
న్యూఢిల్లీ, సాక్షి: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(NEET) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిబంధన మేరకు.. పలు కేంద్రాల వద్ద నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదు. దీంతో కంటితడి పెడుతూ పలువురు సెంటర్‌లను వీడారు.
దేశవ్యాప్తంగా 552 నగరాలు, పట్టణాల్లో 5 వేలకు పైగా సెంటర్లలో.. అలాగే దేశం వెలుపల 14 నగరాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. గతేడాది నీట్(National Eligibility cum Entrance Test) యూజీ ప్రశ్నపత్రం లీక్‌తో పాటు ఇతర అవకతవకలు చోటు చేసుకోవడంతో.. ఈసారి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.
ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో కలిపి 13 భాషల్లో ఈ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహించింది. విద్యార్థులను పక్కాగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఈసారి జాతీయ స్థాయిలో 23 లక్షల మందికి పైగా నీట్ రాసే అవకాశముందని అంచనా. నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 776 మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. జాతీయ స్థాయిలో 1.17 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.