పశ్చిమ బెంగాల్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి! | One Child Killed And Two Persons Injured In Crude Bomb Blast In Hooghly West Bengal | Sakshi
Sakshi News home page

Hooghly Bomb Blast: పశ్చిమ బెంగాల్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!

Published Mon, May 6 2024 12:54 PM

Bomb Explodes in Hooghly West Bengal

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని పాండువా ప్రాంతంలో ఈ రోజు (సోమవారం) బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. మీడియా కథనాల ప్రకారం కొంతమంది చిన్నారులు బంతిగా భావించి ఒక బాంబుతో ఆడుతుండగా, అది హఠాత్తుగా పేలింది. గాయపడిన వారిలో ఒకరు కుడి చేయి కోల్పోయినట్లు సమాచారం. కాగా టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇదే ప్రాంతంలో జరిగే ఎన్నికల ర్యాలీలో ప్రసంగించాల్సివుంది

ఈ పేలుడులో గాయపడిన ఇద్దరు చిన్నారులను రూపమ్ వల్లభ్, సౌరభ్ చౌదరిగా గుర్తించారు. చిన్నారుల వయసు 11 నుంచి 13 ఏళ్ల మధ్య ఉంటుంది. ప్రస్తుతం బాధితులు చుంచుర ఇమాంబర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం 8:30 గంటల సమయంలో తిన్నా ప్రాంతంలోని చెరువు  దగ్గర పెద్ద పేలుడు శబ్ధం వినిపించింది. దీంతో సమీపంలోని వారు చెరువు గట్టు వద్దకు పరుగులు తీయగా, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన స్థితిలో వారికి కనిపించారు. ఈ ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, ఒకరు మృతి చెందారు.

ఈ ఘటనపై హుగ్లీ రూరల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన భద్రతా లోపంపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని కీలక నేత అభిషేక్ బెనర్జీ  సమావేశం జరగాల్సిన స్థలంలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. 

Advertisement
Advertisement