Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Afghanistan towards follow on in first innings1
మనదే జోరు...

న్యూ చండీగఢ్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన భారత క్రికెట్‌ జట్టు... సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టుపై పట్టు బిగించింది. తొలుత బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేసిన టీమిండియా... ఆ తర్వాత తమకు అలవాటైన రీతిలో ప్రత్యర్థిని స్పిన్‌ ఉచ్చులో బిగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 368/3తో ఆదివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ 127 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 564 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (177 బంతుల్లో 126; 15 ఫోర్లు, 1 సిక్స్‌) శతకం తర్వాత ఎక్కువసేపు నిలవలేకపోగా... రిషబ్‌ పంత్‌ (121 బంతుల్లో 81; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), వాషింగ్టన్‌ సుందర్‌ (68 బంతుల్లో 52 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలతో సత్తా చాటారు. అఫ్గానిస్తాన్‌ బౌలర్లలో సలీమ్‌ 140 పరుగులిచ్చి 6 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అఫ్గాన్‌... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 39.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. రహమత్‌ షా (81 బంతుల్లో 43 బ్యాటింగ్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20) సహా టాపార్డర్‌ మొత్తం విఫలమైంది. భారత బౌలర్లలో అరంగేట్ర లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ 15.5 ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ప్రసిధ్‌ కృష్ణకు రెండు వికెట్లు దక్కాయి. చేతిలో ఐదు వికెట్లు ఉన్న అఫ్గానిస్తాన్‌... టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు 451 పరుగుల దూరంలో ఉంది. ఫాలోఆన్‌ ఇన్నింగ్స్‌ తప్పించుకోవాలంటే అఫ్గానిస్తాన్‌ మరో 252 పరుగులు సాధించాలి. మెరిసిన మానవ్‌ ఈ మ్యాచ్‌ ద్వారానే అరంగేట్రం చేసిన మానవ్‌ సుతార్‌... తొలి టెస్టులోనే ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. పిచ్‌ స్పిన్‌కు సహకరిస్తున్న మాట వాస్తవమే అయినా... మానవ్‌ తన వైవిధ్యంతో కట్టిపడేశాడు. పదేపదే ఒకే చోట బంతిని వేస్తూ ఫలితం రాబట్టాడు. వరుసగా ఒకే ఎండ్‌ నుంచి 13 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసిన 23 ఏళ్ల మానవ్‌... తాను టెస్టు క్రికెట్‌కు పూర్తిగా సిద్ధమయ్యే వచ్చినట్లు నిరూపించుకున్నాడు. రవీంద్ర జడేజా తరహాలోనే లెఫ్టార్మ్‌ స్పిన్‌ వేయగలగడంతో పాటు... అవసరమైతే కింద వరుసలో బ్యాటింగ్‌కు వచ్చి ధాటిగా ఆడటంలో మానవ్‌ దిట్ట. ఈ మ్యాచ్‌లో అతడు బ్యాట్‌తోనూ మెరిశాడు. ఏడో స్థానంలో క్రీజులో అడుగుపెట్టి 41 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేశాడు. స్కోరు వివరాలు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) అఫ్సర్‌ (బి) సలీమ్‌ 24; రాహుల్‌ (సి) రహ్మనుల్లా (బి) జియాఉర్‌ రహమాన్‌ 100; సాయి సుదర్శన్‌ (సి) అఫ్సర్‌ (బి) సలీమ్‌ 81; గిల్‌ (సి) అఫ్సర్‌ (బి) సలీమ్‌ 126; పంత్‌ (సి) అజ్మతుల్లా (బి) హష్మతుల్లా 81; జురేల్‌ (బి) సలీమ్‌ 19; సుందర్‌ (నాటౌట్‌) 52; మానవ్‌ (సి) అఫ్సర్‌ (బి) సలీమ్‌ 28; సిరాజ్‌ (బి) సలీమ్‌ (22); కుల్దీప్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు: 22;మొత్తం (127 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్డ్‌) 564. వికెట్ల పతనం: 1–41, 2–180, 3–247, 4–416, 5–452, 6–456, 7–510, 8–540. బౌలింగ్‌: జియాఉర్‌ రహమాన్‌ 24–2–91–1; అజ్మతుల్లా 22–5–67–0; సలీమ్‌ 27–3–140–6; ఖరోటె 23–0–115–0; అబ్దుల్‌ 7–0–43–0; హష్మతుల్లా 24–1–91–1. అఫ్గానిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌: అబ్దుల్‌ (సి) సిరాజ్‌ (బి) మానవ్‌ 16; సాదిఖుల్లా (బి) ప్రసిధ్‌ 17; రహ్మానుల్లా (సి) సుదర్శన్‌ (బి) మానవ్‌ 12; రహమత్‌ షా (బ్యాటింగ్‌) 43; హష్మతుల్లా (ఎల్బీ) ప్రసిధ్‌ 20; అఫ్సర్‌ (సి అండ్‌ బి) మానవ్‌ 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (39.5 ఓవర్లలో 5 వికెట్లకు) 113. వికెట్ల పతనం: 1–28, 2–40, 3–62, 4–98, 5–113. బౌలింగ్‌: సిరాజ్‌ 6– 1–24–0; ప్రసిధ్‌ 7–0–27–2; మానవ్‌ 15.5–7–21–3; కుల్దీప్‌ 7–0–29–0; సుందర్‌ 4–0–12–0.

Germany enters the Football World Cup without expectations2
పూర్వ వైభవం కోసం!

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ చరిత్రలో అత్యంత నిలకడగా రాణిస్తున జట్లలో జర్మనీ జట్టు కచ్చితంగా ఉంటుంది. ఇప్పటి వరకు 22 సార్లు ప్రపంచకప్‌ జరగ్గా... అత్యధికసార్లు ఫైనల్‌ చేరుకున్న జట్టుగా జర్మనీకి పేరుంది. నాలుగుసార్లు (1954, 1974, 1990, 2014) విశ్వవిజేతగా నిలిచిన జర్మనీ జట్టు... మరో నాలుగుసార్లు ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా (1966, 1982, 1986, 2002) నిలిచింది. మరో నాలుగుసార్లు మూడో స్థానం (1934, 1970, 2006, 2010) సంపాదించింది. 2014లో బ్రెజిల్‌ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచిన జర్మనీ... ఆ తర్వాత అనూహ్యంగా వెనుకబడిపోయింది. పలువురు స్టార్‌ ఆటగాళ్లు రిటైర్‌ కావడం... వారి స్థానాలను భర్తీ చేసేవాళ్లు ఇంకా తయారు కాకపోవడం... వెరసి జర్మనీ జట్టు తొలిసారి వరుసగా రెండు ప్రపంచకప్‌లలో (2018, 2022) గ్రూప్‌ దశలోనే ఇంటిదారి పట్టింది. రెండేళ్ల క్రితం స్వదేశంలో జరిగిన ‘యూరో’ టోర్నీలో జర్మనీ క్వార్టర్‌ ఫైనల్లో చాంపియన్‌ స్పెయిన్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. ఇక ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌లో గ్రూప్‌ ‘ఎ’లో ఉన్న జర్మనీ 15 పాయింట్లతో టాపర్‌గా నిలిచి మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది. పూర్వ వైభవం కోసం తాపత్రయపడుతున్న జర్మనీ ఈసారి గ్రూప్‌ దశ సులువుగానే దాటే అవకాశం ఉంది. గ్రూప్‌ ‘ఇ’లో కురసావ్, ఐవరీకోస్ట్, ఈక్వెడార్‌ జట్లతో జర్మనీకి చోటు కల్పించారు. జర్మనీ తొలి మ్యాచ్‌ను జూన్‌ 14న కురసావ్‌తో, రెండో మ్యాచ్‌ను జూన్‌ 20న ఐవరీకోస్ట్‌తో, జూన్‌ 25న ఈక్వెడార్‌తో ఆడుతుంది. మిడ్‌ఫీల్డర్లు జమాల్‌ ముసియాలా, ఫ్లోరియన్‌ విట్జ్, లెనార్ట్‌ కార్ల్, కాయ్‌ హావెట్జ్‌లతోపాటు వెటరన్‌ గోల్‌కీపర్‌ మాన్యుయెల్‌ న్యూయెర్‌ ప్రదర్శనపై జర్మనీ ముందంజ వేసే ఆశలు ఆధారపడి ఉన్నాయి. జర్మనీ జట్టుకు నాకౌట్‌ దశ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో గత ప్రపంచకప్‌ రన్నరప్‌ ఫ్రాన్స్‌ ఎదురయ్యే అవకాశముంది. ఫ్రాన్స్‌ అడ్డంకిని అధిగమిస్తే జర్మనీ నుంచి అద్భుత ఫలితం ఆశించవచ్చు. – సాక్షి క్రీడావిభాగం

Anirudh Jodi is the runner up in the Birmingham Open ATP Challenger 125 tournament3
రన్నరప్‌ అనిరుధ్‌ జోడీ

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది రెండో ఏటీపీ చాలెంజర్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన హైదరాబాద్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్‌కు నిరాశ ఎదురైంది. ఇంగ్లండ్‌లో ఆదివారం ముగిసిన బర్మింగ్‌హామ్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–125 టోర్నీలో అనిరుధ్‌ (భారత్‌)–టకెరు యుజుకి (జపాన్‌) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. బెన్‌ జోన్స్‌–జోషువా పారిస్‌ (బ్రిటన్‌) జంటతో జరిగిన ఫైనల్లో అనిరు«ద్‌–టకెరు జోడీ 4–6, 6–7 (4/7)తో పోరాడి ఓడిపోయింది. 85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్‌–టకెరు ఏడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. తొలి సర్వీస్‌లో 37 పాయింట్లు, రెండో సర్వీస్‌లో ఆరు పాయింట్లు సాధించారు. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్‌ చేశారు. అంతకుముందు తొలి రౌండ్‌లో అనిరు«ద్‌–టకెరు 4–6, 7–6 (7/5), 10–1తో ఫిన్‌ బాస్‌–స్కాట్‌ డంకన్‌ (బ్రిటన్‌)లపై, క్వార్టర్‌ ఫైనల్లో 7–6 (7/3), 6–3తో ఫిన్‌ రేనాల్డ్స్‌–జేమ్స్‌ వాట్‌ (న్యూజిలాండ్‌)లపై, సెమీఫైనల్లో 7–5, 7–6 (7/5)లతో డీగో హిడాల్గో (ఈక్వెడార్‌)–ప్యాట్రిక్‌ ట్రహక్‌ (అమెరికా)లపై గెలుపొందారు. రన్నరప్‌ అనిరుద్‌–టకెరులకు 5,220 (రూ. 4 లక్షల 95 వేలు) డాలర్ల ప్రైజ్‌మనీతోపాటు 75 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది అనిరు«ద్‌–టకెరు ద్వయం బుసాన్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–125 టోర్నీలో డబుల్స్‌ టైటిల్‌ గెలిచింది.

Alexander Zverevs dream comes true on his fourth attempt4
వీల్‌చైర్‌ నుంచి విక్టరీ పోడియం వరకు...

రాకెట్‌ పట్టిన ప్రతి చిన్నారి కల ఒక్కటే... ఏనాటికైనా ఏ విభాగంలోనైనా గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలని... అయితే తమ లక్ష్యం నెరవేరకుండానే... దానికి సమీపంలోకి రాకుండానే... ఎంతోమంది రాకెట్‌ వదిలేస్తారు.... కానీ కొందరుంటారు... ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా... ఎన్నిసార్లు విఫలమైనా... తమకంటూ ఒక రోజు వస్తుందనే నమ్మకంతో టైటిల్‌ వేటను కొనసాగిస్తుంటారు. ఆలస్యమైనా వారు జీవిత లక్ష్యం అందుకుంటారు... జీవన స్వప్నం సాకారం చేసుకుంటారు... ఆ కోవలోకే వస్తాడు జర్మనీకి చెందిన 29 ఏళ్ల అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌. పుష్కరకాలం నుంచి ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ఆడుతున్న జ్వెరెవ్‌ నాలుగో ప్రయత్నంలో తన గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ కలను నిజం చేసుకున్నాడు. పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేదని నిరూపించాడు. నాలుగేళ్ల క్రితం ఏ వేదిక నుంచి గాయపడి వీల్‌చైర్‌లో బయటకు వెళ్లాడో... ఇప్పుడు అదే వేదికపై సగర్వంగా విన్నర్స్‌ ట్రోఫీని ఎత్తుకున్నాడు. – సాక్షి క్రీడా విభాగంఆరేళ్ల క్రితమే తొలి ప్రయత్నంలోనే అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ ట్రోఫీని ముద్దాడాల్సింది. డొమినిక్‌ థీమ్‌ (ఆ్రస్టియా)తో జరిగిన 2020 యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో జ్వెరెవ్‌ తొలి రెండు సెట్‌లు గెల్చుకున్నాడు. విన్నర్స్‌ ట్రోఫీకి కేవలం ఒక్క సెట్‌ దూరంలో ఉన్నాడు. అయితే జ్వెరెవ్‌ కలను థీమ్‌ భగ్నం చేశాడు. తొలి రెండు సెట్‌లు కోల్పోయినా... పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన థీమ్‌ వరుసగా మూడు సెట్‌లు గెలిచి యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌గా అవతరించాడు. జ్వెరెవ్‌ నిరాశగా వెనుదిరిగాడు. నాలుగేళ్లు గడిచాయి... 2024లో జ్వెరెవ్‌కు మరో ‘గ్రాండ్‌’ టైటిల్‌ అవకాశం లభించింది. ఈసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో... కానీ స్పెయిన్‌ రైజింగ్‌ స్టార్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ అసాధారణ ప్రదర్శన ముందు జ్వెరెవ్‌ ఎదురునిలువ లేకపోయాడు. చివరి రెండు సెట్‌లు చేజార్చుకున్న జ్వెరెవ్‌ టైటిల్‌ను కూడా వదులుకున్నాడు. ఏడాది తిరిగేలోపు 2025 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జ్వెరెవ్‌ ముచ్చటగా మూడో ‘గ్రాండ్‌’ చాన్స్‌ లభించింది. కానీ ఇటలీ స్టార్‌ యానిక్‌ సినెర్‌ ధాటికి జ్వెరెవ్‌ వరుస సెట్‌లలో చేతులెత్తేశాడు. మూడోసారి నిరాశతో ఇంటిదారి పట్టాడు. ఈసారి వదల్లేదు... కెరీర్‌లో 41వసారి గ్రాండ్‌స్లామ్‌ ఆడేందుకు జ్వెరెవ్‌ 11వసారి పారిస్‌కు వచ్చాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. సెర్బియా దిగ్గజం, 24 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన జొకోవిచ్‌ మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. దాంతో జ్వెరెవ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ ఈసారి నెరవేరడం లాంఛనమే అనిపించింది.అనుకున్నట్లే... తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన జ్వెరెవ్‌ కెరీర్‌లో ఆడిన 41వ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో విజేత ట్రోఫీని అందుకున్నాడు. 2022 ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీఫైనల్‌ సందర్భంగా స్పెయిన్‌ దిగ్గజం రాఫెల్‌ నాదల్‌థో సెమీఫైనల్‌ ఆడుతూ జ్వెరెవ్‌ జారిపడ్డాడు. గాయంతో చక్రాల కుర్చీతో మైదానాన్ని వీడాడు. ఇప్పుడు అదే మట్టికోర్టులో కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచాడు. జ్వెరెవ్‌ అద్భుత ప్రస్థానంలో కొన్ని ఆసక్తికర విషయాలను పరిశీలిస్తే... టెన్నిస్‌ ఫ్యామిలీ... జ్వెరెవ్‌ది అసలు సిసలు టెన్నిస్‌ కుటుంబం. అతడి తల్లిదండ్రులు ఇరినా జ్వెరెవా, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ సీనియర్‌ ఇద్దరూ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ ప్లేయర్లే. ఈ జంట సోవియట్‌ యూనియన్‌ తరఫున ఆడింది. ఇక జ్వెరెవ్‌ సోదరుడు మిషా జ్వెరెవ్‌ కూడా ప్రొఫెషనల్‌ ఆటగాడే. అతడు ఏటీపీ టూర్‌లో పలు విజయాలు సాధించాడు. అతడి కుటుంబం భిన్న సంస్కృతులకు నెలవు. జ్వెరెవ్‌ ఇంట్లో మూడు భాషలు మాట్లాడుతారు. జర్మనీలో పుట్టి పెరగడంతో జర్మన్‌తో పాటు మూలాల కారణంగా రష్యన్, ఇంగ్లిష్ లో ధారాళంగా మాట్లాడగలరు. అమ్మ దిద్దిన చాంపియన్‌... ఇంట్లో అందరూ టెన్నిస్‌ ప్లేయర్‌లే కాగా... జ్వెరెవ్‌ ఆది గురువు మాత్రం తల్లే! శరీర దారుఢ్యంపై తండ్రి దృష్టి పెడితే... తల్లి ఇరినా మాత్రం అతడికి టెన్నిస్‌లో ఓనమాలు నేర్పింది. సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగాలంటే తనకంటూ కొన్ని ప్రత్యేక షాట్‌లు ఉండాలని బలంగా నమ్మిన ఇరినా... జ్వెరెవ్‌కు బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌ను పదేపదే ప్రాక్టీస్‌ చేయించేది. ఆమె కృషి వల్లే బ్యాక్‌హ్యాండ్‌ పవర్‌ ఫుల్‌ షాట్‌ తనకు అలవడిందని జ్వెరెవ్‌ గతంలో పలుమార్లు వెల్లడించాడు. చిన్నప్పుడు బాగా చురుకుగా ఉండే జ్వెరెవ్‌... ఓటమిని అస్సలు అంగీకరించలేకపోయేవాడని సోదరుడు మిషా తెలిపాడు. పసితనంలో జ్వెరెవ్‌ తన చేతిలో ఓడిపోతే... గెలిచే వరకు టెన్నిస్‌ కోర్టు వీడేవాడు కాదని గుర్తుచేసుకున్నాడు. హాకీ, ఫుట్‌బాల్‌ వదిలేసి... అందరు పిల్లల్లాగే చిన్నప్పుడు వేర్వేరు క్రీడలను ఇష్టపడ్డ జ్వెరెవ్‌.. టెన్నిస్‌తో పాటు హాకీ, ఫుట్‌బాల్‌ కూడా ఆడేవాడు. అయితే 12 ఏళ్ల ప్రాయంలో ఫ్లోరిడాలో జరిగిన ఒక జూనియర్‌ టోర్నమెంట్‌లో జ్వెరెవ్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. దీంతో టెన్నిస్‌పై కసి పెంచుకున్న అతడు ... మిగిలిన క్రీడలను పక్కనపెట్టి వంద శాతం టెన్నిస్‌పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఫ్యాషన్‌లోనూ తనదైన శైలి కోర్టులో ఆటతో పాటు... కోర్టు బయట ఫ్యాషన్‌తోనూ జ్వెరెవ్‌ భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా 2017 యూఎస్‌ ఓపెన్‌ సందర్భంగా అతడి ఫ్యాషన్‌... సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. 1970 నాటి స్టయిల్‌లో అతడి డ్రెస్సింగ్‌ స్టయిల్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ప్రముఖ సంగీత కళాకారుడు, డిజైనర్‌ ఫారెట్‌ విలియమ్స్‌ జ్వెరెవ్‌ కోసం ప్రత్యేకంగా దుస్తువులు డిజైన్‌ చేస్తాడు. ప్రత్యేక అతిథిలా....జ్వెరెవ్‌కు కుక్కలంటే చాలా ఇష్టం. ఏటీపీ టూర్‌ టోర్నమెంట్‌లలో జ్వెరెవ్‌ తరచూ తన పెంపుడు కుక్క ‘లోవిక్‌’తో దర్శనమిస్తాడు. లోవిక్‌కు అతడి జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎంతగానంటే... తనతో పాటు కోర్టులో తిరగడానికి దానికి ప్రత్యేక అతిథిగా అనుమతి పత్రాలు సైతం తీసుకున్నాడు.ముందే ఒలింపిక్‌ స్వర్ణంగ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలవడానికి ముందే జ్వెరెవ్‌... ఒలింపిక్‌ స్వర్ణం నెగ్గాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జ్వెరెవ్‌ పసిడి పతకం సాధించి... పురుషుల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి జర్మనీ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో సెమీఫైనల్లో అతడు... సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌ను ఓడించి ముందంజ వేశాడు. డయాబెటీస్‌తో పోరాడుతూనాలుగేళ్ల వయసు నుంచే టైప్‌–1 డయాబెటీస్‌తో ఇబ్బందిపడుతున్న జ్వెరెవ్‌... ఆ విషయాన్ని 2022లో బహిరంగంగా వెల్లడించాడు. కెరీర్‌లో చాలా వరకు మ్యాచ్‌ల విరామంలో వైద్యుల సూచన మేరకు ఇన్సులిన్‌ తీసుకున్నట్లు తెలిపాడు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పిల్ల్లలకు ఇన్సులిన్‌తో పాటు మరికొన్ని అత్యవసర మందులు అందించాలనే లక్ష్యంతో అతడు ‘అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌’ ఫౌండేషన్‌ను స్థాపించాడు.

Alexander Zverev wins French Open5
జయహో జ్వెరెవ్‌

పారిస్‌: నిరీక్షణ ముగిసింది.... జర్మనీ టెన్నిస్‌ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెల్చుకున్నాడు. టెన్నిస్‌ సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రెండో సీడ్‌ జ్వెరెవ్‌ విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ జ్వెరెవ్‌ 6–1, 4–6, 6–4, 6–7 (5/7), 6–1తో ప్రపంచ 14వ ర్యాంకర్, పదో సీడ్‌ ఫ్లావియో కొబోలి (ఇటలీ)పై గెలిచాడు. 4 గంటల 16 నిమిషాలపాటు జరిగిన తుది సమరంలో జ్వెరెవ్‌ నిర్ణాయక ఐదో సెట్‌లో తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడిన కొబోలి చివరి సెట్‌లో తడబడ్డాడు. ఈ సెట్‌లో జ్వెరెవ్‌ మూడుసార్లు కొబోలి సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ అల్‌కరాజ్‌ గాయంతో వైదొలగడం... ప్రపంచ నంబర్‌వన్‌ సినెర్‌ రెండో రౌండ్‌లోనే వెనుదిరగడం... సెర్బియా దిగ్గజం జొకోవిచ్‌ మూడో రౌండ్‌లోనే ఓడిపోవడం .... వెరసి జ్వెరెవ్‌కు తన ‘గ్రాండ్‌’ కలను నిజం చేసుకునేందుకు సువర్ణావకాశం లభించింది. నాలుగో ప్రయత్నంలో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌నుకైవసం చేసుకున్నాడు. 2020 యూఎస్‌ ఓపెన్, 2024 ఫ్రెంచ్‌ ఓపెన్, 2025 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లో ఓడిపోయిన జ్వెరెవ్‌ ఈసారి మాత్రం వదల్లేదు. కాస్త ఒత్తిడికి లోనైనా... కీలకదశలో తన అనుభవంతో గట్టెక్కి ‘గ్రాండ్‌’ స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన జ్వెరెవ్‌కు 28 లక్షల యూరోలు (రూ. 30 కోట్ల 62 లక్షలు), రన్నరప్‌ కొబోలికి 14 లక్షల యూరోలు (రూ. 15 కోట్ల 31 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. బోరిస్‌ బెకర్‌ (1996లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) తర్వాత గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన జర్మనీ ప్లేయర్‌గా జ్వెరెవ్‌ గుర్తింపు పొందాడు.

Updated WTC Table After ENG vs NZ 1st Test 20266
WTC పాయింట్ల పట్టికలో మార్పులు

ఇవాళ ముగిసిన లార్డ్స్‌ టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్‌ 115 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత WTC 2025-27 పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఓటమితో న్యూజిలాండ్‌ రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. మరోవైపు న్యూజిలాండ్‌పై గెలిచినా ఇంగ్లండ్‌ స్థానంలో ఎలాంటి మార్పు జరగలేదు. వారి PCT (పాయింట్ల శాతం) 31.67 నుంచి 37.88కి పెరిగినప్పటికీ ఏడో స్థానంలోనే కొనసాగుతోంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్‌ నాలుగో స్థానానికి పడిపోవడంతో సౌతాఫ్రికా, శ్రీలంక రెండు, మూడు స్థానాలకు ఎగబాకాయి.భారత్‌ ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఇటీవల పాక్‌ను రెండు మ్యాచ్‌ సిరీస్‌లో క్లీన్‌ స్వీప్‌ చేసిన బంగ్లాదేశ్‌ ఐదో స్థానంలో ఉంది. వెస్టిండీస్‌ (9), పాకిస్తాన్‌ (8) జట్లు పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.లార్డ్స్‌ టెస్ట్‌ విషయానికొస్తే.. పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ నిర్దేశించిన 254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ పూర్తిగా చేతులెత్తేసింది. 138 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకపడిపోయింది.ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇరు జట్లు స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యాయి. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ఇంగ్లండ్‌ను 140 పరుగులకే ఆలౌట్‌ చేసింది. జేమీసన్‌ 5, నాథన్‌ స్మిత్‌ 3, విలియమ్‌ ఓరూర్కీ 2 వికెట్లతో సత్తా చాటారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్‌ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం న్యూజిలాండ్‌ మరింత చెత్తగా ఆడి 113 పరుగులకే కుప్పకూలింది. రాబిన్సన్‌ 5, టంగ్‌ 3, అట్కిన్సన్‌ 2 వికెట్లతో చెలరేగారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన జేమీసన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.27 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ అరంగేట్రం బ్యాటర్‌ ఎమిలియో గే (57), డకెట్‌ (33), జేమీ స్మిత్‌ (39) రాణించడంతో 226 పరుగులు చేయగలిగింది. నాథన్‌ స్మిత్‌ 6 వికెట్లతో విజృంభించగా.. విలియమ్‌ ఓరూర్కీ 2, మ్యాట్‌ హెన్రీ, జేమీసన్‌ తలో వికెట్‌ తీశారు.254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ మరోసారి బొక్కబోర్లా పడింది. అట్కిన్సన్‌ 5, రాబిన్సన్‌, టంగ్‌ తలో 2, స్టోక్స్‌ ఓ వికెట్‌ పడగొట్టడంతో 138 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో కాన్వే (41), గ్లెన్‌ ఫిలిప్స్‌ (44 నాటౌట్‌), కేన్‌ విలియమ్సన్‌ (18) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్‌ కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా జూన్‌ 17న మొదలవుతోంది.

Pakistan star serves fresh conspiracy against India with shocking claim, Umpiring calls go in their favour7
టీమిండియాపై పాక్‌ క్రికెటర్‌ సంచలన ఆరోపణలు

పాకిస్తాన్ ఆల్‌రౌండర్ ఖుష్దిల్‌ షా టీమిండియాను ఉద్దేశిస్తూ సంచలన ఆరోపణలు చేశాడు. తమ మధ్య జరిగే మ్యాచ్‌ల్లో అంపైరింగ్ నిర్ణయాలు, షెడ్యూలింగ్ సహా అనేక అంశాలు భారత్‌కు అనుకూలంగా ఉంటాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. భారత్‌తో మ్యాచ్‌ల్లో చాలా విషయాలు వాళ్లకు అనుకూలంగా ఉంటాయి. అంపైరింగ్ నిర్ణయాలు, కొన్ని డ్రెస్సింగ్‌రూమ్ నిర్ణయాలు, మ్యాచ్‌ల నిర్వహణ కూడా వారి కోరికల మేరకే జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ గెలిస్తే ఆ ఆనందం మరింత ఎక్కువగా ఉంటుందని అన్నాడు.భారత్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో..ఇటీవలికాలంలో భారత్‌పై పాకిస్తాన్ రికార్డు నిరాశాజనకంగా ఉంది. టీమిండియాపై పాక్‌ చివరిసారి 2022 ఆసియా కప్ సూపర్-4 దశలో విజయం సాధించింది. అప్పటి నుంచి జరిగిన ఆరు వరుస మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది.వన్డేల్లో అయితే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత పాకిస్తాన్ భారత్‌ను ఓడించలేదు. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ఆరు వన్డేల్లోనూ భారత్‌దే పైచేయిగా నిలిచింది.గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలుభారత్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోందని కొందరు పాక్‌ మాజీలు గతంలోనూ ఆరోపించారు. అయితే ప్రస్తుత క్రికెటర్‌ ఖుష్దిల్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.ఖుష్దిల్‌ షా భారత్‌పై ఒక వన్డే, రెండు టీ20లు ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన వన్డేలో 39 బంతుల్లో 38 పరుగులు చేసి, వికెట్ తీసుకున్నప్పటికీ, ఆ మ్యాచ్‌లో పాక్‌ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. మొత్తంగా షా పాక్‌ తరఫున 15 వన్డేలు, 38 టీ20లు ఆడి 762 పరుగులు చేసి, 10 వికెట్లు తీశాడు.

Shreyas Iyer Sends Warning To Gautam Gambhir After Becoming India T20I Captain8
కెప్టెన్‌ అయ్యాక శ్రేయస్‌ అయ్యర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత టీ20 కెప్టెన్‌గా నియమితుడయ్యాక శ్రేయస్‌ అయ్యర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు ప్రధాన కోచ్ గౌతమ్‌ గంభీర్‌తో కలిసి పనిచేయబోతున్న నేపథ్యంలో, తన నాయకత్వ శైలిని మార్చుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు.ప్రస్తుతం ముంబై టీ20 లీగ్ ఆడుతున్న అయ్యర్‌ ఓ సందర్భంగా మాట్లాడుతూ.. భారత జట్టు కెప్టెన్సీ పెద్ద సవాలే కానీ, దాని కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఇంతకుముందు ఎలా ఉన్నానో, ఇకపై కూడా అలాగే ఉంటానని అన్నాడు. ఈ వ్యాఖ్యలను కొందరు గంభీర్‌కు పరోక్ష సందేశంగా అభివర్ణిస్తున్నారు.గంభీర్‌-అయ్యర్‌ గతంలో ఐపీఎల్‌లో కలిసి పని చేశారు. 2024లో వీరిద్దరి కాంబినేషన్‌లో (మెంటార్‌-కెప్టెన్‌) కేకేఆర్‌ టైటిల్‌ గెలిచింది. అంతకుముందు ఇద్దరూ ఆటగాళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడారు.అయ్యర్ శైలి ప్రత్యేకంఅయ్యర్‌ నాయకత్వంలో ప్రధానంగా కనిపించే అంశం ఆటగాళ్లపై నమ్మకం. ఒకసారి ఆటగాడికి అవకాశం ఇస్తే అతడికి పూర్తి మద్దతు ఇవ్వడం అయ్యర్ శైలిగా గుర్తింపు పొందింది.ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడిన ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ అభివృద్ధిలో అయ్యర్ పాత్ర కీలకమని పలుమార్లు ప్రశంసలు వచ్చాయి. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవడం, ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం అయ్యర్ బలంగా భావిస్తారు.

Young cricketers protest at Indira Park9
ఇందిరా పార్క్‌ వద్ద యువ క్రికెటర్ల ధర్నా

హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద "తెలంగాణ క్రికెట్ కోసం ప్రజా ఉద్యమం" పేరుతో నిర్వహించిన ధర్నాలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) నేతలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)పై పలు ఆరోపణలు చేశారు.టీసీఏ కార్యదర్శి గురువా రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ జిల్లాల క్రికెటర్లకు హెచ్‌సీఏలో సరైన అవకాశాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతిభావంతులైన ఆటగాళ్లు హెచ్‌సీఏ వ్యవస్థ కారణంగా నష్టపోతున్నారని ఆరోపించారు.ప్రత్యేక తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలు, మండలాల స్థాయిలో ఇతర క్రీడలకు ఉన్నట్లుగా క్రికెట్‌కు కూడా ప్రత్యేక వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. బీసీసీఐ టోర్నమెంట్లలో ఆడాలంటే హెచ్‌సీఏ పరిధిలోనే ఉండాల్సిన పరిస్థితి జిల్లాల ఆటగాళ్లకు ఇబ్బందిగా మారిందన్నారు.హెచ్‌సీఏలో అవినీతి, అక్రమాలు జరిగాయని, ఎంపికల ప్రక్రియలో పారదర్శకత లేదని టీసీఏ నేతలు ఆరోపించారు. క్లబ్‌ల నమోదు, ఎన్నికలు, ఆర్థిక వ్యవహారాలు, క్రీడాకారుల ఎంపికలో పలు అక్రమాలు జరిగాయని వారు పేర్కొన్నారు. హెచ్‌సీఏలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.అలాగే హెచ్‌సీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లీగ్‌లకు సంబంధించిన అనుమతులు, క్లబ్‌ల చట్టబద్ధత, పాలకవర్గ నియామకాలపై కూడా టీసీఏ నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో సమర్పించిన ఫిర్యాదులపై ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరారు.గ్రామీణ, జిల్లా స్థాయి ఆటగాళ్ల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం జోక్యం చేసుకుని పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

England beat new zealand in lords test10
చరిత్రాత్మక లార్డ్స్‌ టెస్ట్‌లో ఇంగ్లండ్‌దే గెలుపు

లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన చారిత్రక టెస్ట్‌ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో లార్డ్స్‌లో జరిగిన 150వ మ్యాచ్‌ కావడంతో చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలో 150 టెస్ట్‌లకు ఆతిథ్యమిచ్చిన తొలి స్టేడియం లార్డ్స్‌ క్రికెట్‌ మైదానం​.పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యాయి. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ఇంగ్లండ్‌ను 140 పరుగులకే ఆలౌట్‌ చేసింది. జేమీసన్‌ 5, నాథన్‌ స్మిత్‌ 3, విలియమ్‌ ఓరూర్కీ 2 వికెట్లతో సత్తా చాటారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్‌ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం న్యూజిలాండ్‌ మరింత చెత్తగా ఆడి 113 పరుగులకే కుప్పకూలింది. రాబిన్సన్‌ 5, టంగ్‌ 3, అట్కిన్సన్‌ 2 వికెట్లతో చెలరేగారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన జేమీసన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.27 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ అరంగేట్రం బ్యాటర్‌ ఎమిలియో గే (57), డకెట్‌ (33), జేమీ స్మిత్‌ (39) రాణించడంతో 226 పరుగులు చేయగలిగింది. నాథన్‌ స్మిత్‌ 6 వికెట్లతో విజృంభించగా.. విలియమ్‌ ఓరూర్కీ 2, మ్యాట్‌ హెన్రీ, జేమీసన్‌ తలో వికెట్‌ తీశారు.254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ మరోసారి బొక్కబోర్లా పడింది. అట్కిన్సన్‌ 5, రాబిన్సన్‌, టంగ్‌ తలో 2, స్టోక్స్‌ ఓ వికెట్‌ పడగొట్టడంతో 138 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో కాన్వే (41), గ్లెన్‌ ఫిలిప్స్‌ (44 నాటౌట్‌), కేన్‌ విలియమ్సన్‌ (18) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్‌ కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా జూన్‌ 17న మొదలవుతోంది.

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement