పెదకాకాని: వివాహేతర సంబంధం కారణంగానే నంబూరు గ్రామంలో మహిళ హత్యకు గురైనట్లు మంగళగిరి డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ తెలిపారు. పెదకాకాని పోలీసుస్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. నంబూరు గ్రామానికి చెందిన షేక్ మల్లికతో అదే గ్రామానికి చెందిన షేక్ అక్బర్‌కు ప్రేమ వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. అక్బర్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అతడి ఆటోలో రోజూ రాకపోకలు సాగించే బోర్లు తీసే వారిలో ఒకరైన కారుమూరి ప్రేమ్‌కుమార్‌తో మల్లికకు పరిచయం ఏర్పడింది.
దీంతో గొడవలు జరిగి దంపతులు విడిపోయారు. అనంతరం ప్రేమ్‌కుమార్‌ను ఆమె రెండో వివాహం చేసుకుని గుంటూరుకు వచ్చింది. 2021లో గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన బంగారు వ్యాపారి అబ్దుల్ రెహమాన్‌తో పరిచయం ఏర్పడింది. తర్వాత వివాహేతర సంబంధంగా మారడంతో మల్లికకు అతడు బంగారం, నగదు రూపంలో రూ.15 లక్షల వరకు ఇచ్చాడు. 9 నెలల క్రితం మల్లిక దంపతులు కాపురం నంబూరుకు మార్చారు. రెహమాన్‌ను కొంతకాలంగా దూరంగా పెడుతోంది. గ్రామానికి చెందిన నాగబాబుతో పరిచయం ఏర్పడిందని, అతనితోనే ఉంటానని హెచ్చరించింది. వారిద్దరూ శారీరకంగా కలిసి ఉన్న వీడియోను రెహమాన్‌కు వాట్సాప్ పెట్టింది.
వికటించిన వశీకరణ ప్రయత్నం
కక్ష పెంచుకున్న రెహమాన్ ఆమెను వశీకరణతో సొంతం చేసుకోవాలని, లేకుంటే కాళ్లు, చేతులు పడిపోయి మంచానికే పరిమితం చేయాలని గుంటూరు ఇన్నర్ రింగ్‌రోడ్డులోని గాయత్రి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న షేక్ జనాబ్ అహ్మద్ మంత్రగాడిని ఆశ్రయించాడు. పదేళ్ల క్రితం ఢిల్లీ నుంచి గుంటూరుకు మంత్రగాడు వచ్చాడు. మల్లిక తల వెంట్రుకలు, దుస్తులను రెహమాన్ తెచ్చి షేక్ జనాబ్ అహ్మద్‌కు ఇచ్చాడు. పిండితో బొమ్మను చేసి వశీకరణ చేసినట్లు పేర్కొన్నాడు. అప్పటికీ ఆమె దక్కలేదు.
చున్నీతో గొంతు బిగించి హత్య
రూ.3 లక్షలు నగదు ఇచ్చి మల్లికను చంపేలా రెహమాన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. డిసెంబరు 28వ తేదీన షేక్ జనాబ్ అహ్మద్ తన అనుచరులైన ప్రకాశం జిల్లా పామూరు పడమట కట్టకింద పల్లి గ్రామానికి చెందిన ఎర్రబెల్లి కాజా రసూల్, గుంటూరుకు చెందిన మానిపాటి స్వప్నతో కలిసి నంబూరు చేరుకున్నాడు. స్వప్న స్కూటీ వద్ద నిలబడి ఉండగా అహ్మద్, కాజా రసూల్‌లు మల్లిక ఇంటిలోకి వెళ్లి ఒంటరిగా ఉన్న మల్లిక(29)ను నోరు మూసి చున్నీతో గొంతు బిగించి హతమార్చారు. నిందితులైన రెహమాన్, షేక్ జనాబ్ అహ్మద్, కాజా రసూల్, స్వప్నలను మంగళవారం ఆరెస్టు చేశారు. కోర్టుకు హాజరు పరచనున్నట్లు డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ తెలిపారు. మల్లిక దుస్తులు, రూ.40 వేల నగదు, స్కూటీ, సెల్‌ఫోన్‌లను నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ టి.పి. నారాయణస్వామి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment