జులన్ గోస్వామి (ఫైల్ ఫొటో)
సాక్షి, స్పోర్ట్స్ : ప్రపంచకప్ సాధించడమే అంతిమ లక్ష్యమని భారత మహిళా పేసర్ జులన్ గోస్వామి అభిప్రాయపడ్డారు. కాలి మడమ గాయంతో ఆమె దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా తిరుగొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మహిళల జట్టు ప్రపంచకప్ గెలువలేదు. గతేడాది అడుగుదూరంలో కప్‌ను చేజార్చుకున్న భారత అమ్మాయిలకు ఈ ఏడాది నవంబర్‌లో టీ20 ప్రపంచకప్ రూపంలో మరో అవకాశం రానుంది.
ఈ నేపథ్యంలో గోస్వామి మాట్లాడుతూ.. ‘ టీ20 ప్రపంచకప్ కసరత్తు దక్షిణాఫ్రికా పర్యటనతోనే మొదలైంది. ఇంకా సుమారు ఏడాది సమయం ఉండగా కసరత్తు మొదలు పెట్టడం మంచి పరిణామం. ఈ వ్యవధిలో భారత మహిళలు బీజీ షెడ్యూలతో రాటు దేలుతారు. భారత్‌లో ఆస్ట్రేలియాతో, ఇంగ్లండ్‌లో ట్రై టీ20 సిరీస్ ప్రపంచకప్ సన్నహాకానికి ఉపయోగపడుతాయి. ఒక వేళ ప్రపంచకప్ గెలిస్తే మా కల నెరవేరినట్లే. నా కెరీర్ ప్రారంభించినప్పుడే ప్రపంచకప్ గెలవాలనే కోరిక నా మెదడులో నాటుకుపోయింది. నాలుగేళ్ల కోసారి వచ్చే ఈ టోర్నీ గెలుపు ఒలింపిక్ బంగారు పతకంతో సమానం. టీ20 ప్రపంచకప్ టోర్నీ సెమీస్‌కు వెళ్లడమే మా లక్ష్యమైనప్పటికీ, అంతిమ లక్ష్యం మాత్రం ప్రపంచకప్ సాధించడమే.’ అని 16 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న గోస్వామి తెలిపారు.
దక్షిణాఫ్రికా పర్యటనపై స్పందిస్తూ..
దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ గెలవడంపై స్పందిస్తూ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కలిగించిన స్పూర్తే విజయానికి కారణమని గోస్వామి అభిప్రాయపడ్డారు. అక్కడికి వెళ్లే ముందు సచిన్ మహిళా క్రికెటర్లతో మాట్లాడాడని తెలిపారు. అక్కడి పిచ్‌లపై అనుసరించాల్సిన వ్యూహాలు, పరిస్థితులపై అవగాహన కల్పించారని, జట్టులోని ప్రతి ఒక్కరిలో స్పూర్తిని నింపారని గోస్వామి చెప్పుకొచ్చారు. బీజీ షెడ్యూల్ ఏర్పాటు చేయడంలో బీసీసీఐ కృషి కూడా ఎంతో ఉందని ఆమె తెలిపారు.
డిఫెండింగ్ చాంపియన్ అయిన వెస్టిండీస్‌లో ఈ ఏడాది నవంబర్ 9 నుంచి 24 వరుకు మహిళల టీ20 ప్రపంచకప్ జరగనుంది. గోస్వామి 200 వికెట్లు పడగొట్టిన తొలి మహిళ బౌలర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆమె గాయంతో దక్షిణాఫ్రికా పర్యటన టీ20 సిరీస్ నుంచి దూరమయ్యారు. రెండు మూడు వారాల విశ్రాంతి తర్వాత మార్చిలో ఆస్ట్రేలియాతో బరిలోకి దిగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment