
న్యూఢిల్లీ: ప్రమాదవశాత్తు అంతర్జాతీయ సరిహద్దు దాటి పాక్‌రేంజర్లకు చిక్కిన భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) కానిస్టేబుల్ ఇంకా విడుదల కాలేదు. ఆయన సరిహద్దు దాటి 90 గంటలు దాటింది. విడిపించేందుకు బీఎస్‌ఎఫ్, పాక్ రేంజర్ల మధ్య మూడు దఫాలు సమావేశాలు జరిగాయి. కానిస్టేబుల్‌ను బీఎస్‌ఎఫ్ 182వ బెటాలియన్ సభ్యుడు పూర్ణం కుమార్ సాహుగా గుర్తించారు. ఆయన స్వస్థలం పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ. ఆ జవాన్ గురించిన సమాచారం తమ వద్దలేదని పాకిస్తాన్ చెబుతోంది.
ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో మోహరించిన అన్ని యూనిట్లను బీఎస్‌ఎఫ్ అప్రమత్తం చేసింది. పాక్ రేంజర్లతో మరోసారి ఫీల్డ్ కమాండర్ స్థాయి ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించాలని బీఎస్‌ఎఫ్ కోరింది. త్వరలోనే ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 90 గంటలైనా జవాన్ ఆచూకీ లభించకపోవడం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసింది. తమ కుమారుడిని త్వరగా తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని షా తండ్రి ప్రభుత్వాన్ని కోరారు. భర్తను తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి తెలుసుకునేందుకు జవాన్ పూర్ణం సాహు భార్య రజనీ.. హౌరా నుంచి ఫిరోజ్‌పూర్‌కు బయల్దేరారు.