Sprint race
-
ఉసేన్ బోల్ట్‌కు ఏమాత్రం తీసిపోని రోబో.. 100 మీటర్ల రేస్‌లో గిన్నిస్ రికార్డు
కాస్సీ అనే రోబో 100 మీటర్ల పరుగు పందెంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ రేస్‌ను 24.73 సెకెన్లలో ముగించిన కాస్సీ.. అత్యంత వేగంగా పరుగు పూర్తి చేసిన రెండు కాళ్ల రోబోగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. మనుషుల వేగంతో పోల్చుకుంటే కాస్సీ వేగం తక్కువే అయినప్పటికీ.. ఓ రోబో నుంచి ఇది ఆశ్చర్యకరమైన ప్రదర్శనే అని చెప్పాలి. గతంలో ఏ రోబో ఇంత వేగంగా 100 మీటర్ల పరుగు పందెన్ని పూర్తి చేయలేదు. కాస్సీ ప్రదర్శన దాని రూపకర్తలకు సైతం ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది. మున్ముందు కాస్సీ మరిన్ని అద్భుతాలు చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. పరుగులో మరింత వేగాన్ని అందుకోవడం కాస్సీకి కష్టతరమైన సవాలు కాదని వారంటున్నారు. అసలైన సవాలు పరుగు మొదలుపెట్టడం, ఆపడమేనని తెలిపారు. కాస్సీని ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలోని ఇంజనీర్లు సృష్టించారు. ఇది వారి ఎజిలిటీ రోబోటిక్స్ విభాగంచే తయారు చేయబడింది. కాస్సీ యొక్క మోకాళ్లు ఉష్ట్రపక్షి (Ostrich) నుండి ప్రేరణ పొందాయి. ఉష్ట్రపక్షి భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే పక్షి. దీన్ని ప్రేరణగా తీసుకునే కాస్సీని తయారు చేశారు. కాగా, కాస్సీ దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్‌కు ఏమాత్రం తీసిపోదని నెటిజన్లు అంటున్నారు. బోల్ట్‌కు కాస్సీకి వ్యత్యాసం 15 సెకెన్లు మాత్రమే. బోల్ట్ 9.58 సెకెన్లలో 100మీ రేస్‌ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మహిళల విభాగంలో 100మీ ప్రపంచ రికార్డు ఫారెన్స్ గ్రిఫిత్ పేరిట ఉంది. ఈమె 10.49 సెకెన్లలో 100మీ రేసును పూర్తి చేసింది. -
వయసు సెంచరీ దాటినా.. ఒలింపిక్స్ రికార్డు బ్రేక్!
ఒక్క నిమిషం అనుకుంటే చిన్నసంఖ్య.. అదే కాలాన్ని అరవై సెకన్లు.. అరవై వేల మిల్లీ సెకన్లు.. అనుకుంటే పెద్ద సంఖ్య.. ఇలా అనుకుంది కాబట్టే ఈ బామ్మ భళాభళి అనిపించింది. వందేళ్లకు పైబడిన వయసులోని వాళ్లకు నిర్వహించిన వంద మీటర్ల రేసును కేవలం అరవై రెండు సెకన్లలోనే ముగించి రికార్డు సృష్టించింది. ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ‘లూసియానా సీనియర్ గేమ్స్’లో నమోదైన ఈ రికార్డు.. ఒలింపిక్స్ రికార్డునే బద్దలు కొట్టింది. ఈ బామ్మపేరు జూలియా హాకిన్స్. రన్నింగ్ ట్రాక్‌పై ఈమె దూకుడు చూసి, జనాలు ఆమెను ముద్దుగా ‘హరికేన్’గా పిలుచుకుంటున్నారు. ఇదివరకు 100–104 ఏళ్ల వయసు వారికి జరిగిన వందమీటర్ల ‘మిషిగాన్ సీనియర్ ఒలింపిక్స్’ రేసులో జూలియా హాకిన్స్ సాధించిన రికార్డును గత ఏడాది 101 ఏళ్ల డయానే ఫ్రీడ్మాన్ యెనభై తొమ్మిది సెకన్లలో ముగించింది. ఫ్రీడ్మాన్కు ‘ఫ్లాష్’ అనే ముద్దుపేరు ఉంది. ఇదిలా ఉంటే, జూలియా హాకిన్స్ గత రికార్డులు సామాన్యమైనవేమీ కావు. 2019లో 50 మీటర్ల రేసును 46.07 సెకన్లలో పూర్తి చేసిన మొదటి వంద ఏళ్ల వ్యక్తిగా రికార్డు సృష్టించింది. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే, వచ్చే ఏడాది మే 10–23 తేదీల్లో ఫ్లోరిడాలో జరగనున్న నేషనల్ సీనియర్ గేమ్స్‌లో జూలియా హాకిన్స్, డయానే ఫ్రీడ్మాన్ ఒకేసారి రేసులో పాల్గొననున్నారు. హరికేన్ వర్సెస్ ఫ్లాష్ రేసును తిలకించడానికి ఫ్లోరిడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
స్ప్రింట్ ఫైనల్లో నిత్య, నరేశ్
సాక్షి, వరంగల్ స్పోర్ట్స్: జాతీయ ఓపెన్ అథ్లెటిక్ చాంపియన్íÙప్ స్ప్రింట్‌లో తెలంగాణ అమ్మాయి గంధి నిత్య స్ప్రింట్‌లో సత్తా చాటింది. మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కొత్తగా నిర్మించిన సింథటిక్ ట్రాక్‌పై బుధవారం ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఎక్కువగా పలు ఈవెంట్లకు సంబంధించి క్వాలిఫయింగ్ పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా మహిళల 100 మీ. పరుగు పందెం హీట్స్‌లో నిత్య నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల వంద మీటర్ల స్ప్రింట్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ కె. నరేశ్ కుమార్ ఫైనల్లోకి ప్రవేశించాడు. హీట్స్‌లో అతను నాలుగో స్థానంలో నిలువడం ద్వారా ఫైనల్స్‌కు అర్హత సంపాదించాడు. మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతికశ్రీ ఫైనల్స్‌కు అర్హత పొందింది. హీట్స్‌లో ఆమె మూడో స్థానంలో నిలిచింది. తొలి రోజు రైల్వేస్ అథ్లెట్ల హవా నడిచింది. మొదటి రోజు మూడు మెడల్ ఈవెంట్లలో నలుగురు రైల్వేస్ అథ్లెట్లు పతకాలు గెలుపొందారు. 5000 మీటర్ల పరుగు పందెంలో పురుషుల కేటగిరీలో అభిõÙక్ పాల్, మహిళల ఈవెంట్లో పారుల్ చౌదరీ విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో అభిõÙక్ (రైల్వేస్) పోటీని అందరికంటే ముందుగా 14 నిమిషాల 16.35 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం నెగ్గాడు. సర్వీసెస్‌కు చెందిన ధర్మేందర్ (14ని.17.20 సె.), అజయ్ కుమార్ (14 ని.20.98 సె.) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. మహిళల 5000 మీ. పరుగులో పారుల్ చౌదరి 15 ని.59.69 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం గెలిచింది. ఇందులో మహారాష్ట్ర అమ్మాయిలు కోమల్ జగ్దలే (16ని. 01.43 సె.), సంజీవని బాబర్ (16 ని.19.18 సె.) రజతం, కాంస్యం గెలుపొందారు. మహిళల పోల్‌వాల్ట్ ఫైనల్లో పవిత్ర (తమిళనాడు; 3.90 మీ.) బంగారు పతకం సాధించింది. మరియా (రైల్వేస్; 3.80 మీ.) రజతం, కృష్ణ రచన్ (రైల్వేస్ 3.60 మీ.) కాంస్యం నెగ్గారు. మంత్రి చేతుల మీదుగా... మునుపెన్నడూ లేనివిధంగా చారిత్రక ఓరుగల్లులో జాతీయ క్రీడా పోటీలు జరుగుతుండడం గొప్ప విశేషం అని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి లాంఛనంగా పోటీలను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి జాతీయస్థాయి పోటీలకు హనుమకొండ నోచుకోలేదన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రామప్పకు యునెస్కో గుర్తింపు తీసుకువచ్చామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వారెవ్వా క్యా సీన్ హై.. ట్రాక్‌పైనే అంధ అథ్లెట్‌కు లవ్ ప్రపోజల్
టోక్యో: పారాలింపిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన 200 మీటర్ల పరుగు పందెంలో రన్నింగ్ ట్రాక్‌పై ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ అంధ అథ్లెట్‌కు ఆమె గైడ్ రన్నింగ్ ట్రాక్‌పైనే ప్రమోజ్ చేసి ఆమెతో సహా అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. వివరాల్లోకి వెళితే.. కేప్ వర్డే దేశానికి చెందిన స్ప్రింటర్ క్యూలా నిద్రేయి పెరీరా సెమెడో.. సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. అయితే ఆమె ఏమాత్రం నిరాశపడలేదు. ఎందుకంటే.. ఆమెకు మెడల్ కంటే గొప్ప బహుమతి లభించింది. దీంతో ఆమె స్వర్ణం గెలిచినంతగా ఉబ్బితబ్బిబిపోయింది. Keula Nidreia Pereira Semedo from Cape Verde got a surprise marriage proposal from guide after her Tokyo Paralympics 2020 Women's 200m T11 Heat 4 event.#YouDeserveIt #Paralympics pic.twitter.com/ZR6Lq7EwOb — SABC Sport (@SPORTATSABC) September 2, 2021 పరుగు పందాన్ని నాలుగో స్థానంతో ముగించిన అనంతరం ఆమె గైడ్ మాన్యువల్ ఆంటోనియో వాజ్ డా వేగా ట్రాక్‌పైనే పెరీరాకు లవ్ ప్రపోజ్ చేశాడు. మోకాళ్ల మీద కూర్చుని.. 'నన్ను పెళ్లి చేసుకుంటావా' అని అడిగాడు. అందుకు ఒక్కసారిగా అవాక్కయిన పెరీరా.. అనంతరం ఓకే చెప్పడంతో సహచర అథ్లెట్లతో సహా మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ చప్పట్లతో లవ్ బర్డ్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రాక్‌పై లవ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ సర్ప్రైజ్ లవ్ ట్రాక్‌ను పారాలింపిక్స్ నిర్వాహకులు అధికారిక ట్విటర్లో షేర్ చేశారు. 'జీవితంలో ఇద్దరూ కలిసి పరుగులు ప్రారంభించండి' అంటూ ట్వీటారు. కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఇలాంటి లవ్ ప్రపోజల్ సీన్ ఒకటి నెట్టింట హల్చల్ చేసింది. అర్జెంటీనా ఫెన్సర్ మరియా బెలెన్ పెరెజ్ మారిస్కు ఆమె కోచ్ లూకాస్ సౌసెడో లవ్ ప్రపోజ్ చేశాడు. 2010 పారిస్ ప్రపంచ ఛాంపియన్షిప్ సందర్భంగా కూడా సౌసెడో ఇలానే ప్రేమను వ్యక్తపరచడం విశేషం. చదవండి: కేబీసీలో.. కేటీఆర్? విషయం ఏమిటంటే? -
మహిళల 100 మీటర్ల స్ప్రింట్‌లో జమైకా క్లీన్‌స్వీప్
స్ప్రింట్ రేసుల్లో జమైకా మహిళా అథ్లెట్లు మరోసారి తమ ఆధిపత్యం చాటుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల రేసులో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకొని క్లీన్‌స్వీప్ చేశారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లోనూ జమైకా తొలిసారి క్లీన్‌స్వీప్ చేసింది. 1928 ఒలింపిక్స్‌లో తొలిసారి మహిళల 100 మీటర్ల రేసును ప్రవేశపెట్టగా ఇప్పటి వరకు జమైకా మాత్రమే రెండు పర్యాయాలు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను గెల్చుకుంది. 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ ఎలైన్ థాంప్సన్ హెరా ‘టోక్యో’లోనూ మెరుపు వేగంతో దూసుకుపోయి రెండోసారి ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచింది. జమైకాకే చెందిన షెల్లీ ఆన్ ఫ్రేజర్‌కు రజతం... షెరికా జాక్సన్‌కు కాంస్యం లభించాయి. టోక్యో: స్ప్రింట్ బుల్లెట్ ఉసేన్ బోల్ట్ ‘రియో’ ఒలింపిక్స్‌లో ఆగిపోయాడు. కానీ... జమైకన్లు మాత్రం సాగిపోతున్నారు. పరుగు పెడితే... పతకం మెడలో పడిందా... లేదా అన్నట్లు ట్రాక్‌పై చెలరేగిపోతున్నారు. మహిళల 100 మీటర్ల పరుగులో అయితే ఎలైన్ థాంప్సన్ హెరా... బోల్ట్‌లా కాదు ముమ్మాటికి బోల్ట్‌నే తలపించింది. కొత్త ఒలింపిక్ రికార్డుతో స్వర్ణం చేజిక్కించుకుంది. ట్రాక్‌పై ఆమె మెరుపు వేగంతో దూసుకొచ్చేసింది. ఆమెకు సమీప దూరంలో ఎవరూ లేరు. ఈ 100 మీటర్ల షార్ట్ డిస్టెన్స్‌లో ఇంత వ్యత్యాసం చూపడం ఒక్క బోల్ట్‌కే సాధ్యమైంది. ఇప్పుడదే వేగాన్ని ఎలైన్ థాంప్సన్ కనబరిచింది. మిగిలిన పతకాలను కూడా ఆమె సహచరులే పట్టేశారు. దీంతో ఈ ఈవెంట్‌ను జమైకన్లే క్లీన్‌స్వీప్ చేశారు. శనివారం జరిగిన మహిళల 100 మీటర్ల స్ప్రింట్‌లో ఎలైన్ థాంప్సన్ పోటీని అందరికంటే ముందుగా 10.61 సెకన్లలో ముగించింది. తద్వారా ఆమె 33 ఏళ్ల ఒలింపిక్ రికార్డును తిరగరాసింది. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో అమెరికాకు చెందిన ఫ్లారెన్స్ గ్రిఫిత్ జాయ్‌నెర్ నెలకొల్పిన 10.62 సెకన్ల రికార్డు 0.01 సెకను తేడాతో ఎలైన్ తన పేర లిఖించుకుంది. ఈ ఈవెంట్లో షెల్లీ అన్ ఫ్రేజర్ (10.74 సెకన్లు) రజతం గెలుపొందగా, షెరికా జాక్సన్ (10.76 సెకన్లు) కాంస్యం నెగ్గింది. బీజింగ్ ఒలింపిక్స్ (2008)లోనూ జమైకన్ అమ్మాయిలు ఇలాగే క్లీన్‌స్వీప్ చేశారు. కానీ ఆనాడు ఉసేన్ బోల్ట్ రికార్డు (9.69 సెకన్లు) ప్రదర్శన ముందు అమ్మాయిల ఘనత చిన్నబోయింది. అప్పుడు షెల్లీ అన్ ఫ్రేజర్ బంగారం గెలిచింది. షెల్లీ మళ్లీ లండన్ (2012)లోనూ స్వర్ణం నిలబెట్టుకుంది. మొత్తం మీద ఆమె ఖాతాలో నాలుగు (2 స్వర్ణాలు, 1 రజతం, రియోలో కాంస్యం) ఒలింపిక్ పతకాలున్నాయి. ఈ జమైకన్ లేడి చిరుతలకు క్లీన్‌స్వీప్ చేసేందుకు మరో అవకాశం 200 మీటర్ల స్పింట్ రేసు కల్పించనుంది. పైగా ఆ ఈవెంట్లో ఎలైన్ థాంప్సన్ డిఫెండింగ్ చాంపియన్. 200 మీటర్ల పరుగులో కూడా పతకాలన్నీ ఊడ్చేస్తే స్ప్రింట్‌లో జమైకన్లకు తిరుగుండదేమో! నేడే పురుషుల 100 మీటర్ల ఫైనల్ అందరూ గుడ్లప్పగించి చూసే అథ్లెటిక్ ఈవెంట్ పురుషుల 100 మీటర్ల పరుగు పోటీ నేడు జరగనుంది. బీజింగ్ (2008) నుంచి రియో (2016) దాకా ఉసేన్ బోల్ట్ వేగమే కనబడిన ఒలింపిక్స్‌లో ఇప్పుడు కొత్త చాంపియన్ స్ప్రింటర్‌ను చూడబోతున్నాం. జమైకన్ దిగ్గజం బోల్ట్ రిటైరైన తర్వాత జరుగుతున్న తొలి ఒలింపిక్స్‌లో స్ప్రింట్‌ను శాసించేది ఎవరో కొన్ని గంటల్లోనే తేలనుంది. ఆదివారమే జరిగే మూడు సెమీఫైనల్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు... ఆ తర్వాత అత్యుత్తమ సమయం నమోదు చేసిన మరో ఇద్దరు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. మొత్తం ఎనిమిది మంది ఫైనల్లో పోటీపడతారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం గం. 6.20 ఫైనల్ పోటీ జరుగుతుంది. ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల విభాగంలో స్వర్ణాన్ని నిలబెట్టుకున్న నాలుగో అథ్లెట్ ఎలైన్. గతంలో వ్యోమియా టైయస్ (అమెరికా; 1964, 1968)... గెయిల్ డెవర్స్ (అమెరికా; 1992, 1996)... షెల్లీ ఆన్ ఫ్రేజర్ (జమైకా; 2008, 2012) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
వెర్‌స్టాపెన్‌కే బ్రిటిష్ గ్రాండ్‌ప్రి పోల్ పొజిషన్
ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో తొలిసారి జరిగిన స్ప్రింట్ రేస్ క్వాలిఫయింగ్‌లో రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ సత్తా చాటాడు. శనివారం సిల్వర్‌స్టోన్‌లో జరిగిన 17 ల్యాప్‌ల బ్రిటిష్ గ్రాండ్‌ప్రి స్ప్రింట్ రేసును రెండో స్థానం నుంచి ఆరంభించిన అతను అందరి కంటే ముందుగా 25 నిమిషాల 38.426 సెకన్లలో పూర్తి చేసి పోల్ పొజిషన్‌ను దక్కించుకున్నాడు. దాంతో అతనికి మూడు పాయింట్లు లభించాయి. సీజన్లో వెర్‌స్టాపెన్‌కు ఇది ఐదో పోల్ కాగా... ఓవరాల్‌గా ఎనిమిదోది. ఆదివారం జరిగే ప్రధాన రేసును వెర్స్టాపెన్ తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. 1.430 సెకన్లు వెనుకగా రేసును ముగించిన మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంలో... సహచరుడు బొటాస్ మూడో స్థానంలో నిలిచాడు. హామిల్టన్‌కు రెండు డ్రైవర్ చాంపియన్‌షిప్ పాయింట్లు లభించగా... బొటాస్‌కు ఒక పాయింట్ లభించింది. -
టోక్యో ఒలింపిక్స్.. వైకల్యాన్ని పరుగు పెట్టించింది
తొమ్మిది నెలలకు ముందే జన్మించిన శిశువు ఆమె! చెవులు కూడా పూర్తిగా ఎదగలేదు. ఏడు నెలలు ఇన్‌క్యుబేటర్‌లో ఉంచవలసి వచ్చింది. ఆ తర్వాతనైనా ఆమె బతుకుతుందని వైద్యులు నమ్మకంగా చెప్పలేకపోయారు. 22 రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆమె టోక్యో పారా ఒలింపిక్స్‌లో వంద మీటర్ల పరుగు పందెంలో పోటీ పడబోతోంది! ఆ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించేలా సిమ్రాన్ శక్తిమంతురాలు అవడానికి ఆమె వైకల్యాలు ఒక కారణం అయితే.. భర్త చేయూత మరొక కారణం. ఆర్మీ జవాను భార్య టోక్యో పారా ఒలింపిక్స్‌కి వెళుతోందని సిమ్రాన్ శర్మను ఇప్పుడు అంతా కీర్తిస్తూ ఉన్నా.. ఆమెలోని ‘సైనికురాలికీ’ ఈ తాజా విజయంలో తగిన భాగస్వామ్యమే ఉంది. ఈ నెల 23న టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం అవుతున్న సమయానికే మొదలవుతున్న పారా ఒలింపిక్స్‌లోని వంద మీటర్ల ట్రాక్ ఈవెంట్‌కు సిమ్రాన్ అర్హత సాధించారు! భారతదేశంలో ఇప్పటి వరకు ఏ క్రీడాకారిణీ సాధించని ఘనత ఇది. అవును. పారా ఒలింపిక్స్‌లోని వంద మీటర్ల పరుగు పందానికి బరిలో దిగబోతున్న తొలి భారత మహిళ సిమ్రాన్ శర్మ! ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో (జె.ఎన్.ఎస్.) జూన్ 30 న జరిగిన వంద మీటర్ల పరుగు పందెంలో విజయం సాధించి.. టోక్యో ఫ్లయిట్ ఎక్కేందుకు ఇప్పుడామె సిద్ధంగా ఉన్నారు. పన్నెండు సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ఒలింపిక్స్ ఎంట్రీ సంపాదించారు సిమ్రాన్. టోక్యో వెళ్లే ముందు ఆఖరి నిముషం వరకు కూడా సాధన చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తానని చెబుతున్న సిమ్రాన్.. జీవితంలో అడుగడుగునా అవరోధాలు ఎదుర్కొన్న ఒక ‘రన్నర్’. ∙∙ సిమ్రాన్, ఆమె సిపాయి భర్త ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. భర్తే తన కోచ్ కావడం, ఆర్మీలో అతడి ఉద్యోగం కూడా ఢిల్లీలోనే అవడం సిమ్రాన్‌కు కలిసొచ్చింది. భార్యను గెలిపించి తీరాలన్న గజేంద్ర సింగ్ (30) సంకల్పం కూడా ఆమెను దృఢ మనస్కురాలిని చేసింది. అతడు ఆమెకు ఇచ్చింది సాధారణ శిక్షణ కాదు. భార్య కోసం, భార్యతో కలిసి అతడూ జె.ఎన్.ఎస్.లో రోజుకు ఐదు గంటలు ప్రాక్టీస్ చేశాడు! అదే గ్రౌండ్లో ఆమెను ఒలింపిక్స్‌కి ప్రవేశం సాధించిన విజేతగా నిలబెట్టాడు. అయితే ఇదేమీ అంత తేలిగ్గా జరగలేదు. ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయం ఆమె పోషకాహారానికి, ఇతర అవసరాల వరకు మాత్రమే సరిపోయేది. అందుకే భార్య శిక్షణకు అవసరమైన డబ్బు కోసం తాముంటున్న ప్లాట్‌ను అతడు అమ్మేశాడు గజేంద్ర సింగ్. బ్యాంకుల నుంచీ, స్నేహితుల నుంచీ మరికొంత అప్పు తీసుకున్నాడు. వాటికి ఈ దంపతులు వడ్డీ కట్టవలసి ఉంటుంది. అయితే ఒలింపిక్స్‌కి అర్హత సాధించడంతో ‘అసలు’ కూడా తీరిన ఆనందంలో ఉన్నారు వారిప్పుడు. ∙∙ భర్త ఆమె వ్యక్తి గత కోచ్ అయితే, ఆంటోనియో బ్లోమ్ ఆమె అధికారిక శిక్షకుడు. అంతర్జాతీయ స్థాయి వరకు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 19 ఏళ్ల అనుభవం ఉన్న ఐ.ఎ.ఎ.ఎఫ్. కోచ్! అతడి శిక్షణలో ఆమె ప్రపంచ ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించారు. 2019లో సిమ్రాన్ దుబాయ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కి చేరిన సమయానికి ఆమె తండ్రి మనోజ్ శర్మ ఇక్కడ ఇండియాలో వెంటిలేటర్ మీద ఉన్నారు. సిమ్రాన్ ఆ పోటీలను ముగించుకుని రాగానే కన్నుమూశారు. అంత దుఃఖంలోనూ అదే ఏడాది సిమ్రాన్ చైనా గ్రాండ్ ప్రిక్స్‌లో బంగారు పతకం సాధించారు. 2021 ఫిబ్రవరిలో దుబాయ్‌లోనే జరిగిన వరల్డ్ పారా గ్రాండ్ ప్రిక్స్‌లో బంగారు పతకం గెలుపొందారు. ఇంట్లో పెద్దమ్మాయి సిమ్రాన్. టోక్యో ఒలింపిక్స్‌తో ఇప్పుడు పుట్టింటికీ, మెట్టినింటికీ పెద్ద పేరే తేబోతున్నారు. సిమ్రాన్ శర్మ : పన్నెండు సెకన్లలో 100 మీటర్ల పరుగు లక్ష్యాన్ని ఛేదించి టోక్యో ఒలింపిక్స్‌కి అర్హత సాధించారు. -
షెల్లీ... మళ్లీ...
జమైకా స్టార్‌దే మహిళల 100 మీ. ప్రపంచ టైటిల్ మూడోసారి స్వర్ణంతో కొత్త చరిత్ర బీజింగ్: స్ప్రింట్ రేసుల్లో తమకు తిరుగులేదని జమైకా అథ్లెట్స్ మరోసారి నిరూపించారు. ఆదివారం పురుషుల 100 మీటర్ల రేసులో ఉసేన్ బోల్ట్ విజేతగా నిలువగా... సోమవారం జరిగిన మహిళల 100 మీటర్ల రేసులో జమైకాకే చెందిన షెల్లీ యాన్ ఫ్రేజర్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఎత్తుతో సంబంధం లేదని... వేగమే ముఖ్యమని నిరూపిస్తూ 5 అడుగుల ఎత్తున్న షెల్లీ మూడోసారి ఈ విభాగంలో ప్రపంచ టైటిల్‌ను దక్కించుకుంది. సోమవారం జరిగిన మహిళల 100 మీటర్ల రేసును షెల్లీ 10.76 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించింది. డాఫ్నీ షిపర్స్ (నెదర్లాండ్స్-10.81 సెకన్లు) రజతం, టోరీ బౌవి (అమెరికా-10.86 సెకన్లు) కాంస్యం నెగ్గారు. తొలిసారి ఈ విభాగం ఫైనల్‌కు అమెరికా నుంచి ఒక్క అథ్లెట్ మాత్రమే అర్హత పొందడం గమనార్హం. ఈ విజయంతో షెల్లీ 32 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల రేసును మూడుసార్లు నెగ్గిన తొలి అథ్లెట్‌గా అరుదైన ఘనత సాధించింది. 2009, 2013లలో కూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో పసిడి పతకాలు నెగ్గిన షెల్లీ.. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో కూడా స్వర్ణ పతకాలు సాధించింది. కెంబోయ్ వరుసగా నాలుగోసారి... పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్లో కెన్యా ‘క్లీన్‌స్వీప్’ చేసింది. ఎజికీల్ కెంబోయ్ 8ని.11.28 సెకన్లలో గమ్యానికి చేరుకొని వరుసగా నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. కెన్యాకే చెందిన కాన్సెస్లుస్ కిప్రుటో, బ్రిమిన్ కిప్రుటో రజత, కాంస్య పతకాలు నెగ్గారు. మహిళల 10,000 మీటర్ల ఫైనల్లో వివియన్ చెరుయోట్ (కెన్యా-31ని.41.131 సెకన్లు) విజేతగా నిలువగా... ట్రిపుల్ జంప్‌లో కాటరీన్ ఇబార్‌గుయెన్ (కొలంబియా-14.90 మీటర్లు) స్వర్ణం సాధించింది. పురుషుల పోల్‌వాల్ట్‌లో షాన్ బార్బర్ (5.90 మీటర్లు) పసిడి పతకం నెగ్గగా... ఒలింపిక్ చాంపియన్ రెనాడ్ లావిలెనీ కాంస్యంతో సంతృప్తి పడ్డాడు. స్టీపుల్‌చేజ్ ఫైనల్లో లలిత మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో భారత క్రీడాకారిణి లలితా శివాజీ బాబర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ హీట్‌లో మహారాష్ట్రకు చెందిన లలిత 9ని:27.86 సెకన్లలో గమ్యానికి చేరుకొని నాలుగో స్థానాన్ని పొందింది. ఈ క్రమంలో లలిత 9ని:34.13 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును తిరగరాసింది. ఫైనల్ బుధవారం జరుగుతుంది.