ఫిమేల్ మోటర్ స్పోర్ట్స్ అథ్లెట్‌గా ప్రయాణం సులువేమీ కాదు. మద్దతు ఇచ్చే వాళ్ల కంటే వద్దనే వాళ్లే ఎక్కువ... దీనికి ఐశ్వర్య మినహాయింపు కాదు. మొన్న...‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’ అని ఆశ్చర్యంగా అడిగారు. నిన్న... ‘స్లోయెస్ట్ బైకర్’ అని ముఖం మీదే అన్నారు. ఇప్పుడు మాత్రం... ఐశ్వర్య గురించి ‘ఆశాకిరణం లాంటి ప్రొఫెషనల్ బైకర్’ అంటున్నారు...
బెంగళూరుకు చెందిన ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచి బైక్‌లు అంటే చాలా ఇష్టం. ఇంట్లో నాన్న బైక్ ఉండేది. ప్రతి ఆదివారం ఆ బైక్‌పై తనను ఏదో ఒక కొత్త ప్రదేశానికి తీసుకెళుతుండేవాడు. ఇంటర్‌మీడియెట్ ఫెయిల్ అయిన తరువాత ఐశ్వర్యకు బైకే లోకం అయింది. ఫ్రెండ్స్‌ను తీసుకొని రోజూ బైక్‌పై చక్కర్లు కొట్టేది.
ఇలా తిరుగుతున్న రోజుల్లో ఒకసారి టీవిలో మోటోజీపి రేస్ చూసి ‘వావ్’ అనుకుంది. అలాంటి రేస్‌లో ఒకరోజు తాను భాగం అవుతానని అనుకోలేదు ఐశ్వర్య.
ఇక అది మొదలు... మోటర్‌స్పోర్ట్స్, మోటర్‌స్పోర్ట్స్ అథ్లెట్ల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. నిజంగా చెప్పాలంటే అదొక ప్రపంచం!
నిన్నటివరకు బైకింగ్ అనేది తనకు సరదా మాత్రమే. క్రికెట్, ఫుట్‌బాల్‌లాగే అది కూడా ఒక ఆట అని, దానిలో నిరూపించుకుంటే అంతర్జాతీయస్థాయికి వెళ్లవచ్చు అని తెలిశాక ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ట్రైనింగ్, రేసింగ్‌తోనే రోజులు గడిచేవి. అయితే ఐశ్వర్య అమ్మానాన్నలకు, వారి అమ్మా, నాన్నలకు ఆమెను పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్‌గా చూడాలనేది కల. అయితే వారొకటి తలిస్తే ఐశ్వర్య కల ఒకటి తలిచింది. తండ్రి ససేమిరా అన్నాడు. తల్లి మాత్రం పట్టువిడుపు ధోరణి ప్రదర్శిస్తూ మద్దతు ఇచ్చేది.
2018లో కొద్దిమందితో కలిసి జోర్డీ అనే కోచ్ దగ్గర శిక్షణ తీసుకుంది. జోర్డీ సలహా మేరకు బజా అరగాన్, స్పెయిన్‌లో పాల్గొని ఫస్ట్ ఫిమేల్ ఇండియన్‌గా చరిత్ర సృష్టించింది ఐశ్వర్య. (స్పానిష్ బజా...స్పెయిన్‌లోని అరగన్ ప్రాంతంలో జరిగే ర్యాలీ రైడ్ లేదా క్రాస్–కంట్రీ ర్యాలీ. ఆఫ్రికన్ ఎడ్వెంచరస్ ర్యాలీలను స్ఫూర్తిగా తీసుకొని 1983లో దీనిని దేశంలో మొదలుపెట్టారు) ఆరుసార్లు నేషనల్ రోడ్‌రేసింగ్ ర్యాలీ ఛాంపియన్‌గా నిలిచింది. 2019లో మోటర్ స్పోర్ట్స్‌లో వరల్డ్ టైటిల్ గెలుచుకుంది.
తన సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. మోటర్‌స్పోర్ట్స్ లో మన దేశానికి సంబంధించి గట్టిగా వినిపిస్తున్న పేర్లలో ఐశ్వర్య పేరు ఒకటి.
‘నిజానికి మా కుటుంబంలో మోటర్‌స్పోర్ట్స్ గురించి తెలిసిన వారు లేరు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ గురించి గైడ్ చేసేవారు కూడా లేరు. నాకు నేనే తెలుసుకుంటూ వెళ్లాను. రేస్‌లలో పాల్గొనడం ద్వారా ఎంతోమందితో మాట్లాడి, వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది’ అంటుంది ఐశ్వర్య.
‘ప్లాన్ బీ’ లేదా సెకండ్ కెరీర్ అనేవి ఉండాలి అంటారు. అయితే ఒక రంగంలోకి, ఒక లక్ష్యం కోసం దిగిన వారు ‘ప్లాన్ బీ’ గురించి ఆలోచించవద్దు అంటుంది ఐశ్వర్య.
‘ఈ రంగంలో రాణించకపోతే నెక్స్›్టఏమిటి? అని ఎప్పుడూ ఆనుకోలేదు. కచ్చితంగా సాధించాల్సిందే అనుకున్నాను’ అంటుంది ఐశ్వర్య. స్పెయిన్‌లో మహిళలు మోటర్‌స్పోర్ట్స్‌లో రాణించడానికి అనువైన వాతావరణం, మౌలిక వసతులు ఉన్నాయి. కుటుంబ మద్దతు కూడా బలంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి మన దేశంలో కూడా రావాలని కోరుకుంటుంది ఐశ్వర్య.
మోటర్ స్పోర్ట్స్ అంటే పరాజయాలు, విజయాలు మాత్రమే కాదు... గట్టి గాయాలు కూడా. ఒక ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది ఐశ్వర్య. ఇక ఆమె నడవడం కూడా కష్టమే అనుకున్నారంతా. అయితే ‘బ్యాక్ ఆన్ ది బైక్’ అంటూ మళ్లీ విజయపథంలో దూసుకుపోవడానికి ఎంతోకాలం పట్టలేదు!
Comments
Please login to add a commentAdd a comment