నీట్‌ యూజీ–2025 పెన్,పేపర్‌తోనే.. | National Testing Agency makes key announcement on NEET UG 2025 | Sakshi
Sakshi News home page

నీట్‌ యూజీ–2025 పెన్,పేపర్‌తోనే..

Published Fri, Jan 17 2025 4:56 AM | Last Updated on Fri, Jan 17 2025 5:46 AM

National Testing Agency makes key announcement on NEET UG 2025

ఒకేరోజు– ఒకే షిఫ్టులో ఓఎంఆర్‌ విధానంలో పరీక్ష 

అక్రమాలకు తావు లేకుండా పరీక్ష నిర్వహణకే ఈ విధానం: ఎన్‌టీఏ

సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్‌: పేపర్‌ లీకేజీలు, ఇతర వివాదాల నేపథ్యంలో నీట్‌ యూజీ–2025పై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక ప్రకటన చేసింది. దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ –2025 పరీక్షను ఆఫ్‌లైన్‌ మోడ్‌లో అంటే పెన్, పేపర్‌ (ఓఎంఆర్‌ విధానం) పద్ధతిలో నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించింది. పేపర్‌ లీక్, ఇతర అక్రమాలను నిరోధించేందుకు ఈసారి దేశవ్యాప్తంగా ‘ఒకే రోజు– ఒకే షిఫ్టు’లో ఈ పరీక్షను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఖరా రు చేసిన మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్‌ఎంఎస్‌ కోర్సులకు యూనిఫామ్‌ నీట్‌ యూజీ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. నీట్‌ యూజీ ఫలితాల ఆధారంగా నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ హోమియోపతి కింద బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో అడ్మి షన్లు నిర్వహిస్తారు. 

దీంతోపాటు సాయుధ దళాలకు వైద్య సేవలందించే ఆసుపత్రుల్లో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో చేరాలనుకునే మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌ అభ్యర్థులు కూడా నీట్‌ అర్హత సాధించాల్సి ఉంటుంది. నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుకూ నీట్‌ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని ఎన్టీఏ తెలిపింది. 

ఆన్‌లైన్‌ పరీక్షపై మల్లగుల్లాలు 
గత సంవత్సరం నీట్‌–2024లో చోటు చేసుకున్న లీక్‌ వ్యవహారాల నేపథ్యంలో నీట్‌ యూజీ– 2025ని జేఈఈ మెయిన్‌ తరహాలో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలనే డిమాండ్లు వచ్చాయి. దీంతో ఎన్‌టీఏ నిర్వహించే పరీక్షల్లో పారదర్శకతను పెంచే సూచనలు చేసేందుకు ఇస్రో మాజీ చైర్మన్‌ ఆర్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలో కేంద్రం ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. 

ఈ కమిటీ విస్తృత సమాలోచనలు జరిపి ‘మల్టీ సెషన్‌ టెస్టింగ్, మల్టీ స్టేజ్‌ టెస్టింగ్‌ ’విధానంలో నీట్‌ను.. ‘మల్టిట్యూడ్‌ సబ్జెక్ట్‌ స్టీమ్స్‌’విధానంలో ‘కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ) పరీక్షలను నిర్వ హించాలంది. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి ల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపింది. తాజాగా కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు జరిపిన చర్చల్లో పాత ఓఎంఆర్‌ పద్ధతికే మొగ్గుచూపుతూ నిర్ణయం తీసుకున్నారు. 

అయితే అవకతవకలకు ఆస్కారం లేకుండా ఒకే రోజు– ఒకే షిఫ్టు విధానాన్ని అవలంబించాలని నిర్ణయించారు. ‘నీట్‌ యూజీ–2025ని ఆన్‌లైన్‌లో నిర్వహించాలా? పెన్, పేపర్‌ పద్ధతిలో నిర్వహించాలా? అనే అంశంపై కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు చర్చించాయి. ఆ తర్వాతే ఈ పరీక్షను ఓఎంఆర్‌ విధానంలో నిర్వహించాలని నిర్ణయించాం. ఎన్‌ఎంసీ నిర్ణయం ప్రకారం, నీట్‌–యూజీ–2025ని పెన్, పేపర్‌ పద్ధతిలోనే నిర్వహిస్తాం. ఒకే రోజు, ఒకే షిఫ్టులో పరీక్ష ఉంటుంది’అని ఎన్‌టీఏ వర్గాలు చెప్పాయి.

దేశంలోనే అతిపెద్ద పరీక్ష 
దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్‌కు పేరుంది. 2024లో ఏకంగా 24 లక్షల మందికిపైగా ఈ పరీక్ష రాశారు. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లోని దాదాపు 1.08 లక్షల ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ కోసం ఏటా నీట్‌ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహిస్తుంది. ఇందులో దాదాపు 56 వేల సీట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉన్నాయి. నీట్‌లో సాధించే మార్కుల ఆధారంగా విద్యార్థులకు వివిధ కోర్సుల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి.

ఆధార్‌ ఆథెంటికేషన్‌ తప్పనిసరి 
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ కోసం మొబైల్‌ నంబర్‌తోపాటు ఆధార్‌ను లింక్‌ చేయాలని ఎన్‌టీఏ గతంలో కోరింది. అభ్య ర్థులు తమ పదోతరగతి సర్టిఫికెట్‌ ప్రకారం ఆధార్‌ క్రెడెన్షియల్స్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సరళమైన దరఖాస్తు ప్రక్రియ కోసం ఆధార్‌ ఉపయోగిస్తున్నట్లు ఎన్‌టీఏ పేర్కొంది.

 ఆధార్‌లోని ఫేస్‌ అథెంటికేషన్‌ పద్ధతి వల్ల అభ్యర్థుల గుర్తింపు వేగవంతం, సులభతరమవుతుందని వెల్లడించింది. దీనివల్ల ప్రవేశ పరీక్షలోని అన్ని ప్రక్రియలు సునాయాసంగా పూర్తవుతాయని తెలిపింది. నీట్‌ యూజీ–2025 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. సిలబస్‌ను ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement