Female athlete
-
స్త్రీ శక్తి: బ్యాక్ ఆన్ ది బైక్ పడి లేచిన కెరటం
ఫిమేల్ మోటర్ స్పోర్ట్స్ అథ్లెట్‌గా ప్రయాణం సులువేమీ కాదు. మద్దతు ఇచ్చే వాళ్ల కంటే వద్దనే వాళ్లే ఎక్కువ... దీనికి ఐశ్వర్య మినహాయింపు కాదు. మొన్న...‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’ అని ఆశ్చర్యంగా అడిగారు. నిన్న... ‘స్లోయెస్ట్ బైకర్’ అని ముఖం మీదే అన్నారు. ఇప్పుడు మాత్రం... ఐశ్వర్య గురించి ‘ఆశాకిరణం లాంటి ప్రొఫెషనల్ బైకర్’ అంటున్నారు... బెంగళూరుకు చెందిన ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచి బైక్‌లు అంటే చాలా ఇష్టం. ఇంట్లో నాన్న బైక్ ఉండేది. ప్రతి ఆదివారం ఆ బైక్‌పై తనను ఏదో ఒక కొత్త ప్రదేశానికి తీసుకెళుతుండేవాడు. ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన తరువాత ఐశ్వర్యకు బైకే లోకం అయింది. ఫ్రెండ్స్‌ను తీసుకొని రోజూ బైక్‌పై చక్కర్లు కొట్టేది. ఇలా తిరుగుతున్న రోజుల్లో ఒకసారి టీవిలో మోటోజీపి రేస్ చూసి ‘వావ్’ అనుకుంది. అలాంటి రేస్‌లో ఒకరోజు తాను భాగం అవుతానని అనుకోలేదు ఐశ్వర్య. ఇక అది మొదలు... మోటర్‌స్పోర్ట్స్, మోటర్‌స్పోర్ట్స్ అథ్లెట్ల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. నిజంగా చెప్పాలంటే అదొక ప్రపంచం! నిన్నటివరకు బైకింగ్ అనేది తనకు సరదా మాత్రమే. క్రికెట్, ఫుట్‌బాల్‌లాగే అది కూడా ఒక ఆట అని, దానిలో నిరూపించుకుంటే అంతర్జాతీయస్థాయికి వెళ్లవచ్చు అని తెలిశాక ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ట్రైనింగ్, రేసింగ్తోనే రోజులు గడిచేవి. అయితే ఐశ్వర్య అమ్మానాన్నలకు, వారి అమ్మా, నాన్నలకు ఆమెను పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్‌గా చూడాలనేది కల. అయితే వారొకటి తలిస్తే ఐశ్వర్య కల ఒకటి తలిచింది. తండ్రి ససేమిరా అన్నాడు. తల్లి మాత్రం పట్టువిడుపు ధోరణి ప్రదర్శిస్తూ మద్దతు ఇచ్చేది. 2018లో కొద్దిమందితో కలిసి జోర్డీ అనే కోచ్ దగ్గర శిక్షణ తీసుకుంది. జోర్డీ సలహా మేరకు బజా అరగాన్, స్పెయిన్‌లో పాల్గొని ఫస్ట్ ఫిమేల్ ఇండియన్‌గా చరిత్ర సృష్టించింది ఐశ్వర్య. (స్పానిష్ బజా...స్పెయిన్‌లోని అరగన్ ప్రాంతంలో జరిగే ర్యాలీ రైడ్ లేదా క్రాస్–కంట్రీ ర్యాలీ. ఆఫ్రికన్ ఎడ్వెంచరస్ ర్యాలీలను స్ఫూర్తిగా తీసుకొని 1983లో దీనిని దేశంలో మొదలుపెట్టారు) ఆరుసార్లు నేషనల్ రోడ్రేసింగ్ ర్యాలీ ఛాంపియన్‌గా నిలిచింది. 2019లో మోటర్ స్పోర్ట్స్‌లో వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. తన సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. మోటర్‌స్పోర్ట్స్ లో మన దేశానికి సంబంధించి గట్టిగా వినిపిస్తున్న పేర్లలో ఐశ్వర్య పేరు ఒకటి. ‘నిజానికి మా కుటుంబంలో మోటర్‌స్పోర్ట్స్ గురించి తెలిసిన వారు లేరు. వరల్డ్ ఛాంపియన్షిప్ గురించి గైడ్ చేసేవారు కూడా లేరు. నాకు నేనే తెలుసుకుంటూ వెళ్లాను. రేస్‌లలో పాల్గొనడం ద్వారా ఎంతోమందితో మాట్లాడి, వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది’ అంటుంది ఐశ్వర్య. ‘ప్లాన్ బీ’ లేదా సెకండ్ కెరీర్ అనేవి ఉండాలి అంటారు. అయితే ఒక రంగంలోకి, ఒక లక్ష్యం కోసం దిగిన వారు ‘ప్లాన్ బీ’ గురించి ఆలోచించవద్దు అంటుంది ఐశ్వర్య. ‘ఈ రంగంలో రాణించకపోతే నెక్స్›్టఏమిటి? అని ఎప్పుడూ ఆనుకోలేదు. కచ్చితంగా సాధించాల్సిందే అనుకున్నాను’ అంటుంది ఐశ్వర్య. స్పెయిన్‌లో మహిళలు మోటర్‌స్పోర్ట్స్‌లో రాణించడానికి అనువైన వాతావరణం, మౌలిక వసతులు ఉన్నాయి. కుటుంబ మద్దతు కూడా బలంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి మన దేశంలో కూడా రావాలని కోరుకుంటుంది ఐశ్వర్య. మోటర్ స్పోర్ట్స్ అంటే పరాజయాలు, విజయాలు మాత్రమే కాదు... గట్టి గాయాలు కూడా. ఒక ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది ఐశ్వర్య. ఇక ఆమె నడవడం కూడా కష్టమే అనుకున్నారంతా. అయితే ‘బ్యాక్ ఆన్ ది బైక్’ అంటూ మళ్లీ విజయపథంలో దూసుకుపోవడానికి ఎంతోకాలం పట్టలేదు! -
World Athletics Championship: పసిడి... ప్రపంచ రికార్డు
యుజీన్ (అమెరికా): రేసు మొదలైన వెంటనే ట్రాక్‌పై వాయువేగంతో దూసుకెళ్తూ... ఒక్కో హర్డిల్‌ను అలవోకగా అధిగమిస్తూ... ఒక్కో ప్రత్యర్థిని వెనక్కి నెడుతూ... ఎవరూ ఊహించని సమయంలో లక్ష్యానికి చేరిన అమెరికా మహిళా అథ్లెట్ సిడ్నీ మెక్లాఫ్లిన్ తన పేరిట నాలుగోసారి ప్రపంచ రికార్డును లిఖించుకుంది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం జరిగిన మహిళల 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ ఈవెంట్లో 22 ఏళ్ల సిడ్నీ మెక్లాఫ్లిన్ 50.68 సెకన్లలో గమ్యానికి చేరి తొలిసారి స్వర్ణ పతకం సొంతం చేసుకోవడంతోపాటు ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రపంచ రికార్డు సాధించినందుకు సిడ్నీకి లక్ష డాలర్లు (రూ. 79 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఫెమ్కే బోల్ (నెదర్లాండ్స్; 52.27 సెకన్లు) రజతం, దాలియా మొహమ్మద్ (అమెరికా; 53.13 సెకన్లు) కాంస్యం సాధించారు. బంగారు పతకం గెలిచే క్రమంలో సిడ్నీ గత నెల 25న 51.41 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది. గత 13 నెలల కాలంలో సిడ్నీ ప్రపంచ రికార్డును తిరగరాయడం ఇది మూడోసారి కావడం విశేషం. మహిళల జావెలిన్ త్రో ఫైనల్లో భారత క్రీడాకారిణి అన్ను రాణి జావెలిన్‌ను 61.12 మీటర్ల దూరం విసిరి ఏడో స్థానంలో నిలువగా... డిఫెండింగ్ చాంపియన్ కెల్సీ బార్బర్ (ఆస్ట్రేలియా; 66.91 మీటర్లు) స్వర్ణం సాధించింది. -
Tokyo Paralympics : బుల్లెట్ దిగింది బల్లెం మెరిసింది
దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత క్రీడాకారులు తళుక్కుమన్నారు. ఊహించని విధంగా ఒకేరోజు ఐదు పతకాలతో అదరగొట్టారు. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉండటం విశేషం. 1984 న్యూయార్క్ పారాలింపిక్స్‌లో 4 పతకాలు... 2016 రియో పారాలింపిక్స్‌లో 4 పతకాలు నెగ్గడమే భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. అయితే సోమవారం టోక్యో వేదికగా భారత క్రీడాకారులు ఏకంగా ఐదు పతకాలు సాధించి ఓవరాల్‌గా ఏడు పతకాలతో ఈ క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. ఆరో రోజు పోటీలు ముగిశాక భారత్ 26వ స్థానంలో కొనసాగుతోంది. మరో వారంరోజులపాటు జరిగే ఈ క్రీడల్లో భారత్‌కు మరిన్ని పతకాలు వచ్చే అవకాశముంది. టోక్యో: ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడల చరిత్రలో ఏ భారతీయ మహిళా క్రీడాకారిణికి సాధ్యంకాని ఘనతను భారత టీనేజ్ షూటర్ అవనీ లేఖరా సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఎస్‌హెచ్–1 కేటగిరీలో అవనీ లేఖరా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా విశ్వ క్రీడల్లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవని చరిత్ర సృష్టించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు (బ్యాడ్మింటన్)... 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్).. 2016 రియో పారాలింపిక్స్‌లో దీపా మలిక్ (షాట్‌పుట్), 2020 టోక్యో పారాలింపిక్స్‌లో భవీనాబెన్ పటేల్ (టేబుల్ టెన్నిస్) రజత పతకాలు గెలిచారు. అయితే 19 ఏళ్ల అవని పారాలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే స్వర్ణ పతకం నెగ్గి చిరస్మరణీయ ప్రదర్శన నమోదు చేసింది. చెదరని గురి... ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అవని మొత్తం 249.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 2018లో 249.6 పాయింట్లతో ఇరీనా షెట్నిక్ (ఉక్రెయిన్) నెలకొల్పిన ప్రపంచ రికార్డును అవని సమం చేసింది. నిర్ణీత 10 షాట్ల తర్వాత అవని 103.3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండు షాట్లు ముగిశాక అవని 124.9 పాయింట్లతో అగ్రస్థానంలోకి వచ్చింది. అటునుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. తన టాప్ ర్యాంక్‌ను కాపాడుకుంటూ చివరకు స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. 248.9 పాయింట్లతో క్యూపింగ్ జాంగ్ (చైనా) రజతం... 227.5 పాయింట్లతో ఇరీనా షెట్నిక్ (ఉక్రెయిన్) కాంస్యం గెలిచారు. అవని గురి పెట్టిన మొత్తం 24 షాట్లలో 20 షాట్లు 10 కంటే ఎక్కువ పాయింట్లవి ఉండటం విశేషం. అంతకుముందు 21 మంది షూటర్ల మధ్య జరిగిన క్వాలిఫయింగ్‌లో అవని 621.7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. టాప్–8లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్లో పోటీపడతారు. సూపర్ సుమిత్... బరిలోకి దిగిన తొలి పారాలింపిక్స్‌లోనే జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ స్వర్ణ కాంతులను విరజిమ్మాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్–64 కేటగిరిలో పాల్గొన్న 23 ఏళ్ల సుమిత్ బల్లెంను 68.55 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ క్రమంలో అతను మూడు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టడం విశేషం. హరియాణాకు చెందిన సుమిత్ బల్లెంను తొలి ప్రయత్నంలో 66.95 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో 2019లో దుబాయ్‌లో 62.88 మీటర్లతో తానే సాధించిన ప్రపంచ రికార్డును సుమిత్ సవరించాడు. అనంతరం రెండో ప్రయత్నంలో సుమిత్ జావెలిన్‌ను 68.08 మీటర్ల దూరం పంపించాడు. ఈసారి ప్రపంచ రికార్డును సృష్టించాడు. మూడో ప్రయత్నంలో 65.27 మీటర్ల దూరం... నాలుగో ప్రయత్నంలో 66.71 మీటర్ల దూరం విసిరిన సుమిత్ ఐదో ప్రయత్నంలో జావెలిన్‌ను 68.55 మీటర్ల దూరం విసిరి మూడోసారి ప్రపంచ రికార్డు సవరించడంతోపాటు పసిడి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మైకేల్ బురియన్ (ఆస్ట్రేలియా–66.29 మీటర్లు) రజతం... దులాన్ కొడితువాకు (శ్రీలంక–65.61 మీటర్లు) కాంస్యం సాధించారు. భారత్‌కే చెందిన సందీప్ చౌదరీ 62.20 మీటర్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నాలుగో భారత క్రీడాకారుడు సుమిత్. గతంలో మురళీకాంత్ పేట్కర్ (స్విమ్మింగ్; 1972 హెడెల్‌బర్గ్–జర్మనీ), దేవేంద్ర ఝఝారియా (అథ్లెటిక్స్; 2004 ఏథెన్స్, 2016 రియో), మరియప్పన్ తంగవేలు (అథ్లెటిక్స్; 2016 రియో) పసిడి పతకాలు నెగ్గారు. సుమిత్‌కు రూ. 6 కోట్లు నజరానా పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన తమ రాష్ట్ర జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్‌కు రూ. 6 కోట్లు... రజత పతకం గెలిచిన డిస్కస్ త్రోయర్ యోగేశ్‌కు రూ. 4 కోట్లు నగదు పురస్కారం అందిస్తామని హరియాణా ప్రభుత్వం తెలిపింది. అలాగే స్వర్ణం గెలిచిన తమ రాష్ట్రానికి చెందిన షూటర్ అవనికి రూ. 3 కోట్లు... జావెలిన్ త్రోలో రజతం నెగ్గిన దేవేంద్ర ఝఝారియాకు రూ. 2 కోట్లు... కాంస్య పతకం సాధించిన సుందర్ సింగ్ గుర్జర్‌కు రూ. ఒక కోటి అందజేస్తామని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోట్ ప్రకటించారు. -
సింధు సంపాదన రూ.39 కోట్లు
న్యూయార్క్: తెలుగుతేజం, బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ప్రపంచ సంపన్న మహిళా క్రీడాకారిణుల జాబితాలో 13వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో భారత్ నుంచి ఆమె ఒక్కరికే చోటు దక్కడం విశేషం. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ఆమె గతేడాది సంపాదన రూ. 39 కోట్లు (5.5 మిలియన్ డాలర్లు)గా తేల్చింది. ‘సింధు విలువైన మార్కెట్ కలిగిన భారత మహిళా అథ్లెట్‌గా కొనసాగుతోంది. ఆమె గతేడాది సీజన్ ముగింపు టోర్నీ అయిన ‘బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్’లో విజేతగా నిలువడంతో ఆమె బ్రాండింగ్‌కు ఢోకా లేకపోయింది’ అని ఫోర్బ్స్ తెలిపింది. ఈ ఆదాయంలో ప్రైజ్‌మనీ, కాంట్రాక్టు ఫీజులు, బోనస్, ఎండార్స్మెంట్లు, అప్పియరెన్స్ ఫీజులు అన్ని కలిసి ఉన్నాయని ఆ సంస్థ వెల్లడించింది. అత్యధికంగా ఆర్జించే మహిళా అథ్లెట్ల టాప్–15 జాబితాలో భారత్ నుంచి మరే క్రీడాకారిణి కూడా ఆమె సమీప దూరంలో లేదు. ఈ లిస్ట్‌లో అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ 29.2 మిలియన్ డాలర్ల (రూ. 207 కోట్లు)తో అగ్రస్థానంలో ఉంది. -
టోక్యో ఎంత దూరం?
పంతొమ్మిదేళ్ల యువ తరంగం... భారత మహిళా అథ్లెట్ హిమ దాస్ వరుసగా ట్రాక్‌పై అద్భుతాలు సాధిస్తోంది. 18 రోజుల వ్యవధిలో ఐదు స్వర్ణాలు గెలుచుకొని... అంతంతమాత్రంగా ఉన్న అథ్లెటిక్స్‌లో దేశం మొత్తం గర్వపడేలా చేసింది. ఫలితంగా క్రీడాభిమానులతో పాటు రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు హిమ ఘనతను కీర్తిస్తున్నారు. సామాజికంగా, ఆర్థికపరంగా వెనుకబడిన వర్గానికి చెందిన నేపథ్యంతో పాటు ఇటీవల అసోం వరద బాధితుల కోసం పెద్ద మనసుతో ఆమె చేసిన సాయం కూడా ఆ అమ్మాయి స్థాయిని పెంచింది. దీంతో 2020 టోక్యో ఒలింపిక్స్ క్రీడలకు సంబంధించి హిమ దాస్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మన దేశానికి తొలి పతకం అందించగలదని, ఇటీవలి పంచ స్వర్ణాలు ఆమె సత్తా చాటాయని అంతా భావిస్తున్నారు. కాకపోతే ఇటీవలి ప్రదర్శన ఆమె కెరీర్లో అత్యుత్తమమేమీ కాదు. టోక్యోకు అర్హత సాధించటానికి సరిపోదు కూడా..!! ఒకవేళ ఆమె తన మునుపటి అత్యుత్తమ ప్రదర్శనను చేరుకుంటే, లేక అధిగమిస్తే మాత్రం... పతకాన్ని ఆశించవచ్చు. ఆ విశ్లేషణ ఇదిగో...! ఇటీవల గెలిచిన స్వర్ణాలు... 200 మీటర్లు ► పోజ్నాన్ గ్రాండ్‌ప్రి (పోలండ్) : 23.65 సెకన్లు ► కుట్నో మీట్ (పోలండ్) : 23.97 సెకన్లు ► క్లాడ్నో మీట్ (చెక్ రిపబ్లిక్) : 23.43 సెకన్లు ► తాబోర్ మీట్ (చెక్ రిపబ్లిక్) : 23.25 సెకన్లు 400 మీటర్లు ► నోవ్ మెస్టో (చెక్ రిపబ్లిక్) : 52.09 సెకన్లు ఏ స్థాయి ఈవెంట్లంటే... అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) గుర్తింపు పొందిన ఈవెంట్లలో ‘ఎ’ నుంచి ‘ఎఫ్’ వరకు ఆరు రకాలు స్థాయిలున్నాయి. వీటిలో హిమ పతకాలు గెలిచిన ఐదులో రెండు ‘ఎఫ్’ కేటగిరీవి కాగా... మరో మూడు ‘ఇ’ కేటగిరీవి. ఎవరెవరు పాల్గొన్నారు... భారత అథ్లెట్ల బృందానికి పోలండ్‌లోని స్పాలాలో రెండు నెలల ప్రత్యేక శిక్షణ శిబిరం జరుగుతోంది. ప్రాక్టీస్‌తో పాటు రేస్‌లో అనుభవం కోసం స్పాలాకు చుట్టుపక్కల జరిగే ఈవెంట్లలో మనవాళ్లు పాల్గొంటున్నారు. హిమ గెలిచిన 400 మీటర్ల పరుగులో టాప్–5 అందరూ భారత అథ్లెట్లే ఉన్నారు. మిగతా దేశాలవారు కొందరు పాల్గొన్నా వారెవరికీ హిమకంటే మెరుగైన ర్యాంక్ లేదు. హిమ ప్రదర్శన ఎలా ఉంది? అథ్లెటిక్స్‌లో పతకాల్ని పక్కనబెడితే... టైమింగే ముఖ్యం. దీని ప్రకారం చూస్తే హిమ ప్రదర్శన ఇంకా మెరుగుపడాల్సి ఉందనే చెప్పాలి. ఎందుకంటే 200 మీటర్ల పరుగులో నమోదు చేసిన నాలుగు టైమింగ్‌లు కూడా ఆమె కెరీర్ అత్యుత్తమ టైమింగ్‌తో (23.10 సెకన్లు) పోలిస్తే చాలా వెనకబడినట్లే. 400 మీటర్ల పరుగులోనైతే కెరీర్ బెస్ట్ 50.79 సెకన్లతో పోలిస్తే 1.30 సెకన్ల తేడా అంటే చాలా చాలా ఎక్కువ! తాజా ప్రదర్శన ఉపయోగపడదా... అథ్లెటిక్స్‌కు సంబంధించి ఒలింపిక్స్ లేదా ప్రపంచ చాంపియన్‌షిప్! ఈ రెండే అత్యుత్తమ ఈవెంట్లు. ఇక్కడ చూపిన ప్రతిభనే క్రీడా ప్రపంచం గుర్తిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28 నుంచి దోహాలో ప్రపంచ చాంపియన్‌షిప్ జరగనుంది. దీనికి ఐఏఏఎఫ్ నిర్దేశించిన అర్హత ప్రమాణాలు 23.02 సెకన్లు (200 మీటర్లు), 51.80 సెకన్లుగా (400 మీటర్లు) ఉన్నాయి. క్వాలిఫికేషన్‌కు సెప్టెంబర్ 6 చివరి తేదీ. 200 మీటర్ల పరుగులో వచ్చే నెలలో మరో రెండు మీట్లు ఉండటంతో హిమకు ఇంకా అవకాశం ఉంది. 400 మీటర్ల పరుగులో మాత్రం ఆమెకు మరో ఈవెంట్ లేదు. దాంతో ఆమె క్వాలిఫై కానట్లే! తాజాగా పతకాలు గెలిచిన మీట్లలోనే ప్రత్యర్థులతో సంబంధం లేకుండా హిమ తన అత్యుత్తమ ఆటతీరు కనబరిచి ఉంటే క్వాలిఫై అయ్యేదేమో!!. కాకపోతే అది సాధ్యం కాలేదు. ఒలింపిక్స్‌పై ఆశలు... టోక్యో ఒలింపిక్స్‌కు చాలా సమయం ఉంది. ట్రాక్‌పై టైమింగ్ ప్రకారమే కాకుండా మెరుగైన ర్యాంకింగ్ ఆధారంగా కూడా ఒలింపిక్స్‌కు అర్హత సాధించవచ్చు. అయితే ర్యాంకింగ్‌కు సంబంధించి ఉండే గణాంకాలు, లెక్కల కారణంగా చివరి వరకు చాలా గందరగోళం ఉంటుంది. కాబట్టి అథ్లెట్లు ఎక్కువగా టైమింగ్‌పైనే దృష్టి పెడతారు. 22.80 సెకన్లు (200 మీటర్లు), 51.35 సెకన్లు (400 మీటర్లు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హతగా నిర్ణయించారు. ఇందులో 200 మీటర్లలో హిమ చాలా మెరుగవ్వాలి. 400 మీ. విషయంలో మాత్రం గతంలో ఇంతకంటే బెస్ట్ టైమింగ్ నమోదు చేసింది కాబట్టి అది స్ఫూర్తినివ్వవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వెన్ను నొప్పితో ఆసియా చాంపియన్‌షిప్ నుంచి మధ్యలోనే తప్పుకున్న హిమ దాస్ ఇటీవలే కోలుకుంది. అదే క్రమంలో తాజా యూరోప్ ఈవెంట్లలో పాల్గొన్నది. మెరుగైన టైమింగ్ కోసం తన పని తాను చేసుకుపోతోంది. ఇదే దారిలో వెళితే మున్ముందు తన టైమింగ్‌ను మెరుగుపర్చుకుని, మరిన్ని పతకాలు సాధించగల సత్తా ఆమెలో ఉంది. సహజ ప్రతిభ కలిగిన హిమ అద్భుత ఆటతో క్వాలిఫై కావటం, పతకాల ఆశల్ని సజీవంగా ఉంచగలగటం... అసాధ్యమైతే కాదు. -
దుతీచంద్‌కు ఊరట
అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనుమతి లాసానే: భారత మహిళా అథ్లెట్ దుతీచంద్‌కు ఊరట లభించింది. ఇకపై ఆమె అన్ని స్థాయిల్లోని మహిళల ఈవెంట్లలో పాల్గొనవచ్చని ఇక్కడి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (సీఏఎస్) తీర్పు ఇచ్చింది. ‘హైపరాండ్రోజెనిజమ్’ కారణంగా ఆమెలో పురుష లక్షణాలు ఉన్నాయని, ఆమె మహిళల విభాగంలో పోటీకి అనర్హురాలని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ), అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ఆమెపై నిషేధం విధించింది. దీనిపై దుతీ సీఏఎస్‌ను ఆశ్రయించింది. ఆమె శరీరంలో టెస్టోస్టిరాన్ మోతాదుకు మించి ఉండటం వల్ల పోటీల్లో ఆమె అదనపు ప్రయోజనం పొందిందనడానికి ఎలాంటి రుజువు లేదని సీఏఎస్ అభిప్రాయపడింది. ఐఏఏఎఫ్లోని హైపరాండ్రోజెనిజమ్ నిబంధనలనే మొత్తంగా రద్దు చేస్తూ దుతీకి అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్లోనే దేశవాళీ పోటీల్లో పాల్గొనవచ్చని సీఏఎస్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో ఆమె కేరళ జాతీయ క్రీడల్లో పాల్గొని స్వర్ణం గెలుచుకుంది. స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం లాస్ ఏంజిలిస్: స్పెషల్ ఒలింపిక్స్ ప్రపంచ క్రీడల్లో భారత్‌కు తొలి పతకం లభించింది. 13 ఏళ్ల ఢిల్లీ టీనేజర్ యాష్ సింగ్ అక్వాటిక్స్లో కాంస్యం సాధిం చాడు. ఇది తనకు తొలి అంతర్జాతీయ ఈవెంట్ కావడం విశేషం. 25మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో తను 19.23 సెకన్ల టైమింగ్‌తో గమ్యం చేరాడు. పాక్షిక వైకల్యం కలిగిన ఆటగాళ్లు ఇందులో పాల్గొంటారు. యాష్‌కు పుట్టుకతోనే బధిర సమస్యలున్నాయి. ఈ తీర్పు పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. 19 ఏళ్ల యువ అథ్లెట్ కెరీర్ నిలబడింది. భవిష్యత్తులో ఆమె మరింత బాగా ఆడి దేశం తరఫున పతకాలు సాధిస్తుంది. అదే లక్ష్యంతో ప్రస్తుతం ఆమెకు ఇక్కడే హైదరాబాద్‌లోనే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాను. -ఎన్. రమేశ్, దుతీచంద్ వ్యక్తిగత కోచ్