Mallika
-
వివాహేతర సంబంధం.. ఢిల్లీ నుంచి గుంటూరుకు వశీకరణ మాంత్రికుడు
పెదకాకాని: వివాహేతర సంబంధం కారణంగానే నంబూరు గ్రామంలో మహిళ హత్యకు గురైనట్లు మంగళగిరి డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ తెలిపారు. పెదకాకాని పోలీసుస్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. నంబూరు గ్రామానికి చెందిన షేక్ మల్లికతో అదే గ్రామానికి చెందిన షేక్ అక్బర్‌కు ప్రేమ వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. అక్బర్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అతడి ఆటోలో రోజూ రాకపోకలు సాగించే బోర్లు తీసే వారిలో ఒకరైన కారుమూరి ప్రేమ్‌కుమార్‌తో మల్లికకు పరిచయం ఏర్పడింది. దీంతో గొడవలు జరిగి దంపతులు విడిపోయారు. అనంతరం ప్రేమ్‌కుమార్‌ను ఆమె రెండో వివాహం చేసుకుని గుంటూరుకు వచ్చింది. 2021లో గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన బంగారు వ్యాపారి అబ్దుల్ రెహమాన్‌తో పరిచయం ఏర్పడింది. తర్వాత వివాహేతర సంబంధంగా మారడంతో మల్లికకు అతడు బంగారం, నగదు రూపంలో రూ.15 లక్షల వరకు ఇచ్చాడు. 9 నెలల క్రితం మల్లిక దంపతులు కాపురం నంబూరుకు మార్చారు. రెహమాన్‌ను కొంతకాలంగా దూరంగా పెడుతోంది. గ్రామానికి చెందిన నాగబాబుతో పరిచయం ఏర్పడిందని, అతనితోనే ఉంటానని హెచ్చరించింది. వారిద్దరూ శారీరకంగా కలిసి ఉన్న వీడియోను రెహమాన్‌కు వాట్సాప్ పెట్టింది.వికటించిన వశీకరణ ప్రయత్నంకక్ష పెంచుకున్న రెహమాన్ ఆమెను వశీకరణతో సొంతం చేసుకోవాలని, లేకుంటే కాళ్లు, చేతులు పడిపోయి మంచానికే పరిమితం చేయాలని గుంటూరు ఇన్నర్ రింగ్‌రోడ్డులోని గాయత్రి అపార్ట్మెంట్లో ఉంటున్న షేక్ జనాబ్ అహ్మద్ మంత్రగాడిని ఆశ్రయించాడు. పదేళ్ల క్రితం ఢిల్లీ నుంచి గుంటూరుకు మంత్రగాడు వచ్చాడు. మల్లిక తల వెంట్రుకలు, దుస్తులను రెహమాన్ తెచ్చి షేక్ జనాబ్ అహ్మద్‌కు ఇచ్చాడు. పిండితో బొమ్మను చేసి వశీకరణ చేసినట్లు పేర్కొన్నాడు. అప్పటికీ ఆమె దక్కలేదు.చున్నీతో గొంతు బిగించి హత్యరూ.3 లక్షలు నగదు ఇచ్చి మల్లికను చంపేలా రెహమాన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. డిసెంబరు 28వ తేదీన షేక్ జనాబ్ అహ్మద్ తన అనుచరులైన ప్రకాశం జిల్లా పామూరు పడమట కట్టకింద పల్లి గ్రామానికి చెందిన ఎర్రబెల్లి కాజా రసూల్, గుంటూరుకు చెందిన మానిపాటి స్వప్నతో కలిసి నంబూరు చేరుకున్నాడు. స్వప్న స్కూటీ వద్ద నిలబడి ఉండగా అహ్మద్, కాజా రసూల్‌లు మల్లిక ఇంటిలోకి వెళ్లి ఒంటరిగా ఉన్న మల్లిక(29)ను నోరు మూసి చున్నీతో గొంతు బిగించి హతమార్చారు. నిందితులైన రెహమాన్, షేక్ జనాబ్ అహ్మద్, కాజా రసూల్, స్వప్నలను మంగళవారం ఆరెస్టు చేశారు. కోర్టుకు హాజరు పరచనున్నట్లు డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ తెలిపారు. మల్లిక దుస్తులు, రూ.40 వేల నగదు, స్కూటీ, సెల్ఫోన్లను నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ టి.పి. నారాయణస్వామి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
అవకాశాల్లేకపోవడంతో డిప్రెషన్.. రాత్రి పెగ్గేశాకే..: నటి
మల్లిక జాగుల.. సీరియల్ కిల్లర్ వంటి కొన్ని చిన్నాచితకా చిత్రాల్లో వ్యాంప్ క్యారెక్టర్లు పోషించింది. సినిమా కంటే కూడా సీరియల్స్ ద్వారానే పేరు, డబ్బులు సంపాదించింది. ఒకప్పుడు బుల్లితెరపై ఫుల్ బిజీగా ఉన్న ఈ నటి తర్వాత మాత్రం సడన్‌గా స్మాల్ స్క్రీన్కు దూరమైంది. ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాధలు చెప్పుకుని ఎమోషనలైంది. 'ఇండస్ట్రీలో తెలుగువారికి అవకాశాలు ఇవ్వరు. బెంగళూరు నుంచి తీసుకొస్తారు. మమ్మల్ని చిన్నచూపు చూస్తారు, ఛాన్సులు కూడా ఇవ్వకపోయేసరికి డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. సరిగా తిండి కూడా తినకపోయేసరికి నిల్చున్నచోటే పడిపోయేదాన్ని. ఆస్పత్రికి తీసుకెళ్తే బతకడం కష్టమన్నారు. ఆ స్టేజీ నుంచి మళ్లీ బతికొచ్చాను. చీరలమ్మాను.. 19 ఏళ్ల అనుభవం. కరోనా తర్వాత ఛాన్సులు నిల్.. ఎక్కడి నుంచి మొదలుపెట్టానో మళ్లీ అక్కడికే వచ్చానేంటి? అని ఆలోచించి పిచ్చిదాన్నైపోయాను. మొన్నటివరకు బతుకుదెరువు కోసం చీరలమ్మాను. పెట్రోల్ బంకులో పని చేయడానికి కూడా సిద్ధమయ్యాను. కానీ వాళ్లు చులకనగా మాట్లాడారు. పదేళ్ల క్రితం నా రెమ్యునరేషన్ రోజుకు రూ.1300. అందులో మళ్లీ కటింగ్స్ ఉంటాయి. నాలుగేళ్లు అదే పారితోషికానికి పని చేశాను. ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు డబ్బులు పోగేస్తారనుకుంటారు కానీ అందరి పరిస్థితి అలాగే ఉండదు. కమిట్మెంట్ అడిగారు సినిమా ఆఫర్లు వచ్చాయి. అలా ఓ ఆడిషన్‌కు వెళ్లినప్పుడు కమిట్మెంట్ అడిగారు. నేను నో చెప్పి వచ్చేశాను. నెలరోజులపాటు టార్చర్ పెట్టారు. అందుకే సీరియల్స్ ద్వారా నేనేంటో చూపించాను. ఇకపోతే డబ్బుల కోసం కొన్ని సినిమాల్లో వాంప్ క్యారెక్టర్లు చేయాల్సి వచ్చింది. అయితే నేను ఒళ్లు అమ్ముకోలేదు, ఒళ్లు చూపించుకున్నానంతే! గతంలో నేను ప్రేమించిన వ్యక్తి చనిపోవడంతో ఆయన్ను మర్చిపోయేందుకు మద్యం తాగేదాన్ని. అలా మద్యపానం అలవాటైంది. రాత్రి ఓ పెగ్గేసి పడుకుంటాను. ఇకపోతే నా జీవితంలో ఎవరికీ చోటు లేదు. నేను పెళ్లి చేసుకోను' అని చెప్పుకొచ్చింది. చదవండి: పెళ్లైన ఏడాదికే విడాకులు.. ఒకప్పుడు స్టార్ హీరోలతో జోడీ.. ఇప్పుడేమో! -
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. సింగర్ సూసైడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ సింగర్ విజయ్ లక్ష్మి అలియాస్ మల్లికా రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తన ఇంట్లోనే శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాకుండ్ ప్రాంతంలోని ఆమె ఇంటి గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని పోలీసులు వెల్లడించారు. అయితే రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు మల్లిక తల్లి సుమిత్రా సింగ్ తెలిపారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా భావిస్తున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆమె తల్లి సుమిత్రా మాట్లాడుతూ.. 'ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. నేను నా గదిలో పడుకున్నా. చాలాసేపు తన గదిలో లైట్ వెలుగుతుండడంతో అనుమానం వచ్చి తలుపు తీసేందుకు యత్నించాను. ఎంతకు డోర్ తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా.. నా కూతురు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే నా భర్త, స్థానికులు కలిసి మల్లికను ఆసుపత్రికి తరలించాం. అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు'అంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్యహత్య? లేదా ఎవరీ పాత్ర అయినా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన మల్లికా రాజ్‌పుత్.. నటిగా రాణిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ మల్లిక సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. 35 ఏళ్లకే మల్లికా చనిపోవడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
కానిస్టేబుల్ కుమార్తెకు కాన్పూర్ ఐఐటీ సీటు
గుంటూరు: మార్టూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పూర్ణాంజనేయరాజు చిన్న కుమార్తె అనుపమ ప్రతిష్టాత్మక కాన్పూర్ ఐఐటీలో ఇంజినీరింగ్ సీటు సాధించింది. ఈ సందర్భంగా కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ గురువారం తమ కార్యాలయానికి పిలిపించుకొని అనుపమను శాలువాతో సత్కరించి రూ.10 వేలు నగదు పురస్కారం బహుమతిగా అందించారు. ప్రస్తుతం కాన్పూర్ ఐఐటీ కళాశాలలో మూడో ఏడాది ఇంజినీరింగ్ చదువుతున్న కానిస్టేబుల్ పూర్ణాంజనేయరాజు పెద్ద కుమార్తె జాహ్నవి గతంలో ర్యాంకు సాధించిన సందర్భంగా ఎస్పీ మల్లికా గర్గ్ రూ.25 వేలు నగదు పురస్కారం అందించి అభినందించినట్లు కానిస్టేబుల్ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ భార్య సునీత కుమార్తెలు జాహ్నవి, అనుపమ పాల్గొన్నారు. -
నవ్వుతూ వెళ్లి.. జీవచ్ఛవమై తిరిగొచ్చింది
కురబలకోట/మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా): ఐదేళ్ల క్రితం ఆమె నవ్వుతూ సౌదీ విమానం ఎక్కింది. ఇప్పుడు సోదరులు సైతం గుర్తు పట్టలేనంతగా జీవచ్ఛవంలా మారి విమానంలోంచి వీల్ చైర్లో తిరిగొచ్చింది. బతుకు దెరువు కోసం సౌదీ వెళ్లిన ఆ మహిళను అక్కడ చిత్రహింసలకు గురి చేసి.. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను విమానంలో ఎక్కించి బుధవారం మధ్యాహ్నం బెంగళూరు ఎయిర్ పోర్టుకు పంపారు. అక్కడ ఆమెను వదిలేసి వెళ్లినట్లు చెబుతున్నారు. బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా కురబలకోట రైల్వేస్టేషన్ పక్కనున్న అరవిందపురానికి చెందిన కె.మల్లిక (42) నిరుపేద. భర్త పట్టించుకోకపోవడంతో తల్లితోనే ఉండేది. ఐదేళ్ల క్రితం కురబలకోటకు చెందిన ముగ్గురు ఏజెంట్లు ఆమెకు సౌదీ ఆశలు కల్పించారు. రూ.2 లక్షలు తీసుకుని పాస్‌పోర్టు కూడా వారే సిద్ధం చేయడంతో ఆమె సౌదీ వెళ్లి ఓ ఇంట్లో పని మనిషిగా చేరింది. ఏడాది తర్వాత అక్కడి ఏజెంట్లు ఆమెను మరో ఇంటికి మార్చారు. అప్పటినుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆమె పనిచేస్తున్న ఇంటి యజమాని భార్య తరచూ ఆమెను చిత్రహింసలకు గురి చేసేది. నాలుగేళ్ల పాటు ప్రత్యక్ష నరకం అనుభవించిన మల్లిక చివరకు జీవచ్ఛవంలా మారింది. మల్లికను బెంగళూరు ఎయిర్ పోర్టుకు బుధవారం పంపుతున్నట్లు సౌదీ నుంచి ఆమె కుటుంబీకులకు మంగళవారం ఫోన్ కాల్ రావడంతో ఆమె సోదరులు, బంధువులు బుధవారం ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఆక్కడ వీల్ చైర్లో కన్పించిన మల్లికను చూసి ఖిన్నులయ్యారు. ఆమెను పాస్‌పోర్టు ఆధారంగా గుర్తించాల్సి వచ్చింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అప్పటికప్పుడు మదనపల్లిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు.. మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయాకు రిఫర్ చేశారు. మల్లిక తల్లి రాణెమ్మ, సోదరులు కిశోర్, రాజేష్ మాట్లాడుతూ.. మల్లికను ఏజెంట్లు మోసం చేశారని, వారివల్లే ఆమె కష్టాల పాలైందని వాపోయారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె కోసం నాలుగేళ్లుగా పోలీసులు, ఇతర ఉన్నతాధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని వాపోయారు. -
జలీల్‌ఖాన్ కుమార్తె పోటీ నుంచి విరమించుకోవాలి
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ రాజకీయాల నుంచి విరమించుకోవాలని మాజీ మేయర్ మల్లికాబేగం డిమాండ్ చేశారు. పంజా సెంటర్లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2009లో ముస్లిం మహిళలు రాజకీయాలలోకి రాకూడదని జలీల్‌ఖాన్ కొంతమంది మతపెద్దలను ప్రోత్సహించి తనపై ఫత్వా జారీ చేయించారన్నారు. దాని వల్ల తాను ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని పేర్కొన్నారు. జలీల్‌ఖాన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ 2009లో మల్లికాబేగం ఆ ఫత్వాను గౌరవించలేదని వ్యాఖ్యానించారని, అందువలన తన కుమార్తె కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారని గుర్తు చేశారు. 2009లో తాను నామినేషన్ వేసిన తరువాత ఫత్వా జారీ చేశారన్నారు. అందువలన తాను ఎన్నికల్లో అనివార్యంగా పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. కనుక ఇప్పటివరకూ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు కనుక జలీల్‌ఖాన్ మత పెద్దల ఫత్వాను గౌరవించి తన కుమార్తెను రాజకీయాల నుంచి పశ్చిమ నియోజకవర్గం పోటీ నుంచి తప్పించాలని కోరారు. ఆనాడు ఫత్వా జారీ చేసిన మత పెద్దలు మహిళలందరికీ ఒకే విధమైన న్యాయాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2009లో ఒక విధంగా 2019లో మరో విధంగా జలీల్‌ఖాన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. దీనిపై అన్ని పార్టీల రాష్ట్ర అధ్యక్షులను కలిస్తానని, ముస్లిం పర్సనల్ లా బోర్డును, ఇతర సంఘాలను కలిస ఫత్వా గురించి వివరించి అమలు చేయాలని కోరుతానని వివరించారు. -
స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ తెలంగాణగా ‘మల్లికా యాదవ్’
సూపర్‌బజార్(కొత్తగూడెం) : కొత్తగూడెం పట్టణంలోని నేతాజీ వ్యాయామశాలకు చెందిన వి.మల్లికాయాదవ్ రాష్ట్రస్థాయి సీనియర్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో బంగారుపతకం సాధించడంతోపాటు స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ తెలంగాణ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్ పవర్‌లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మల్లికాయాదవ్ బ్యాక్స్కాడ్ విభాగంలో 180 కేజీలు, బెంచ్‌ప్రెస్‌లో 80, డెడ్‌లిఫ్ట్‌లో 180 కేజీల బరువులు ఎత్తి బంగారు పతకంతోపాటు టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆగస్టులో గుంటూరు జిల్లా మదనపల్లిలో జరగనున్న సీనియర్ జాతీయస్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా మల్లికకు ఉమ్మడి జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ ఎ.నాగరాజు, జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కె.వసంతరావు, ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీనివాస్, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ కూచన కృష్ణారావు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.మహిదర్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఖాసీ హుస్సేన్, కె.మొగిళిలు అభినందనలు తెలిపారు. -
టీవీ నటి, యాంకర్ మల్లిక మృతి
బెంగళూరు : టీవీ నటి, యాంకర్ మల్లిక (39) అనారోగ్యంతో మృతి చెందారు. గత 20 రోజులుగా ఆమె కోమాలో ఉన్నారు. మల్లిక సోమవారం ఉదయం ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో మరణించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘రాజకుమారుడు’ చిత్రంలో మల్లిక నటించారు. అలాగే పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. ఆమె అసలు పేరు అభినవ. జెమిటీ టీవీలో ప్రసారం అవుతున్న ‘నాతిచరామి’ సీరియల్లోనూ మల్లిక నటించారు. కాగా మల్లిక అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఆమెకు భర్త విజయ్ సాయి, కుమారుడు కృష్ణ ప్రసాద్ ఉన్నారు. తొలి తరం టీవీ యాంకర్ గా మల్లిక ప్రజాభిమానం చూరగొన్నారు. ఎమోషనల్ సీన్స్‌లో నాలుగు అయిదు పేజీల డైలాగ్స్‌ను కూడా సింగిల్ టేక్‌తో చేసేవారు. పెళ్లి అనంతరం ఆమె కొంతకాలం నటనకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత బుల్లితెరకు రీ ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్‌లో నటించారు. మల్లిక నేషనల్ బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. ఆమె మృతి పట్ల పలువురు బుల్లితెర నటీనటులు సంతాపం తెలిపారు. -
ఆటోమొబైల్ ఆణిముత్యం!
మన దిగ్గజాలు కుటుంబం నుంచి అందిపుచ్చుకున్న వారసత్వానికి తనదైన కృషి, తెలివితేటలను జోడించి వ్యాపారంలో విజయపతాకను ఎగరేసిన తొలితరం మహిళా వ్యాపారవేత్తల్లో ఎన్నదగిన వారు ‘టాఫే’ చైర్మన్ మల్లికా శ్రీనివాసన్. మహిళలు కొన్ని రంగాలకే పరిమితమనే మూస భావన ను తోసిరాజని ట్రాక్టర్ల వ్యాపారంలో తనదైన ముద్ర వేశారు మల్లిక.1959 లో చెన్నైలో జన్మించారు. తండ్రి ఎ. శివశైలం. ద అమాల్గమేషన్ గ్రూపు సార థి. మల్లికకు కష్టం అంటే తెలియకుండా సుకుమారంగా పెంచారాయన. మల్లిక మద్రాస్ యూనివర్శిటీ నుంచి ఎం.ఎ. చదివారు. అర్థశాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించారు. 1982లో నెలల వయసున్న కూతురును వదలి అమెరికా వెళ్లి వార్టన్ బిజినెస్ స్కూల్లో ఎం.బి.ఎ. పూర్తిచేశారు. చిన్నతనం నుంచి యంత్రాలు, వ్యవసాయ పరికరాలంటే మల్లికకు అమితమైన ఆసక్తి. ఆ ఆసక్తితోనే 1986లో ‘టాఫే’ బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆమె వయసు 26 ఏళ్లు. ఒక మహిళ జీఎంగా బాధ్యతలను చేపట్టటం చూసి పోటీదారులు విస్తుపోయారు. రైతుల నుంచి పాఠాలు... మల్లిక జనరల్ మేనేజర్ హోదాలో ఏసీ క్యాబిన్‌కు పరిమితం కాలేదు. ట్రాక్టర్లను కొనుగోలు చేసేటప్పుడు అందులో ఏ సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారో తెలుసుకోవటానికి పొలాలకు వెళ్లి రైతులను కలిసేవారు. దీంతోపాటు కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భారతీయ రైతుల అవసరాలకు తగ్గట్టు మలచారు. రష్యా, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటించి అక్కడి ట్రాక్టర్ కంపెనీలను సందర్శించి సాంకేతిక సహాయాన్ని పొందారు. తొలిసారిగా వినియోగదారుల సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిజైన్లలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి దించారు. ధరలు పెరగకుండా చూశారు. దీంతో కంపెనీ ఆదాయం రూ. 85 కోట్ల నుంచి 2004 కల్లా రూ. 1200 కోట్లకు చేరింది. 2006లో ఐషర్ మోటార్స్‌కు చెందిన ఇంజిన్, గేర్, ట్రాక్టర్ విభాగాలను రూ. 310 కోట్లకు టాఫే కొనుగోలు చేసింది. దీంతో ఉత్తర భారతదేశంలోను ‘టాఫే’ వాటా పెరిగి దేశంలో రెండో అతిపెద్ద ట్రాక్టర్ కంపెనీగా ఎదిగింది. అమెరికా మార్కెట్లోను అడుగుపెట్టింది. ‘టాఫే’ అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు మల్లిక. తను బాధ్యతలు చేపట్టిన 20 ఏళ్లకు ‘టాఫే’ ను దేశంలోనే రెండో పెద్ద కంపెనీగా నిలిపారు. ఇప్పటికీ ఏమాత్రం ఖాళీ సమయం చిక్కినా పొలాలకు వెళ్లి రైతుల అవసరాలను స్వయంగా తెలుసుకుంటారు. సిబ్బందితో చర్చిస్తారు. 2010లో లక్షన్నర ట్రాక్టర్లను విక్రయించటమే గాక టాఫే బిలియన్డాలర్ల క్లబ్లో చేరింది.›డీజిల్ ఇంజిన్లు, బ్యాటరీలు, గేర్లు, హైడ్రాలిక్ పంపుసెట్లు వంటి పలు వ్యవసాయ అనుబంధ యంత్రాల తయారీకి మల్లిక ముందుచూపుతో వ్యాపారాన్ని విస్తరించారు. దీంతో రూ. 85 కోట్ల ఆదాయం కాస్తా ప్రస్తుతం రూ. 10 వేల కోట్లకు చేరింది. ‘టాఫే’ ప్రస్తుతం 100కు పైగా దేశాలకు ట్రాక్టర్లను ఎగుమతి చేస్తుంది. టర్కీ, చైనాల్లో ట్రాక్టర్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. సేవాకార్యక్రమాలలోను మేటి ఒక పెద్ద సంస్థకు అధిపతైనా మరో పెద్ద వ్యాపార వేత్తల కుటుంబానికి కోడలు అయినా మల్లిక ఇంట్లో మాత్రం సాధారణ గృహిణిలానే ఉంటారు. మల్లిక భర్త టీవీఎస్ మోటారు కంపెనీ సీఎండీ వేణు శ్రీనివాసన్. 2011లో మల్లికా శ్రీనివాసన్ ‘టాఫే’ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. వ్యాపార బాధ్యతలతో తలమునకలుగా ఉన్నా సేవా కార్యక్రమాలలోనూ తనదైన ముద్రను చాటుకున్నారామె. పేదల కోసం చెన్నైలో పలు పాఠశాలలు, ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఇందిరా శివశైలం ఫౌండేషన్ ఏర్పాటు చేసి కర్ణాటక సంగీతానికి మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. – దండేల కృష్ణ -
సైనేడ్ మల్లికకు జీవిత ఖైదు
బెంగళూరు : మహిళలను పరిచయం చేసుకుని.. ఆపై నమ్మకం ఏర్పడిన తర్వాత వారికి ఆహార పదార్థాలల్లో సైనేడ్ కలిపి ఇచ్చి... హత్య చేసి... సదరు మహిళల బంగారాన్ని దోచుకు వెళ్తున్న మల్లిక నేరం రుజువైంది. ఈ నేపథ్యంలో ఆమెకు జీవిత ఖైదు విధిస్తూ కనకపుర రెండవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. మల్లికపై పదికి పైగా హత్యకేసుల్లో నిందితురాలిగా ఉంది. 2007లో కనకపుర తాలూకాలోని కబ్బాళమ్మ దేవాలయం సమీపంలో నివసిస్తున్న ఎలిజెబెత్ జోసెఫ్ అనే మహిళతో మల్లిక స్నేహం చేసింది. ఆ క్రమంలో ఆమెకు సైనేడ్ కలపిన ఆహారం ఇచ్చి హత్య చేసింది. అనంతరం ఆమె నగలతో ఉడాయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సాతనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో మల్లికను అరెస్ట్ చేసి విచారించారు. ఆ తర్వాత కనపుర రెండవ అదనపు జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ నేరం రుజువు కావడంతోపాటు మల్లికపై మరో రెండు హత్య కేసులు, దోపిడి కేసులో భాగస్వామి అని న్యాయమూర్తి నిర్ధారించారు. ఐపీసీ సెక్షన్ కింద 302 కింద జీవిత ఖైదు శిక్షతో పాటు రూ. 50 వేల జరిమాన విధించారు. జరిమాన చెల్లించని పక్షంలో మరో ఏడాది కఠిన శిక్ష అనుభవించవలసి ఉంటుందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్లో డిగ్రీ విద్యార్థిని మల్లిక ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఆమె చదువుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
ఇప్పటికింకా నా వయస్సు 25 ఏళ్ళే !
‘‘సినిమా అనేది బఫేలాంటిది. బఫేలో ఉన్న అన్ని వంటకాలను అందరూ తినరు. నచ్చినవే తింటారు. అలాగే, ఎవరికి నచ్చిన సినిమాని వాళ్లు చూస్తారు. అందరి నాడీ తెలుసుకోలేం కాబట్టి కథ, పాత్ర బాగున్న సినిమాలను ఎంపిక చేసుకుని చేస్తాను’’ అంటున్నారు చార్మి. చందు దర్శకత్వంలో ఆమె నటించిన ‘ప్రేమ ఒక మైకం’ రేపు విడుదల కానుంది. ఇందులో ‘మల్లిక’ అనే వేశ్య పాత్ర చేశారు చార్మి. తన పాత్రతో పాటు సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తపరుస్తున్న చార్మీతో జరిపిన ఇంటర్వ్యూ... పెళ్లెప్పుడు? నా వయసు 25 అన్నాను కదా. కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఇది మంచి వయసు. 35 ఏళ్లల్లో కెరీర్ గురించి ఆలోచించలేం. కానీ ఆ వయసులో పెళ్లి చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు నా దృష్టంతా కెరీర్ మీదే. *** దర్శకుడు చందు ఈ సినిమా గురించి అడిగినప్పుడు ముందు ఒప్పుకోలేదట.. కారణం? గతంలో మూడు, నాలుగు సినిమాల విషయంలో చేదు అనుభవం ఎదురయ్యింది. చెప్పింది ఒకటీ తీసింది ఒకటి. అందుకే నమ్మకం పోయింది. ఈసారి చేదు అనుభవం ఎదురు కాకూడదనుకున్నాను. కానీ చందు చెప్పిన కథ విన్న తర్వాత చేయాలని నిర్ణయించుకున్నాను. కాల్‌గాళ్ కేరక్టర్ కాబట్టి డైలాగ్స్, కాస్ట్యూమ్స్ మరీ ఇబ్బందికరంగా ఉంటాయేమో అన్నాను. అలా ఏం ఉండదని మాటిచ్చారు. నేను కూడా చుడిదార్లే వేసుకుని యాక్ట్ చేస్తానని చెప్పలేదు. అయితే గ్లామరస్ కాస్ట్యూమ్స్ విషయంలో ఓ గీత ఉంటుంది. ఆ గీత దాటకుండా ఉంటే చాలన్నాను. *** మరి.. చందు ఈ సినిమాని చెప్పినట్లే తీశారా? అలానే తీశారు. ఆయన సినిమాలు మ్యూజికల్ వేలో ఉంటాయి. ‘టెన్త్ క్లాస్’ సినిమా చూసినవాళ్లకి అది తెలుస్తుంది. ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. సాంగ్స్, రీ-రికార్డింగ్ అద్భుతంగా కుదిరాయి. *** మల్లిక గురించి చెబుతారా? ప్రాస్టిట్యూట్, కాల్ గాళ్‌కి మధ్య వ్యత్యాసం ఉంది. కాల్‌గాళ్ తనకు నచ్చినవాళ్లతోనే వెళుతుంది. ఇందులో మల్లిక అలాంటి అమ్మాయే. హైక్లాస్ కాల్‌గాళ్. స్టయిలిష్‌గా ఉంటుంది. తనను మించిన అందగత్తె లేదనుకుంటుంది. ఎవరైనా ఫోన్ చేసి రమ్మంటే, ‘నీ ఫొటో పంపించు. నచ్చితే వస్తా’ అంటుంది. మల్లిక వెరీ బోల్డ్. *** మరి.. మల్లిక మహిళలకూ నచ్చుతుందా? ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడే మహిళలందరికీ నచ్చేలా తీయాలనుకున్నాం. లేడీస్ అందరూ ఇష్టపడి చూసే విధంగా ఉంటుంది. ఎక్కడా అభ్యంతరకరంగా ఉండదు. *** ఈ చిత్రం ఫలితం ఎలా ఉంటుందనుకుంటున్నారు? ‘ప్రేమ ఒక మైకం’ చూసిన తర్వాత ప్రేక్షకులు ‘బాగుంది’ అని చిన్న మాట అన్నా చాలు.. ‘హిట్’ అయిపోతుంది. ఆ మాట అంటారనే నమ్మకం ఉంది. *** మీరు ప్రివ్యూ చూశారు కదా.. ఎలా అనిపించింది? నా మేనేజర్, డ్రైవర్, ఇంకొంతమందితో కలిసి చూశాను. క్లయిమాక్స్‌లో వాళ్లు కంట తడిపెట్టుకున్నారు. కచ్చితంగా ప్రేక్షకులు కూడా కదిలిపోతారనే నమ్మకం ఉంది. ఎంత మంచి సినిమా అయినా, సరైన సమయంలో విడుదల చేయకపోతే.. ప్రేక్షకులకు రీచ్ కాదు. ఈ సినిమాకి పోటీ లేదు. మంచి టైమ్‌లో మంచి థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం కాబట్టి విజయం సాధించడం ఖాయం. *** డైలాగ్స్ సంగతేంటి? రచయిత పులగం చిన్నారాయణ అద్భుతంగా రాశారు. ఈ సినిమాకి డైలాగ్సే ఓ హీరో అని చెప్పాలి. లొకేషన్లో యాక్ట్ చేసేటప్పుడు, డబ్బింగ్ చెప్పేటప్పుడు డైలాగ్స్‌కి చాలా ఇన్‌స్పయిర్ అయ్యాను. ప్రతి మాటకూ మంచి అర్థం ఉంది. *** ఈ సినిమా మీ చుట్టూనే తిరుగుతుందా? వాస్తవానికి నాకు పాపులార్టీ ఉంది కాబట్టి నన్ను ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు. ఓ సింగర్, రైటర్, కాల్‌గాళ్ చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్రలు కూడా అద్భుతంగా ఉంటాయి. *** మల్లిక పాత్రతో మరోసారి నంది అవార్డు సాధిస్తావనుకుంటున్నారా? మా ఇంట్లో బోల్డన్ని అల్మరాలున్నాయి. నంది వస్తే ఆనందమే. *** ఈ మధ్య ఏడు కిలోలు బరువు తగ్గారట. కారణం ఏంటి? నా పన్నెండేళ్ల కెరీర్లో చాలాసార్లు బరువు తగ్గిన, పెరిగిన సందర్భాలున్నాయి. కానీ అదంతా సినిమాల కోసం, దర్శకులు చెప్పి మీదట చేశాను. ఇప్పుడు నాకోసం తగ్గాను. ఇంకా ఐదు కిలోలు తగ్గాలనుకుంటున్నా. ‘స్మాల్ సైజ్’కి చేరుకున్న తర్వాత మునుపటికన్నా రెట్టింపు ఉత్సాహంగా ఉంది. *** పన్నెండేళ్ల కెరీర్లో అపజయాల శాతం ఎక్కువే ఉంది. మీరేమంటారు? అది నిజమే. పదమూడేళ్ల వయసులో ఇండస్ట్రీకొచ్చాను. అది నిర్ణయాలు తీసుకునే వయసు కాదు కాబట్టి మా అమ్మానాన్న, నా మేనేజర్ సలహా తీసుకునేదాన్ని. వాళ్లు తప్పు చెప్పారనను. ఇప్పుడు నా వయసు 25. నా నిర్ణయాలు నేను తీసుకుంటున్నాను. ఎప్పుడైన సందిగ్ధంలో పడ్డప్పుడు నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, మేనేజర్ సలహా తీసుకుంటాను. ఇక్కడ సక్సెస్, లక్ రెండూ ముఖ్యం. అదృష్టం నా వెంటే ఉంది. అందుకే... అనుకోకుండా రోజు, మంత్ర, ప్రేమ ఒక మైకం, ఇప్పుడు ప్రతిఘటనలాంటి సినిమాలు చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాలు చేయడంవల్లే పన్నెండేళ్లయినా ఇంకా సినిమాలు చేయగలుగుతున్నాను. లేకపోతే మూడేళ్లకే కెరీర్ ముగిసిపోయేది.