సైనేడ్ మల్లికకు జీవిత ఖైదు
బెంగళూరు : మహిళలను పరిచయం చేసుకుని.. ఆపై నమ్మకం ఏర్పడిన తర్వాత వారికి ఆహార పదార్థాలల్లో సైనేడ్ కలిపి ఇచ్చి... హత్య చేసి... సదరు మహిళల బంగారాన్ని దోచుకు వెళ్తున్న మల్లిక నేరం రుజువైంది. ఈ నేపథ్యంలో ఆమెకు జీవిత ఖైదు విధిస్తూ కనకపుర రెండవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు.
మల్లికపై పదికి పైగా హత్యకేసుల్లో నిందితురాలిగా ఉంది. 2007లో కనకపుర తాలూకాలోని కబ్బాళమ్మ దేవాలయం సమీపంలో నివసిస్తున్న ఎలిజెబెత్ జోసెఫ్ అనే మహిళతో మల్లిక స్నేహం చేసింది. ఆ క్రమంలో ఆమెకు సైనేడ్ కలపిన ఆహారం ఇచ్చి హత్య చేసింది. అనంతరం ఆమె నగలతో ఉడాయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సాతనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో మల్లికను అరెస్ట్ చేసి విచారించారు.
ఆ తర్వాత కనపుర రెండవ అదనపు జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ నేరం రుజువు కావడంతోపాటు మల్లికపై మరో రెండు హత్య కేసులు, దోపిడి కేసులో భాగస్వామి అని న్యాయమూర్తి నిర్ధారించారు. ఐపీసీ సెక్షన్ కింద 302 కింద జీవిత ఖైదు శిక్షతో పాటు రూ. 50 వేల జరిమాన విధించారు. జరిమాన చెల్లించని పక్షంలో మరో ఏడాది కఠిన శిక్ష అనుభవించవలసి ఉంటుందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.