National Medical Commission
-
నీట్ యూజీ–2025 పెన్,పేపర్‌తోనే..
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: పేపర్ లీకేజీలు, ఇతర వివాదాల నేపథ్యంలో నీట్ యూజీ–2025పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక ప్రకటన చేసింది. దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ –2025 పరీక్షను ఆఫ్‌లైన్ మోడ్‌లో అంటే పెన్, పేపర్ (ఓఎంఆర్ విధానం) పద్ధతిలో నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించింది. పేపర్ లీక్, ఇతర అక్రమాలను నిరోధించేందుకు ఈసారి దేశవ్యాప్తంగా ‘ఒకే రోజు– ఒకే షిఫ్టు’లో ఈ పరీక్షను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఖరా రు చేసిన మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ కోర్సులకు యూనిఫామ్ నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. నీట్ యూజీ ఫలితాల ఆధారంగా నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో అడ్మి షన్లు నిర్వహిస్తారు. దీంతోపాటు సాయుధ దళాలకు వైద్య సేవలందించే ఆసుపత్రుల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో చేరాలనుకునే మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అభ్యర్థులు కూడా నీట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుకూ నీట్ యూజీ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని ఎన్టీఏ తెలిపింది. ఆన్లైన్ పరీక్షపై మల్లగుల్లాలు గత సంవత్సరం నీట్–2024లో చోటు చేసుకున్న లీక్ వ్యవహారాల నేపథ్యంలో నీట్ యూజీ– 2025ని జేఈఈ మెయిన్ తరహాలో ఆన్లైన్ విధానంలో నిర్వహించాలనే డిమాండ్లు వచ్చాయి. దీంతో ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో పారదర్శకతను పెంచే సూచనలు చేసేందుకు ఇస్రో మాజీ చైర్మన్ ఆర్ రాధాకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విస్తృత సమాలోచనలు జరిపి ‘మల్టీ సెషన్ టెస్టింగ్, మల్టీ స్టేజ్ టెస్టింగ్ ’విధానంలో నీట్‌ను.. ‘మల్టిట్యూడ్ సబ్జెక్ట్ స్టీమ్స్’విధానంలో ‘కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) పరీక్షలను నిర్వ హించాలంది. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి ల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపింది. తాజాగా కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు జరిపిన చర్చల్లో పాత ఓఎంఆర్ పద్ధతికే మొగ్గుచూపుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అవకతవకలకు ఆస్కారం లేకుండా ఒకే రోజు– ఒకే షిఫ్టు విధానాన్ని అవలంబించాలని నిర్ణయించారు. ‘నీట్ యూజీ–2025ని ఆన్లైన్లో నిర్వహించాలా? పెన్, పేపర్ పద్ధతిలో నిర్వహించాలా? అనే అంశంపై కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు చర్చించాయి. ఆ తర్వాతే ఈ పరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించాం. ఎన్ఎంసీ నిర్ణయం ప్రకారం, నీట్–యూజీ–2025ని పెన్, పేపర్ పద్ధతిలోనే నిర్వహిస్తాం. ఒకే రోజు, ఒకే షిఫ్టులో పరీక్ష ఉంటుంది’అని ఎన్టీఏ వర్గాలు చెప్పాయి.దేశంలోనే అతిపెద్ద పరీక్ష దేశంలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షగా నీట్‌కు పేరుంది. 2024లో ఏకంగా 24 లక్షల మందికిపైగా ఈ పరీక్ష రాశారు. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లోని దాదాపు 1.08 లక్షల ఎంబీబీఎస్ సీట్ల భర్తీ కోసం ఏటా నీట్ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఇందులో దాదాపు 56 వేల సీట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉన్నాయి. నీట్లో సాధించే మార్కుల ఆధారంగా విద్యార్థులకు వివిధ కోర్సుల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి.ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ కోసం మొబైల్ నంబర్‌తోపాటు ఆధార్‌ను లింక్ చేయాలని ఎన్టీఏ గతంలో కోరింది. అభ్య ర్థులు తమ పదోతరగతి సర్టిఫికెట్ ప్రకారం ఆధార్ క్రెడెన్షియల్స్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సరళమైన దరఖాస్తు ప్రక్రియ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. ఆధార్‌లోని ఫేస్ అథెంటికేషన్ పద్ధతి వల్ల అభ్యర్థుల గుర్తింపు వేగవంతం, సులభతరమవుతుందని వెల్లడించింది. దీనివల్ల ప్రవేశ పరీక్షలోని అన్ని ప్రక్రియలు సునాయాసంగా పూర్తవుతాయని తెలిపింది. నీట్ యూజీ–2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. సిలబస్‌ను ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో ఉంచారు. -
వైద్యం.. వైవిధ్యం..
మనకు అనారోగ్యం వస్తే.. వైద్యులను ఆశ్రయిస్తాం. మరి అలాంటి వైద్యులే అనారోగ్యం పాలైతే? ఒక వైద్యుడు ఆరోగ్యంగా ఉంటే వందలాది మంది రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తాడు. ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. అందుకే వైద్యుల ఆరోగ్యం అత్యంత విలువైనది. అయితే దురదృష్టవశాత్తూ ప్రజల్ని అనారోగ్యాల నుంచి విముక్తం చేయాల్సిన వైద్యులే తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు/ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఆస్పత్రి ప్రాంగణంలో జిమ్ అనే కొత్త సంప్రదాయం ఊపిరి పోసుకుంది. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు.. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) ప్రకారం.. దేశంలో వైద్యులు, జనాభా నిష్పత్తి 1:854 కావడంతో తీవ్ర పని ఒత్తిడి తప్పడం లేదు. దీంతో పాటే అనేక రకాల ఇతరత్రా పరిస్థితులు సైతం వైద్యులను రోగులుగా మారుస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో వైద్యులు/ ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్యాల అంశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే వైద్య రంగంలో రకరకాల మార్పు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగమే ఆస్పత్రుల్లో వ్యాయామ కేంద్రాలు. ఇప్పటి దాకా పలు దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న హాస్పిటల్ జిమ్స్.. ఇప్పుడిప్పుడే మన నగరంలోనూ అందుబాటులోకి వస్తున్నాయి.ఆస్పత్రిలో జిమ్.. అంత ఈజీ కాదు.. నిజానికి కరోనా సమయంలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో రద్దీ, బెడ్స్ లేకపోవడం వంటివి అనేక మంది మరణాలకు కారణమవడం అందరికీ తెలిసిందే. మరోవైపు అత్యంత వ్యాపారాత్మక ధోరణిలో నడుస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు తమ వైద్యుల కోసం ఆస్పత్రిలో అత్యంత విలువైన స్థలాన్ని జిమ్‌కు కేటాయించడం అంత సులభం కాదు కాబట్టి.. ఈ తరహా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఆస్పత్రివైపు అందరూ అశ్చర్యంగా, అభినందనపూర్వకంగా చూస్తున్నారు. ఒత్తిడిని జయించేందుకు.. ఆస్పత్రి ఆవరణలో జిమ్ ఉండడం అనేక రకాలుగా ప్రయోజనకరం అంటున్నారు పలువురు వైద్యులు. ముఖ్యంగా క్లిష్టమైన కేసుల్ని డీల్ చేయడం, ఆపరేషన్లు వంటివి చేసిన తరువాత కలిగే ఒత్తిడి నుంచి రిలాక్స్ అవడానికి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల కావడానికి సంగీతం నేపథ్యంలో సాగే వర్కవుట్స్ వీలు కల్పిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా గంటల తరబడి ఎక్కువ సమయం ఆస్పత్రిలో గడపాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా జిమ్ అందుబాటులో ఉండడం వల్ల మేలు కలుగుతుందని అంటున్నారు.సిబ్బందికి ఉపయుక్తం.. ఒక పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యుల కంటే నర్సులు, అసిస్టెంట్ స్టాఫ్.. ఇతరత్రా సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వైద్యుల కన్నా రోగులతో అత్యధిక సమయం గడిపే వీరి ఆరోగ్యం కాపాడుకోడం చాలా ప్రధానమైన విషయమే. వీరి పనివేళలు సుదీర్ఘంగా ఉన్నా చెప్పుకోదగ్గ ఆదాయం ఉండని, ఈ దిగువ స్థాయి సిబ్బందికి నెలవారీ వేల రూపాయలు చెల్లించి జిమ్స్‌కు వెళ్లే స్థోమత ఉండదు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రి ఆవరణలోనే జిమ్ ఉండడం, ఉచితంగా వ్యాయామం చేసుకునే వీలు వల్ల వీరికి వెసులుబాటు కలుగుతోంది. అరుదుగా కొందరు రోగులకు సైతం ప్రత్యేక వ్యాయామాలు అవసరమైనప్పుడు ఈ తరహా జిమ్స్ ఉపయుక్తంగా ఉంటాయి.లాభనష్టాల బేరీజు లేకుండా.. ఆస్పత్రుల్లో జిమ్స్ అనేది విదేశాల్లో కామన్. నేను సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పుడు అక్కడ టాప్ ఫ్లోర్లో జిమ్ ఉండేది. అక్కడ నేను వర్కవుట్ చేసేవాడిని. ఏ సమయంలోనైనా ఆస్పత్రికి చెందిన వారు వెళ్లి అక్కడ వర్కవుట్ చేయవచ్చు. హౌస్ కీపింగ్ స్టాఫ్ నుంచి డాక్టర్స్ వరకూ ఎవరైనా వర్కవుట్ చేసేందుకు వీలుగా జిమ్ ఉండడం నాకు చాలా నచి్చంది. అదే కాన్సెప్ట్ నగరంలో తీసుకురావాలని అనుకున్నా. సిటీలో ఆస్పత్రి నెలకొలి్పనప్పుడు మా హాస్పిటల్లోనే దాదాపు రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24/7 పనిచేసే జిమ్‌ను నెలకొల్పాం. లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా దీన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మా ఆస్పత్రిలోని అన్ని స్థాయిల సిబ్బందీ ఈ జిమ్‌ను వినియోగించుకుంటున్నారు. – డా.కిషోర్‌రెడ్డి, ఎండీ, అమోర్ హాస్పిటల్స్ -
ప్రైవేట్ వైద్య‘మిథ్య’
తనిఖీల్లో ఏం తేలింది..? పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 50% వరకు అధ్యాపకులు లేరు. ఓ కాలేజీలో 50.47%, మరో కాలేజీలో 59.3% మేరకు కొరత ఉంది. ఒక కాలేజీలో రెసిడెంట్లు, ట్యూటర్ల కొరత 66.31% వరకు ఉంది. 150 మంది విద్యార్థులుండే కాలేజీ అనుబంధ ఆసు పత్రిలో రోజూ 1,200 మంది ఓపీ ఉండాలి. ఒక చోట 849, మరో చోట 650 మందే వస్తున్నారు. ఓ కాలేజీ ఆసుపత్రిలో 650కి 542 పడకలే ఉన్నాయి. రెండు కాలేజీల ఆసుపత్రుల్లో బెడ్ ఆక్యుపెన్సీ 9.38%, 11.97% చొప్పునే ఉంది. పలుచోట్ల లెక్చర్ హాళ్లు, పరీక్షా కేంద్రాలు సరిపడా లేవు. ఒకే ప్రొఫెసర్‌ను రెండు కాలేజీల్లో చూపించారు.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొన్ని కళాశాలల్లో ఉండాల్సిన సంఖ్యలో సగం మంది కూడా లేరు. మరోవైపు విద్యార్థులకు అవసరమైన స్థాయిలో మౌలిక సదుపాయాలు కూడా లేవు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఇటీవలి తనిఖీల్లో ఈ అంశాలు బహిర్గతమయ్యాయి. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫె సర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తగిన సంఖ్యలో లేకపోవడం, ల్యాబ్‌ల వంటి మౌలిక వసతుల కొరతతో అనేక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య అత్యంత నాసిరకంగా తయారవుతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఆయా కాలేజీల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న చాలామంది తగిన సామర్థ్యం, నైపుణ్యం లేక వృత్తిలో రాణించలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో లేనందుకు విద్యార్థుల అడ్మిషన్లను కమిషన్ రద్దు చేసింది. తర్వాత వారిని ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేసింది. ఎన్ఎంసీ కఠిన చర్యలు తీసుకుంటున్నా, చాలా మెడికల్ కాలేజీలు ఇప్పటికీ అధ్యాపకులను నియమించుకోవడంలో, మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడే ఉంటున్నాయని, వైద్య విద్యపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆసక్తిని సొమ్ము చేసుకుంటున్న కాలేజీలు నాణ్యమైన విద్య అందించడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏ కాలేజీ..ఎలా ఉండాలి: ఎంబీబీఎస్ సీట్లు 150 ఉన్న మెడికల్ కాలేజీలో 600 పడకలు ఉండాలి. 116 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 76 మంది రెసిడెంట్లు ఉండాలి. ఐదు పడకల ఐసీయూ, పీఐసీయూ వేర్వేరుగా ఉండాలి. ఫిజికల్ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. స్కిల్ లేబొరేటరీ ఉండాలి. ఇలా ఉన్న సీట్లను బట్టి బోధనా సిబ్బంది, వసతులు ఉండాలి. అన్ని మెడికల్ కాలేజీల్లో తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేసే లేబొరేటరీ ఉండాలి. లైబ్రరీలో 4,500 పుస్తకాలుండాలి. అదే 100 సీట్లున్న మెడికల్ కాలేజీ అయితే 3 వేల పుస్తకాలు, 200 సీట్లుంటే 6 వేలు, 250 సీట్లయితే 7 వేల పుస్తకాలు ఉండాలి. లైబ్రరీ వైశాల్యం కూడా సీట్ల సంఖ్యకు అనుగుణంగా ఉండాలి. 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు చదివే మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రికి రోజుకు 1,200 మంది ఔట్ పేషెంట్లు అవసరం. ఆ మేరకు తప్పనిసరిగా రోగులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇలాంటి అనేక వసతులు సరిగ్గా లేకుండానే, బోధనా సిబ్బంది తగిన సంఖ్యలో లేకుండానే నడుస్తున్నట్లు తేలింది. తనిఖీల సమయంలో ‘సర్దుబాట్లు’ రాష్ట్రంలో మొత్తం 64 మెడికల్ కాలేజీలున్నాయి. అందులో 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాగా, 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కాగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, రోగుల వివరాలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. వసతులు లేవని విద్యార్థులు బయటకు చెప్పలేని పరిస్థితి ఉందని, ఒకవేళ అలా చెబితే, నిరసన వ్యక్తం చేస్తే ప్రాక్టికల్స్‌లో తక్కువ మార్కులు వేస్తారన్న భయం వారిలో ఉంటోందని చెబుతున్నారు. కాగా ఎన్ఎంసీ తనిఖీలకు వచ్చే సమయానికి కాలేజీలు సర్దుబాట్లు చేస్తున్నాయి. నకిలీ బోధనా సిబ్బందితో ప్రైవేటు యాజమాన్యాలు నెట్టుకొస్తున్నాయి. అనేక కాలేజీలు సింథటిక్ బయోమెట్రిక్ ద్వారా ఒకరికి బదులు మరొకరితో హాజరు నమోదు చేయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. -
వైద్య విద్య కల ఛిద్రం.. ఇక ప్రైవేట్ ‘మెడిసిన్’!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కలలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిధ్రం చేసింది. ‘పీ 4’ జపం చేస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టే కుట్రకు తెర తీసింది. అందులో భాగంగానే ఐదు ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు రాకుండా తాజాగా అడ్డుపడింది. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభమైతే తమకు వైద్య విద్య చదివే అవకాశం లభిస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు కూటమి సర్కారు వెన్నుపోటు పొడిచింది. దీంతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం కోల్పోయింది. సాధారణంగా ముఖ్యమంత్రులంతా కొత్తగా వైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టి విద్యార్థులకు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. ఎన్ఎంసీ సీట్లు ఇస్తామన్నప్పటికీ మాకు వద్దని రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసిన దుస్థితి చంద్రబాబు పాలనలో ఏపీలో నెలకొంది. గత ప్రభుత్వం తలపెట్టిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను గుజరాత్ పీపీపీ మోడల్లో ప్రైవేట్‌కు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు వైద్య కళాశాలలకు కుట్రపూరితంగా ప్రభుత్వమే పొగ పెట్టింది. మరోవైపు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు వైద్య కళాశాలల నిర్మాణ పనులను ఇప్పటికే ప్రభుత్వం అటకెక్కించింది. వీటి ద్వారా వచ్చే ఏడాది అందుబాటులోకి రావాల్సిన వెయ్యికి పైగా ఎంబీబీఎస్ సీట్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు మెరుగుపడటంతోపాటు పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువలో అందుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రతి పార్లమెంట్ నియోజక వర్గానికి ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పాలని గత ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే మరింత మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలు అందుబాటులోకి వస్తాయి. బోధనాస్పత్రులకు వచ్చే రోగులకు సులభంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి. తద్వారా పోటీతత్వం పెరిగి ప్రైవేట్ రంగంలో కూడా వైద్య చికిత్స వ్యయం తగ్గుతుంది. అయితే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన కూటమి సర్కారు ప్రైవేట్ పాట పాడుతోంది.సర్వం సిద్ధం చేసినా ససేమిరా..2024–25 విద్యా సంవత్సరం నుంచి మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లు ప్రారంభించేలా వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్ కృషి చేశారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ఐదు చోట్ల బోధనాస్పత్రులను అభివృద్ధి చేశారు. కళాశాల, బోధనాస్పత్రుల్లో అవసరమైన పోస్టులను మంజూరు చేసి ఎన్నికలు ముగిసే నాటికి 70–80 శాతం పోస్టుల భర్తీ చేపట్టారు. తొలి ఏడాది తరగతులు ప్రారంభించడానికి వీలుగా కళాశాలలో సెమినార్ హాల్, ల్యాబొరేటరీ, లైబ్రరీ, హాస్టళ్ల నిర్మాణాలు 80 శాతం పూర్తి అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని ప్రైవేట్‌పరం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు సాధించకుండా పొగ పెట్టింది.వద్దని ప్రభుత్వమే లేఖ..కొత్త కాలేజీల్లో తొలి విడత తనిఖీల అనంతరం ఐదు చోట్ల స్వల్పంగా వనరుల కొరత ఉందని పేర్కొంటూ ఎన్ఎంసీ అనుమతులు నిరాకరించింది. ఎన్ఎంసీ గుర్తించిన అంశాలను మెరుగు పరచడానికి ఏమాత్రం చర్యలు తీసుకోకుండానే మొక్కుబడిగా చంద్రబాబు ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. అయినప్పటికీ గత ప్రభుత్వం కల్పించిన వసతుల ఆధారంగానే పులివెందుల వైద్య కళాశాలకు 50 సీట్లను మంజూరు చేస్తూ ఈ నెల 6వ తేదీన ఎన్ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ) ఇచ్చింది. అయితే ఈ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ఆ 50 సీట్లతో కళాశాలలను ప్రారంభించేందుకు మనస్కరించలేదు. దీంతో 50 సీట్లు మంజూరు చేసినప్పటికీ కళాశాలలో మేం వసతులు కల్పించలేమని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసింది. ఫలితంగా చేసేదేమీ లేక 50 సీట్లతో ఇచ్చిన ఎల్‌ఓపీని విత్‌డ్రా చేసినట్టు ఎన్ఎంసీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అనుమతులు రద్దు చేసినట్టు స్పష్టం చేసింది.ఉసూరుమన్న విద్యార్థులు, తల్లిదండ్రులుపులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేసినట్లు ఎన్ఎంసీ ప్రకటించిన అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కన్వీనర్ కోటా ఆప్షన్ల నమోదు గడువును పొడిగించింది. బుధవారం (11వ తేదీ) రాత్రితో గడువు ముగిసింది. దీంతో కొత్తగా మంజూరైన పులివెందుల కాలేజీలో ప్రవేశాలు పొందవచ్చని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశ పడ్డారు. అయితే ఆ కళాశాల ఆప్షన్లలో కనిపించకపోవడంతో ఉసూరుమన్నారు.అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే..సాధారణంగా వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ తొలి విడత తనిఖీల అనంతరం వసతుల కొరత ఉంటే అనుమతులివ్వదు. ఆ లోపాలను సవరించుకుని అప్పీల్‌కు వెళితే రెండో విడత తనిఖీలు చేసి అనుమతులిస్తారు. అదే ప్రభుత్వ కళాశాలలైతే తరగతులు ప్రారంభం అయ్యే నాటికి వసతుల కల్పన చేపడతామని ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇస్తే ఎన్ఎంసీ ఎల్ఓపీ ఇచ్చేస్తుంది. గతేడాది నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలకు అండర్ టేకింగ్ ఇచ్చి వంద శాతం సీట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం రాబట్టింది. అదే తరహాలో ప్రస్తుతం కూటమి సర్కారు కూడా అండర్ టేకింగ్ ఇచ్చి ఉంటే వంద శాతం సీట్లకు అనుమతులు లభించి ఉండేవన్న అభిప్రాయం వైద్య వర్గాల్లో వ్యక్తం అవుతోంది. నిర్మాణాల నిలుపుదలప్రై వేట్‌పరం చేయడంలో భాగంగా నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను సైతం కూటమి సర్కారు నిలిపివేసింది. ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు కళాశాలలతో పాటు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు కళాశాలల నిర్మాణం కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం పీపీపీ విధానంలో ముందుకు వెళ్లనుందని, అందువల్ల నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఆదోని, పెనుకొండ కళాశాలల నిర్మాణం ఎక్కడికక్కడే నిలిపివేయాలని కర్నూలు సర్కిల్ ఏపీఎంఎస్ఐడీసీ ఎస్ఈ లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చారు. వందేళ్ల చరిత్రలో తొలిసారిగా..2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పించింది. 1923లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు.మోసం చేశారు..నీట్ యూజీలో నేను 593, నా సోదరి 555 స్కోర్ చేశాం. గతేడాదితో పోలిస్తే కటాఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. రెండేళ్లు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నా సీట్ రావడం కష్టంగా ఉంది. గతేడాది ఏపీకి అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ఈసారి కూడా 750 సీట్లు అదనంగా వస్తే వైద్య విద్య అవకాశాలు పెరిగి మా కల నెరవేరుతుందని భావించాం. కానీ కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు రాలేదు. పులివెందుల కాలేజీకి 50 సీట్లతో అనుమతులు వచ్చాయని ఎన్ఎంసీ ప్రకటించినా కౌన్సెలింగ్‌లో చూపించడం లేదు. దీనివల్ల నాలాంటి ఎందరో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొత్త కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ మాట నిలబెట్టుకోకుండా మమ్మల్ని మోసం చేసింది.– నల్లగట్ల సుధీష్ రెడ్డి, రాజంపేట, అన్నమయ్య జిల్లా -
కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు 112 దరఖాస్తులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా 2024–25 విద్యా సంవత్సరంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు సంబంధించిన దరఖాస్తులను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పరిశీలించింది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు కోసం 112, ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు 58 దరఖాస్తులు వచి్చనట్టు వెల్లడించింది. కాగా, ఏపీలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు ఐదు దరఖాస్తులు అందినట్టు తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.8 వేల కోట్లకు పైగా వ్యయంతో రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను 2023–24 విద్యా సంవత్సరంలో ప్రారంభించింది. ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లను విద్యార్థులకు అందుబాటులోకి తెచి్చంది. కాగా వచ్చే విద్యా సంవత్సరం (2024–25)లో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పాడేరుల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు వైద్య శాఖ దరఖాస్తు చేసింది. అలాగే మరో ఏడు వైద్య కళాశాలలను 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించడానికి వీలుగా బోధనాస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మొత్తం 17 వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మన విద్యార్థులకు 2,550 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెస్తోంది. తద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న వైద్య విద్యను వారికి చేరువ చేస్తోంది. ఐదు దశల్లో అనుమతుల ప్రక్రియ కొత్త కళాశాలలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను ఎన్ఎంసీ ఐదు దశల్లో చేపడుతోంది. తొలి దశలో దరఖాస్తుల పరిశీలన అనంతరం నిబంధనల ప్రకారం ధ్రువపత్రాలు సమరి్పంచని, బోధనాస్పత్రుల్లో పడకలు, ఫ్యాకలీ్ట, ఇతర అంశాల్లో లోటుపాట్లు ఉన్న కళాశాలలకు నోటీసులు జారీ చేస్తోంది. వివరణ ఇవ్వడానికి కళాశాలలకు గడువు విధించింది. ఈ ప్రక్రియ ముగిశాక రెండో దశలో ఫ్యాకల్టీ ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్) నమోదు చేపట్టనుంది. ఈ రెండు దశల ప్రక్రియ ముగియడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉంది. అనంతరం మూడో దశలో కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఎన్ఎంసీ తనిఖీలు చేపట్టనుంది. నాలుగో దశలో కళాశాలలపై సమీక్ష చేపడుతుంది. ఐదో దశలో అనుమతులు జారీ చేస్తుంది. -
ఎంబీబీఎస్ విద్యార్థులకు స్టైపెండ్ చెల్లించండి
న్యూఢిల్లీ: దేశంలో 70 శాతం వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ విద్యార్థులకు సక్రమంగా స్టైపెండ్ చెల్లించకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత జరుగుతున్నా జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఏం చేస్తోందని నిలదీసింది. స్టైపెండ్ చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీ విద్యార్థుల నుంచి భారీగా డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేస్తుంటాయని పేర్కొంది. ఎంబీబీఎస్ విద్యార్థులు నిర్బంధ కారి్మకులు కాదని తేలి్చచెప్పింది. వారికి తక్షణమే స్టైపెండ్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఎన్ఎంసీని ఆదేశించింది. -
భారతీయ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: భారతీయ వైద్య విద్యార్థులకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ గుడ్ న్యూస్ అందించింది. ఇకపై భారత్‌లో మెడికల్ గ్రాడ్యూయేట్ పూర్తి చేసిన విద్యార్థులు విదేశాల్లో కూడా ప్రాక్టిస్ చేయోచ్చని పేర్కొంది. ఈ మేరకు రల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యూకేషనల్ (WFME) నుంచి జాతీయ వైద్య మండలి (NMC) పది సంవత్సరాల వరకు గుర్తింపు పొందింనట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ గుర్తింపుతో భారత్‌లో వైద్య విద్యనభ్యసించిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌లలో పీజీ కోర్సుల్లో చేరడంతో పాటు ప్రాక్టీస్ చేయవచ్చు. 2024 నుంచి భారతీయ వైద్య విద్యార్థులు విదేశాల్లో విద్య, ప్రాక్టీస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెసులుబాటుతో ఇప్పటికే దేశంలో ఉన్న 706 మెడికల్ కాలేజీలతోపాటు రాబోయే 10 ఏళ్లలో కొత్తగా ఏర్పాటు చేయబోయే కళాశాలలు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు పొందనున్నాయి. దీని వల్ల దేశంలో వైద్య విద్య ప్రమాణాలు మెరుపడటమే కాకుండా భారతీయ వైద్య విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా అపార అవకాశాలు లభించనున్నాయి ఈ సందర్భంగా ఎన్ఎమ్సీలోని ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు సభ్యుడు యోగేందర్ మాలిక్ మాట్లాడుతూ.. WFME గుర్తింపుతో భారతీయ వైద్య విద్య అంతార్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. దీనివల్ల భారతీయ వైద్య కళాశాలలకు, నిపుణులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా తమ కెరీన్‌ను కొనసాగించవచ్చని తెలిపారు. ఎన్ఎమ్సీ అంతర్జాయంగా గుర్తింపు పొందడం ద్వారా విదేశీ విద్యార్థులను భారత వైద్య కళాశాలు ఆకర్షిస్తాయని చెప్పారు. కాగా డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ అనేది ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన వైద్య విధ్యను అందించేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థ. డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు ప్రక్రియ కోసం ప్రతి వైద్య కళాశాల నుంచి 60 వేల డాలర్లు రుసుము వసూలు చేస్తోంది. దీంతో దేశంలోని 706 వైద్య కళాశాలలు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు కోసం మొత్తంగా సుమారు 4,23,60,000 డాలర్లు ఖర్చు చేయనుంది. చదవండి: గణతంత్ర వేడుకలకు బైడెన్!.. ఆహ్వానించిన ప్రధాని మోదీ -
AP: మరో 5 మెడికల్ కాలేజీలు
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మరో ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కళాశాలల ప్రారంభానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కి ఆ కళాశాలల ప్రిన్సిపల్స్ దరఖాస్తు చేశారు. పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లెలో ఈ కళాశాలలు నిర్మిస్తున్నారు. ఒక్కో కాలేజిలో 150 సీట్లతో 2024–25 విద్యా సంవత్సరం నుంచి అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించడానికి దరఖాస్తు చేశారు. అంటే మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయి. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వీటిలో ఒక్కో కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున మొత్తం 3,530 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టులను భర్తీ చేసి, కళాశాలలకు అనుమతి కోసం దరఖాస్తు చేశారు. ఈ ఐదు చోట్ల ఉన్న ఏపీవీవీపీ ఆస్పత్రులను ప్రభుత్వం 330 పడకల బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేస్తోంది. వీటిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభానికి వీలుగా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్ వంటి వివిధ విభాగాలను ఏర్పాటు చేసింది. రూ.8,480 కోట్లతో 17 కళాశాలలు ప్రజలకు ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్య వసతులు సమకూర్చడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రూ.16వేల కోట్లకు పైగా ఖర్చుతో నాడు–నేడు కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.8,480 కోట్లతో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాలేజీల ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి తెస్తున్నారు. ఇటీవలే సీఎం వైఎస్ జగన్ నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలలను ప్రారంభించారు. వీటి ద్వారా 750 సీట్లు అదనంగా వచ్చాయి. ఈ కళాశాలల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ఐదు కొత్త కాలేజీల ద్వారా మరో 750 సీట్లు సమకూరనున్నాయి. ఇక మిగిలిన ఏడు వైద్య కళాశాలలను 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించనున్నారు. అన్ని వనరులతో వైద్య కళాశాలలు కొత్తగా ప్రారంభించే వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా అన్ని వనరులను ప్రభుత్వం సమకూరుస్తోంది. సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలలు ప్రారంభించడానికి ఎన్ఎంసీకి దరఖాస్తు చేశాం. అదే విధంగా ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించిన ఐదు కళాశాలలకు ఫస్ట్ రెన్యువల్‌కు దరఖాస్తు చేశాం. – డాక్టర్ నరసింహం, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ -
రోగాలను బట్టి పీజీ మెడికల్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: ఆయా ప్రాంతాల్లో వ్యాధులు.. రోగుల సంఖ్య..అందుతున్న వైద్య సేవలను బట్టి మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు కేటాయించాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది. అంటే ఏ ప్రాంతంలో ఎలాంటి రోగాలున్నాయో, ఆయా ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీలకు ఆయా స్పెషాలిటీల్లో పీజీ మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మేరకు కొత్త పీజీ మెడికల్ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం.. మెడికల్ కాలేజీలో సంబంధిత స్పెషాలిటీ వైద్యంలో ఔట్ పేషెంట్ (ఓపీ)ల సంఖ్య 50కి తగ్గకుండా ఉంటేనే రెండు ఎండీ లేదా ఎంఎస్ సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేస్తుంది. ఉదాహరణకు ఒక మెడికల్ కాలేజీకి రెండు పీడియాట్రిక్ సీట్లు కావాలంటే సంబంధిత కాలేజీలో రోజుకు చిన్న పిల్లల ఓపీ కనీసం 50 ఉండాలి. ఒక ఆపరేషన్ థియేటర్ 24 గంటలు పనిచేస్తేనే రెండు పీజీ అనస్తీషియా సీట్లు ఇస్తారు. వారానికి 20 ప్రసవాలు జరిగితేనే రెండు గైనిక్ సీట్లు ఇస్తారు. ఇక సంబంధిత స్పెషాలిటీలో అదనంగా మరో సీటు కావాలంటే 20 శాతం ఓపీ పెరగాలి. సూపర్ స్పెషాలిటీకి సంబంధించి రెండు సీట్లు కేటాయించాలంటే ఆయా సూపర్ స్పెషాలిటీ విభాగంలో రోజుకు 25 ఓపీ ఉండాలి. పడకల్లో 75% ఆక్యుపెన్సీ ఉండాలి ఎన్ఎంసీ మరికొన్ని కొత్త నిబంధనలను కూడా ముసాయిదాలో చేర్చింది. మెడికల్ కాలేజీల్లోని స్పెషాలిటీ పడకల్లో 75 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. అల్ట్రా సౌండ్లు రోజుకు 30 జరగాలి. 10 సీటీ స్కాన్లు చేయాలి. రోజుకు మూడు ఎంఆర్ఐ స్కాన్లు తీయాలి. రోజుకు 15 శాతం మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. గతంలో ఇలాంటి నిబంధనలు లేవు. సంబంధిత స్పెషాలిటీలో నిర్ణీత ఓపీ సంఖ్యతో సంబంధం లేకుండా మౌలిక సదుపాయాలు, సర్జరీలు, అన్ని రకాల ఓపీలు, ఐపీలు, బ్లడ్ బ్యాంకు నిర్వహణ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలు ఉన్నాయా లేవా? వంటివి మాత్రమే చూసి సీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రధానంగా ఓపీని ప్రామాణికంగా తీసుకొని ఇవ్వాలని నిర్ణయించారు. ఐసీఎంఆర్ ఆన్లైన్ కోర్సులు చదవాలి ఎండీలో కొత్తగా 3 కోర్సులను ఎన్ఎంసీ చేర్చింది. ప్రజా రోగ్యం, బయో ఫిజిక్స్, లేబొరేటరీ మెడిసిన్లను ప్రవేశపెట్టింది. అలాగే సూపర్ స్పెషాలిటీలో ఉండే చిన్న పిల్లల గుండె, రక్తనాళాల కోర్సులను ఎత్తివేసి, సాధారణ గుండె, ఛాతీ, రక్తనా ళాల సర్జరీలో చేర్చింది. సూపర్ స్పెషాలిటీలో ఉన్న ఛాతీ శస్త్రచి కిత్స కోర్సును ఎత్తివేసి సాధారణ గుండె శస్త్రచికిత్సలో కలి పేసింది. అలాగే 11 పోస్ట్ డాక్టర్ సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపె ట్టింది. అవయవ మార్పిడి అనెస్తీషియా, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ, లేబొరేటరీ ఇమ్యునాలజీ, న్యూక్లియర్ నెఫ్రాలజీ, రీనాల్ పెథాలజీ, గ్యాస్ట్రో రేడియాలజీ, రక్తమార్పిడి థెరపీ, పెయిన్ మేనేజ్మెంట్, హిమటో ఆంకాలజీ, పీడియాట్రిక్ ఈ ఎన్టీ, స్పైన్ సర్జరీ కోర్సులు ప్రవేశపెట్టారు. పీజీ అయిపో యిన వారు ఈ కోర్సులను చేసే సదుపాయం కల్పించారు. ప్రతి పీజీ విద్యార్థి మొదటి ఏడాది ఐసీఎంఆర్ నిర్వహించే ఆన్ లైన్ కోర్సులు తప్పనిసరిగా చదవాలి. ఈ ముసాయిదా లోని అంశాలపై అభ్యంతరాలను 15లోగా తెలియజేయాలన్నారు. ఇలా అయితేనే ఉపయోగం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించాయి. అందువల్ల ఆయా మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ సీట్లను స్థానిక రోగాలను బట్టి కేటాయిస్తేనే ఉపయోగం ఉంటుంది. ఎన్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో శాస్త్రీయ మైనది. ఆయా ప్రాంతాల రోగులకు సంబంధిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ కిరణ్ మాదల,ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
ఇది సరైన ఔషధమేనా?
జనరిక్ ఔషధాల వినియోగాన్ని మెరుగ్గా అమలు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ఖరీదైన కంపెనీ మందుల బదులు చౌకగా లభించే జనరిక్ ఔషధాలనే తప్పక రాయాలంటూ వైద్యులకు ఆదేశాలిచ్చింది. వైద్యం ఖరీదవుతున్న వేళ సామాన్యులకు సాంత్వననిచ్చే ఆదేశాలు స్వాగతించాల్సినవే. ఈ విషయంలో ఎన్ఎంసీ మార్గదర్శకాలివ్వడం ఇదేమీ తొలిసారి కాదు. మునుపెప్పుడో ఇచ్చినా, వాటి అమలు అంతంత మాత్రమైంది. అందుకే, ఈసారి ఆదేశాలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరించింది. ఇక్కడే తకరారు వచ్చింది. ఇది ‘పట్టాలు లేకుండా రైళ్ళు నడపడం లాంటిది’ అంటూ దేశంలోని వైద్యులకు అతి పెద్ద సంఘమైన భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) తప్పుపడుతోంది. ఈ విధాన నిర్ణయాలు తీసుకొనే ముందే జనరిక్ మందుల్ని ప్రోత్సహించి, నాణ్యమైనవి దొరికేలా చేయాల్సింది. అది చేయకుండా జరిమానా నిబంధనలు పెట్టడం ఏ మాత్రం సబబన్నది ఐఎంఏ వాదన. వెరసి, వృత్తి నిర్వహణకు సంబంధించి ఆగస్ట్ మొదట్లో అమలులోకి వచ్చిన కొత్త మార్గదర్శకాలపై చర్చ జరుగుతోంది. ఈ నిబంధనల ప్రకారం డాక్టర్లు ఇకపై మోతాదులో స్వల్పతేడా సైతం దుష్పరిణామాలకు దారి తీసే మందుల విషయంలో తప్ప, మిగతావన్నీ జనరిక్ మందులే సిఫార్సు చేయాలి. ఫలానా బ్రాండే వాడాలనకూడదు. తత్సమాన జనరిక్ ఔషధం పేరు రాయాలి. నిర్ణీత మోతాదులో, అనుమతించిన కాంబినేషన్లలోనే ఆచితూచి మందులు రాయాలి. స్పష్టంగా, అర్థమయ్యేలా, ఇంకా వీలుంటే ఇంగ్లీషులో పెద్ద బడి అక్షరాల్లో మందుల చీటీ రాయాలి. అర్థం కాని కోడిగీతల్లో రాస్తే గందరగోళ పడ్డ రోగులు పొరపాటుగా వేరే మందులు తీసుకొనే ప్రమాదం ఉందనేది అంతరార్థం. అలాగే రోగి పరిస్థితి, చికిత్స, ఫలితం లాంటివి డాక్టర్లు ట్విట్టర్ వగైరాల్లో చర్చించరాదంటూ రోగుల హక్కులు కాపాడేలా 11 అంశాలతో సోషల్ మీడియా మార్గదర్శకాలూ ఇచ్చింది. ఇవన్నీ మంచి మాటలే. బ్రాండెడ్ మందులతో పోలిస్తే, జనరిక్ ఔషధాలు సగటున 30 నుంచి 80 శాతం చౌకని ఓ లెక్క. అందువల్ల ఆ మేరకు ఆరోగ్యరక్షణ ఖర్చులు తగ్గుతాయి. సహజంగానే సామాన్యులకు అది పెద్ద ఊరట. అదే సమయంలో, డాక్టర్ల వాదన ఏమిటంటే – మిగిలే లాభం తక్కువ గనక అన్ని ఫార్మ సీలూ అన్నిరకాల జనరిక్ మందులనూ నిల్వ చేయవు. డాక్టర్ రాసిచ్చిన మందు లేనప్పుడు నిర్ణయం షాపువాడి చేతిలోకి వస్తుంది. అప్పుడు నాణ్యతతో సంబంధం లేకుండా, ఎక్కువ లాభం మిగిలే మందులను అంగట్లో అంటగట్టే ప్రమాదం ఉంది. అంతేకాక, వైద్యులు తమ అనుభవం కొద్దీ రోగికి సరిపోయే మందు రాయడానికి వీలు లేకుండా పోతుందనీ, కంపెనీలను బట్టి జనరిక్ ఔషధాల నాణ్యతలోనూ తేడాలు తప్పవు గనక చికిత్స సమర్థంగా సాగదనీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో నాణ్యతా ప్రమాణాల నియంత్రణ అంతంత మాత్రమే. కాబట్టి ఈ ఆందోళనను అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. నాణ్యతకు హామీ లేకపోతే, మందుల్ని వాడినా ప్రయోజనం ఉండదన్నది నిష్ఠురసత్యం. ఈ రకమైన చికిత్స, ఔషధ వినియోగంతో వ్యాధి తగ్గకుంటే రోగికి నష్టం, డాక్టర్ పేరుకూ దెబ్బ. ఇన్ని లోతుపాతులున్న అంశంపై నిర్ణయాలు ప్రకటించే ముందు సంబంధిత వర్గాలన్నిటితో సమగ్రంగా చర్చించడం తప్పక అవసరం. అదేమీ లేకుండా మార్గదర్శకా లను నోటిఫై చేశారని వైద్యవర్గాల ఆరోపణ. నిజానికి, దేశంలోని జనరిక్ ఔషధాల నాణ్యత విషయంలో చేయాల్సింది చాలా ఉంది. అది డాక్టర్లు, మందుల ఉత్పత్తిదార్లు, పాలకులు – అంతా అంగీకరించే మాటే. తయారయ్యే మందుల్లో అన్ని బ్యాచ్‌లకూ ప్రభుత్వం నాణ్యతా పరీక్ష చేయడం ఆచరణ సాధ్యం కాదు. కేవలం 0.1 శాతం మందులకే పరీక్షలు జరుగుతున్నాయట. గత మూడేళ్ళ కాలంలో జనరిక్, బ్రాండెడ్ జనరిక్, బ్రాండెడ్ మందులన్నిటికీ జరిపిన పరీక్షల్లో దాదాపు 3 శాతం ప్రమాణాల మేరకు నాణ్యంగా లేవని సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మందుల తయారీలో నిర్దుష్టమైన విధానాల్ని అనుసరించడమే నాణ్యతను సాధించ డానికి మూల మంత్రం. పాలకులు అందుకు కట్టుదిట్టమైన విధివిధానాలు పెట్టాలి. ఆ మాటకొస్తే కొన్నేళ్ళ క్రితం దాకా జనరిక్స్ తయారీ సంస్థలకు కొన్ని టెస్ట్‌లు తప్పనిసరి కాదు. బ్రాండెడ్ మందులకు సమానంగా జనరిక్ మందు స్పందిస్తున్నట్టు నిర్ధరించే బయో–ఈక్వలెన్స్ పరీక్ష కానీ, నిర్ణీత వాతావరణ పరిస్థితుల్లో ఔషధ నాణ్యత ఏ మేరకు మారుతుందో చూసే స్టెబిలిటీ అధ్యయనాలు కానీ జరపకుండానే బండి నడిచింది. ఇప్పుడవి తప్పనిసరి చేశారు. కానీ, అవేవీ జరగకుండానే బయటకొచ్చిన జనరిక్స్ చాలానే ఇప్పటికీ విపణిలో ఉన్నట్టు ఔషధరంగ నిపుణులు అంగీకరిస్తున్నారు. అందుకే, ఇప్పటికైనా నిబంధనల అమలును వాయిదా వేసి, అన్ని వర్గాలతో కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయి సంప్రతింపులు జరపాలన్నది వైద్య సంఘం డిమాండ్. వైద్యవృత్తికి సంబంధించి నియంత్రణాధికారాలున్న ఎన్ఎంసీ ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. వైద్యులు నిరంతరం తమ వృత్తినైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్న మార్గదర్శకం ఆచరణలో ఏ మేరకు సాధ్యమో ఆలోచించాలి. పర్యవేక్షించే విధానమేమిటో చెప్పాలి. అన్నిటి కన్నా ముందు బ్రాండెడ్‌కు దీటుగా జనరిక్ ఔషధాలు పనిచేస్తాయనే భరోసా ప్రజల్లో కల్పించాలి. షాపుల్లో ఈ రకం ఔషధాలన్నీ పెద్దయెత్తున నిల్వ ఉండేలా, జన్ ఔషధీ కేంద్రాలు ఊరి నలుమూలలా నెలకొనేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ఆ పని చేయకుండా మార్గదర్శకాలు, జరిమానాలంటూ హడావిడి చేస్తే ఏం లాభం? పుండు ఒకచోట ఉంటే, మందు మరొకచోట రాసినట్టే! -
ఆన్లైన్ కౌన్సెలింగ్‌తోనే వైద్య సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ల బ్లాకింగ్‌కు చెక్ పెట్టే దిశగా జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారానే అన్ని సీట్లను భర్తీ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్ష (ఫిజికల్) కౌన్సెలింగ్ చేపట్టవద్దని స్పష్టం చేసింది. పలుమార్లు ఆన్లైన్ కౌన్సెలింగ్‌లు నిర్వహించాలని, అప్పటికీ సీట్లు మిగిలిపోతే వాటికి ప్రత్యక్ష కౌన్సెలింగ్ నిర్వహించకుండా అలాగే వదిలేయాలని సూచించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ప్రతిభకు న్యాయం 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్ఎంసీ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో సీట్ల బ్లాకింగ్ నిలిచిపోతుందని, ఫలితంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. అభ్యర్థుల ఫిర్యాదులు, కోర్టు కేసులను పరిష్కరించడంలో ఇది సాయపడుతుందని ఎన్ఎంసీ కూడా స్పష్టం చేసింది. కాగా ఈసారి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ యాజమాన్య సీట్లు దాదాపు 50కు పైగా, పీజీ మెడికల్‌లో 30కి పైగా మిగిలిపోయే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. బ్లాకింగ్‌తో కోట్లు దండుకున్న కాలేజీలు! గతేడాది వరకు ఎంబీబీఎస్, పీజీ సీట్ల బ్లాకింగ్‌తో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అక్రమ వ్యాపారం చేశాయనే ఆరోపణలున్నాయి. ప్రతిభ కలిగిన విద్యార్థులు తమ కాలేజీల్లోని ఏ, బీ కేటగిరీ సీట్లలో చేరేలా యాజమాన్యాలు ముందస్తు అవగాహన కుదుర్చుకునేవి. దీంతో ఈ కేటగిరీలకు రెండు విడతల కౌన్సెలింగ్, చివరి మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్‌లు పూర్తయ్యేవరకు ఉత్తమ ర్యాంకర్లు తమ సీట్లను అలాగే అట్టిపెట్టుకునేవారు. అన్ని కౌన్సెలింగ్‌లూ పూర్తయిన తర్వాత ఒకవేళ సీట్లు మిగిలితే అవి ఆటోమెటిక్‌గా సీ (ఎన్ఆర్ఐ) కేటగిరీ సీట్లుగా మారిపోతాయి. ఆ సమయంలో అప్పటికే ఫీజు చెల్లించిన మెరిట్ విద్యార్థులు ముందుగా కుదుర్చుకున్న అవగాహన మేరకు తమ సీట్లు వదిలేసుకునేవారు. దీంతో ఇవి కూడా నిబంధనల ప్రకారం సీ కేటగిరీ సీట్లుగా మారిపోతాయి. వీటికి అభ్యర్థులతో ప్రత్యక్ష కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా ప్రైవేట్ కాలేజీలు కోట్లు దండుకునేవి. కన్వీనర్ కోటాకు ఏడాదికి రూ.60 వేలు, బీ కేటగిరీ సీటుకు రూ.11.55 లక్షల ఫీజు ఉంటుంది. ఇక సీ కేటగిరీ సీటుకు బీ కేటగిరీ సీటు కంటే రెట్టింపు ఫీజు ఉంటుంది. అంటే ఏడాదికి రూ.23.10 లక్షల వరకు ఉంటుందన్న మాట. ఇలా కోర్సు మొత్తానికి కోటికి పైగా వసూలు చేస్తారు. రూ.60 వేలున్న కన్వీనర్ కోటా సీటును కూడా అదే రేటుకు అమ్ముకునేవారు. ఇక అవగాహన మేరకు వర్సిటీకి రూ.3 లక్షల జరిమానా చెల్లించి మరీ సీట్లు వదులుకున్న విద్యార్థులకు వాళ్లు చెల్లించిన ఫీజుతో పాటు రూ.10 లక్షల వరకు అదనంగా యాజమాన్యాలు చెల్లిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ విద్యార్థులు ఆ తర్వాత ఇతర కాలేజీల్లో చేరిపోయేవారు. ఇతర రాష్ట్రాల ముఠాల ప్రమేయం గతంలో మాదిరిగానే ఏ, బీ కేటగిరీ సీట్లను సీ కేటగిరీగా మార్చుకునేలా యాజమాన్యాలు విద్యార్థులకు వల వేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ దందాలో అనేక ఇతర రాష్ట్రాల ముఠాలు, ప్రైవేటు కాలేజీలు, కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాలుపంచుకుంటున్నట్లు తెలిసింది. గతంలో కర్ణాటకలో జరిగిన ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణంలో కాలేజీల చైర్మన్లు, వైద్యాధికారులు కూడా ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఇదంతా గుట్టుగా సాగిపోతుండటం గమనార్హం కాగా.. ఎన్ఎంసీ తాజా నిర్ణయంతో సీట్ల బ్లాకింగ్‌కు చెక్ పడుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. -
ఎందుకో బిల్ కౌంటర్ దగ్గరే అనుచితంగా ప్రవర్తిస్తున్నారు!!
ఎందుకో బిల్ కౌంటర్ దగ్గరే అనుచితంగా ప్రవర్తిస్తున్నారు!! -
ఆర్ఎంపీలకు కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్ఎంపీ) వైద్యులకి జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కొత్త నియంత్రణలు విధించింది. ఫార్మా కంపెనీలు, వారి ప్రతినిధులు, వైద్య పరికరాల సంస్థల దగ్గర్నుంచి వైద్యులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి కానుకలు, డబ్బులు, ఆతిథ్యం స్వీకరించకూడదని నిబంధనలు విధించింది. ఫార్మా కంపెనీలు ఇచ్చే పార్టీల్లో పాల్గొనడం, ప్రయాణ సదుపాయాలను తీసుకోవడం వంటివి చేయకూడదని పేర్కొంది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు వృత్తిపరమైన బాధ్యతని కలిగి ఉంటూ ప్రవర్తించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగస్టు 2నే ఈ నిబంధనల్ని జారీ చేసింది. అంతే కాదు ఫార్మా కంపెనీలు తయారు చేసే మందులు ఇతర పరికరాల వినియోగాన్ని ఆమోదిస్తూ ప్రకటనలివ్వకూడదంది. -
ఎన్ఎంసీ తీరు మారాలి
దేశంలో వైద్య విద్య పర్యవేక్షణకు నెలకొల్పిన భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) భ్రష్టుపట్టిందనీ, దాని ప్రక్షాళన అసాధ్యమనీ పదమూడేళ్ల క్రితం సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆ తర్వాత 2019లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు చట్టమై జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ఆవిర్భవించింది. 2020 సెప్టెంబర్ నుంచి కొత్త సంస్థ పనిచేయటం ప్రారంభమైంది. పాత వ్యవస్థలోని లోపాలనూ, దోషాలనూ పరిహరించి కొత్త వ్యవస్థ వస్తున్నదంటే ఎవరైనా స్వాగతిస్తారు. కానీ ఈ మూడేళ్లలో ఎన్ఎంసీ ఆచరణ సరిగా ఉందా లేదా అన్నదే ప్రశ్న. కొత్త చట్టం వచ్చినప్పుడూ, కొత్త వ్యవస్థలు రూపుదిద్దుకున్నప్పుడూ సంబంధిత రంగాల్లోనివారు నిశితంగా గమనిస్తారు. అవి తమ ఆశలకూ, ఆకాంక్షలకూ అనుగుణంగా ఉన్నాయో లేదో తరచి చూస్తారు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక వైద్య వృత్తిలో ప్రవేశించేందుకైనా, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోరడానికైనా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్(నెక్ట్స్) పేరిట జరిగే ఉమ్మడి ప్రవేశపరీక్ష రాయాల్సిందేనన్న నిబంధనను బిల్లుపై పార్లమెంటు చర్చిస్తున్న సమయంలోనే వైద్యరంగ నిపుణులు, వైద్య విద్యార్థులు గట్టిగా వ్యతిరేకించారు. అలాగే ఫీజుల నిర్ణయం విషయంలోనూ ఆందోళన వ్యక్తమైంది. వారి అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ అది చట్టంగా మారింది. దాని సంగతలావుంచి కొత్త వ్యవస్థ అయినా పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదా? దేశవ్యాప్తంగా 38 వైద్య కళాశాలల గుర్తింపు రద్దు చేస్తున్నట్టు ఈమధ్యే ఎన్ఎంసీ ప్రకటించింది. మరో వందకు పైగా వైద్య కళాశాలల్లో అనేక లోటుపాట్లను గుర్తించి వాటిని సరిచేసుకోనట్టయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిజానికి గతంలో ఎంసీఐ సైతం ఇలాంటి తనిఖీలే చేస్తుండేది. చర్యలు తీసుకునేది. అయినా దానిపై ఎందుకు ఆరోపణలొచ్చేవో, అది ఎందుకు భ్రష్టుపట్టిపోయిందో కొత్త వ్యవస్థ సారథులు సరిగా అర్థం చేసుకున్నట్టు లేరు. వచ్చే నెలలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ ప్రవేశాలుంటాయి గనుక ఎన్ఎంసీ ముందుగానే వైద్య కళాశాలలను తనిఖీ చేయటం మెచ్చదగింది. గుర్తింపు రద్దు చేసినంత మాత్రాన వెంటనే ఆ కళాశాలలకు కేటాయించిన సీట్లన్నీ రద్దుకావు. అవి సకాలంలో మేల్కొని దిద్దుబాటు చర్యలు తీసుకుని, తిరిగి దరఖాస్తు చేసుకుంటే ఎన్ఎంసీ పరిశీలించి అనుమతులు పునరుద్ధరిస్తుంది. అలాగే ఎన్ఎంసీ సంతృప్తి చెందని పక్షంలో సంబంధిత కళాశాల కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను కూడా ఆశ్రయించే వెసులుబాటుంది. వైద్య కళాశాలలపై ప్రధానంగా బోధనా సిబ్బంది కొరత విషయంలోనే ఆరోపణలొస్తున్నాయి. రెసిడెంట్ డాక్టర్ల సమస్య సరేసరి. ఇక ఇత రేతర మౌలిక సదుపాయాల లేమి సైతం ఎన్ఎంసీ కన్నెర్రకు కారణమవుతోంది. వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాల తీరుతెన్నులనూ, అక్కడి మౌలిక సదుపాయాల కల్పననూ మదింపు వేయటం చాలా అవసరం. అయితే ఆ ప్రక్రియలో పారదర్శకత లోపిస్తే మాత్రం ప్రయోజనం శూన్యం. వాస్త వానికి ఎన్ఎంసీ చట్టం–2019లోని సెక్షన్ 26(ఈ) ప్రకారం సంస్థకు చెందిన మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (మార్బ్) కళాశాల తీరుతెన్నులపై ఇచ్చే మదింపు, ఆ కళాశాలకిచ్చే రేటింగ్ అందరికీ అందుబాటులో ఉంచాలి. కానీ ఈ నెల మొదట్లో జారీ చేసిన కళాశాలల ఏర్పాటు, మదింపు, రేటింగ్ నిబంధనల్లోని సెక్షన్ 25 దీన్ని నీరుగారుస్తోంది. నిజానికి ఎన్ఎంసీ ఏర్పడింది మొదలు కళాశాలల మదింపు నివేదికల జాడే లేదు. సరిగదా అంతక్రితం ఎంసీఐ ఉన్నప్పుడు పొందుపరిచిన మదింపు నివేదికలు, రేటింగ్‌లు సైతం మాయమయ్యాయి. ఫలానా కళాశాలలో ఏ సదుపాయాలు లోపించాయో, దానిపై ఎందుకు చర్యలు తీసుకోవలసి వచ్చిందో, కాలక్రమంలో అది ఏయే అంశాల్లో మెరుగుపడిందో అందరికీ తెలియకపోతే ఎట్లా? ఇక ఆ తనిఖీల వల్ల సాధారణ విద్యార్థులకు ఒరిగేదేముంటుంది? విద్యార్థులు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకునే సమయంలో ఎన్ఎంసీ మదింపు నివేదికలు అందుబాటులో ఉంటే, కళాశాల పూర్వ చరిత్ర తెలిస్తే వారు మెరుగైన నిర్ణయం తీసుకోగలుగుతారు. అంతేతప్ప కేవలం అది ప్రకటించిన ఫలితాన్నీ, దాని రేటింగ్‌నూ చూసి ఎలా సరిపెట్టుకుంటారు? ఈ చిన్న విషయం ఎన్ఎంసీకి తెలియదా? ఇలాంటి ధోరణి అటు కళాశాలలకు సైతం నష్టం కలిగిస్తుంది. రేటింగ్ సరిగా లేని కళాశాలలో స్వల్ప లోటుపాట్లు మాత్రమే ఉండొచ్చు. అవి సరిచేసుకునే స్థాయిలోనే ఉండొచ్చు. కానీ ప్రత్యర్థి కళాశాలకు చెందినవారు మాత్రం ఆ లోపాలను భూతద్దంలో చూపి తప్పుడు ప్రచారానికి దిగొచ్చు. విద్యార్థులకు తగిన సమాచారం అందుబాటులో లేకపోవటంతో ఆ కళాశాలపై అనాసక్తి ప్రదర్శిస్తారు. ఎన్ఎంసీ తీరుపై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)కి చాన్నాళ్ల క్రితమే ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఆ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సీఐసీ మొన్న మార్చిలో ఆదేశాలు కూడా ఇచ్చింది. తీరా ఈ నెల మొదట్లో నోటిఫై చేసిన నిబంధనలు గమనిస్తే సీఐసీ ఆదేశాలు బేఖాతరైనట్టు అర్థమవుతుంది. గతంలో పనిచేసిన ఎంసీఐ అవినీతిమయం అయిందని రద్దు చేస్తే, దాని స్థానంలో వచ్చిన ఎన్ఎంసీ కూడా అదే బాటలో సాగుతున్నదన్న అభిప్రాయం కలిగిస్తే, పారదర్శకతకు పాతరేస్తే ఏమనాలి? ఇది సరికాదు. దేశంలోని ప్రతి వైద్య కళాశాలకు సంబంధించి ఎంసీఐ కాలంనాటి మదింపు నివేదికలు, రేటింగ్‌లతోపాటు ఎన్ఎంసీ గత మూడేళ్ల అంచనాలు సైతం అందరికీ అందుబాటులో ఉంచాలి. విద్యార్థులు మెరుగైన నిర్ణయం తీసుకొనేందుకు తోడ్పడాలి. -
మచిలీపట్నం వైద్య కళాశాలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి/మచిలీపట్నం టౌన్: కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు చేపట్టడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ), మెడికల్ అసెస్మెంట్ మరియు రేటింగ్ బోర్డు అనుమతులిచ్చింది. ఈ మేరకు గురువారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారికి ఎన్ఎంసీ నుంచి ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే ఏలూరు, నంద్యాల, విజయనగరం వైద్య కళాశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు మొదలు పెట్టడానికి లైన్‌క్లియర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మచిలీపట్నం కళాశాలకు కూడా గ్రీన్‌సిగ్నల్ రావడంతో నాలుగు వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 600 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా వచ్చినట్లైంది. మరోవైపు.. రాజమండ్రి వైద్య కళాశాలకు అనుమతులు రావాల్సి ఉంది. ఈ కళాశాలలో కూడా మరో 150 సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో ఈ ఏడాది ఏకంగా 750 ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాది ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమవుతుండటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మచిలీపట్నం మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ విజయకుమారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఈ ఏడాది తరగతుల నిర్వహణకు అన్నీ సిద్ధంచేశామని చెప్పారు. నూతన భవనాల్లో తరగతి గదుల నిర్మాణం పూర్తయ్యిందని.. ఫర్నిచర్, హాస్టల్‌కు అవసరమైన సామాగ్రి నెలాఖరుకుకల్లా వస్తుందన్నారు. రూ.8,480 కోట్లతో 17 వైద్య కళాశాలలు.. రాష్ట్రంలో వైద్య విద్యలో నూతన అధ్యాయానికి తెరతీస్తూ సీఎం జగన్ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రానున్న విద్యాసంవత్సరంలో ఐదుచోట్ల అడ్మిషన్లు ప్రారంభిస్తున్నారు. మరోవైపు.. 2024–25లో పులివెందుల, ఆదోని, పాడేరు కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించాలని కార్యాచరణ రూపొందించారు. ఇందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటవుతున్న 17 వైద్య కళాశాలల్లో మరో 2,100 ఎంబీబీఎస్ సీట్లు సమకూరనున్నాయి. ముఖ్యమంత్రికి ‘పేర్ని’ కృతజ్ఞతలు ఇక మచిలీపట్నంలో శరవేగంగా వైద్య కళాశాలను ఏర్పాటుచేస్తున్న సీఎం జగన్‌కి మాజీమంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని కృతజ్ఞతలు తెలిపారు. 67 ఎకరాల విస్తీర్ణంలో రూ.550 కోట్లతో వైద్య కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని.. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఇదే క్రమంలో రానున్న విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు చేపట్టడానికి అనుమతులు రావడం సంతోషకరమన్నారు. అలాగే, బందరు ప్రజల చిరకాల స్వప్నమైన పోర్టు నిర్మాణానికి ఈనెల 22న సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: హోంశాఖ సమీక్షలో సీఎం జగన్ కీలక ప్రకటన -
5 ఏళ్లు.. 50 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: వైద్య రంగంలో ఉపయోగించే పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగానే తయారీకి ఊతమివ్వడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ 2023కి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. వైద్య పరికరాల రంగం వచ్చే అయిదేళ్లలో 50 బిలియన్ డాలర్ల స్థాయికి (దాదాపు రూ. 4.1 లక్షల కోట్లు) చేరేందుకు ఇది తోడ్పడనుంది. భారత్‌లో వైద్య పరికరాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుండటంతో వీటిని దేశీయంగానే ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ సమావేశం అనంతరం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మీడియాకు తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో దిగుమతులు కూడా ఉంటాయని, అయితే సాధ్యమైనంత మేరకు స్థానిక అవసరాలకు అనుగుణంగా దేశీయంగానే ఉత్పత్తిని పెంచుకోవడమే కొత్త విధానం లక్ష్యమని వివరించారు. ఆరు వ్యూహాలు..: నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీలో ఆరు వ్యూహాలను నిర్దేశించుకున్నారు. నియంత్రణ విధానాలను క్రమబద్ధీకరించడం, మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధన.. అభివృద్ధి.. ఆవిష్కరణలకు తోడ్పాటు అందించడం, పరిశ్రమలోకి పెట్టుబడులను ఆకర్షించడం, మానవ వనరుల అభివృద్ధి, మన పరిశ్రమకు బ్రాండింగ్ సాధించడం .. అవగాహన కల్పించడం వంటివి ఈ వ్యూహాల్లో ఉన్నాయి. ఇటు భారత్, అటు ప్రపంచ హెల్త్‌కేర్ అవసరాలను తీర్చే దిశగా దేశీయంగా వైద్య పరికరాల రంగం స్వయం సమృద్ధి సాధించేలా, ఒడుదుడుకులను సమర్థంగా ఎదుర్కొంటూ పటిష్టమైన పరిశ్రమగా ఎదిగేలా అవసరమైన మద్దతు కల్పించి, దిశా నిర్దేశం చేసేందుకు ఈ పాలసీ ఉపయోగపడనుంది. ప్రధానంగా పేషంట్లను దృష్టిలో ఉంచుకుని, వారి అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను తయారు చేస్తూ వైద్య పరికరాల రంగం వేగవంతంగా వృద్ధి చెందేలా ఊతమివ్వాలని ఇందులో నిర్దేశించుకున్నారు. 11 బిలియన్ డాలర్ల పరిశ్రమ.. దేశీయంగా వైద్య పరికరాల మార్కెట్ 2020లో 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 90,000 కోట్లు) స్థాయిలో ఉందని అంచనా. అంతర్జాతీయంగా మెడికల్ డివైజ్‌ల మార్కెట్లో మన వాటా దాదాపు 1.5% వైద్య పరికరాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్రం ఇప్పటికే ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాన్ని అమలు చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్‌లో 4 మెడికల్ డివైజ్ పార్క్‌ల ఏర్పాటు కోసం తోడ్పాటు అందిస్తోంది. ఈ స్కీము కింద ఇప్పటివరకు రూ. 1,206 కోట్ల విలువ చేసే పెట్టుబడులతో 26 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. 37 ఉత్పత్తులను తయారు చేసే 14 ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు వివరించింది. వీటిలో లీనియర్ యాక్సిలరేటర్, ఎంఆర్ఐ స్కాన్, సీటీ–స్కాన్, మామోగ్రామ్, సీ–ఆర్మ్, ఎంఆర్ఐ కాయిల్స్, అధునాతన ఎక్స్–రే ట్యూబ్స్ మొదలైనవి ఉత్పత్తి చేస్తున్నారు. -
ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు.. జాతీయ మెడికల్ కమిషన్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాగింగ్ వంటి చర్యలకు పాల్పడరాదని.. అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) హెచ్చరించింది. విద్యార్థులు మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండాలని.. రోగులతో మర్యాదగా, సున్నితంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. మారుతున్న వైద్య విధానాలు, సాంకేతికత, చికిత్సలపై అవగాహన పెంచుకోవాలని సూచించింది. రోగులు, వారికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని పేర్కొంది. దేశంలో వైద్య విద్యార్థుల వృత్తిపరమైన బాధ్యతలపై ఎన్ఎంసీ తాజాగా మార్గదర్శకాలను జారీచేసింది. వైద్య విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఈ అంశాలు కీలకమని పేర్కొంది. వైద్య విద్యార్థులు రోగులతో సమర్థవంతంగా మాట్లాడటానికి స్థానిక భాష నేర్చుకోవాలని కోరింది. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, వైద్యారోగ్య అత్యవసర పరిస్థితుల వంటి సందర్భాల్లో వీలైనంత సాయం చేయాలని సూచించింది. శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి కేవలం చికిత్సకే పరిమితం కాకుండా వైద్యారోగ్య వ్యవస్థపై నమ్మకం కలిగేలా రోగి–వైద్యుడి సంబంధం ఉండాలని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని.. జాతీయ ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతలపై అవగాహన కలిగి ఉండాలని సూచించింది. కేవలం పుస్తకాల నుంచే మాత్రమే కాకుండా అధ్యాపకుల అపార అనుభవం, ఆచరణాత్మక బోధన నుంచి నేర్చుకోవాలని పేర్కొంది. విద్యార్థులు ప్రాక్టికల్ రికార్డులు, కేస్షీట్లను శ్రద్ధగా నిర్వహించాలని.. కాపీ చేయడం, తారుమారు చేయడం వంటివి చేస్తే తగిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. -
ఐదేళ్లలో 119 మంది మెడికోల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: దేశంలో 512 మెడికల్ కాలేజీల్లో 119 మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఆత్మహత్య చేసుకున్నవారిలో ఎంబీబీఎస్ తదితర వైద్య గ్రాడ్యుయేట్లు 64 మంది ఉండగా, 55 మంది ఎండీ, ఎంఎస్ చదువుతున్న విద్యార్థులున్నారని పేర్కొంది. వేధింపులు, ఒత్తిడి తదితర కారణాల వల్ల 1,166 మంది మధ్యలోనే వైద్యవిద్యను వదిలేసి వెళ్లిపోయారని వివరించింది. అందులో ఎంబీబీఎస్ విద్యార్థులు 160 మంది, పీజీలో ఎంఎస్ జనరల్ సర్జరీ విద్యార్థులు 114 మంది, ఎంఎస్ ఆర్థోపెడిక్స్ 50 మంది, గైనిక్ 103 మంది, ఎంఎస్ ఈఎన్టీ 100 మంది, పీజీ ఎండీ జనరల్ మెడిసిన్56 మంది, ఎండీ పీడియాట్రిక్స్ 54 మంది, ఇతర బ్రాంచీలకు చెందినవారు 529 మంది ఉన్నారని తెలిపింది. 18–30 ఏళ్ల మధ్యలో వైద్యవృత్తిలో తలెత్తే ఒడిదొడుకులను తట్టుకోలేక కొందరు యువవైద్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికలో వెల్లడించింది. వైద్య విద్యార్థుల్లో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) పాసయ్యేవారు 20 శాతం వరకే ఉంటున్నారు. ఎఫ్ఎంజీఈ పాసైతేనే మన దేశంలో మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్‌కు అర్హత ఉంటుంది. పీజీలో ఆర్థికభారం, వృత్తి బాధ్యతలు, పెళ్లికాకపోవడం వంటివి ఆత్మహత్యలకు కారణాలుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆత్మహత్యల్లో 60 శాతం ఒత్తిడికి సంబంధించినవే ఉంటున్నాయని వివరించారు. -
‘విదేశీ’ వైద్య విద్యార్థులకు ఇంటర్న్‌షిప్
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఎంబీబీఎస్, తత్సమాన మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు రాష్ట్రంలో కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ (సీఆర్ఎంఐ) చేసుకునేందుకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో రాష్ట్రంలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల వివరాలను పొందుపరిచింది. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ) పాసైన విద్యార్థులంతా రాష్ట్రంలో ఇంటర్న్‌షిప్ చేసుకోవచ్చని తెలిపింది. ఏడాది ఇంటర్న్‌షిప్ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వారికి స్టైపెండ్ కూడా ఇవ్వాలని ఎన్ఎంసీ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. త్వరలో ఇంటర్న్‌షిప్ కోసం ఎఫ్ఎంజీఈ పాసైన విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని కాళోజీ వర్సిటీ తెలి పింది. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. 3,833 మందికి ఇంటర్న్‌షిప్ అవకాశం.. కరోనా కాలంలోనూ, ఆ తర్వాత అనేకమంది విదేశీ ఎంబీబీఎస్ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. కొందరు అక్కడకు వెళ్లి చదవగా, చాలామంది ఆన్లైన్ క్లాసుల ద్వారా మెడికల్ కోర్సు పూర్తి చేశారు. అలా విదేశీ వైద్య విద్య పూర్తి చేసినవారు తర్వాత దేశంలో మెడికల్ రిజిస్ట్రేషన్, ప్రాక్టీస్ కోసం ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎఫ్ఎంజీఈ పరీక్ష పాసైన వారు ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంది. గతంలో విదేశీ గ్రాడ్యుయేట్ల కోసం కొన్ని కాలేజీల్లోనే ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉండగా, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 44 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్న్‌షిప్ చేయడానికి వీలు కల్పించారు. ప్రస్తుతం ఆయా కాలేజీల్లో 3,833 మంది ఇంటర్న్‌షిప్ చేయవచ్చు. ఇప్పటివరకు ఎంబీబీఎస్ బ్యాచ్ బయటకు రాని మెడికల్ కాలేజీల్లో ఆయా కాలేజీలకు చెందినవారు ఇంటర్న్‌షిప్ దశకు చేరుకోనందున, అక్కడ పూర్తిస్థాయిలో విదేశీ గ్రా డ్యుయేట్లకు ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించారు. సీట్ల సంఖ్యకు మించి కూడా కొన్నిచోట్ల ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. -
వైద్య విద్యార్థుల గోస.. టీఆర్ఆర్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు రద్దు
టీఆర్ఆర్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు రద్దయిన ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారిని వివిధ మెడికల్ కాలేజీల్లో సర్దుబాటు చేసినా, ఆ కాలేజీ నుంచి ఫీజు బదిలీ జరగకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సర్దుబాటు చేసిన కాలేజీలకు ఫీజు చెల్లించకపోతే మొదటి ఏడాది పరీక్ష రాసేందుకు వీలు లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. టీఆర్ఆర్ యాజమాన్యం ఫీజు డబ్బులు బదిలీ చేయకపోవడం లేదా వెనక్కు ఇవ్వకపోవడంతో ఏకంగా బీ, సీ కేటగిరీలకు చెందిన ఏడుగురు విద్యార్థులు వైద్య విద్యకు స్వస్తి చెప్పాల్సివచ్చిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. – సాక్షి, హైదరాబాద్ ఎవ్వరికీ పట్టని విద్యార్థుల గోడు 2021–22 వైద్య విద్యా సంవత్సరంలో ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు లేవంటూ రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీల్లోని మొదటి ఏడాది ఎంబీబీఎస్ అడ్మిషన్లను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసిన సంగతి తెలిసిందే. సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్, పటాన్‌చెరులోని టీఆర్ఆర్, వికారాబాద్‌లోని మహవీర్ కాలేజీల్లో మొదటి ఏడాదికి చెందిన మొత్తం 450 ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ రద్దు చేసింది. దాంతో ఆయా కాలేజీల్లో చేరిన వైద్య విద్యార్థులు అడ్మిషన్లు పొందిన నెలకే రోడ్డున పడ్డారు. వాటిల్లో తొలి ఏడాది చేరిన వైద్య విద్యార్థులు అంతా కలిపి రూ.66 కోట్లు చెల్లించారు. తర్వాత టీఆర్ఆర్, మహావీర్ మెడికల్ కాలేజీలకు చెందిన 300 మంది (ఒక్కో మెడికల్ కాలేజీకి చెందిన 150 మంది) విద్యార్థులను 13 ప్రైవేట్ కాలేజీల్లో సర్దుబాటు చేశారు. ఎమ్మెన్నార్ కాలేజీ విద్యార్థులను మాత్రం తిరిగి అందులోనే కొనసాగించారు. ఈ క్రమంలో టీఆర్ఆర్ కాలేజీ డబ్బులు ఇవ్వకుండా చెక్కులు ఇచ్చింది. అయితే అవి బౌన్స్ అవుతున్నాయి. ముఖ్యంగా బీ, సీ కేటగిరీల్లో పెద్ద మొత్తంలో డొనేషన్లు చెల్లించిన విద్యార్థులకు రసీదులు లేకపోవడం ఒక సమస్య కాగా, కొందరు తక్కువ ధరకు మాట్లాడుకోవడం వల్ల ఇతర కాలేజీల్లో సర్దుబాటుతో అక్కడ పూర్తి స్థాయి ఫీజు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సీ కేటగిరీకి చెందిన కొందరు విద్యార్థులైతే ఏకంగా ఏడాదికి రూ. 23 లక్షల చొప్పున చెల్లించారు. ఇందులో డొనేషన్ల సొమ్ముకు కాలేజీలు ఎలాంటి రసీదులూ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. బీ, సీ కేటగిరీలకు చెందిన ఓ ఏడుగురు విద్యార్థులు పెద్దమొత్తంలో టీఆర్ఆర్ కాలేజీకి డొనేషన్ చెల్లించారు. కానీ ఆ కాలేజీ యాజమాన్యం ఇప్పటివరకు తిరిగి డబ్బు ఇవ్వకపోవడం, తమకు తిరిగి సీటు కేటాయించిన కాలేజీకీ డబ్బులు బదిలీ చేయకపోవడం.. మళ్లీ ఇక్కడ అంత మొత్తంలో చెల్లించేంత డబ్బు తమ వద్ద లేకపోవడంతో మొత్తంగా ఆ ఏడుగురు విద్యార్థులూ ఎంబీబీఎస్ విద్యకే దూరమయ్యారని అంటున్నారు. కాగా మొత్తం ఈ వ్యవహారంపై కాలేజీ యాజమాన్యం వివరణ కోసం పలుమార్లు ఫోన్ చేసినా వారు స్పందించకపోవడం గమనార్హం. వైద్య విద్యకు దూరం మా అమ్మాయిని సీ కేటగిరీలో టీఆర్ఆర్లో చేర్పించాను. ఒకేసారి రూ. 75 లక్షల ఫీజు చెల్లించాను. ఇతర కాలేజీలో చేరాలంటే అక్కడ డబ్బు చెల్లించాలన్నారు. టీఆర్ఆర్ యాజమాన్యం మాత్రం డబ్బులు బదిలీ చేయలేదు. దీంతో మా అమ్మాయి ఏకంగా ఎంబీబీఎస్ చదువుకే దూరమైంది. – శ్రద్ధ (విద్యార్థిని తల్లి) రసీదులు తెస్తే న్యాయం చేస్తా టీఆర్ఆర్ కాలేజీలో చేరి డబ్బులు చెల్లించినట్లు తల్లిదండ్రులు, విద్యార్థులు తమ వద్దకు రసీదులతో వచ్చి లిఖిత పూర్వక ఫిర్యాదులు చేస్తే, అటువంటి వారికి న్యాయం చేస్తాము. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడతాం. – కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రూ.45 లక్షలు చెల్లించా మా అబ్బాయిని టీఆర్ఆర్లో చేర్పించాను. ïఫీజు రూ.75 లక్షలకు మాట్లాడుకున్నాను. అడ్మిషన్ రద్దయ్యే నాటికి రూ. 45 లక్షలు చెల్లించాను. ఇప్పుడు మా అబ్బాయిని కరీంనగర్‌లోకి ఒక కాలేజీలో సర్దుబాటు చేశారు. టీఆర్ఆర్ కాలేజీ చెక్‌లను కరీంనగర్ కాలేజీ అనుమతించడంలేదు. టీఆర్ఆర్ కాలేజీ యాజమాన్యం ఇప్పటివరకు మేం చెల్లించిన సొమ్మును ఇవ్వలేదు. పరీక్ష ఫీజు దగ్గర పడుతోంది. ఫీజు చెల్లించకుంటే పరీక్ష రాసే పరిస్థితి లేదంటున్నారు. – శ్రీనివాసరెడ్డి, ఎంబీబీఎస్ విద్యార్థి తండ్రి చెక్‌లు బౌన్స్ అవుతున్నాయి టీఆర్ఆర్ కాలేజీలో బీ కేటగిరీలో మా అబ్బాయిని చేర్పించాను. మొదటి ఏడాది కింద రూ. 11.25 లక్షల ఫీజు చెల్లించాను. తర్వాత ఆర్వీఎం కాలేజీలో సర్దుబాటు చేశారు. కానీ టీఆర్ఆర్ కాలేజీ యాజమాన్యం మాత్రం ఫీజు ఆర్వీఎం కాలేజీకి బదిలీ చేయలేదు. దీంతో మళ్లీ ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. లేకుంటే పరీక్ష రాయడానికి వీలుండదని చెబుతున్నారు. – రుక్మిణి, (ఎంబీబీఎస్ విద్యార్థి తల్లి) -
విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు
సాక్షి, హైదరాబాద్: గతంలో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) అనుమతి పొందిన, 2022 అక్టోబరు 21వ తేదీ లోపు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) గుర్తించిన విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆయా దేశాల్లోనే ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేస్తే దాన్ని ఈ ఒక్క ఏడాది వరకు గుర్తిస్తామని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏ దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసినా కూడా భారత్‌లో అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అనంతరం ఒక ఏడాది పాటు తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంది. ఈ నిబంధన తాజాగా అమల్లోకి రావడంతో 2022 అక్టోబర్‌కు ముందే ఇంటర్న్‌షిప్ విదేశాల్లో పూర్తి చేసిన వారు మళ్లీ ఇక్కడ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అలాంటి అభ్యర్థులు ఈ నిబంధనను సడలించాలని ఎన్ఎంసీని కోరారు. దీన్ని పరిశీలించిన ఎన్ఎంసీ తాజాగా వెసులుబాటు కల్పించింది. తాము అనుమతించిన కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో గతేడాది అక్టోబర్ 21కు ముందు ఎంబీబీఎస్, తత్సమాన అర్హతతో వైద్య విద్య పూర్తి చేసి, ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేసినట్లయితే వారికి ఈ ఒక్క ఏడాదికి సడలింపిస్తామని ఉత్తర్వులు జారీచేశారు. (క్లిక్ చేయండి: 20 కోట్ల ఆఫర్‌ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..) -
నెక్ట్స్ పాసైతేనే ఎంబీబీఎస్ పట్టా
సాక్షి, హైదరాబాద్: ఇకపై ఎంబీబీఎస్ పట్టా పొందాలన్నా, పీజీ మెడికల్ సీట్లలో ప్రవేశించాలన్నా, విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు గుర్తింపు ఇవ్వాలన్నా అందరూ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (ఎగ్జిట్) పాస్ కావాలి. ఆ తర్వాతే వైద్యవిద్య పట్టా ఇవ్వనున్నారు. నెక్ట్స్ పాసైతేనే మెడికల్ ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి లభిస్తుంది. అంతేకాదు నియామకాలకు కూడా ఈ పరీక్షలో వచ్చే మార్కులే ఆధా రం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా విడుదల చేసింది. దాన్ని ప్రజాభిప్రాయం నిమిత్తం అందుబాటులో ఉంచింది. తదుపరి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి దీన్ని అమలులోకి తీసుకొస్తారు. అంటే 2019–20లో ఎంబీబీఎస్‌లో చేరిన బ్యాచ్ నుంచి ఇది అమలవుతుందని అంటున్నారు. అంటే వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి అమలవుతుందని చెబుతున్నారు. దీనిపై ఎన్ఎంసీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. రెండింట్లో పాసైతేనే... నెక్ట్స్ పరీక్ష రెండుషెడ్యూళ్లలో నిర్వహిస్తారు. స్టెప్–1, స్టెప్–2 పద్ధతిలో జరుగుతుంది. స్టెప్–1 పరీక్ష నాలుగున్నరేళ్లకు తర్వాత... ఇంటర్న్‌షిప్‌కు ముందు ఉంటుంది. ఇది ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్షతో సమానం. అంటే ఎంబీబీఎస్‌లో ఫైనయర్ బదులుగా నెక్ట్స్ స్టెప్–1 థియరీ పరీక్ష నిర్వహిస్తారు. ఏటా డిసెంబర్ రెండో వారంలో దీన్ని నిర్వహిస్తారు. దీని ఫలితాలు జన వరి రెండో వారంలో విడుదల చేస్తారు. ఆ తర్వాత యథావిధిగా కాలేజీలు నిర్వ హించే ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. ఇంటర్న్‌షిప్ అయ్యాక స్టెప్–2 ప్రాక్టికల్స్ ఉంటాయి. కోర్సు పూర్తయ్యాక అంటే స్టెప్–1 పరీక్ష తర్వాత ఏడాదికి స్టెప్–2 పరీక్షను నిర్వహిస్తారు. అది పూర్తిగా ప్రాక్టికల్ పరీక్ష. స్టెప్–2 పరీక్ష ఏటా మార్చిలో నిర్వహించి ఏప్రిల్‌లో ఫలితాలు విడుదల చేస్తారు. ఈ రెండింటిలో పాసైతేనే ఎంబీబీఎస్ పట్టా, పీజీ మెడికల్ అర్హత, విదేశీ వైద్య కు గుర్తింపు ఉంటుంది. స్టెప్–2 కేవలం పాసైతే సరిపోతుంది. ఒకవేళ ఇందులో 3 అంతకంటే తక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలైతేనే సప్లిమెంటరీ ఉంటుంది. లేకుంటే అన్ని పరీక్షలు రాయాలి. మూడు కంటే ఎక్కువ ఫెయిలైతే ఏడాది కోల్పోయినట్లే లెక్క. పదేళ్లలోగా ఎన్నిసార్లు అయినా నెక్ట్స్ రాసుకోవచ్చు. అలాగే ఒకసారి పాసైనా కూడా మార్కులను పెంచుకొనేందుకు కూడా పరీక్ష రాసుకోవచ్చు. అంటే పీజీలో సీటు పొందేందుకు ఎక్కువ మార్కులు రావాలనుకుంటే మరోసారి రాసుకోవచ్చు. నెక్ట్స్ అమలైతే సంబంధిత సమానమైన ప్రస్తుత పరీక్షలు దశలవారీగా రద్దవుతాయి. ఉదాహరణకు ‘నీట్’పీజీ పరీక్ష రద్దు అవుతుంది. ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సింది... అమెరికా లాంటి దేశాల్లో గత 20 ఏళ్ల నుంచి ఈ తరహా పరీక్షా విధానం అమలవుతోంది. వైద్యవిద్యలో దేశవ్యాప్తంగా ఏకీకృతంగా ఇప్పటికే అమలు చేస్తున్న ‘నీట్’విధానానికి నెక్ట్స్ కొనసాగింపు మాత్రమే. తుది ర్యాంకులో స్టెప్–1కు మాత్రమే కాకుండాప్రాక్టికల్స్కు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది. – డాక్టర్ కిరణ్ మాదల, తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం రాష్ట్ర ఉపాద్యక్షుడు -
కొత్త వైద్య కళాశాలల దరఖాస్తుకు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా 2023–24 వైద్య విద్య సంవత్సరానికి కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, ప్రస్తుత కాలేజీల్లో యూజీ, పీజీ సీట్లను పెంచుకునేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు పత్రాలను దాఖలు చేయడానికి గడువు తేదీని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పొడిగించింది. ఎంబీబీఎస్ సీట్లకు ఆగస్టు 31తో, పీజీ సీట్లకు జూలై 20తో గడువు ముగియగా... కాలేజీల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకొని గురువారం నుంచి ఈ నెల 23 వరకు దరఖాస్తులను స్వీకరించడానికి గడువు పొడిగించినట్లు పేర్కొంది. దేశంలో డీమ్డ్ వైద్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనుకునే సందర్భంలో ప్రస్తుత నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. విశ్వవిద్యాలయానికి సమీపంలోనే రెండేళ్ల కాలం నాటి వెయ్యి పడకల ఆసుపత్రి తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను సడలించింది. సమీపంలో లేకపోయినా దేశంలో ఎక్కడైనా సరే వెయ్యి పడకల ఆసుపత్రి రెండేళ్లుగా ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది. అయితే వైద్య సంస్థ, ఆసుపత్రి భవనాలు సొంతంగా ఉండాలని చెప్పింది. డీమ్డ్ విశ్వవిద్యాలయం కోసం దరఖాస్తు చేసే సమయానికే వెయ్యి పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నెలకొల్పి ఉండాలని తేల్చిచెప్పింది. మరోవైపు, మెడికల్ కాలేజీల్లో తనిఖీలు, పర్యవేక్షణకు నిపుణుల కమిటీలో సభ్యులుగా అర్హులైన అధ్యాపకుల పేర్లను పంపించాలని తెలిపింది. ఆధార్ లింక్‌తో బయోమెట్రిక్ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కచ్చితంగా ఆధార్ నంబర్‌తో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అనుసరించాల్సిందేనని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. అధ్యాపకులు, ట్యూటర్లు, డిమానిస్ట్రేటర్లు, సీనియర్ రెసిడెంట్లు సహా ప్రతి ఒక్కరు కూడా ఈ విధానాన్ని పాటించాలని, లేకపోతే తదుపరి సంవత్సరాలకు మెడికల్ సీట్లను పొడిగించడం, కొత్త సీట్లకు అనుమతించడం, కొత్త కళాశాలను స్థాపించడం వంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చిచెప్పింది. ఆధార్ బయోమెట్రిక్ హాజరును ఎన్ఎంసీకి అనుసంధానం చేయాలని తెలిపింది. దీనిపై అభ్యంతరాలు, సూచనలను నెల రోజుల్లోగా director.nmc@nmc.org. inకు పంపాలని పేర్కొంది. -
అనుమతి లేని కాలేజీల్లో చేరొద్దు.. మెడికల్ అభ్యర్థులకు ఎన్ఎంసీ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: అనుమతి లేని మెడికల్ కాలేజీల్లో చేరవద్దని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విద్యార్థులను హెచ్చరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సహా ఇతర వైద్య కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్న నేపథ్యంలో ఎన్ఎంసీ ఈ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేని రాజస్తాన్‌లోని సింఘానియా యూనివర్సిటీ ఎంబీబీఎస్, ఇతర మెడికల్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానించినట్లు ఎన్ఎంసీ తెలిపింది. వివిధ వార్తాపత్రికల్లో సైతం ఈ సంస్థ ప్రకటన ఇచ్చిందని వివరించింది. కొత్త మెడికల్ కాలేజీని స్థాపించడానికి, ఆధునిక వైద్యంలో కోర్సులను అందించడానికి ఎన్ఎంసీ ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. అనుమతి లేని సంస్థల్లో ఎంబీబీఎస్, ఎండీ సహా ఇతరత్రా వైద్య కోర్సులు చేసిన విద్యార్థులు మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి అనర్హులవుతారని హెచ్చరించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అనుమతి ఉన్న వైద్య కళాశాలల వివరాలను, సీట్ల సంఖ్యను ఎన్ఎంసీ వెబ్సైట్లో ప్రదర్శించింది. ఏదైనా మెడికల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకునేముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించింది. అన్ని విధాలా కాలేజీలను పరిశీలించి తనిఖీ చేసిన తర్వాతే వాటిల్లో చేరే విషయమై నిర్ణయం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దళారులను నమ్మి మోసపోవద్దు.. రాష్ట్రంలో గత వైద్య ప్రవేశాల అనంతరం మూడు మెడికల్ కాలేజీల అడ్మిషన్లను ఎన్ఎంసీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇది పెద్ద దుమారాన్నే లేపింది. కొన్ని నెలల అనంతరం ఒక కాలేజీ సీట్లను పునరుద్ధరించగా, మరో రెండు కాలేజీల విద్యార్థులను ఇతర ప్రైవేట్ కాలేజీల్లో సర్దుబాటు చేశారు. అయితే 2022–23 వైద్య విద్య అడ్మిషన్లలో ఆ రెండు కాలేజీలైన టీఆర్ఆర్, మహావీర్‌లకు ఎన్ఎంసీ అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని విద్యార్థులు ప్రత్యేకంగా గమనంలో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొందరు దళారులు సీట్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుంటారని, ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. -
ఎంబీబీఎస్ విద్యార్థులు ఇకపై ఫ్యామిలీ డాక్టర్లుగా..
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ విద్యార్థులు ఇక ముందు ఫ్యామిలీ డాక్టర్లుగా మారిపోనున్నారు. నేరుగా గ్రామాల్లోని ప్రజల వద్దకే వెళ్లి.. కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోనున్నారు. ఆ కుటుంబాల యోగక్షేమాలను తెలుసుకోవడం, రెండు వారాలకోసారి ఇంటికే వచ్చి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, అవసరమైన మందులు సూచించడం, మరీ అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించడం వంటివి చేయనున్నారు. ఎంబీబీఎస్ సిలబస్‌లో భాగంగా కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని చేపట్టాలని గతంలో చేసిన సిఫార్సులను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు వైద్య విద్య క్యాలెండర్లో కుటుంబాల దత్తతను ప్రధాన అంశంగా ప్రస్తావించింది. ఇంటి ముంగిటికే వైద్యం ప్రస్తుతం చాలావరకు గ్రామాల్లో గుర్తింపు లేని ప్రైవేట్ ప్రాక్టీషనర్లు, ఆర్ఎంపీల వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. కొందరు తెలిసీ తెలియని వైద్యం చేస్తుండటం, నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రాణాల మీదకు వచ్చిన ఘటనలూ ఎన్నో. అర్హత లేని ప్రాక్టీషనర్లు ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాల్సి ఉండగా.. కొందరు సర్జరీలు, డెలివరీలు వంటివి కూడా చేస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. అంతేగాకుండా విచ్చలవిడిగా నొప్పుల మాత్రలు, యాంటీ బయాటిక్స్, ఇతర మందులు ఇస్తున్నారు కూడా. ఈ క్రమంలో అటు గ్రామీణ ప్రజలకు మంచి వైద్యం అందించడం, ఇటు ఎంబీబీఎస్ విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పరిస్థితులు, వివిధ వ్యాధులపై అవగాహన, ప్రాక్టీస్ లభించేందుకు.. కుటుంబాల దత్తత కార్యక్రమాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఎన్ఎంసీ గతంలోనే సిఫార్సు చేసింది. తాజాగా దీనిని అమల్లోకి తెచ్చింది. దీనితో పలుచోట్ల గ్రామీణ ప్రాంతాల వారికి నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో బ్యాచ్‌కు ఒక్కో గ్రామం ఎన్ఎంసీ నిర్ణయం ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలకు చెందిన ఒక్కో బ్యాచ్ విద్యార్థులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. బ్యాచ్‌లోని ఒక్కో విద్యార్థికి ఐదు నుంచి ఏడు కుటుంబాలను కేటాయిస్తారు. ప్రతి 25 మంది విద్యార్థుల బృందాన్ని పర్యవేక్షించడానికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు. వైద్య విద్యార్థులకు స్థానికంగా ఆశా కార్యకర్తల సాయం అందించేలా ఏర్పాటు చేస్తారు. వైద్య విద్యార్థులు ఆయా కుటుంబాల్లోని వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎవరికైనా, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. తక్షణమే టెలి మెడిసిన్ పద్ధతిలో అవసరమైన వైద్య సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. అవసరమైతే ఆస్పత్రికి రిఫర్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు రెండు వారాలకోసారి ఆయా గ్రామాలకు వెళ్లాలి. కోర్సు మొదటి ఏడాదిలో కనీసం 10 సార్లయినా వారికి కేటాయించిన కుటుంబాల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. దీనంతటినీ కోర్సులో భాగంగానే పరిగణిస్తారు. ఇలా విద్యార్థులు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచే ఫ్యామిలీ డాక్టర్ల అవతారం ఎత్తుతారు. దత్తత తీసుకున్న గ్రామాలకు పదుల సంఖ్యలో వైద్య విద్యార్థులు వచ్చిపోవడం, సలహాలు సూచనలు ఇవ్వడం వల్ల అక్కడి ప్రజలకు ఆరోగ్య సమకూరుతుందని చెప్తున్నారు. వేల మంది విద్యార్థులు.. లక్షన్నరకుపైగా కుటుంబాలు.. ఈ ఏడాది మొదలవుతున్న కొత్త కాలేజీలతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం 18 ప్రభుత్వ, 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో వచ్చే నెల 15వ తేదీ నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. అన్ని బ్యాచ్‌లకు చెందినవారు కలిపి దాదాపు 20 వేల మందికిపైగా ఎంబీబీఎస్ విద్యార్థులు ఉంటారు. ఆయుష్, డెంటల్ వారినీ కలిపితే మరో ఐదారు వేల మంది జత అవుతారు. ఇంతమందికి కుటుంబాల దత్తత బాధ్యత ఇస్తే.. లక్షన్నరకు పైగా కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందనున్నాయి. ప్రతి జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఉన్నందున అన్ని చోట్లా ఫ్యామిలీ డాక్టర్ పద్ధతి అమల్లోకి వస్తుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థులు చేసేదిదీ.. ►వైద్య విద్యార్థులు గ్రామాల్లో తాము దత్తత తీసుకున్న కుటుంబాల వద్దకు నెలకు రెండు సార్లు వస్తారు. కుటుంబంలోని వారందరితో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటారు. ►వ్యక్తుల వారీగా ఆరోగ్య రికార్డులను తయారు చేస్తారు. ఆహారపు అలవాట్లు, వ్యసనాలను తెలుసుకుని నమోదు చేస్తారు. ►అవసరాన్ని బట్టి బీపీ, షుగర్, కిడ్నీ, లివర్, గుండె పనితీరు పరీక్షలు, కేన్సర్ స్క్రీనింగ్, ఇతర వైద్య పరీక్షలు చేయిస్తారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. పరిశీలించి తగిన వైద్య సలహాలు ఇస్తారు. మందులు సూచిస్తారు. అవసరమైతే ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. ►పిల్లలకు వ్యాక్సిన్లు, గర్భిణులకు రెగ్యులర్ చెకప్‌లపై అవగాహన కల్పిస్తారు. ►రోగాలు రాకుండా ఎలాంటి ఆహార అలవాట్లు అలవరుచుకోవాలో సూచిస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తారు. ►గ్రామాల్లో స్థానిక పరిస్థితులు, తరచుగా వస్తున్న వ్యాధులను పరిశీలిస్తారు. ►ఈ అన్ని అంశాల్లో తమకు పర్యవేక్షకుడిగా ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్ సూచనల మేరకు వైద్య విద్యార్థులు వ్యవహరిస్తారు.