కోల్‌కతా: ఈ ఏడాది అక్టోబర్‌లో 9 ఏళ్ల బాలికపై అత్యాచారంచేసి హత్యకు పాల్పడిన 19 ఏళ్ల వ్యక్తికి బెంగాల్‌లోని కోర్టు మరణ శిక్ష విధించింది. నేరం చోటుచేసుకున్న నాటి నుంచి కేవలం 61 రోజుల్లోనే విచారణ పూర్తవడం రికార్డు సృష్టించింది. దక్షిణ 24 పరగణాల జిల్లా జయ్‌నగర్‌లో అక్టోబర్ 4న ట్యూషన్ నుంచి వస్తున్న 9 ఏళ్ల బాలికను ముస్తాకిన్ సర్దార్ నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై చంపేశాడు. అప్పటికే ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఘటనతో రాష్ట్రం అట్టుడుకుతోంది.
దాంతో బాలిక హత్యాచార కేసులో పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంతో నిందితుడిని కేవలం రెండున్నర గంటల్లోనే అరెస్ట్ చేశారు. అతడిచ్చిన వివరాలతో బాలిక మృతదేహాన్ని అదే రోజు రాత్రి స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఆధారాలతో 25 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి బారుయిపూర్ పోక్సో కోర్టులో అక్టోబర్ 30న చార్జిషీట్ వేశారు. కోర్టు విచారణ నవంబర్ 4న మొదలై 26న పూర్తయింది. మొత్తం 36 మంది సాక్షులను విచారించారు. దోషి ముస్తాకిన్ సర్దార్‌కు మరణ శిక్ష విధిస్తూ శుక్రవారం జస్టిస్ సుబ్రతా చటర్జీ తీర్పు వెలువరించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదో రికార్డని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. పోలీసులు, న్యాయాధికారుల కృషిని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment