటర్లతో మాట్లాడాడని తెలిపారు. అక్కడి పిచ్‌లపై అనుసరించాల్సిన వ్యూహాలు, పరిస్థితులపై అవగాహన కల్పించారని, జట్టులోని ప్రతి ఒక్కరిలో స్పూర్తిని నింపారని గోస్వామి చెప్పుకొచ్చారు. బీజీ షెడ్యూల్ ఏర్పాటు చేయడంలో బీసీసీఐ కృషి కూడా ఎంతో ఉందని ఆమె తెలిపారు. డిఫెండింగ్ చాంపియన్ అయిన వెస్టిండీస్‌లో ఈ ఏడాది నవంబర్ 9 నుంచి 24 వరుకు మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుంది. గోస్వామి 200 వికెట్లు పడగొట్టిన తొలి మహిళ బౌలర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆమె గాయంతో దక్షిణాఫ్రికా పర్యటన టీ20 సిరీస్ నుంచి దూరమయ్యారు. రెండు మూడు వారాల విశ్రాంతి తర్వాత మార్చిలో ఆస్ట్రేలియాతో బరిలోకి దిగనున్నారు. -
పంకజ్ 18వ సారి...
దోహా: మరోసారి అద్భుత ఆటతీరును ప్రదర్శించిన భారత క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ కెరీర్లో 18వ ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. సోమవారం ముగిసిన ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో 32 ఏళ్ల పంకజ్ అద్వానీ చాంపియన్‌గా నిలిచాడు. అమీర్ సర్ఖోష్ (ఇరాన్)తో జరిగిన ఫైనల్లో పంకజ్ 8–2 (19–71, 79–53, 98–23, 69–62, 60–5, 0–134, 75–7, 103–4, 77–13, 67–47) ఫ్రేమ్‌ల తేడాతో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 7–4 ఫ్రేమ్‌ల తేడాతో 15 ఏళ్ల ఫ్లోరియన్ నుబిల్ (ఆస్ట్రియా)పై; క్వార్టర్ ఫైనల్లో 6–2 ఫ్రేమ్‌ల తేడాతో లువో హాంగ్హావో (చైనా)పై గెలిచాడు. బెంగళూరుకు చెందిన పంకజ్ గతంలో ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్; 2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను... ఏడుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (టైమ్ ఫార్మాట్; 2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను... మూడు సార్లు ప్రపంచ స్నూకర్ (2017, 2015, 2003) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ (2014) టైటిల్‌ను సాధించాడు. -
షెల్లీ... మళ్లీ...
జమైకా స్టార్‌దే మహిళల 100 మీ. ప్రపంచ టైటిల్ మూడోసారి స్వర్ణంతో కొత్త చరిత్ర బీజింగ్: స్ప్రింట్ రేసుల్లో తమకు తిరుగులేదని జమైకా అథ్లెట్స్ మరోసారి నిరూపించారు. ఆదివారం పురుషుల 100 మీటర్ల రేసులో ఉసేన్ బోల్ట్ విజేతగా నిలువగా... సోమవారం జరిగిన మహిళల 100 మీటర్ల రేసులో జమైకాకే చెందిన షెల్లీ యాన్ ఫ్రేజర్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఎత్తుతో సంబంధం లేదని... వేగమే ముఖ్యమని నిరూపిస్తూ 5 అడుగుల ఎత్తున్న షెల్లీ మూడోసారి ఈ విభాగంలో ప్రపంచ టైటిల్‌ను దక్కించుకుంది. సోమవారం జరిగిన మహిళల 100 మీటర్ల రేసును షెల్లీ 10.76 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించింది. డాఫ్నీ షిపర్స్ (నెదర్లాండ్స్-10.81 సెకన్లు) రజతం, టోరీ బౌవి (అమెరికా-10.86 సెకన్లు) కాంస్యం నెగ్గారు. తొలిసారి ఈ విభాగం ఫైనల్‌కు అమెరికా నుంచి ఒక్క అథ్లెట్ మాత్రమే అర్హత పొందడం గమనార్హం. ఈ విజయంతో షెల్లీ 32 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల రేసును మూడుసార్లు నెగ్గిన తొలి అథ్లెట్‌గా అరుదైన ఘనత సాధించింది. 2009, 2013లలో కూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో పసిడి పతకాలు నెగ్గిన షెల్లీ.. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో కూడా స్వర్ణ పతకాలు సాధించింది. కెంబోయ్ వరుసగా నాలుగోసారి... పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్లో కెన్యా ‘క్లీన్‌స్వీప్’ చేసింది. ఎజికీల్ కెంబోయ్ 8ని.11.28 సెకన్లలో గమ్యానికి చేరుకొని వరుసగా నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. కెన్యాకే చెందిన కాన్సెస్లుస్ కిప్రుటో, బ్రిమిన్ కిప్రుటో రజత, కాంస్య పతకాలు నెగ్గారు. మహిళల 10,000 మీటర్ల ఫైనల్లో వివియన్ చెరుయోట్ (కెన్యా-31ని.41.131 సెకన్లు) విజేతగా నిలువగా... ట్రిపుల్ జంప్‌లో కాటరీన్ ఇబార్‌గుయెన్ (కొలంబియా-14.90 మీటర్లు) స్వర్ణం సాధించింది. పురుషుల పోల్‌వాల్ట్‌లో షాన్ బార్బర్ (5.90 మీటర్లు) పసిడి పతకం నెగ్గగా... ఒలింపిక్ చాంపియన్ రెనాడ్ లావిలెనీ కాంస్యంతో సంతృప్తి పడ్డాడు. స్టీపుల్‌చేజ్ ఫైనల్లో లలిత మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో భారత క్రీడాకారిణి లలితా శివాజీ బాబర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ హీట్‌లో మహారాష్ట్రకు చెందిన లలిత 9ని:27.86 సెకన్లలో గమ్యానికి చేరుకొని నాలుగో స్థానాన్ని పొందింది. ఈ క్రమంలో లలిత 9ని:34.13 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును తిరగరాసింది. ఫైనల్ బుధవారం జరుగుతుంది. -
మేవెదర్ టైటిల్ వెనక్కి
వాషింగ్టన్: మ్యానీ పకియావోతో జరిగిన ‘శతాబ్దపు పోరు’లో దక్కించుకున్న వెల్టర్‌వెయిట్ ప్రపంచ టైటిల్‌ను ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ కోల్పోవాల్సి వచ్చింది. గత మేలో విజేతగా నిలిచిన మేవెదర్‌కు ఈ ఫైట్ ద్వారా రూ.1,040 కోట్లు దక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ బౌట్ ద్వారా బెల్ట్‌ను గెల్చుకున్నందుకు తను మంజూరు రుసుము కింద రెండు లక్షల డాలర్ల (రూ.కోటీ 27 లక్షలు)ను ప్రపంచ బాక్సింగ్ సంస్థ (డబ్ల్యుబీవో)కు చెల్లించాల్సి ఉంది. గత శుక్రవారమే ఈ గడువు ముగియడంతో వెల్టర్‌వెయిట్ బెల్ట్‌ను వెనక్కి తీసుకోవాలని డబ్ల్యుబీవో నిర్ణయించింది. డబ్ల్యుబీవో నిబంధనల ప్రకారం బాక్సర్లు తాము గెలుచుకున్న మొత్తం నుంచి 3 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే డబ్ల్యుబీవో చాంపియన్లు ఇతర వెయిట్ విభాగాల టైటిళ్లను తమ దగ్గర ఉంచుకోవడం నిషేధం. మేవెదర్ ప్రస్తుతం జూనియర్ మిడిల్వెయిట్లో డబ్ల్యుబీసీ, డబ్ల్యుబీఏ చాంపియన్ కూడా.