
ఒక్క నిమిషం అనుకుంటే చిన్నసంఖ్య.. అదే కాలాన్ని అరవై సెకన్లు.. అరవై వేల మిల్లీ సెకన్లు.. అనుకుంటే పెద్ద సంఖ్య.. ఇలా అనుకుంది కాబట్టే ఈ బామ్మ భళాభళి అనిపించింది. వందేళ్లకు పైబడిన వయసులోని వాళ్లకు నిర్వహించిన వంద మీటర్ల రేసును కేవలం అరవై రెండు సెకన్లలోనే ముగించి రికార్డు సృష్టించింది. ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ‘లూసియానా సీనియర్ గేమ్స్’లో నమోదైన ఈ రికార్డు.. ఒలింపిక్స్ రికార్డునే బద్దలు కొట్టింది.
ఈ బామ్మపేరు జూలియా హాకిన్స్. రన్నింగ్ ట్రాక్‌పై ఈమె దూకుడు చూసి, జనాలు ఆమెను ముద్దుగా ‘హరికేన్’గా పిలుచుకుంటున్నారు. ఇదివరకు 100–104 ఏళ్ల వయసు వారికి జరిగిన వందమీటర్ల ‘మిషిగాన్ సీనియర్ ఒలింపిక్స్’ రేసులో జూలియా హాకిన్స్ సాధించిన రికార్డును గత ఏడాది 101 ఏళ్ల డయానే ఫ్రీడ్‌మాన్ యెనభై తొమ్మిది సెకన్లలో ముగించింది. ఫ్రీడ్‌మాన్‌కు ‘ఫ్లాష్’ అనే ముద్దుపేరు ఉంది. ఇదిలా ఉంటే, జూలియా హాకిన్స్ గత రికార్డులు సామాన్యమైనవేమీ కావు.
2019లో 50 మీటర్ల రేసును 46.07 సెకన్లలో పూర్తి చేసిన మొదటి వంద ఏళ్ల వ్యక్తిగా రికార్డు సృష్టించింది. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే, వచ్చే ఏడాది మే 10–23 తేదీల్లో ఫ్లోరిడాలో జరగనున్న నేషనల్ సీనియర్ గేమ్స్‌లో జూలియా హాకిన్స్, డయానే ఫ్రీడ్‌మాన్ ఒకేసారి రేసులో పాల్గొననున్నారు. హరికేన్ వర్సెస్ ఫ్లాష్ రేసును తిలకించడానికి ఫ్లోరిడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment