షెల్లీ... మళ్లీ...
జమైకా స్టార్‌దే మహిళల 100 మీ. ప్రపంచ టైటిల్
మూడోసారి స్వర్ణంతో కొత్త చరిత్ర
బీజింగ్: స్ప్రింట్ రేసుల్లో తమకు తిరుగులేదని జమైకా అథ్లెట్స్ మరోసారి నిరూపించారు. ఆదివారం పురుషుల 100 మీటర్ల రేసులో ఉసేన్ బోల్ట్ విజేతగా నిలువగా... సోమవారం జరిగిన మహిళల 100 మీటర్ల రేసులో జమైకాకే చెందిన షెల్లీ యాన్ ఫ్రేజర్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఎత్తుతో సంబంధం లేదని... వేగమే ముఖ్యమని నిరూపిస్తూ 5 అడుగుల ఎత్తున్న షెల్లీ మూడోసారి ఈ విభాగంలో ప్రపంచ టైటిల్‌ను దక్కించుకుంది. సోమవారం జరిగిన మహిళల 100 మీటర్ల రేసును షెల్లీ 10.76 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించింది.
డాఫ్నీ షిపర్స్ (నెదర్లాండ్స్-10.81 సెకన్లు) రజతం, టోరీ బౌవి (అమెరికా-10.86 సెకన్లు) కాంస్యం నెగ్గారు. తొలిసారి ఈ విభాగం ఫైనల్‌కు అమెరికా నుంచి ఒక్క అథ్లెట్ మాత్రమే అర్హత పొందడం గమనార్హం. ఈ విజయంతో షెల్లీ 32 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల రేసును మూడుసార్లు నెగ్గిన తొలి అథ్లెట్‌గా అరుదైన ఘనత సాధించింది. 2009, 2013లలో కూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో పసిడి పతకాలు నెగ్గిన షెల్లీ.. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో కూడా స్వర్ణ పతకాలు సాధించింది.
కెంబోయ్ వరుసగా నాలుగోసారి...
పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో కెన్యా ‘క్లీన్‌స్వీప్’ చేసింది. ఎజికీల్ కెంబోయ్ 8ని.11.28 సెకన్లలో గమ్యానికి చేరుకొని వరుసగా నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. కెన్యాకే చెందిన కాన్సెస్‌లుస్ కిప్‌రుటో, బ్రిమిన్ కిప్‌రుటో రజత, కాంస్య పతకాలు నెగ్గారు. మహిళల 10,000 మీటర్ల ఫైనల్లో వివియన్ చెరుయోట్ (కెన్యా-31ని.41.131 సెకన్లు) విజేతగా నిలువగా... ట్రిపుల్ జంప్‌లో కాటరీన్ ఇబార్‌గుయెన్ (కొలంబియా-14.90 మీటర్లు) స్వర్ణం సాధించింది. పురుషుల పోల్‌వాల్ట్‌లో షాన్ బార్బర్ (5.90 మీటర్లు) పసిడి పతకం నెగ్గగా... ఒలింపిక్ చాంపియన్ రెనాడ్ లావిలెనీ కాంస్యంతో సంతృప్తి పడ్డాడు.
స్టీపుల్‌చేజ్ ఫైనల్లో లలిత
మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో భారత క్రీడాకారిణి లలితా శివాజీ బాబర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ హీట్‌లో మహారాష్ట్రకు చెందిన లలిత 9ని:27.86 సెకన్లలో గమ్యానికి చేరుకొని నాలుగో స్థానాన్ని పొందింది. ఈ క్రమంలో లలిత 9ని:34.13 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును తిరగరాసింది. ఫైనల్ బుధవారం జరుగుతుంది.