
'ఎల్ 2: ఎంపురాన్' (L2 Empuraan) వివాదంపై మరోసారి పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తల్లి మల్లిక స్పందించారు. లూసిఫర్ సినిమా విషయంలో కేవలం తన కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కొందరు దూషిస్తున్నారని ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ గొడవలో కేవలం పృథ్వీరాజ్ సుకుమారన్‌ను మాత్రమే బలిపశువును చేస్తున్నారని ఆమె కామెంట్ చేశారు. తన కుమారుడికి చిత్ర పరిశ్రమలో చాలా మంది శత్రువులు ఉన్నారని మల్లిక తెలిపారు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా రాణిస్తుండటంతో అతని ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు ఎల్2: ఎంపురాన్ సినిమాను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని మల్లికా ఆరోపించింది.
ఇలాంటి సమయంలో తమకు అండగా నిలిచిన ఏకైక స్టార్ హీరో మమ్ముట్టి మాత్రమే అని పృథ్వీరాజ్ తల్లి మల్లిక తాజాగా కామెంట్స్ చేశారు. ఆయన పంపిన సందేశం చూసి చాలా భావోద్వేగానికి గురయ్యానని ఆమె ఇలా చెప్పారు. "రంజాన్ పండుగ ఉన్నప్పటికీ, మమ్ముట్టి నాకు మెసేజ్ చేశారు. పృథ్వీరాజ్ గురించి ఫేస్‌బుక్‌లో నేను చేసిన పోస్ట్ చూసి చింతించవద్దని మమ్ముట్టి చెప్పారు. మాకు అండగా నిలబడుతానని మాట ఇచ్చారు. నా కుమారుడికి జరుగుతున్న అన్యాయం వల్ల నేను చాలా బాధలో ఉన్నానని ఆయనకు తెలుసు. మమ్ముట్టి ఒక మనస్సాక్షి ఉన్న కళాకారుడు.
నా పిల్లల గురించి ఎక్కడైనా ప్రతికూలంగా ఏదైనా కనిపిస్తే.., అది నన్ను బాధపెడుతుందని అతను అర్థం చేసుకుంటారు. నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోను. నా పిల్లలకు కూడా మమ్ముట్టి చేసిన సాయాన్ని మర్చిపోవద్దని చెప్పాను. ఇంత జరుగుతున్నా చిత్ర పరిశ్రమ నుంచి మా కుటుంబం కోసం ఎవరూ మాట్లాడలేదు. కానీ, పరిశ్రమ నుండి సందేశం పంపిన ఏకైక వ్యక్తి మమ్ముట్టి మాత్రమే.. ఆయన పంపిన మెసేజ్ చూసినప్పుడు నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి.'అని మనోరమ న్యూస్‌తో మల్లిక అన్నారు.
'ఎల్ 2: ఎంపురాన్' చిత్రం ఇప్పటికే ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగానే వసూలు చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో సెట్ చేయబడిన సన్నివేశాల చిత్రీకరణపై వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదం వల్ల ఈ చిత్రం నుంచి సుమారు 3 నిమిషాల నిడివిని తొలగించారు.